31 August 2013

- ప్రార్ధన -

తెల్లటి చీకటి: నీడలతో ఎదురుచూసే నీడలు
నీ చేతులు -
ఈ ఒంటరి
గోడల పైకి

సర్పాల వలే నీనా చూపులు:ఇక ఒక వృక్షం
వొంగుతుంది
ప్రమిదె వంటి
ఒక పండుతో-

- Amen -
ఇదే పవిత్రమైన ఒక ప్రధమ పాపపుణ్యం-

ప్రార్ధించు మరి: నాలికని నాలికతో
పెదవులని
పెదవులతో

శరీరాన్ని శరీరంతో, నిప్పులు ఎగిసిపడే
నిను వీడిన నీ
నా నీ/డలతో-

- ఇల్లా. ఇల్లిల్లా. అల్లా. అల్లల్లా-
(ఆmen)

29 August 2013

I Kissed Her Goodbye

"వొంటరిగా ఉంది ఇక్కడ - నొప్పిగా కూడా ఉంది
ఏం చేయాలో తెలియటం లేదు

చెల్లాచెదురుగా చెదురుమదురుగా కూడా ఉంది
శరీరం ముసురు పట్టింది.పక్షులు
వొదిలి వేసిన గూడును చూసావా

నువ్వు ఎన్నడైనా? ఇదిగో నేను దాచుకున్న ఆ
రంగురంగుల పక్షి ఈక, ఎగరలేదు
ఇక ఇది, గింజలకై  కువకువలాడ

లేదు ఇది. నా లోపల చెట్టుని కొట్టేసినట్టు ఉంది
నీడలు తిరుగాడుతున్నట్టు ఉంది
బెంగగా కూడా ఉంది. ఏం చేయాలో

తెలియటం లేదు. ఏం చేయాలి-?" అని అడిగింది
తనూ, తన తనువూ. ఇక అప్పుడు
రాత్రి చినుకులు చుక్కలతో లోపలికి

విసురుగా వచ్చి గాలితో గదినీ నన్నూ
తడుపుతున్నప్పుడు- it is then that
I gently kissed her Goodbye-మరి

వినపడిందా మీకు? నీళ్ళు ఒలికిన ఆ చప్పుడు-?

28 August 2013

ఒడ్డున కూర్చున్న వాళ్ళు

ఒడ్డున కూర్చుని, నీళ్ళలోకి రాళ్ళు విసిరి
నవ్వుకుంటూ, మురిసిపోతూ
ఆనందించే వాళ్ళ సంగతి వేరే

కానీ, నీ కళ్ళల్లోకి గాలం వేసి కూర్చునే
నీ వాళ్ళ సంగతీ,  బజార్లల్లోకి
లాగి నిన్ను వేలం వేసే నీ/వాళ్ళ

సంగతీ ఏమన్నా ఉంటే చెప్పు వింటాను-

అది సరే:మరి సంతోషంగా ఉన్నావా నువ్వు
ఇప్పుడు:నాకు లేని సహచరీ
ఒడ్డు దొరకని ఒక మనిషి, నీ

గాలానికి చిక్కుకుని, శ్వాసందక ఇక
పాలిపోయిన అశ్రువు వలే
ఇలా, రాలి/పోయిన నాడు-? 

27 August 2013

- ఒక విషయం -

అద్దంలో ఒక లిల్లీ పూవుని ఉంచాను
నా శరీరాన్ని త్రవ్వి త్రవ్వి
నెత్తురుని దున్ని దున్ని

ఒక పాదు చేసి, అందులో
నీ ప్రతిబింబాన్ని ఉంచాను

నీకు చినుకులని జల్లి
ఆ ఎండకు ఆనుకుని

అక్కడే పడి ఆదమరచి నిదురపోయాను. మరి
అతను  లేచేలోగా
మొక్కకు పూచిన
ఒక చిన్ని పసుపు

సీతాకోకచిలుకను చిదిమి, నిదురించే అతని
కనురెప్పలపై నుంచి
తడి ఆరని పాదాలతో

వీస విసా నడుచుకుంటూ వెళ్లిపోయింది ఎవరు? 

