31 July 2013

Déjà vu

అప్పుడు
- నువ్వు - సముద్ర తీరాన
     విచ్చుకునే మసక వెన్నెలా, పాలరాతి గులాబీ శిల్పానివీ నువ్వు.
     రాత్రుళ్ళల్లో, ఇక్కడ

నా శ్వాసలో, ఈ కమిలిన నగరంలో
     చెమ్మగిల్లి, నా భుజాన తల ఆన్చిన ఒక నీలి గుల్మొహర్ పూవువీ
     - నువ్వు -

అప్పుడు
నీ చేతివేళ్ళ చివర్లు
     వాన వాసన వేస్తాయి - మట్టి వాసన వేస్తాయి- వేర్ల వాసన వేస్తాయి- 
     అవే. నీ చేతివేళ్లు...

ఎవరి చేతినో గట్టిగా పట్టుకుని
     లోపలికి వేళ్ళూనుకుని, వెలుపలకి వద్దామనీ, కొంతకాలం చిగురిద్దామనీ
     - ఇక నన్ను విడవకు - 
     అని అర్ధించే, ప్రార్ధించే

నీ చేతివేళ్లు. కంట కన్నీరు
     స్మృతుల ధూపమై - ఒక మాతృత్వపు అశ్రువై - నన్ను పొదివి పుచ్చుకునే
     నీ అరచేతులు: O blue blue One
     Of the None:

Come here. Hear. Here-
     వానకి తడచే గుల్మొహర్ పూవులూ
     వాటి చుట్టూ నవ్వే ఆ కాంతి ఆకులూ ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు.
     ఇక
   
ప్రేమ రంగుల గురించి
రాత్రే వెలిగే వీధి దీపాలతో మనం మాట్లాడటం ఎంత అసంబద్ధం! - 

30 July 2013

నిద్ర నీడ

నీ నిద్ర నీడ ఇక్కడ -
    నీ  కలలోంచి కురిసే వాన. వానలోంచి సాగిన
     నీ చేయి

నన్ను అందుకుని
     తెగిన పూవుని పూలపాత్రలోంచి తీసి తిరిగి
     మొక్కకి

అద్ది బ్రతికించినట్టు
     నువ్వు నా నిద్రని ముద్దాడితే
     ఊగుతోంది హాయిగా నీ శరీరపు వాసనలో,  శరీరం-
     మంచుకి

తడచిన పచ్చిక
     చిన్నగా వాలినట్టు, చీకటి బరువుకి చిగురాకులు
     మెల్లిగా

ముడుచుకున్నట్టు
    ఇక మనం: O One, O No One, Oh
     Blue blue One
     Of the None...

నిద్రి కింది కళ్ళల్లో, కళ్ళ కింది ఆకాశంలో
     చల్లగా, మెల్లిగా తేలే
     నీ వెన్నెలా, నీ వానా-

- వానలో అలలలపై ముసురులో ఈ నవ రంధ్రాల పూల నావ-

- చూడు: విదిలించబోకు -
     నిన్ను కావలించుకుని నోరు తెరుచుకుని నిదురపోయే
ఈ పసి రాయిని- 

27 July 2013

కలువ పూల రాత్రులు

నీలంగా ఉంటాయి అవి: నీలా ఉంటాయి -
     నువ్వు చేతులు చాచినప్పుడు, నీ వేళ్ళ చివర్లన అంటుకున్న 
     కనుపాపలు

పసిపాపల వాసన వేస్తాయి. ఇక 
     దీపపు చీకటిలో నవ్వుతూ, రెక్కలు విప్పుకునే నీకూ 
     నీ వక్షోజాలకీ 

- నా శరీరమొక జోలపాటా, ఊయలా - గాలిలో తేలే ప్రేమ సమాధీ -
     ఒక శరీర కాంతి. అందుకని  

Come. Here. O hear... నీలి నీలి 
     నయనాల తారకా, రాత్రి రంగులు రాలిన చెట్ల కింద 
     ముసిరిన చీకట్లలో
     రాలిపోయిందీ  

