28 January 2016

మరోవైపు

"మునపటిలాగా లేవు నువ్వు. అస్సలు పట్టించుకోవడం లేదు నువ్వు
నన్ను " అంటుంది తను -
మాట్లాడడు అతను.
***
నెల ఆఖరు -
ఆకలితో ట్రాఫిక్ లైట్ల వద్ద అడుక్కునే పిల్లలా (అద్దె) ఇల్లు: శ్వాస అందక
తపన పడుతున్నట్టు గాలి. గదిలో
రాలిన పూలల్లా నిస్తేజమైన కాంతి -

(ఆ గదీ, గాలీ, పిల్లవాడూ అతనేనా?)

మరకలు అంటిన గోడపై వేలాడే కాలెండర్లో తను జాగ్రతగా మార్క్ చేసిన
తేదీలు: నెల మొదట్లో ఇవ్వాల్సిన తేదీలు.
ఇవ్వలేకపోయి బాకీ పడిన తేదీలు -

(ఆ గోడా, ఆనవాలూ, తేదీలూ తనేనా?)
***
"యు డోంట్ లవ్ మీ ఎనీ మోర్: మారిపోయావు నువ్వు" నిందిస్తుంది
తను: కుంచించుకుపోతున్న ఒక దీపం
అతని హృదయంలో -
***
బయట, దూరంగా ఎక్కడో చీకట్లో మిణుకు మిణుకుమనే నక్షత్రాలు.
చిన్నగా మొదలయ్యే గాలి. పల్చగా మాటలు.
పూర్వజన్మలో విన్నావో, కన్నవో, తాకినవో -

"ఋణ పడి ఉన్నాను నేను నీకు ఇప్పటికీ. రెండు అరచేతులు కలిసిన
ఇంద్రజాలంలో, గట్టిగా హత్తుకున్న కాలంలో...
నన్ను నమ్ము. దయచేసి నన్ను నవ్వు -"

అని చెబుదామనీ, నగరం నుంచి అడవి అవుదామనీ
ఆగిపోతాడు అతను -
***
ఇక రాత్రంతా మరెక్కడో - అతని లోపలా తన లోపలా - కాలంత సీమలో
సంధ్యాసమయంలో, తీరాన
అలల ఊగిసలాటలకి అట్లా

తేలియాడే, లంగరు వేయని రెండు పడవలు -

27 January 2016

ఎవరికి తెలుసు

"నేను పిచ్చిదానినా?" అడుగుతుంది తను. అతను ఏమీ
మాట్లాడడు -
***
రాత్రి. తెరచి ఉంచిన కిటికీలు. గాలికి సన్నగా ఊగే పరదాలు.
పరదాలని దాటి చూడగలిగితే, బహుశా
మబ్బుల చాటుకు తప్పుకునే జాబిలీ -

(తన కళ్ళూ, తన ముఖమూనా అవి?) 

బాల్కనీలో, ఆ మసక వెన్నెల్లో పాలిపోయిన ఆకులు: (తన
చేతివేళ్ళా అవి?) రాత్రి చెమ్మ బరువుకి
వొంగిన నెత్తురంటిన లిల్లీ పూలు. కింద 

ఎక్కడో, కుత్తుక తెగేలా ఒకటే అరచే, కళ్ళు తెరవని పిల్లి
కూనలు -
***
"నేను పిచ్చిదానినా?" అడుగుతుంది, బేలగా పాపలా
తను -
***
వానలో లిల్లీ పూవులు తడిచి తెరపిబడ్డాయో లేదో, పరదాలు
తొలిగి చంద్రబింబం బ్రతికిందో లేదో, ఒక
మహా పురుషాంగంగా మారిన ఈ లోకం

పిచ్చిదో, తను పిచ్చిదో ఎవరికీ తెలుసు?

26 January 2016

నీ అంత...

తినడానికి కూర్చున్నారు ఇద్దరూ, చెక్క బల్ల ముందు:
వలయపు వెలుతురులో పాత్రలు -

బయట చీకటిలో,వెళ్ళిపోయిన వాళ్ళ గుర్తుల్లాగా అశృవుల్లాగా చుక్కలు: "చుక్కలు మాట్లాడగలవా?"అడుగుతుంది తను చిన్నగా - బయట శీతాకాలాపు గాలి.వొణికే లతలు.మసక వెలుతురులో అటూ ఇటూ ఊగే నీడలు: మట్టి చెమ్మగిల్లిన వాసన.గూట్లో ఇరుకుగా తిరిగే రెక్కల సవ్వడి.రాత్రి చెమ్మకి పూలు వొంగి,నేల తడిగా మారి, తన కనుల్లాంటి ఆకులు ఆ చీకట్లో చుక్కల కేసి చూస్తో - *** "చుక్కలు మాట్లాడతాయా?"అడుగుతుంది మళ్ళా తను, చిన్నగా మారే దీపపు కాంతిలో - "ఎవరికి తెలుసు, వినే వాళ్లుంటే, ఈ దేశాన్ని ఒక వస్త్రంగా మార్చి కుట్టు పని చేసే ఆ తల్లి చేతుల్లో పెట్టి ఉండి ఉంటే, పిలవగలిగి ఉండి ఉంటే..." అని చెబుదామని ఆగిపోతాడు అతను - *** ఇక బయట,రాత్రంతా చీకట్లో తడుస్తూ,ఏవేవో చెబుతూ వాళ్ళ చేతికందేంత దూరంలో ఉండీ
వాళ్ళు తాకలేకపోయిన నక్షత్రాలు -

