30 August 2016

అమ్మాయీ

అమ్మాయీ
ఎంతో కాంతి నీ ముఖంలో -
కొంగలు ఎగిరే సరస్సులు నీ కళ్ళల్లో -
ఊగే చెట్లూ, గాలీ
నీ మాటల్లో!

అమ్మాయీ
దిక్కూ మొక్కూ లేని పక్షులు
చేరే గూళ్ళా అవి, నీ పల్చటి చేతుల్లో?
రాత్రి నవ్వులా అవి
చుక్కలు

చినుకులై
మెరిసే నీ తనువులో? అంతిమ
మృత్యువేనా అది, లాలనగా పిలిచే
నీ ఒడిలో? జీవన జోల
పాటేనా అది
నీలో?

నాలో?
***
అమ్మాయీ
ఎంత కాంతి, నీ ముఖంలో!
ఎంత శాంతి , నీలో!

ఎంత కాంతీ, శాంతీ
నిన్ను చూసిన ఆ క్షణంలో!
ఆ కృతజ్ఞతలో!

29 August 2016

నీ నవ్వు

ఉన్నటుండి, పకాల్మని ఎందుకో నవ్వుతావు నువ్వు -
గుత్తులు గుత్తులుగా పూవులు
రంగురంగుల చినుకులై
మెత్తగా రాలిపడినట్టు -


(అదే పరిమళం, అదే సవ్వడి: మరి అదే గాలీ నీరూ
అప్పుడు: నీ ఎదురుగా, దిగులు
దిగులుగా, బేలగా నేను
నీతో కూర్చున్నప్పుడు)
***
ఉన్నటుండి, ఎందుకో పకాల్మని నవ్వుతావు నువ్వు -
ఎందుకూ అని నేనూ అడగను
కానీ, "ఒక కుందేలు పిల్ల
నవ్వీ, నవ్వీ, నవ్వీ

ఒక్క క్షణంలో నన్ను నాకే చూయించి మాయ చేసి
ఏటో మాయం అయ్యింది" అని
నేను అంటే, రేపు ఇక నన్ను

ఎవరైనా ఎట్లా నమ్ముతారు చెప్పు? 

27 August 2016

బహుమతి

సాయంకాలపు నీడలూ, కాంతీ తన ముఖంలో -
కళ్ళేమో నానిన మొగ్గలు. ఒళ్లో
వొదిలేసిన చేతులేమో వడలిన కాడలు -
(నరాలు తేలి, పసుపుపచ్చగా
అవి) ఇక

తను చిన్నగా నడుం వాల్చి నుదిటిపై అరచేతిని
చిన్నగా వాల్చుకుని "నానీ, కాస్త
లైటు ఆర్పివేయి" అని లీలగా అంటే, బయట
ఉగ్గపట్టుకున్న రాత్రి కరిగింది -
అతి నెమ్మదిగా

గాలి వీచి, ధూళి రేగి, నేలపై ఆకులు దొర్లి, చీకటి
సవ్వడి చేసింది. తన శరీరంపైనుంచి
అలలా ఒక తెర ఏదో, తాకి వెళ్ళిపోయింది -
అలసట వదులవ్వుతూ, ఇక
మ్రాగన్నుగా తను

ఒక కలవరింత అయ్యింది. కంపించింది. ఆనక
ఆకులపై జారే మంచువోలె, తను
నిదుర ఒడ్డున ఒక గవ్వై ముడుచుకుపోయింది.
తెల్లని పావురమైపోయింది -
నిశ్శబ్ధమయ్యింది -

మరి అందుకే, నువ్వసలు మాట్లాడకు శ్రీకాంత్!
ఊహలోనైనా తనని కదపక, అలా
తనని తనతో ఉండనివ్వగలగడమే, నువ్వు
తనకి ఇవ్వగలిగిన, ఒక విలువైన
బహుమతి!

