28 November 2013

అప్పుడు, అక్కడ

అప్పుడు, అక్కడ, తల వంచుకుని కూర్చుని ఉంటుంది

నీ ముసలి తల్లి: ఆ చిన్ని వరండాలో, తన
జుత్తు విరబోసుకుని తల దువ్వుకుంటూ-

చెట్టుపైకి వొంగి, చెమ్మగిల్లిన నింగి.
రాలిపోతున్న పసుపు వేపాకులు.
పాలిపోయిన ఆ కాంతిలో,ఆ చెట్టు

బెరడుని గీకుతూ, గుర్రుమనే పిల్లులు. కంపించే నీడలు.
అక్కడక్కడా పిల్లలు వొదిలి వేసిన
పగిలిన బొమ్మలు.అద్దం పెంకులూ-

వెనుకగా పక్షి పిల్లలు లేని ఒక ఒంటరి గూడు. అక్కడక్కడా
కొమ్మల మధ్యలో ఊగే సాలె గూళ్ళు.
అలసిన తన, ఎండిన పెదాలను
కోసుకుని ఉబికే నెత్తుటి తడీనూ-

ఇక ఉన్నట్టుండి వీచిన చల్లని గాలికి, తను తల ఎత్తి చూస్తే
ఎప్పట్లా నిన్ను చూసి నవ్వితే
ఎదురుగా నువ్వు. అదే: దారి
తప్పో, దారి మరచో, ఇంటికి

వచ్చిన నువ్వు - ఇక అక్కడ

ఉండాలేకా, వెళ్లిపోనూ లేకా, మాట్లాడలేకా, ఏమీ కాలేక...

21 November 2013

మాట

1
ఎంతో నిశ్శబ్ధం తరువాత, నలిగిన ఆ చీకటిలోంచి
ఒక మాట మాట్లాడతావు నువ్వు
గాలిలోంచి తేలుతూ వచ్చి  రాలే

ఒక తెల్లని పక్షి ఈకలా: తల ఎత్తి చూస్తాను నేను - కానీ
రెక్క తెగిన ఆ పక్షి ఎక్కడో కనిపించదు.
చిట్లించిన కనురెప్పలపై మాత్రం, రాలే

నీ శరీరం అంతటి ఒక నెత్తురు చుక్క-
2
ఆ నిశ్శబ్ధంలో, నేను పుచ్చుకున్న నీ రెండు చేతులూ

ఎంతో సేపటి నుంచి నువ్వు
మధన పడీ, మధన పడీ  మననం చేసుకున్న పదాలు.
తల ఎత్తి చూస్తే రెపరెపలాడే
నీ కళ్ళు, నేను ఎప్పటికీ చేరుకోలేని అర్థాలు-

ఇక ఈ పదాలకీ, అర్థాలకీ వెనుక, అశృవులతో చీరుకుపోయిన...
నీ కనుల అంచులను తుడిచిన
నా చేతి వేళ్ళ చివర్లు: అవే. అవే
కాలతాయీ రాత్రికి నిరంతరంగా

అనాధ శవాలు ఏవో చిట్లుతూ, తగలబడుతున్నట్టు -

నాకు తెలుసు, నాకు తెలుసు-

గోడలపై వ్యాపించే నీడల చుట్టూ అల్లుకుపోయే నిశ్శబ్ధం లతలు-
గూడు రాలిపోయిన తరువాత
పిల్లలు కనిపించక ఇక అక్కడే
రెక్కలల్లర్చుతూ ఎగిరే పక్షుల
దిగులూ, వాటి అరుపులూ -

మరి తెలుసు నీకు కూడా- మరి అర్థం అవుతుంది నీకు కూడా

తప్పకుండా - కట్టిన దారానికి తెగిన తూనీగ రోదనా
వెక్కిళ్ళు పెట్టి రాలిపోయే
సాంధ్య పూల భాషా-
తలుపు చాటున ఇరికి