26 August 2013

సదా

ఆకుల మీది కాంతీ, కాంతిని తాకి రాలే మంచూ

నీ చుట్టూతా:నీ ముఖాన్ని నువ్వు దాచుకునే నీ

అరచేతుల్లో లేత మంట. ఎలా అంటే
చిన్ని చిన్ని గుల్మొహర్ పూవులు
చప్పున నీ అరచేతుల్లో వికసిస్తే,నీ
చెంపలపై ఆ కాంతి ప్రతిఫలించినట్టు

నీ ముఖమంతా సంతోషం, నీ కళ్ళల్లో ఆనందం-

అలలపై కలువ మెరిసినట్టు  నీతో నువ్వు
నీలో నువ్వు. నీ చుట్టూతా సమస్థం ఒక
అమృత పరిమళ వెన్నెల వలయం -ఇక
నీతో, వలయామృతమైన కాలంలో, నాలో

మరి ఇక, సదా ఇలాగే ఉండాలనే ఒక శాంతి సందేశం-

నీ వేళ్ళ చివర్లతో,నేలపై ఎగిరిపడే ఆ నీడల్ని తాకుతూ
అట్లా, తుళ్ళి తుళ్ళి పడి నవ్వే
ఓ చిన్ని చిన్ని చిన్నమ్మాయీ

ఇంతకూ నీ పేరేమిటి?/ ఇంతకూ నీ ఊరేమిటి?

నీ నవ్వుల నురగల్లో చిక్కుకుపోయిన, నేను ఏమిటి? 

21 August 2013

- మనMe -

- మాట్లాడని దీపం ఒకటి, నీ వంటి కాంతితో -
     మసి నిండిన రాత్రిలోకి.
అప్పుడు నీ అరచేతులు

మాట్లాడే పూవులు -  నన్ను నవ్వే పూవులు -
     ప్రతిధ్వనులు.చినుకులు
చిగురించిన వేళలలో
చిన్నగా కదిలి, ఆగే

- పూరేకులు. మసక వెన్నెల ముళ్ళు. రెండు
     వేళ్ళ మధ్య నిన్ను ఎవరో
నులిమిన వాసనలు
నా లోకాలని ఊపేసే

నీ లోలకాలు.
పురాగాధలు-
 
అయినా ఎవరూ రారు ఇక్కడికి: చీకటి రెక్కలు
     రిఫ్ఫున వీచే, సీతాకోక
చిలుకల రెక్కలూగి
ఆగిన చోటకి.అలసిన

మన చోటకి/తోటకి /అలలా

విలపిలిపించే ఆ కోట వద్దకి -

అందుకని

O One
O Blue one
Oh Blue blue One of the None

No.
Don't open
the door

- Of you, of me -
- Of you and me -

Look
Lock
Look

- కుత్తుక తెగి నీ గుమ్మంలో రాలి, తల ఎత్తి, ఆఖరి
     పదశ్వాసతో నీ వైపు చూసే
ఒక పావురాన్ని

ఇక ఇప్పటికి. మనం.  వచ్చేటప్పటిkey.

19 August 2013

- దీవెన -

- దీవించే గాలి. దీవించబడ్డ గాలి. గాలిలో దీవెన -
   
వంచిన శిరస్సుపైన, ఒకోసారి పాక వలే, ఒకోసారి పడగవలే
వొంగిన - దీవించడానికి వొంగి
దీవించలేని - నీ అరచేతులు-

రాలుతుంది వాటి కింద, నీ కళ్ళ కింద, ఈ వాన కుబుసం...
తేలికగా, ఆలంబనగా
   
శాపం వలె, శరాఘాతం వలే
నిన్ను నమ్మి,నీ వెంటే వచ్చి
కూలిపోయిన రెండు అపస్మారక బాహువుల వలే: నిజం.