మొరటూ చందామామ. మరి మన నాలికలని 
    తాకిన వీర్యంతో, ఇలా ఎగిసి వచ్చిన మన శబ్ధాల రహస్యాలతో
    పూలరెమ్మల 

మధ్య ఇంకే వెన్నెల భాషతో, కన్నీళ్ళతో, ఓహ్,
      Oh, hear - my blue blue one
      Of the none -
here
శరణార్ధులు మన పెదాలు.
     శిబిరాలు లేని శరీరాలతో మరి ఇలా ప్రేమ గురించి
     మాట్లాడుకోకూడదా

మనం? ఒకోసారి. మరి ఒక్కసారీ? ఒకే ఒక్కసారి?- 

26 July 2013

- of you/of me/of them and us -

ఒక ముంత. కొన్ని నీళ్ళు.
     ఇక్కడ వాలే మబ్బులు, పిచ్చుకలు- వాటి మెడ కిందటి
     మెత్తటి నూనుగు సాయంత్రంలో
     నువ్వు. ఒక వడ్ల గింజ - నువ్వు -

నీకై
గింజలతో చాచిన అపరచితుని
     అరచేయి- ఇది. అది నేను. మెడ కింది ఆ చిన్ని కుత్తుక తెగి
     అక్కడే ఉబికి, ఇక
     ఇక్కడ రాలలేని ఓ
   
నెత్తురు చినుకు - నేనూ, నువ్వూ - (మనం). చెప్పు నాకు

ఎలా తెలుస్తుంది నీకూ నాకూ - ఉన్నామని మనం - మన కళ్ళకీ
కనీళ్ళతో అవి
తెగని దాకా-?

- Oh, hear: here, O blue blue One of the none -

ఒక అశ్రువు బరువుతో ఆగిపోయిందీ రాత్రి. అందుకే
రెప్పలను తెరచి
విగతమైన కను
పాపలమై ఉంచు

ఈ చిన్ని పదాన్ని. రేపు, ఇక రేపు మనం

 ప్రేఏమని గురించి
మాట్లాడుకుందాం- 

a prayed love

Oh You
A blue blue one here: ఓహ్, hear
     నీ పాదాల మధ్య ఉద్యానవనంలో ఈ ప్రార్ధన.
     నీ అరచేతుల్లోంచి కురిసే
     ఈ నీలం వాన- చూడు

నీలో
గుబురుగా నిక్కబొడుచుకునే కాంతి చీకటి ఇది-
     నువ్వు తెరిస్తే కిటికీ
     దాచేసుకుంటుంది
     రాత్రుళ్ళ వాసనని- Oh You, hear...
రెప్పల్ని మూసిన కళ్ళతో
చూడు
మళ్ళా

-ఈ ద్రవ్య కాంతిలో ఊగే  కొన్ని లక్షల గులాబీలని-
అవే
అవే
అవే

నిన్ను కౌగలించుకుంటాయి
ముద్దులు పెట్టుకుంటాయి
నీకు శరీరం లేకుండా చేసి

రోమాల రోజాల నీలి భాషని సృష్టిస్తాయి. స్నానిస్తాయి-

Oh You, a blue blue one here: hear, ఈ
     అనుదిన, వర్ధమాన దైవప్రార్ధనను-
     ప్రేమా అని అడగకు
     పాపం అని అడగకు

ఏడవ రోజే మొదటి దినము మనకు 
     ఈ కర్కశ కాల ఆలయంలో- దా-
     మరి నీ అరచేతులలోని వానకి
     మొలకెత్తిన ఒక చిగురాకు

మోకరిల్లి అర్ధిస్తున్న ప్రార్ధన వద్దకి- మన వద్దకి -
లిపి వద్దకి
ఇక్కడికీ
అక్కడికీ...

-ఇక శరీరం లేకుండా ప్రేమించలేను నిన్ను ఎప్పటికీ-

ఆmen.

a little love

ఇది ఒక తోవ-
     గాజు సీతాకోకచిలుకలు అవి
     వెన్నెల తడితో
     మెరిసే పెదాలు
     అవి.