నుజ్జు నుజ్జయ్యిన వేలి వెంటే, నీ వెంటే వచ్చే ఆ బేల కనుల ఘోషా -
4
ఎంతో నిశ్శబ్ధం తరువాత, నలిగిన ఆ చీకటిలోంచి, ఇటు వచ్చిన...
నువ్వు మాట్లాడిన ఒక తేలికైన
మాట:  ధాన్యం వాసన వేసే
వాన వాసన వేసే ఒక మాట-

పొలమారిన తలపై తట్టి, నోటికి
మంచి నీళ్ళ గ్లాసు అందించిన
తల్లి చేయి వంటి ఒక మాట
పీడకలలలో భీతిల్లి ఒత్తిగిల్లి

నువ్వు గట్టిగా కరచుకుపోయి
పడుకునే ఒడి వంటి ఓ మాట
వెలుగుతోంది ఇక్కడ, ఒక మట్టి ప్రమిదెయై, వలయమై -
5
వస్తారు పిల్లలు, వెళ్ళిపోతారు పిల్లలు
నీ నుంచి నాకూ నా నుంచి నీకూ
ఒక మాటని మంత్రించి, పెనవేసి-

చీకటి గాలి వీస్తుంది అప్పుడు- ఆరుబయట ఆరవేసిన
తెల్లని వస్త్రాలు ఊయలల వలే
ఊగుతాయి అప్పుడు.ఆకులు
కదిలి, నేలపై కాగితాలు దొరలి

నా నుదిటిని తాకిన గాలే, నీ ముంగురలనీ తాకి

నీ శ్వాసలో చేరి, కరిగి ఒక మాటై
పోతుంది అప్పుడు. ఇక నిదురలో
అస్పష్టంగానే అంటారు ఏదో పిల్లలు
అప్పుడు. అది కూడా... ఒక మాటే

పెదాలపై ఇంకా తడి ఆరని తల్లి పాల వంటి ఒక మాటే -
6
అక్కడ, నువ్వు లేచి, ఎంతో నలిగిన ఆ చీకటిని సాఫీగా చేస్తూ

మాటలోంచి మాయమయిన దానినేదో తిరిగి నింపి
వాటిని ఇటువైపు రంగుల
నీటి బుడగల మల్లే చేసి
వొదులుతూ ఉన్న చోట
7
చిన్నగా నవ్వుతూ, మాట నుంచి మాటకి సాగుతూ, దాదాపుగా చేరుకుంటూ
చిన్నగా కాలం గడుపుతూ
వీటన్నిటి తరువాత కూడా
బ్రతుకుతాం మనం -ఇలా

ఎంతో నిశ్శబ్ధం తరువాత, ఎంతో చీకటి తరువాత, ఎంతో మౌనం తరువాత , ఎంతో 
ఎంతో నువ్వు తరువాత 
ఎంతో నేను తరువాత... 

ఒక చిన్న మాటలో ఒదిగిన 
మనంతో, మనతో,
మన తనంతో... 

18 November 2013

నిశ్శబ్ధం నీవైనప్పుడు

1
నిన్న రాత్రి నువ్విచ్చిన పూలగుచ్చం ఇక్కడ
ఒక ప్లాస్టిక్ బాటిల్లో, నీళ్ళల్లో -

అవే, వాడిపోని ఈ పూవులు 

కొన్నిసార్లు అవి నీ కళ్ళు. కొన్నిసార్లు అవి నీ మాటలు.
కొన్నిసార్లు, అవి నీ చుట్టూ తిరిగే
పిల్లలు. వాళ్ళ ఆటలూ. నిదురలో 

తెరుచుకున్న వాళ్ళ పెదవులు. ఇంకా మరి   
వాళ్ళ నుంచి వచ్చే వాసనా
అర తెరచిన వాళ్ళ చేతుల్లో 
చిక్కుకున్న, నీ చేతివేళ్ళూ -
2
గంజి పెట్టి ఉతికిన దుప్పటిలోంచి ఎప్పటిదో 

బాల్యంలో అమ్మ బొజ్జను  
చుట్టుకున్న ఒక స్మృతి 
నేలపై, చాపపై ఆ ఇంట్లో-

నువ్వు కూడా ఇప్పుడు 
దవనం వాసన వేస్తావు-
అదే, కనకాంబరం పూలను అల్లుకున్న, మెరిసే దవనం-  