- ఇది
నిజంగా
నిజం -

- సత్యం - శివం - సుందరం - 

ఈ కారుణ్య రాత్రుళ్ళ కరకు దంతాల పెదాల ఇష్టం/దాహం

నీ గొంతున దాగిన
నా పిలుపు అంత

వెన్నెల హాలాహలం... ఆహ్ ...

O blue blue One
Of the None...
Hear-
Here

ఇక... 

18 August 2013

- అంతం -

1
గుత్తులుగా వేళ్ళాడే ఆకులను తొలగిస్తే, నీ వేళ్ళకు అంటుకుంటుందీ
పొరల పొరల వంటి కాంతి - మజ్జిగ చిలికే
అమ్మ ముందు కూర్చుంటే మధ్యలో ఇంత
వెన్న తీసి, తను నీ అరచేతుల్లో పెట్టినట్టు-

ఊహ తెలియని వయస్సులో, తన కొంగులో
దాగితే, ఆ కనకాంబరపు చీరలో లోకమంతా
లేత నారింజ రంగులో కనిపించినట్టు, మరి

ఇక్కడ, మృదువైన పూల కాంతి. ఇప్పుడు
గుర్తు లేదు కానీ నీకు, పొలమారితే నీ తల్లి
నీ తలపై తట్టి, మంచి నీళ్ళు తాపించినట్టు
ఇక్కడ, తన వొంటి వాసనా, తన చేతుల గాజుల అలికిడి వంటి గాలీ-

ఆ గాలిలో, రెపరెపలాడుతూ ఒక సీతాకోకచిలుక. దాని గమనాలలో
కాలభ్రమణం. ఇంతకు మునుపే ఇక్కడికి
వచ్చినట్టు,ఈ జీవితాన్నిఇంతకు మునుపే
పలుమార్లు జీవించినట్టు, వెళ్లిపోయినట్టూ-

ఇక అప్పుడు, అక్కడ
2
నిదురించిన పసి పిడికిలి లోంచి, అతి నెమ్మదిగా నువ్వు నీ
చూపుడు వేలిని లాక్కునట్టు, ఆ చెట్ల కింద
నుంచి సాగిపోతాయి నీడలు. రాత్రి కురిసిన
వాన నీళ్ళు ఆగిన పచ్చికలో ఒక ప్రకంపన-
ఆ నీళ్ళపై పురుగులు కదిలితే, అతి మెత్తగా

వణుకుతుంది సాయం సంధ్య. లక్షలక్షలు
విసెన కర్రెలు వీచినట్టు,హోరున వీచే గాలి.
ఆకస్మికంగా ధూళి లేచి, తెరలు తెరలుగా
నీ పైన కొమ్మలు గలగలా ఊగి ఆకులుగా
రాలితే,నీ కళ్ళల్లో కొంత నీరు.కొంత చీకటి-
దుమ్మే పడిందో,లేక నీ తల్లే అలా రాలిందో

ఎప్పటికీ తెలియదు నీకు. మరి ఇక నువ్వు నీ తల తిప్పి చూస్తే
3
నీకు కనిపించని దూరాలలోంచి నీ వైపు తేలి
వచ్చే సుపరచితమైన పిలుపు, ఆడుకున్నది
ఇక చాలనీ,ఇంటికి త్వరగా రమ్మని కేక వేసే
నీ తల్లి పిలుపు,వేచి చూసే నీ తండ్రి పిలుపు-
అప్పుడు,నీ మెలకువలోకి దిగే ఒక దిగులు-

అది ఎలా ఉంటుందీ అంటే
4
ఇంటి నుంచి తిరిగి వెళ్లలేనంత దూరంగా వచ్చాక, నీకు అత్యంత
ప్రియమైనదీ నువ్వు మరచినదేదో గుర్తుకువచ్చి
ఇక నువ్వు వెనక్కు వెళ్ళాలేకా మరి ముందుకి
సాగాలేకా, రెండుగా చీలుకుపోయి గిలగిలా

