15 February 2014

ధన్యవాదాలు

పాపుల పవిత్ర రాత్రి ఇది

గులాబీ రాత్రి ఇది. నీ కనుల అంచులలో
ఎర్రగా మారుతున్న
ఒక తెల్లని గులాబీ రాత్రి ఇది

ప్రేమా? వద్దు. ధన్యవాదాలు.
దయా? వద్దు. ధన్యవాదాలు.

ఇది చెప్పు నాకు
పగటి చీకటిలో కానీ
రాత్రి కాంతిలో కానీ
నీ చేతి వేళ్ళ చివర్లు
పరిమళపు పుష్పాలుగా కానీ
పచ్చిముళ్ళుగా కానీ
ఎలా మారగలవో చెప్పు నాకు-

చెప్పు, ఇది చెప్పు నాకు
పగలు కానీ రాత్రి కానీ నీ స్వరం
కొనసాగే హింసా చిహ్నమై
మళ్ళా అంతలోనే ఒక ఇంధ్రధనుస్సై
పగటినీ రాత్రినీ కలుపుతున్న
జీవితపు ఊయలకు పైగా ఎలా
వికసించగలదో చెప్పు నాకు-

చెప్పు, ఇది  చెప్పు నాకు
ఒక పక్షి తన గూడును వొదిలి వెళ్ళినప్పుడు
ఒక పావురం రాలి పడిపోయిన
తన గుడ్డు వైపు చూస్తున్నప్పుడు
చెప్పు, ఇది చెప్పు నాకు

ప్రపంచం ఎలా ఉండేదో
ప్రపంచం ఎలా ఉందో
ప్రపంచం ఎలా ఉండబోతుందో: నీకు తెలుసు
వాళ్ళకూ తెలుసు

రాలిపడిపోయి, పిగిలిపోయి
జన్మించక మిగిలిపోయిన
ఆ పక్షీ గుడ్డూ, గూడూ మనమేనని

ఇక చాలు, ఇప్పటికని- 

ధన్యవాదాలు.

మరొక చిన్ని చిన్ని కవిత

నేనొక పూల పాత్రని

నీ అస్తిత్వపు అంచున ఉంచుతాను
దానికి నీరువి నువ్వే
సూర్యరశ్మివీ నువ్వె
ఆ పూలపై కురిసే వర్షానివీ నువ్వే
ఆ పూలను పదిలంగా చూసుకుని
నేను ఎక్కడికి వెళ్ళినా
నేను ఏం చేసినా
ఒక పాప నవ్వులా నన్ను వెంటాడే 
ఒక పరిమళాన్ని
ఆ పూలకు అందించేదీ నువ్వే

మరణించడం తేలిక
జీవించడమే మృత్యువు అంత కటినమైనది

నేను ఇంతకు మునుపే చెప్పాను
ఇదొక చిన్ని చిన్ని కవిత అని- 
చూస్తూ ఉండు

నీకు ధన్యవాదాలు తెలిపేందుకు
నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేందుకూ
ఈ వాక్యం చివర
నీ కలల మరో వైపును తాకే
ఉనికి ఒకటి ఉంది.

చిన్ని చిన్ని కవిత

నేను నీకొక చిన్న కవితని రాస్తాను

ఒక చిన్ని చిన్ని కవిత
పిచ్చుకలాంటి
చిన్ని చిన్ని గడ్డి పూవులాంటి
నీ చుట్టూ
పిచ్చుక పిల్లలా గిరికీలు కొట్టే
నీ చుట్టూ
తనతో పాటు వర్షపు ప్రేమను
తీసుకు వచ్చే
పచ్చిగడ్డి పరిమళం లాంటి
ఒక చిన్ని చిన్ని కవితను
నేను నీకు బహుకరిస్తాను.

దాహార్తులం మనం
మనది కాని ప్రదేశాలలో అలమటించే
కరవు ప్రదేశాలం మనం
మనం: నక్షత్రాలమి మనం
సూర్యుడి తునకలమి మనం
ఒక మహత్తరమైన వానలో
కరిగిపోయే మనం: మనం.

మనం: ఇంతకు మునుపూ ఉన్నాం
ఇప్పుడూ ఉన్నాం
ఇక ముందూ ఉంటాం మనం
మంచులా
నిన్ను చీకట్లో కప్పివేసి
పురా జన్మల శాంతిని తెచ్చే
మృత్యువుని ఇచ్చే
తన అరచేతుల్లా
మనం ఉన్నాం
మనం ఉంటాం

ఇప్పటికీ
ఎప్పటికీ

Amen.

08 February 2014

ఆ ఇద్దరు

ఒక మహాసర్పపు పడగ వలే ఆకాశం నీపైకి వొంగిన రాత్రి-

నక్షత్రాలు కాన రావు. చీకట్లో నీ చుట్టూ
పూలు తగలబడి రాలిపోతున్న వాసన-
     'అమ్మా' అని నిదురలో ఉలిక్కిపడి లేచిన చిరు నయనాలకీ
      ఏమీ ఎరుగని, వెన్నెల వొణికే ఆ
అరచేతులకీ, ఏ స్థన్యమూ ఒక గూడు కాదు-

"ఇదొక నగరం. మనుషుల నెత్తురును
నింపాదిగా త్రాగే మనుషులను తయారు చేసే ఒక మహా నగరం-
ఇదొక రంగుల ఊబి:" అతను అన్నాడు-

ఇక అప్పుడు, నెత్తురుతో ఉప్పగా మారిన అతని పెదాల్ని తుడిచి
వొణికే అతని చేతులని తను
తన శరీరంలో ముంచుకుంటే