ఇక, నవ్వే నీ ముఖంలో, నన్ను 
చుట్టుకునే నీ చేతుల్లో 
ఒక పసిపిల్లతనం, ఇష్టం-
3
బహుశా జన్మదినాలూ, జన్మించడమూ ఇంతేనేమో -

పూల నీడల్లో కాంతి రేఖలు. గూళ్ళల్లో 
ముడుచుకున్న పిట్టలూ - 
వీచే గాలికి చలించే ఆకులూ
చీకటిలో మెరిసే నక్షత్రాలూ 

ఛాతిపై సీతాకోకచిలుకలు ఏవో వాలినట్టు ఉన్న  
పిల్లల చేతులని ఆప్తంగా తాకి  
ఎప్పటికీ ఇక్కడ ఉండబోమనే 
ఒక స్పృహ జ్ఞప్తికి రావడమూ 
కావొచ్చును. కొంత దయతో 
మేల్కొవడమూ అవ్వొచ్చును- 
4
వెళ్ళిపోతాం నువ్వూ, నేను- ఎప్పటికైనా - చివరికి -

మరో పక్కకి ఒత్తిగిల్లిన తరువాత 
పక్కపై నలిగిన ఖాళీలో మిగిలిన 
నీ శరీర స్పర్శ ఏదో నునువెచ్చగా 
తగిలినట్టూ, ఒక లాంతరై రాత్రంతా 
మనకు కలలలోకి దారి చూపినట్టూ

వనాలలో కురిసే తుంపర వంటి నిశ్శబ్ధం: ఇప్పుడు ఇక్కడ- 
ఇక, నిశ్శబ్ధం నీవైన ఆ క్షణంలో 
ఈ కవితను ముగించడం ఎలా?         

17 November 2013

కృతజ్ఞతలు

అప్పుడో మాట వస్తుంది నీ వద్ద నుంచి.   

తెల్లటి పావురం అది. రెక్కలు విదుల్చుకుంటూ 
నా ముందు వాలితే
కొంత తెరపి నాకు-
పూవై విచ్చుకుని 

రాత్రి పరిమళం వలే వ్యాపిస్తే కొంత శాంతి నాకు. 

అరచేతుల్లోకి ముఖాన్ని తీసుకున్నట్టు, శ్వాసతో  
కనురెప్పలని తాకినట్టు 
గుండెల్లోకి హత్తుకుని
ముద్దు పెట్టుకున్నట్టూ

రెక్కల కింద వెచ్చగా దాచుకున్నట్టూ, జోలపాట 
పాడుతూ బుజ్జగించినట్టూ
పచ్చని కలల లోకాలలోకి
తోడ్కొని పోయినట్టూ - నీ 

వద్ద నుంచి వచ్చే వాన వాసన వంటి ఒక మాట. 

ఇంక బెంగ లేదు. ఇంక భయం లేదు. నవ్వుతూ 
నీ చిటికెన వేలు పట్టుకుని 
రేపటిలోకి నడుస్తాను నేను. 

16 November 2013

renege/r

1
కూర్చుని ఉన్నాడు అతను - చీకట్లో -

పదునైన శీతాకాలపు అంచులను తాకిన పూవులు
ఇక రగలలేక, చెమ్మతో
చిట్లి, రాలిపోయే వేళల్లో-
2
ఎదురుగా రాత్రి -
తన నిలువెత్తు
చిగురాకు శరీరం, అతను తాకలేని పుప్పొడిగా మారి
చేజారే క్షణాల్లో.
3
ఇక
అతని చుట్టూతా
ప్రమిదెలు వెలిగించిన తన అరచేతులలోంచి వ్యాపించే
మట్టీ, మంటా

పెనవేసుకున్న
గాలీ, వాసనా-
ఒక కుబుసం.
4

తరువాత
కిటికీ రెక్కలు తెరచి ఉన్నా
వెళ్ళిపోలేక

నిప్పు కౌగిలికీ, మృత్యు చుంబనానికీ దగ్గరై
కొట్టుకులాడే
ఒక పురుగు -
5
ఇక
రాత్రంతా అతని ముంగిట రాలే నక్షత్రాలు.