గింజుకులాడతావే, అలా-

ఇక అప్పుడు, నీ వదనాన్ని రివ్వున కోసే ఒక గాలి:నీ పూర్వీకుల చేతులేవో
నిన్ను అధ్రుస్యంగా తాకి, నిన్ను రహస్యంగా
తమ వద్దకి రమ్మని పిలుస్తున్నట్టు, నీ తల్లి

అరచేతుల ఛాయ ఏదో నీ పైకి కమ్ముకున్నట్టు
భూమిలోంచి పాదాలలోకి జొరబడి దేహమంతా
వ్యాపిస్తున్న ఒక పురాతన స్మృతి.జలదరింపు-
ఏదో మొదలై,మరేదో అంతమై,ఏమీ అర్థం కాక

నువ్వు,లుంగ చుట్టుకుని ముడుచుకుపోయి
నిస్సహాయంగా తల ఎత్తి ఆకాశంలోకి  చూస్తే
గుత్తులుగా గుత్తులుగా వేలాడే చేతుల మధ్య

నుంచి తెరలు తెరలుగా, నలుదిశలా నువ్వు
పిగిలిపోయే కాంతి. ఒక రహస్య విహంగమేదో
నీ ప్రాణాన్ని నీ ముందే తనపైకి ఎక్కించుకుని
క్షణిక కాలంలో, మరో లోకంలోకి ఎగిరిపోయే

సాంధ్యకాలపు సప్త రంగురేకుల పూవు ఒకటి నీ ముందు, తనకి తాను
5
విచ్చుకుని, మెరిసి, సువాసనతో వెదజల్లబడి
తిరిగి ముకుళితమై, ప్రార్ధనవలే ఒదిగిపోతూ...
ఎంత క్లుప్తం ఈ జీవితం-గుత్తులుగా వేళ్ళాడే
మనుష్యుల మధ్య ఎంత క్లుప్తం నీ సమయం-!
6
ఇక అప్పుడు,వాళ్ళు తాకిన చోట రాలిన నీ కన్నీటి మంచును తుడుచుకుని
లేచి చూస్తావా, కనిపించకుండా ఎవరో రమ్మనే
ఆ చోటూ, నీ గమనాన్ని నిర్ధేశించే ఆ పిలుపూ
ఆ గూడూ,నీ దీపాలు ఆరిన చోటే మొదలయ్యే
ఆ కాలాలూ... వాటిలోకి నువ్వు వెళ్ళాలేవు -
అలా అని అక్కడే ఉండాలేవు. ఇక
7
గుత్తులుగా వేళ్ళాడే ఆకులను తొలగించి నీ వేళ్ళకు అంటుకునే ఈ
పొరల పొరల వంటి కాంతిని చూస్తూ, తాకుతూ
ఇక ఎలా బ్రతకడం? ఇక ఎలా కొనసాగడం?ఇక

నిరంతరం నిన్ను స్మరిస్తూ -నిరంతరం నిన్ను లిఖిస్తూ- నిన్ను తుడిపివేస్తూ
నిన్ను చేరలేక, ఎలా ఇక్కడ ఈ గుత్తుల మధ్య
చిన్న చిన్నగా,చమురు ఆవిరయ్యే ప్రమిద వలే
సన్నగిల్లుతూ, కాంతికై తపించిపోతూ, చీకటిని
వదులుకోలేకా, ఉంచుకోలేకా ఇక

చిన్నా, మరి ఎలా - ఇలా - ఇక్కడ - అంతం - అవ్వడం-?