25 August 2016

వాన

వాన పడుతున్నది. నడి దినం మసక చీకట్లలో చిక్కుకుని ఉన్నది. గూడు చెదిరి ఒక పావురం నిలిచిన నీళ్ళల్లో అలజడిగా కదులుతున్నది. జలజలా ఆకులు రాలి, నేల వొణుకుతున్నది. గాలికీ, చినుకులకీ భీతిల్లి ఒక పాప చెట్టు కింద ఆగి ఉన్నది. నీటి ధారకి పాదాల కింది మట్టి జారి పోవుచున్నది. ఏమీ తోచకున్నది. హృదయమొక పావురమై, ఆకులు రాలిన నేలై, పాపై, తడిచిన కాగితమై బెంగటిల్లి దిక్కు తోచక అటూ ఇటూ తల్లడిల్లుచున్నది. నలు దిక్కులలోకీ ఏదో లాగుచున్నది. తిరిగి మరల లేనంతగా, ఏదో పిలుచు చున్నది. ఎటుల బయటపడుటనో తెలియకున్నది -

బయట వాన పడుతున్నది. గూడు లేకున్నది. రెక్కలు తడిచి ఉన్నవి. చీకట్లు ముసురుకుని ఉన్నవి. దారి తెలియకున్నది. దీపం వెలుగక, ఎవరూ కాన రాక, లోన దిగులుతో, పావురమింకా తచ్చాట్లాడూతూనే ఉన్నది. తల్లి లేక, రాక, చెట్టు కింద, కాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని పావురం కళ్ళతో, ముడుచుకుని పాప వాలిపోయి ఉన్నది. దారులన్నీ సోలి ఉన్నవి. పూవులన్నీ రాలి ఉన్నవి. ఊపిరిని ముడి వేసి బిగించినట్టూ, హృదయాన్ని నులిమినట్టూ

ఇంకా లోన వాన పడుతూనే ఉన్నది. గూటికి దారి ఏటో, గూడు ఉన్నదో లేదో కూడా తెలియకున్నది. ఆగక ఇంకా, ఇంకా, ఇంకా - వాన పడుతూనే ఉన్నది. నువ్వై వాన కుండపోతగా కురుస్తూనే ఉన్నది!

పోషణ

తెరచే ఉన్నాయి కిటికీలు. మంచులా
వ్యాపించే చీకటి. చిన్నగా గాలి -
ఆరిన పొయ్యి. పల్చటి పొగ -

నీకు ఆనుకుని కూర్చుని ఉంది తను -
రొట్టెల వాసన తనలో. గ్లాసులో
నీళ్లు ధారగా పడి ఎగిసి, తిరిగి

స్థిమిత పడే ఒక మెత్తని సవ్వడి నీలో -
***
ఇక బయట రాత్రిలో, తనలో అతనిలో

మసక వెన్నెల తాకిడికి
నెమ్మదిగా ఊగే రెండు ఎర్రెర్రని
దానిమ్మ పూలు!

22 August 2016

పిచ్చుక, గింజ

ఎవరు నేను, అని అడిగింది ఒక
అమ్మాయి  -
చిన్న పిచ్చుకవు, చేపాను నేను -
మరి నువ్వు? అని అడిగింది
అదే అమ్మాయి  -
ఒక గింజను, చెప్పాను నేను -
***
ఇక మారు మాట్లాడక, గింజను
నోట కరచుకుని
తుర్రున ఏటో ఎగిరిపోయింది

ఆ తుంటరి పిచ్చుక!

21 August 2016

వినతి

ఎంతో ఎదురుచూస్తారు పిల్లలు, అమ్మ కోసం -
***
ఈ లోగా చుక్కలు మెరుస్తాయి. ఆవరణలో
వేపాకులు రాలుతాయి. ఒక పిల్లి
మెల్లిగా, చెట్టుకు రుద్దుకుంటే

తెల్లని లిల్లీ పూవులు ఊగుతాయి. నల్లని
రాత్రుళ్ళాంటి కనులలో వనాలూ
గాలీ, ధూళీ, ఎగిసి పడతాయి -

ఇక చెట్లల్లోని చెమ్మా, తడి ఆరని పాదులూ
గూళ్ళల్లో మెసిలే పక్షులూ, వణికే
నీడలూ, కోసే బెంగా, వాళ్ళల్లో -
***
ఎంతో ఎదురు చూస్తారు పిల్లలు, నీ కోసం -
***
తల్లి ఎవరైతే ఏం? ఇంటికి వెళ్ళు నువ్విక
తొందరగా, హృదయాన్ని బొమ్మల
బుట్టగా మార్చుకుని: బహుశా

ఇకనైనా నువ్వు, ఒకసారి బ్రతికిపోవచ్చు!