మెరిసే
వాటి లేతెరుపు కాంతీ-
అది ఇప్పటిది కాదని అతనికి ఖచ్చితంగా తెలుసు -
కానీ

తన
ముఖాన్ని మరవడం ఎలా?
6
డెజావూ
డెజావూ
డెజావూ
7
ఇక
అందుకే

ఉరికంబమైన వెన్నెల వలయంలో
తలను వాల్చి
నిదురోతున్న
8
ఒక మనిషీ

ఒక
మృగమూ
ఒక పంచ వన్నెల సీతాకోకచిలుకా, నవరంధ్రాల
నీస్మృతి వేణు
గానమూనూ-
9
ఇక
రేపు
ఏమవుతుందో, ఎవరికి తెలుసు?

12 November 2013

హే రాజన్

అరే
హేమిరా రాజన్
తాగితిని పో
అందులో బీర్లు త్రాగనేల?
బార్లో బీర్లే పో
అందులో అట్లా పడి మునుగనేల?
మునిగితి పో
పురాజన్మల పాపములు, కర్మములు తీరునట్టు
నన్ను నేను మరచుటేల?
మరచితిని పో
నన్ను మరచి నిన్ను తలచుటేల?
తలచితినిపో, ఇంకన్నూ
ఈ జన్మ దుక్క దాహము తీరనట్టు
తిరిగి, చంద్రుని  ముక్కలున్ జేసి
ఆ గాజుపాత్రలో వేసి
నింగినెక్కి, నక్షత్రాలతో విస్కీ త్రాగనేల?
అలా ఇకిలించనేల?
ఇకలించితినిపో, వేకువఝాము  వెన్నెల చలిలో
నీ  మోముని కాంచి
ఆనందముతో సకిలించనేల?
సకిలించితిని పో
చంకల కింద చేతులు జొనిపి
ఆ మంచులో పవళించనేల?
పవళించితిని పో
ఊగే ఆకులతో, రేగే గాలితో, పెదాలపై ధూమముతో
అలా పరవశించనేల?
అనంతమును చూడనేల?
అంతా చేసీ చూసీ
ఇప్పుడిలా
ఒరే
రాజన్
హే హే  రాజన్
ముక్కులు నదులయ్యీ
గుండెలు అగ్నయ్యీ
తుమ్ముకుంటో
దగ్గుకుంటో
చీటికిమాటికీ
చీటికీ మాటకీ
మాటి మాటికీ
కడవల నిండగా చీదుకుంటో
చీమిడి వంటి
ఈ పదాములను
వ్రాయనేల?
ఆపై తిరిగి వెర్రివాడివలే
నవ్వనేల?
రాజన్
హే  హే  రాజన్
ఇప్పటికి ఇంకన్నూ ఇక్కడ
ఎరిత్రోమైసిన్
టోటల్ కాని డీ కోల్డ్
రెండు సిట్రజిన్, నాలుగు డోలో - 650 తో
శోక నివారణం లేని
ఒకే ఒక్క క్రోసిన్ నొప్పి నివారణతో
కోతి మదితో
శునకం తోకతో
తల కిందులుగా
తపస్సు చేయనేల? మరి
ఇక
వేద్ధునా
ఒక పెగ్గు బ్రాందీ
సర్వం దిగేటట్టూ, నీ ఈ
వాచకం తాట తీసేటట్టూ
కొద్ది సిగ్గుగా
కొద్ది నిర్లజ్జగా
కొద్దికొద్దిగా
ఇంకొద్దిగా, జుత్తును గోక్కునే నా వానర తత్వంతో
హే రాజన్
మరిక
ఇప్పటికి ఆమెతో
కారుతున్న
ముక్కులతో? 