14 August 2013

- ఒక ఆధ్యాత్మిక ప్రశ్న -

చిన్న పిల్లాడివైనా కాదు: ఉడుక్కుని అలిగితే
     చాక్లెట్తో ఐస్క్రీమో చూపించి మాయజేయటానికి - అలా అని 
పూర్తిగా పెద్ధవాడివీ కాదు 

రాత్రిలో, మసక వెన్నెల్లో 
     ఆకుల అంచులనుంచి జారే చెమ్మను చూయించి-'ఒరే, జీవితం 
     ఇలాంటిదిరా: కరిగిపోతుంది 
ఇలాగే తేలికగా 

చంద్రుడ్ని అంటిపెట్టుకున్న ఆ పసిడి మృత్యువలయంలోకి' - అని 
నిన్ను- నిన్నే - పట్టుకుని
నవ్వుతూనో ఏడుస్తోనో చెప్పి 

నేనూ కన్నీటి చెమ్మనై 
నీ కనురెప్పల అంచుల 
నుంచి రాలి, నీ అరచేతులలోకీ, ఆ మట్టిలోకీ రాలి, ఇంకిపోయేందుకు- 

మరి ఇక నేను ఏమి సేతురా నా వెర్రి నాగన్నా - 

చూడిక్కడ: ఈ హృదయ స్థానంలో ఏర్పడిన 
సమాధులనీ 
స్మశానాలనీ-

కొమ్మకి ఊగే ఆకు ఎప్పటికీ ఒంటరే: గాలిలో, చీకట్లో 
తనను బ్రతికించే వేళ్ళతోనే 
తనను తుంపివేసే వానతో - 

తప్పదు: గొరింటాకులా ఈ మనుష్యులని ఒంటినిండా పూసుకుని 
పరిపక్వమయ్యి ఎర్రగా పండిపోయో  
ఎవరూ చూడక 
పిగిలి రాలిపోయో

ఏదో ఒకటి, ఇక మరి ఇంతకు మించి, ఇంతకు మినహా  
ఏముందీ జీవితంలో? 
నీకైనా నాకైనా మరి 

- ఎ - వ - రి - కైనా? -

13 August 2013

- పాషాణం -

- "ఏం ఉంది నీ వద్ద?" అని అడుగుతుంది తను -

ఆహ్: చీకటిని గులాబీలా చుట్టి, వెన్నెల వాసనతో
వాన చినుకులతో
నింపి,ఈ రాత్రంతా

- నీ చుట్టూ సీతాకోకచిలుకల వలే ఎగిరే -

ఆహ్, కథలై కలలై 
ఇద్దరినీ హత్తుకునే 
కడలై చల్లని నీడై 

నీతో కలసి ఉండగలిగే రహస్యం ఒకటి ఉంది నా వద్ద: 
మరి, కావాలా నీకు అది? 
అని వినమ్రంగా అడిగాడు 
అతను తల ఎత్తి -

గాలికే కదిలే కాగితాలపై ఒక గాజురాయిని ఉంచి
తల తిప్పుకుని,వంచుకుని 
వెళ్లిపోయింది ఆ అమ్మాయి-

ఇక, గాజునయనాలతో ఆ గదీ, కన్నుల్లేని క్షమ లేని  
కాగితాలతో అతనూ  
ఏం మాట్లాడగలరు 

అర్థాంతరంగా/ అస్థిమితంగా/ మిగిలిపోయిన/ ఆ రాతి 

రాత్రి అంతా-? అంతటా

- కోత -

- అప్పుడొక కోత అక్కడ: ఎవరో నిన్ను వెనుకనుంచి పట్టుకుని
     నీ కుత్తుకను కోసి వొదిలి వేసినట్టు -
     ఆ వదనమూ తెలియదు,ఆ చేతులూ
     తెలియవు.వెనుతిరిగేలోపు అక్కడొక
గులాబీ కోతనూ
 