17 January 2016

బ్రతకడం

బ్రతకడం ఎలా, అతను అడిగాడు, దిగులుగా -

చెదిరిపోయిన గూడులా, ఇల్లు పీలికలుగా -
వస్తువులపై,  ఒకరికి ఒకరు ఒకప్పుడు ఇష్టంగా బహుమతిగా ఇచ్చుకున్న
పింగాణీ బొమ్మలపై

పుస్తకాలపై, గాజు పాత్రలపై, దుస్తులపై
అల్మారాలో - నవ్వే దినాల ముఖాల ఫోటోలపై, తెరవని కిటికీలపై పొరలా
పేరుకున్న దుమ్ము -

బ్రతకడం ఏలా, అతను మళ్ళా అడిగాడు, బహుశా
ఈసారి ఒకింత నిస్సహాయంగా -

ఇక
తను తెరచిన తలుపులలోంచి ప్రసరించే
ఆ శీతాకాలాంతపు సూర్యరశ్మిలో, దుమ్ముని తుడిచీ, దుస్తులనీ పాత్రల్నీ సర్దీ
ఎన్నాళ్ళుగానో

నీళ్ళు లేక వడలిపోయిన మొక్కలకి
నొచ్చుకున్న ముఖంతో ఇన్ని నీళ్ళు తాపిస్తూ, ఒరిగిన పూలని చిన్నగా తాకుతూ
తను ఏమీ మాట్లాడలేదు! 

16 January 2016

అనుకున్నవి

ఒక తెల్లని కాగితం ఇచ్చావు నువ్వు అతనికి, కడు జాగ్రత్తగా
దాచుకొమ్మని -

అతను కూడా అనుకున్నాడు
రాత్రిని, ఒక ఇష్టమైన పుస్తకపు పేజీ తిప్పినట్టుగానో, ఒక
పూవుని విన్నట్టుగానో, నిన్ను
చూసినట్టుగానో గడుపుదామనీ, మరేమీ చేయకూడదనీ -

నిజమే, నువ్వే అయిన
ఒక తెల్లని కాగితం ఇచ్చావు అతనికి - దాచుకొమ్మనో
జీవితాన్ని దాటేందుకు
ఒక పడవగా చేసుకొమ్మనో, అతన్ని రాసుకొమ్మనో -

మరి, రాత్రిలోకి
కనుమరుగయ్యే దీపపు కాంతిని కాగితంలో నింపి, అట్లా
ముక్కలు చేసి
చీకట్లోకి విసిరి, నింపాదిగా నడచి వెళ్లిపోయింది ఎవరు?

గ్రహింపు

రోజు బావుంది, అని నువ్వు అంటావు. అప్పుడు నీ ముఖంలో
సంతోషపు పూల కాంతి -

అవును, నేను అంటాను, ఈవేళ - స్కూలు బస్సులోంచి
ఒక తెల్లని రోజా పూవు, నేను ఎవరో
తెలిసినట్టు, నా వైపు చేయి ఊపుతో నవ్వింది: ఇంకా
ఎవరో రహస్యంగా ఒక పుష్పగుచ్చాన్ని

నీ బల్లపై ఉంచి, దాగుని చూస్తున్నట్టు
గడిచే ఈ కాలం కొంత కుతూహలంగా కూడా ఉంది.
అవును, నిజం:

రోజులు ఎంత బావుంటాయి, కాంతివంతమైన నీ కళ్ళల్లా
మనం ఏమీ ఆశించనప్పుడు!

నిస్సహాయత

ఒక పదం కావడం ఎలా? అతను అడుగుతాడు -
తను చిన్నగా నవ్వుతుంది.

లేత కాంతి గది అంతా:
పసుపు పూల రేకులు రాలుతున్నట్టు. ఎక్కడో చిన్నగా
పిల్లల మాటలు: తీరంపై ఇసుకను లాక్కునే అలల సవ్వడి
ఒక గూటిని అల్లుకునే పక్షుల భాషా, ఆ రెక్కల కదలికా
ఒరిమీ మరి వీచే గాలిలో -

పదాలలోకి ఆ గాలిని, శ్వాసను నింపడం ఎలా? అతను
నిస్సహాయంగా అడుగుతాడు
తనని -

ఇక
పెదాలపై విరిగిన వేణువుతో నెమ్మదిగా ఒక సాయంత్రం
తనని తోడ్కొని రాత్రిలోకి
సాగిపోతుంది.