హంతకుడు

మసి పట్టిన ఒక దీపం: మసకగా
దాని చివరి వెలుతురు -
రాత్రి గాలి. ఖాళీ గూడు. ఎక్కడో
ఆకులు కదిలి, మరి
అవి రాలే చప్పుడు: నీ లోపల -
దీపం పగిలి, చీకటి
నీలో దిగినంత లోతుగా, జిగటగా -
***
ప్రేమను అడుక్కోగలవా నువ్వు
నెత్తురంటిన చేతులతో?
***
ఇక నీ చుట్టూ నీ పదాల నీడలు
ఉరికొయ్యలై, తాడులై!

18 August 2016

అపరాధి

ఎంతో రాత్రి అయ్యింది. ఇక ఇంటికి వెళ్ళాలి
నువ్వు -
***
దారేమో, వొంపులు తిరిగిన ఒక నల్లని పాము
శరీరమేమో క్షతగాత్రుల క్షేత్రం -
గాత్రమేమో, పగిలిన ఒక వేణువు. మరి చూపేమో
రాయికి మోదుకుని చిట్లిన గోరు -
ఇక హృదయం అంటావా? అది తల్లిని వీడిన
ఒక ఒక పసివాని మోము: ఎడతెగని
రాత్రుళ్ళ దప్పికా, ఉలికిపాటూ, కలవరింతా -
***
ఎంతో రాత్రి అయ్యింది. ఇక ఇంటికి వెళ్ళాలి
నువ్వు -
***
ఇంటికి వెళ్లి, నెత్తురంటిన నీ అరచేతులని

మరి కడుక్కోవాలి నువ్వు!

15 August 2016

నిదుర నిండిన పూవులు

నిదురను ఇచ్చే పూవులు -
నిదురను తూలే పూవులూ, నిండైన మబ్బుల
రాత్రుళ్లూ నీ కళ్ళు -
***
మసక వెన్నెల మెల్లిగా నిమిరే కనురెప్పలు -
చినుకులు సోలే చేతివేళ్ళు -
చీకటి చిన్నగా నవ్వితే

మిణుకుమనే పెదిమలు: లతలు లతలుగా
గాలి సోకే బుగ్గలు. కథలైన
చెవులూ, వాలిపోయే

చేతులు. ఆడీ ఆడీ అలసిపొయిన పాదాలు -
తల్లి అరచేతిలో మిగిలిపోయిన
అన్నం ముద్దలూ, తన

బ్రతిమలాడుకోవడాలూ, ఎవరి మాటా వినక
చివరికి నిదుర చెరువులోకి
బుడుంగున మునిగే

తుంటరి కప్పపిల్లలు, నీ కళ్ళు !
***
ఎంత రాత్రి ఇది! ఆకాశంలోంచి
రాలి, నిను నిద్రలో ముంచే ఎంతెంత కలల
పూల రాత్రి ఇది!
***
సరే! ఇక బజ్జుకో నువ్వు -
ఏనుగులంత మబ్బుల్లోంచి తప్పించుకుని
నెమ్మదిగా

ఎటో జారుకుంటోంది
నువ్వు లేని, నీ అంత, కుందేలు అంత
ఓ చందమామ!

13 August 2016

పరిశీలన

వెళ్ళిపో, నువ్వు నాకేం
అక్కరలేదు
అని అంది కవి ప్రియురాలు
అతనితో -
***
మబ్బు పట్టింది. రాత్రి
అయ్యింది -
ఎవర్నైనా అంత తేలికగా
వదిలి ఎలా
పోవటం?
***
ఎక్కడ ఉన్నావు? ఇక
ఇంటికి రా
అని అన్నది కవి ప్రియురాలు
అతనితో -
***
ప్చ్ప్. ఏమీ మారలేదు -

ఒక కవీ
అతని కవితా, ఊగే ఆకుల్లో
వణికే, రాత్రి
చినుకుల

హృదయ సవ్వడి!

12 August 2016

కాదా

ఊదా రంగుల పూవులు
నీ నవ్వులు -
మెరిసే గలగలలతో ఊగే
ఒక షాండ్లియార్

కాదా నువ్వు?!
నాలో ఆకస్మికంగా వెలిగిన
వేల దీపాల
రాత్రి కదా నువ్వు?
నవ్వు

నువ్వు: ఎప్పటిలానే -
అన్నీ మైమరచి
ఏటో కొట్టుకుపోవాలి
ఈ చిన్ని

పద్యం, నా జీవితం!