నీ కుత్తుక కిందుగా ఉబికే, రుగ్మత వంటి ఒక చీకటినీ ఉంచి
     మాయం అయ్యినది ఎవరో తెలియదు
     ఇక మసక వెన్నెల్లో,గాలికలా ఊగుతో
     ఆగుతూ చూస్తో అప్పుడొకటీ,అప్పుడొకటీ
రాలే కనకాంబరం పూలు:

వాటి నీడలు- అవే: నీ కుత్తుకను కోసి

నువ్వు వెనుదిరిగే లోపు మాయం అయ్యిన, తన శరీరం వాసన వేసే
     నీడలు: శూన్యం ఊగే ఊయలలో
     గుమికూడే ఊదా రంగు రాత్రుళ్ళు-
     అది సరే:నా తల్లీ, సోదరీ సహచరీ

నా ప్రియురాలా,నా భార్యా,ఇక ఎప్పటికీ ఒకటి కాలేని,ఒక్కటి కాలేని
     విధి వంచితురాలైన, నువ్వే కానీ
     మరి క్షమయే కానీ,'క్షమార్హమా?'
     అన్న సంవాదమే, వివాదమే కానీ

కానీ క్షమించు. నీ ఏక ముఖ వ్యాకరణను అంగీకరింపలేక,అనుసరించ/లేఖా
     నువ్వో,మరి నేనో ఇలా
     - కోసిన/గీసిన/రాసిన -
     కోతలలో,అలసిన ఒక

నెత్తురు బిందువునై ఆగిపోతున్నాను. క్షమయే కానీ,చేతులెత్తి నిను
     ప్రార్ధించి, అర్ధించి, నిను శరణుజొచ్చిన
     జీవినే కానీ,ఇక ఈ అద్దాలలో,ఇక 
     అబద్ధాలలో,ఇక ఈ పల్లకీలలలో-నిను-

మోయలేకున్నాను-నిను క్షమించలేకున్నాను -నీకు బానిసని కాలేక
     ఉన్నాను:పూలపాత్రలో వడలిన కాలంతో
     చేతిలో, నీ కలకలమంత హలాహలంతో
     ఈ అ/ఖండికనై, రాయబడుతున్నాను -

నా ఆల్కహాలికా, మరి ఈ

రాళ్ళు స్వప్నించగలిగితే
ఈ గాలి శ్వాసించగలిగితే
ఈ వాన తెరలు-నిన్ను-

వినగలిగితే, ఎవరి నయనాలలోంచో , మూలకు ఒదిగిన మన పిల్లవాని
కడుపులోంచి ఆకలై
నిన్ను, తాకగలిగితే
నీతో మాట్లాడగలిగితే

తల వంచిన అతని శిరస్సు కింద గుమికూడిన నీడలలో, నీ వైపు చేతులు
చాచిన ఈ అనాధ పదాలు
కాగలిగితే,రా-య-గలిగితే

- ఇక నీ సంగతి ఏమిటి? - 

12 August 2013

-నేనెవరిని ఇంతకు-

ఏమీ చేయలేక, కొన్నిసార్లు
నుదిటిపై ముంజేతిని వాల్చుకుని కళ్ళు మూసుకుని పడుకుంటావు-

వేన వేల పావురాళ్ళు ఒక్కసారిగా రెక్కలు కొట్టుకుని గాలిలోకి లేచినట్టూ
ఏ నదీ తీరానో రావి ఆకులు ఒక్కసారిగా
ఉలిక్కిపడి, అలలతో రెపరెపలాడినట్టూ

లోపలంతా అలజడీ, ఒక శీతల కాంతి-
అరచేతుల్లో పొదివి పుచ్చుకున్నదేదీ
క్షణకాలం కంటే ఎక్కువ మన్నలేని, కనుల ముందే కరిగిపోయే ఒక స్థితి-

ఇక ఒక ముఖం ఏదో, నీవై, నీ
శరీరం వంటి రూపమై, నా లోపలి లోకాలలో జీవం పోసుకుంటుంది, అదొక
ఒక పూల పాత్ర అయినట్టూ, అదొక
మంచినీళ్ళ మట్టికుండ అయినట్టూ---