11 November 2013

మన/తల్లులు

ఎలా రాయటం ఈ నొప్పిని? మహా తీవ్రత ఏమీ కాదు కానీ,గుండెలో ఒక గాజు దీపం పగిలింది-

ఏరుకో  ఇక ఆ పెంకుల్ని కళ్ళలోంచి, కాంతి కణాలని తీసేవేసి.పూడ్చుకో ఇక ఆ ముఖాన్ని అరచేతుల్లోకి,ఉరితాళ్ళ వలే ఊరిన,తల ఎత్తలేని ఒంటరి కాలాలలోకి. రాత్రయితే త్రవ్వుకో ఒక సమాధిని -కడుపు చీలిపోయినట్టు, పేగులు రాలిపోయినట్టూ,వాటిని చేతిలో పట్టుకుని.తెగిపోయి,నీకు నువ్వే చెప్పుకోలేక, విరిగిపో. ఊగే నీడల,అంతు లేని వలయాల అంగాంగ లోకాలలోకి-


ఎన్నడూ అడగకు ఒక చేతినీ, మాటనీ, సహపద్మపు సువాసననీ. 


తినగా తినగా తినగా వాళ్ళు ,ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే  నీకో శరీరం, దాచుకో భద్రంగా నీ బాహువుల మధ్య,మిగిలిన ఆ సుమాలయాన్ని. చూపించు ఒక్కసారి, చెక్కివేయబడ్డ వక్షోజాలని. వినిపించు మళ్ళా మళ్ళా పురుషాంగం అయిన దేశాన్నీ,దేశం దేవుడూ అయిన రాజ్యంగాన్నీ,రాజ్యం పీలికలు చేసిన నీ యోనినీ. నవ్వు ఒక్కసారి గట్టిగా, పురాణాలూ పుణ్యాత్ములూ ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టూ, నివ్వెరపోయేటట్టూ.చూడనిది ఏదో ఇవ్వు.నీకు ఇవ్వనిది ఏదో పొందు. అల్లు, నరాలని పెనవేసి, నిన్ను నువ్వు రాసుకోగలిగే ఒక నెత్తురు కాగితాన్ని. స్ఖలించు ఒక్కసారిగా,ఈ విశ్వం మొత్తమూ తిరిగి ప్రారంభం అయ్యేటట్టు. ఉన్నది ఏదో విసురు. నీకు దాచినది ఏదో పెగల్చుకు పో -


అమ్మా, నా తలుపులమ్మ తల్లీ, నా గ్రామ దేవతా, దీపం కాదు, దేహాన్ని వెలిగించు. చీకటిని కాదు దేవతా దివ్య వాచకాలని తగలబెట్టు.ముట్లు లేని,విసర్జించలేని,స్త్రీత్వం లేని ఆ మహా కథనాలనేవో ముక్కలు ముక్కలు చేసి పెట్టు.నీ గర్భ సారంగ సంగీత మహా లయ విన్యాసాలనేవో నువ్వే చూపెట్టు.  


అమ్మా, తల్లీ - ఒళ్లంతా పొక్కిలయ్యి,కళ్ళంతా నెత్తురు చినుకులయ్యి కూర్చున్న ఆదిమ ఆదివాసీ,నా తండ్లాటల తల్లీ, కొడుకులను కోల్పోయిన యాదమ్మా,తాయమ్మా,నలిగిన పాదాల,అడుగంటి పోయిన కడుపుల అమీనమ్మా, ఖండిత అంగాల, తగలబడ్డ నా తెలంగాణా తల్లీ 

  
నీ చేతుల్లో గాజు దీపమేదో,కత్తై,కొడవలై,పువ్వై,సూర్యుడై పూర్ణ చంద్రబింబబై వికసించింది -ఎలుగెత్తి ఏడ్చింది. ఎలుగెత్తి నవ్వింది. బిడ్డా అని నువ్వు హత్తుకున్న నీ గరకు అరచేతుల మధ్యకు ఈ ముఖం ఈ వేళ నిశ్శబ్ధంగా నాటుకుపోయింది, నీ హృదయ ధ్వనితో కప్పబడింది-


ఇక రేపు నీ అరచేతులలోంచి మొలకెత్తే, ఒక  మాట, ఒక్క మాట, ఒకే మాట ఎవరిది? 