ఇక అక్కడ, లోపల, తన లోపల

ఒడ్డుని డీకొని, ఒడ్డుని దాటలేక, నదికీ చెప్పుకోలేక

వెనక్కి మరలి,అలాగే వెళ్లిపోలేక
మళ్ళా మళ్ళా ముందుకు వచ్చే
అనాధ అశ్రువుల అలల శబ్ధం-

ఇక అప్పుడు, చివరికి, శిశువుల వలే ఆ ఇద్దరినీ పెనవేసుకుని
తన రొమ్ముకు హత్తుకుని
ఆ రాత్రే,నిద్రలో కలవరిస్తూ

ఊగుతూ, ఊగుతూ
ఊగుతూ, ఊగుతూ
ఊగుతూ, ఊగుతూ

కన్నీరెండిన చెంపలై, ఒక తల్లై, ఒక తండ్రై, మిణుకు మిణుకుమనే కందిలిలోకి
కుంచించుకుపోయే కాంతియై
చివరగా ఒక నెత్తుటి జోలపాటై

ఊగీ, ఊగీ, ఆగీ ఆగీ
ఆఖరకు ఇలా-

07 February 2014

నీడలు

తల వంచుకుని నువ్వు ఒక్కడివే కూర్చునే ఈ దినాలలో, నీ ఎదురుగా ఈ నీడలు -

వేళ్ళతో వాటిని తాకి చూస్తే, కొంత తడి -
నువ్వు ఎప్పటికీ చూడలేని, కొలవలేని
     నీ తల్లి కనుల కింది లోకాలలో, స్థిమిత పడుతున్న నీటి చెలమల వలే:
     'ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటావు'
   
అని తను అడగలేని ఒక మహా ప్రశ్నవలే, దిగులు వలే -

నిజం - ఒంటరిగా ఉండాలని ఎవరికి ఉంటుంది?

ఎవరో ఒకరు ఉండాలి లేదా
ఎవరో ఒకరు రావాలి: నీతో కొంతసేపు మాట్లాడాలి -

మాటలు కాకపోయినా సరే - ఊరకే నీ పక్కన అలా నుల్చున్నా, కూర్చున్నా
చాలు. నీలో కొంత, ఉపశమనం.
తెరపితో కూడిన ఒక నిట్టూర్పూ-

అయినా
ప్రతీసారీ పూవులు కావలనేం ఉంది?
ప్రతీసారీ వెన్నెల కురవాలనేం ఉంది?
ప్రతీసారీ వానలో తడవాలనేం ఉంది?

ఒక పచ్చి ముల్లు. ఒక పగిలిన పాత్ర
రాలిన గూడూ, నేలపై చితికిన గుడ్లూ
రెక్కలు కొట్టుకుంటూ, చిట్లిన ఆ గుడ్ల చుట్టూ గిరికీలు కొట్టే పక్షులూ, లేదా నీ ముందుకు
నిస్సహాయంగా సాగిన ఆకలితో వొణికే

ఒక పసి అరచేయైనా కావొచ్చు- ఎవరైనా
ఎలాగైనా రావొచ్చు.నీడలై
నీ ముందు అల్లాడవచ్చు-!

మరి, తల వంచుకుని నువ్వు ఒక్కడివే కూర్చునే ఈ దినాలలో, ఈ కాలాలలో
నీ ఎదురుగా రెపరెపలాడే నీడలకీ
నీడల తోడు కావాలని తెలియలేదా

స్నేహితుడా, నీకు ఇన్నాళ్ళకైనా-? 

06 February 2014

లతలు


కొంచెం నీళ్ళు, కొంత ఆసరా, కొంత కాంతీ కొంత గాలీ మరికొంత నీ స్పర్శా చాలు దీనికి

పచ్చగా నిన్ను అల్లుకుపోతుందీ లత, పిల్లలు నిన్ను కౌగలించుకున్నట్టు. ఒక మెత్తదనం అప్పుడు నీ ఒంట్లో. విచ్చుకునే పూరేకులు అప్పుడు నీ నయనాలలో. మరి నీ హృదయమంతటా ఒక చల్లని పరిమళం -

ఏళ్ళుగా చూడని - నువ్వు ప్రేమించిన - వారెవరో నీకు ఎదురుపడి నిన్ను హత్తుకున్నప్పటి ఉపశమనం. ఊరకే పెదాలపై తార్లాటలాడుతూ మెరిసే చిరునవ్వూ. కొంత ఇష్టం. కొంత ఒరిమీ నువ్వు చేసే పనులన్నిటిలోనూ కొంత నెమ్మదితనం, కొంత పరిపక్వతా,ఒద్ధికా. మనుషులని ద్వేషించడం మానివేసి, దయతో వాళ్ళని దగ్గరికి తీసుకునే అవగాహన ఏదో తెలుస్తుంది నీకు- 

ఇక అప్పుడు, లోకం నుంచి అతి స్వల్పంగా తీసుకుని మరింతగా ఇవ్వడంలోని చిరు ఆనందమేదో నీలో- ఇవ్వడం వల్ల విముక్తుడవయ్యి, నువ్వు పొందే ఒక స్వేచ్చేదో, ఒక శాంతేదో, ఒక కాంతేదో నీలో... 

మరి అల్లుకుపోయి చూడరాదు ఒక మనిషిని, కొంచెం నీళ్ళు, కొంత ఆసరా, కొంత కాంతీ కొంత గాలీ మరికొంత స్పర్శా మాత్రమే సరిపోయే, పచ్చగా నిన్ను పిల్లల్లా అల్లుకుపోయే ఒక లతవలే-