అది ఒక కలల పచ్చిక-
     వాన చినుకులో రాత్రి వాసన.
     అవి మన కళ్ళల్లో ఊరే
     రహస్య శబ్ధాలు. ఇలా-

(ఎవరు రాసారు వీటిని?
     ఈ నీటిని? వొద్దు-)

నీ పదాలు. ఇక
     చించివేయి నిఘంటువును-
     నాలికను నాలిక
     తాకాక, ఎవరికి
     కావాలి, ఇక ఈ

/అర్థ/
/నగ్న/
/మైన/

/అర్థాలు/? 

25 July 2013

how we die

కుచ్చిళ్ళు పారాడుకుంటూ తిరిగే చీకటి: చాచిన అరచేతులకి
     పలకలు, పలకలుగా గాలి.
     తెరచి ఉంచు కిటికీ.లోపలికి

వచ్చేది ఏదీ ఉండదు నీతో, వెలుపలకి వెడుతూ అడగరు ఎవరూ
     నిన్ను, మరొకరితో వెడుతో.న్నీ
     చుట్టూ, రెక్కల కొట్టుకుంటున్న
     పావురాళ్ళ సవ్వడి. అవే...
   
నిశ్శబ్ధంలోంచి లేచే పావురాళ్ళు. అనువాదం కాని కళ్ళు -

ఇక, లాంతరు వెలిగించలేక, బావురుమంటూ రాలిపోయింది
     తెల్లటి కుచ్చిళ్ళ నల్లని చీకటి-ఇక
     నీలో ఒదిగొదిగి ఏడ్చే వక్షోజాలకి
     రాత్రి కుంకుమ అంటిన కన్నీటికీ

ఏమని చెప్పగలవు, ఖాళీ లేని కాగితాలయ్యిన పెదాలతో? 

24 July 2013

మన మాటలు 2

చెప్పటానికి ఏమీ లేదు: నీ వద్దా, నా వద్దా- అందుకని ఇక

నీ హృదయాన్ని తొలగించి చూద్దును కదా
పూల సువాసనతో విచ్చుకునే
ఒక రంగు లేని రాయి అక్కడ-           (అదే)

చెమ్మగిల్లి, సమాధిలో ఒత్తిగిల్లి
మొలకెత్తబోయే చిగురాకుతో
కదులాడే, పసినయనం వంటి

విత్తనం, రాయీ అక్కడ. 'రాయిఅక్కడ'- అదే (నువ్వు)
అన్నది, నీ తలుపులు తెర
చాపిన నాడు. అందుకనిక

నావని చీల్చే నీటిని తొలగించి చూద్దును కదా, అప్పటికే మన

పెదాల అంచున
పుష్ప గుచ్చాన్ని
ఉంచి, తొలిగారు
ఎవరో. మరి ఇక

వొత్తి లేని ఒక దీపం
రాత్రంతా ఇక నిప్పు(/లేని/) నిశ్శబ్ధంతో మాట్లాడటం ఎలా? 

22 July 2013

తప్పు

నీ కళ్ళే గుర్తుకొస్తాయి, అవే వర్షం కురిసే నీ కళ్ళు-
     గాలికి కర్టెన్ తొలిగి, కన్నీళ్లు కనిపించకుండా చటుక్కున
          పక్కకి తిరిగే, నువ్వూ నీ ముఖమూ గుర్తుకు వస్తాయి ఇక్కడ-

చదవకుండా పరాకుగా తిప్పివేసిన పుటలలో, క్షణకాలం
చదివిన కవితా వాక్యాలేవో గుర్తుకు వచ్చి
ఇక ఆ కవిత ఏదో ఎక్కడా దొరకనట్టు. కానీ
   
ఏం చేయగలడు అతను. ఇప్పటికీ చెట్ల కింద నిలబడి,
     వెళ్ళిపోయిన వానని తిరిగి రమ్మని పిలిచే అతను? అరచేతుల్లో
          మిగిలిన చినుకుల్లో తన ముఖాన్ని చూసుకునే
అతనూ అతని కళ్ళూ?

