15 August 2016

నిదుర నిండిన పూవులు

నిదురను ఇచ్చే పూవులు -
నిదురను తూలే పూవులూ, నిండైన మబ్బుల
రాత్రుళ్లూ నీ కళ్ళు -
***
మసక వెన్నెల మెల్లిగా నిమిరే కనురెప్పలు -
చినుకులు సోలే చేతివేళ్ళు -
చీకటి చిన్నగా నవ్వితే

మిణుకుమనే పెదిమలు: లతలు లతలుగా
గాలి సోకే బుగ్గలు. కథలైన
చెవులూ, వాలిపోయే

చేతులు. ఆడీ ఆడీ అలసిపొయిన పాదాలు -
తల్లి అరచేతిలో మిగిలిపోయిన
అన్నం ముద్దలూ, తన

బ్రతిమలాడుకోవడాలూ, ఎవరి మాటా వినక
చివరికి నిదుర చెరువులోకి
బుడుంగున మునిగే

తుంటరి కప్పపిల్లలు, నీ కళ్ళు !
***
ఎంత రాత్రి ఇది! ఆకాశంలోంచి
రాలి, నిను నిద్రలో ముంచే ఎంతెంత కలల
పూల రాత్రి ఇది!
***
సరే! ఇక బజ్జుకో నువ్వు -
ఏనుగులంత మబ్బుల్లోంచి తప్పించుకుని
నెమ్మదిగా

ఎటో జారుకుంటోంది
నువ్వు లేని, నీ అంత, కుందేలు అంత
ఓ చందమామ!

No comments:

Post a Comment