ఎవరో రావాలి, పాత్రలో పూలు ఉంచేందుకూ
మట్టికుండ చుట్టూ, ఈ దినం చుట్టూ ఒక
తడి గుడ్డను చుట్టేందుకూ, ఈ నుదిటిపై

సర్పాలవలె అల్లుకుపోయిన, ఈ చేతులని
తొలగించి ఇంత చూపుని ప్రసాదించేందుకూ
ఇంత శ్వాసని లోపల నింపేందుకూ - కానీ

ఇవన్నీ అడిగేందుకు, నేనెవరిని ఇంతకూ?

11 August 2013

- ఒక అద్దం -

కనుపాపల కింద చీకటి మొనతో గీస్తున్నట్టు ఒక కోత -
     హృదయానికీ దీనికీ సంబంధం లేదు -
     ఇది నిజంగా

కళ్ళకీ, చూపుకీ సంబంధించినదే. ఇది నీకూ, నాకూ
    సంబంధించినదే . నాకూ నాకూ మధ్య
     ఒక జలపాతం కింద
     పదునైన క/నీళ్ళపై

- పాకుడు రాళ్ళపై నడక ఇది - ఎలుగెత్తిన శబ్ధం ఇది -

ఆక్కడే, ఇక్కడే, నాకు

- ఇరువైపులా పొంచి ఉన్న నీ ముఖం -
- ఇరువైపులా పొంచి ఉన్న నీ చేతులు -
- ఇరువైపులా పొంచి ఉన్న నీ పదాలు -

ఎటు జారినా, మృత్యోధ్యానవనంలో, పుష్పించే గులాబీ

- అద్దం పెంకులు. నెత్తురు పరిమళాలు. మణికట్టుపై
     తార్లాటలాడే సన్నటి నీడలు -
     అవే - వానలో నిలువ లేని
    నిలువ నీడ లేని నీడలు-

ఇక ఏం చెప్పగలడు అతను - ఒక అద్దంలో ముఖం
    కూరుకుపోయి, నీ చేతిలోంచి
    జారి పడిపోయి,ఎక్కడా పూర్తిగా

తనని తాను కనుగొనలేని అతను -? చూడు - ఇక

ఒక అద్దం
తన ప్రతిబింబం ముందు మోకరిల్లి, అవనతమయ్యి
కంపించిపోతూ

ఎలా
తనకై తాను అర్ధిస్తో
తపించి/పోతుందో! - 

10 August 2013

శాంతి

1
పల్చటి కాంతిని ఒత్తి పరచినట్టు, చుట్టూతా గాలి-

తడి తడిగా భూమి. చెట్లల్లో ఒక పచ్చి వాసన, చిగురాకులు విచ్చుకున్నట్టు-
తడారుతున్న నీటిగుంటలు
కదులుతున్న మబ్బులూ-

ఇక
ఈ నగరపు అద్దంపై మసి తొలిగి
ఒక ముఖం బయటపడుతుంది
శత్రువు,తన శిరస్త్రాణం తీయగా

-ఊహించని- నీ ప్రియురాలి తెల్లని కళ్ళు బయటపడి నిన్ను పలకరించినట్టు-
2
విచ్చుకోబోయే మొగ్గలో తొణికికిసలాడే మెత్తటి నిశ్శబ్ధం ఇక్కడ-
శబ్ధమంతా- కాంతి తరంగాలై-
కొమ్మల్లోకీ, ఆకుల్లోకీ మెత్తగా
ముడుచుకుపోయినట్టు ఎదపై