13 January 2016

విన్నపం

నీ  తలుపులు తెరుచుకోవు -

సాయం సంధ్య.
హృదయాలని వణికించే గాలి.
రాత్రి తేమ ఏదో ముందుగానే ఈ పెదిమల పైన -
వేణువై

నువ్వు ఉండాల్సిన ఈ పెదిమల పైనే -

అన్నీ వెళ్ళిపోయేవే.
తలుపులు తెరిచో మూసో, ముందుగానో వెనుకగానో -
ఆపటానికి
నేనెవరిని?

సరే.
గాలి శోకం
పూల భాషా నీడల విన్నపం
నీకు

అర్థం కావు -

దానికి
నేనేం చేయను? 

12 January 2016

విముక్తి

నువ్వు
రాత్రి ఇంటికి చేరుకునే సరికి, చీకటి నదిలో నెమ్మదిగా లాంతరు
కాంతిలో సాగే పడవలా
ఇల్లు -

తన చేతివేళ్ళ సువాసన ఇంకా తార్లాటలాడే - దగ్గరిగా వేసి ఉన్న
తలుపు. మసక కాంతిలో గదుల్లో
కదిలే పూలవంటి నిశ్శబ్దం.

తెరచిన బాల్కనీ కిటికీలోంచి నిదురించే పిల్లల శ్వాస వంటి గాలి.
డైనింగ్ టేబుల్పై నీకోసం ఉంచిన
అన్నం పాత్రా, బోర్లించిన

ఒక ప్లేటూ, గాజు గళాసూ, చేయి తుడుచుకునేందుకు ఒక నాప్కిన్ -
ఆపై పడుకునేందుకు సిద్ధం చేసిన
మంచంపై, మడత పెట్టిన ఒక

కంబళీ, మంచం పక్కగా చీకట్లో నువ్వు లేస్తే నీకు తేలికగా అందేలా
ఒక నీటి బాటిలూ, ఇంకా  ఉదయాన్నే
వెలుతురు నిన్ను చెదపకుండా

కిటికీలను మూసిన మందపాటి కర్టెన్లూ:

నువ్వు
రాత్రి ఇంటికి చేరుకునే సరికి, చీకటి నదిలో నెమ్మదిగా లాంతరు
కాంతిలో సాగే పడవలాంటి
ఇంటిలో

ప్రతిదీ సర్ధబడి
అన్నీ ఎక్కడివక్కడే అమర్చబడీ, పొందికతో, అలసటతో అలా
నిదురించిన తన శరీరపు
చెమ్మతో

బహుశా, ఆ నిశ్శబ్ధంలో
నువ్వు ఇన్నాళ్ళూ వినలేని స్వరాలతో, తన ఆత్మంతా  నిండిన
అరుపులతో -

మరి ఇక
నువ్వు అన్నం
తినే వేళకి, అన్నీ అట్లా ఎట్లా సమకూర్చబడ్డాయో, ఆ ప్రక్రియ
ఏమిటో

ఒక్కసారైనా నీకు
తడితే, నువ్వీ జన్మకి విముక్తి
చెందినట్టే! 

11 January 2016

కృతజ్ఞత

నిద్దురలో పక్కకు ఒత్తిగిల్లి
 నా చేతి వేళ్ళను మెత్తగా నీ అరచేతులోకి లాక్కుంటావు
నువ్వు -

ఎవరో
సడీ సవ్వడి లేకుండా
నన్ను తమ కలలోకి లాక్కు వెళ్లినట్టు, కిటికీలు తెరచి
రాత్రి సుగంధాన్ని

లోపలికి
మంచుపొగతో పంపించినట్టు
మైదానాలపై తూనీగలు ఎగిరినట్టూ నా చుట్టూతా నీ
చేతివేళ్ళ సుగంధం:

చీకటి తొలిగి
వెన్నెలలో ఆ  కాంతిలో
ఆకులు మెరిసినట్టు, పూలు ఊగినట్టు, నాలో ఏదో ముడి
వీడి

స్పష్టంగా మారిన
జలదరింపు: ఏదో ఎరుక -
తేలికపాటి వర్షంలో తడచిన ఒక ఆనందం. తొలిసారిగా
నిన్ను విభ్రమంతో
చూసినట్టు -

నిద్దురలో పక్కకు ఒత్తిగిల్లి
చాలా పొందికగా నన్ను నీ అరచేతుల్లోకి లాక్కుంటావు
నువ్వు -

ఇక తిరిగి నిద్రించలేక
నీ పసి చేతిని అలాగే పుచ్చుకుని  ప్రార్ధిస్తాను నేను: నా
చేతిని నువ్వు

ఎప్పటికీ వదలవద్దనీ
నువ్వు చూపించిన దారిని నేను ఎన్నటికీ మరవకూడదనీ
బ్రతుకనిమ్మనీ! 

01 January 2016

requiem for a dream

"You are
A very unhappy soul. 
You are
A frustrated 
And a sick 
Asshole -

Do

something
about it"
She screams -

I get up

Switch off the lights and
Walk into the
other room

Open the windows

let the cold winter slip in and
fill in that space
that she
left
wide
open -

I settle in my bed, cuddle

Under a blanket
And with a smile
go to sleep
As if
there is
no tomorrow -

You know

sometimes life is better 
this way.