09 August 2016

పిల్లి

రాత్రి ఒక పిల్లి పిల్ల వచ్చింది, ఎక్కడినుంచో. కిటికీలోంచి లోపలికి చూస్తూ మ్యావ్మంటో - పాలు పోసినా త్రాగక, నావైపే చూస్తో: నీకు పిల్లి భాష ఏమైనా తెలుసా? అని అడిగింది ఓ అమ్మాయి ఒక మూల ముడుచుకుని కూర్చున్న నాతో

పిల్లులు ఎందుకు వస్తాయో, వాటికేం కావాలో అవి మాటిమాటికీ ఎందుకు మ్యావ్మంటాయో పాదాల చుట్టూతా ఎందుకు తిరుగుతాయో, అట్లా మిడి గుడ్లేసుకుని నిన్నే ఎందుకు చూస్తాయో నువ్వు విదిల్చి వేసినా, కసిరి కొట్టినా అన్నీ మరచి, మళ్ళీ నీ వెనుకెనుకే అట్లా ఎందుకు రుద్దుకుంటూ తిరుగుతాయో

అమ్మాయీ, ఎవరికి తెలుసు? వెళ్లి మరెవర్నైనా అడుగు. కిటికీలోంచి లోపలికి వచ్చి, పాలు త్రాగి ఒక మూల ముడుచుకుని పడుకుని, అర్ధనిమిలిత నేత్రాలతో నిన్నే చూసే, నన్ను మాత్రం నువ్వసలే అడగకు!

నీ నిశ్శబ్ధానికి

ఎంతో ఆలస్యం, ఈ సాయంత్రానికి -
ఎంతో ఓపిక, ఈ సాయంత్రాన్ని అదిమి పట్టుకున్న
నల్లని మబ్బులకి. మరి

ఎంతో కరుణ, మబ్బులని దాచుకుని
నన్ను చూసే నీ కళ్ళకి. రాత్రిని రెక్కల్లో పొదుపుకుని
నన్ను హత్తుకునే నీ

చేతులకి: నీ మాటలకీ, నీ శరీరానీకీ -
***
ఎంతో జీవితం, ఎంతో ధైర్యం -
నీ సాయంత్రానికి. ఆరిపోనివ్వక, అరచేతుల మధ్య
అతనిని దాచి, చీకట్లోకి

ధీమాగా నడిచే నీ నిశ్శబ్ధానికి!

08 August 2016

కొంచెం నిద్ర

ఆమ్మీ, రాత్రి అయ్యింది. నీ కళ్లలో
మండే కట్టెలు, మసి పట్టిన
పాత్రలు, మెతుకులలాంటి నీళ్ళు -
ముఖం ముడతలలో నీడలు -

పగిలిన నీ పాదాలలో మట్టీ, నేలా
వానా, ఆకాశం, చుక్కలూ -
హోరెత్తిoచే గాలి. నీలో, ఒంటరిగా
వణికే, ఓ పసి హృదయం -
***
ఆమ్మీ, రాత్రి అయ్యింది, నీ కళ్లలో -
అందుకే, ఇక కొంచెం నిద్రపో -
తడిచి, గూటిలో ముడుచుకున్న
ఒక తెల్లని పావురంలా -

07 August 2016

ముద్రికలు

వాన ఆగింది. చీకటి గాలి, తన జుత్తు నిండా -
చిన్నగా ఆకులు కదిలిన సవ్వడై
తిరిగి నిశ్శబ్దం అయితే
***
ఏడవకు, అని అంటాడతను నిస్సహాయంగా -
***
ఇక, తను లేచి పొయ్యిపై బియ్యం ఉంచేందుకు
వెడితే, ఆతని ఛాతిపై తన కనుల
వలయాలు. ముద్రికలు -
***
రాత్రిని దాచుకుని, గోడ వారగా జారే, పల్చటి
వాన చినుకుల్లా!

03 August 2016

నెమ్మది

రాత్రి ఆగి ఉంది, నిదానమైన తన
శిరోజాల ప్రవాహంలో -
మెరిసే మసక వెన్నెల, హంసలల్లే
తేలే తన చేతివేళ్ళపై -

నెరసిపోయినది కొంచెంకొంచెంగా
తన శరీరం మాత్రమే -
***
పరవాలేదు: నేర్చుకోవచ్చు చిన్నగా
ఇకిప్పటికైనా మనం

ప్రేమించుకోవడం అంటే ఏమిటో!