07 November 2013

నువ్వు

- ఎక్కడో ముడుచుకుని ఉండి ఉంటావు నువ్వు -

అంతస్థుల అంచులపై అలసటగా వాలి,విరుగుతున్న రెక్కలని మాన్పుకుంటూ
అలా తపనగా, కనిపించని అరణ్యాల వైపు చూసే
ఈ అంతస్థులలో ఇమడలేని ఒక తెల్లని పావురం 

నీవు అని తెలుసు నాకు. దారి తప్పి 

ఈ లోహ రచిత, నరమాంస భక్షక ప్రదర్శనశాలలో, మానవ విపణి కేంద్రంలో   
నీ గుండెను ఉగ్గపట్టుకుని తిరిగే బాలింత కనుల 
బాలికవూ, నెమలీకవూ నీవు అని తెలుసు నాకు-  

ప్రతి రాత్రీ,నీడలతో పోరాడీ పోరాడీ ఓడిపోయే,ఒక దీపకన్యవనీ,దిగులు కలువవనీ   
అశ్రు పవనాలలో చిక్కుకున్న ఓ లేత చిగురాకు 
నీవనీ తెలుసు నాకు. అరచేతులు, లోయలంత 

చీకట్లయితే, వాటిలోకి నిర్ధ్వంధంగా రాలిపోయే, చినుకు చిక్కుకున్న ఓ పూవువి నీవు 
అనీ తెలుసు నాకు. ఒంటరిగా మళ్ళా, రాలిపోయిన  
ఆ లోయల్లోంచి ముఖాన్ని ఎత్తి, చెమ్మను తుడిచి 

ఇక దీపంలోని చీకటినీ, చీకటిలోని దీపాన్నీ వెలిగిస్తే  

ఈ అక్షరాలకు ఇంత తల్లితనం, తల్లి వక్షోజాల తొలి 
పాల వాసనా, తన జోలపాటా, మాటా, నిదురా ... 

మరి ఇదంతా తెలిసి, 'ఎక్కడో ముడుచుకుని, గీరుకుపోయే హృదయంతో, ఎక్కడో 
కంపిస్తూ, పిగిలిపోతూ, తిరిగి ఏకం అవుతూ, మళ్ళా 
అంతలోనే, నలుదిశలా పొగమంచు తెరలై చీలిపోతూ 

ఎక్కడో ముడుచుకుని కూర్చుని ఉంటావు నువ్వు-'
అని నేను వ్రాస్తూ కూడా, "ఎలా ఉన్నావు నువ్వు?"

అని ఎలా రాయను నేను? అని ఎలా అడగను నేను? అని ఎలా చూడగలను నిన్ను?

04 November 2013

ఇవ్వాల్సి'నది'

"How was the day?" అని అడుగుదామని అనుకుంటాడు అతను
తనని -

వాన వచ్చే ముందు వీచిన ఈదురు గాలికి
ఎక్కడో తెగిపోయి, ఇక్కడికి
కొట్టుకు వచ్చి, వాలిపోయిన

ఒక మృదువైన, నిదురలోకి ముడుచుకుపోయిన
ఓ పసి పిడికిలి వంటి
ఆకునీ, తననీ కూడా-

నిస్సత్తువుగా కుర్చీలో జారగిలబడి, భుజాన బ్యాగుని పక్కకు వొదిలి
కళ్ళలోని వాననీ
శరీరంలో వడలిన

పూలనీ, రేగే ధూళినీ తుడుచుకుంటూ, సొమ్మసిల్లుతోన్న నవ్వుతో
అతి కష్టం మీద
ఇలా అంటుంది
తను అప్పుడు-
అతనితో:

"కొద్దిగా, ఓ గ్లాసు మంచినీళ్ళు అందిస్తావా?" 