ముడుచుకుపోయి, తొలిసారిగా
తల్లి చూచుకాన్ని ఒక శిశువు ఆప్తంగా అందుకున్నట్టూ
ఆ తల్లి లాలనగా ఆ బిడ్డని
పొదివి పుచ్చుకున్నట్టూ.సరే
3
నువ్వు ఇది చదివే సమయానికి
నేను ఉండకపోవచ్చు.ఇక గాలికి
అల్లల్లాడిపోతూ, ఎగిసిపోతూ, ఊగిపోతూ,తేలిపోతూ,నీ 
ఇంటి ముందు రావిచెట్టు ఆకులు-
4
అందుకే
ఏమీ మాట్లాడకు
తాకు:ఊరికే విను
వెదురు వనాలలో,రికామీగా తిరిగి తిరిగి, తిరిగి నింపాదిగా నిదురించే గాలిని. తెలుస్తుంది నీకు

అంతిమంగా, మనం
కలసి ఉండటమెలాగో-

07 August 2013

ఇక ఇదే ఉదయం, ఇక ఇదే జీవితం

1
వాన వాసన వేసే పూలరేకుల వలే తాకుతాయి
నీ చేతులు, ఈ చినుకులూ
గోప్యంగా తేలొచ్చే 
చల్లటి గాలీనూ-

ఆ గాలిలో, ఆ లేత పసుపుపచ్చ కాంతిలో,సీతాకోకచిలుకలు-

ఏ లోకాలను విసురుతున్నాయో
ఆ రెక్కలు కానీ

వెన్నెల కళ్ళాపి జల్లినట్టు, నీ చుట్టూ పచ్చిక కాంతి-  


తలలు వాల్చిన

ఆకుల కింద చేరి, ఊయలలూగే నీడలు, వజ్రాలూ
మెరిసే నీ కళ్ళూ-
2
మరి ఏం ఉంది       
అప్పుడు నాకు-?
3
సరస్సుల అంచులలో తేలికగా ఊగే అలలపై కదిలే నాచూ
రెక్కలూపక ఆ వెలుతురులో 
అలా నిశ్చలంగా తేలే 
తూనిగల నిశ్శబ్ధమూ

నాలో: ఒక శిశువు

ఊయలూగుతూ, నిద్రలోకి జారుకున్నంత మెత్తదనం
పెదవిపై మిగిలిన
పాల తడి వంటి
ఒక ఇష్టమూనూ-

కానీ మరి ఇదంతా

ఏమిటీ అని అంటే 
4
ఏమీ లేదు - ఉన్నదంతా, ఇక మనకు మిగిలినదంతా
ఇక ఇదే ఉదయం
ఇక ఇదే జీవితం-

కొంత నాతో, కొంత నీతో, కొంత ఇలా మనకి మనతో-

కానీ, కన్నా
5
మరి ఇంతకూ
సంధ్యా సమయంలో, కలువ పూల చుట్టూ గుమికూడి 
ఒక బిందువులోకి

పునర్యానం

అవుతున్న
ఆ వలయాలను చూసావా నువ్వు? 

02 August 2013

a little love*

- అది ఒక తొవ్వ -

అద్దంలోని సీతాకోక చిలుకలు అవి: మన ప్రేమలు-
     వెన్నెల తడితో మెరిసే పెదాలు: అవి.
     - మన ప్రేమలు -

- ఇది ఒక కలల పచ్చిక -

వాన చినుకులలోని రాత్రి పరిమళాలు అవి: మన ప్రేమలు -
     మన కళ్ళల్లో చేరే రహస్య శబ్ధాలు: అవి.
     - మన ప్రేమలు -

ఇలా
(ఎవరు రాసారు వీటిని?
ఈ నీటిని?ఈ కన్నీటిని?
వొద్దు)

- నీ పదాలు. ఇక చించివేయి నిఘంటువులను -

నా నాలికను నీ నాలిక
అందుకున్నాంక ఇక
ఎవరికీ కావాలి, ఈ

|అర్థ|
|నగ్న
మైన|

అర్థాలు? -
-------------------------------------
- దుస్తులు వేసుకున్నాక ఒక 'కవిత' -