01 November 2013

నీ నిదుర నయనాలలోకి

పదాలు లేని ఇష్టం ఇక్కడ
అప్పుడు
నువ్వు నెమ్మదిగా కళ్ళు మూసుకుని నిదురలోకి జారుకుంటున్నప్పుడు

మలుపులు లేని శ్వాస ఇక్కడ
అప్పుడు
నువ్వు నెమ్మదిగా కలలు లేని నదిలో నావై మృదువుగా సాగిపోతున్నప్పుడు

రెప్పలు లేని కాలం ఇక్కడ
అప్పుడు
నువ్వు ఒక తీరం చేరి, పూలల్లో చేరి, రాత్రిలో, నక్షత్రాల సువాసనలలో

నీ లోపల నువ్వు
ఉద్యానవనంలో
ఒక తెల్లని సీతాకోకచిలుకవై ఎగురుతూ ఉన్నప్పుడు- వాలుతున్నప్పుడు

తల తిప్పి ఒత్తిగిల్లి, నా చేతిని లాక్కుని నీ మెడలో దాచుకుని
నీ నిదురలోనే ఎందుకో
చిన్నగా నవ్వినప్పుడు-

అప్పుడు

నీ శిరోజాలు వీచిన గాలికి, ఇక్కడంతా పురాజన్మల పరిమళం
ఒక మార్మిక ధూపం
ఎవరూ విప్పి చెప్పలేని, ఒక జీవన మృత్యు రహస్యం -  ఇక

అప్పుడు

నీ చుట్టూ ఒక దుప్పటి కప్పి
నా రెండు చేతుల మధ్యా
నిన్ను భద్రంగా, అపురూపంగా, లోపలికి దాచుకుంటుంటానా

స్వప్న ఛాయలతో
బరువెక్కిన నీ కనురెప్పలని ఎత్తి నా వైపు అలా చూస్తావా, ఇక మరి
అంతిమంగా నేనేమో

ఒక కృతజ్ఞతతో
ఏమీ చెప్పలేని
చేయలేని, ఒక
నిస్సహాయతతో

నీ అరచేతులని అందుకుని, నా గుండెలకు అదుముకుని
ముద్దు పెట్టుకుంటాను-

ఎలా?.........ఇలా. 

నివేదిక

రాత్రంతా నువ్వు లేకుండా ఒక్కడినే కూర్చుని తాగాను -

ఏం చెప్పను? కరకు శీతాకాలం.
మనుషులు పగిలిన పెదాలై, మాటలై, కొమ్మ నుంచి తెగి
నీ చుట్టూ ఆకులై రాలే కాలం -

చుట్టూ ఎవరూ లేరు. సమాధిలోంచి తొలుచుకు వచ్చిన
కొన ఊపిరితో బ్రతికి ఉన్న
ఒక చేయి వలే ఈ రాత్రి -

బరువెక్కిన నయనాలూ
అలసిపోయిన చేతులూ-

ఎవరో ఇంతకాలమూ త్రవ్వీ త్రవ్వీ, ఎటువంటి నీటి జాడా లేక
వొదిలి వేసిన ఈ శరీరం ఇక
ఒక పాడుబడిన కుటీరమూ
ఎవరూ అడుగిడని భూమీ-

ఎవరికి చెప్పను, కన్నీళ్ళూ మంచి నీళ్ళేనని, మనిషి లేక
మరొక మనిషి మన్నలేడనీ
తానే ఇతరమనీ? ఇతరమే

తాను అనీ, ఇతరమే మనం అనీ? మనమే సర్వస్వం అనీ?

ఒరే నాయనా, కవీ, కసాయీ
వెన్నెల పూలతో ఊగిపోయే
స్నేహ పాత్రాధారీ, బాటసారీ

ఏమీలేదు. రాత్రంతా ఒక్కడినే కూర్చుని త్రాగాను. ఎదురుచూసాను -

అయిపోయింది ఈ హృదయం ఖాళీగా.
రాత్రేమో వచ్చి వెళ్లిపోయింది
సవ్వడి లేకుండా, రికామీగా-

అది సరే కానీ, మరి ఇది చెప్పు, నువ్వు నాకు-

నువ్వు వచ్చి, ఈ అరచేతుల మధ్య సప్త రంగుల వసంత వనాలై
ఒక సుగంధపు మధుపాత్రై
ఒదిగి ఒదిగి పోయి, నన్ను

నువ్వూ, నిన్ను నేనూ, బ్రతికించుకునేది ఎన్నడు?