అందుకే గొణుక్కుంటున్నాడు ఇలా అతను
తనతో తాను తనలో తాను: *1చెట్లు తమ పక్షుల వద్దకు ఎగిరి వెళ్ళే
     ఈ వసంత కాలంలో, 2ఒక పూవుని సమాధి చేసి
దానిపై అతనిని ఉంచండి' అని. మరి

అందులో, ఆ కోరికలో, ఆ మృత్యు జననంలో తప్పేం ఉంది?
--------------------------------------------------------
*1. Spring: trees flying up to their birds.
2. Bury the flower and put a man on its grave -Paul Celan. 

మన మాటలు

నువ్వు నా ఎదురుగా కూర్చున్నప్పుడు, ఆనాడు నీ కళ్ళల్లో హోరున చెట్లు వీచాయి. శరవేగంగా మబ్బులు కమ్ముకోగా, ఎవరో వచ్చి గదిలోని దీపం వొత్తిని తగ్గించినట్టు, నెమ్మదిగా మందగించిన ఆ వెలుతురులో, తుంపర మొదలయ్యింది. బయట కొమ్మల్లో అలజడిగా మెసిలాయి పక్షులు. అవి 

ఈ బల్లపై నా చేతులని తాకాలని వాలి మళ్ళా అంతలోనే, ఎందుకో సంశయంగా ఆగిపోయిన, నీ అరచేతులూ కావొచ్చు. నీ తనువేమో, అకారణంగా మందలింపబడి, ఇక గుమ్మంలోనే నిలబడిపోయిన ఓ పాపాయి కావొచ్చు. నీ కనుపాపాలపై పేరుకుంటున్న పదునైన చెమ్మా కావొచ్చు. చిన్నబోయిన నీ ముఖం కావొచ్చు. ఆ ముఖంపై లతల్లా ఊగే, నేను మరచిపోయిన 'నువ్వు' అనే స్వప్నఛాయలు కావొచ్చు. అవే

నీ పెదాలపై, అస్పష్టంగా తార్లాటలాడి మళ్ళా అంతలోనే ఆగిపోయే పదాలు- 'నువ్వు', 'నేను', అనే మన మాటలు.

సరే. సరే. అది సరే కానీ, తోటలోకి అడుగుపెట్టినట్టు, ఒక మనిషిలోకి అడుగుపెట్టి, ఒళ్లంతా ముళ్ళతో నెత్తురు తెమ్మరై, తామరపూల కొలనులో రాలిపోయి ఒంటరిగా చనిపోయిన ఓ దేవతా స్త్రీ కథను విన్నావా ఇంతకు మునుపు ఎన్నడైనా? ఆహ్:మరేం లేదు. 

నీ నిశ్శబ్ధం మాట్లాడిన అరచేతుల భాష వ్యాపిస్తోంది ఇక్కడ- ఎలా అంటే, ఆరిన దీప ధూప పరిమళం, చీకట్లో ఓ జ్వాలస్మృతిని రగిలించినట్లుగా-

ఇక మాట్లాడుకోవచ్చా మనం? మనం అనే మనని?

19 July 2013

ఏమీ చేయలేక

వాన అనలేను దీనిని. రాత్రిలోంచి కలత నిద్రలోంచి
     ఇలా మరు దినంలోకి కొనసాగుతున్న చినుకులని-
     మందగించిన కాంతితో నేసిన నల్లని వస్త్రాలేవో
చుట్టుకున్నట్టు

ఆకాశంలోంచి కిందకు రాలే ఈ మసక కాలాన్ని.
     ఒకనాడు నిన్ను కౌగలించుకుని, అదే ఇక ఆఖరు సారి
     అని తెలిసి వొణికిపోయినట్టు, ఇక ఇక్కడ
జలదరించే చెట్లు.
   
శరీరం మొత్తం ఒక కడ చూపుగా మారితే, ఆ రోజు
     చితికిన కళ్ళై  ఉగ్గపట్టుకుని, అక్కడ
     కూలిపోయింది ఎవరో కానీ,ఇప్పుడు 
ఇక్కడ ఒక సమాధి కరిగి

ఒక చేయి సాగుతోంది నీ కోసం. అవే: ఒకప్పుడు
     నీ ముఖాన్ని పొదివి పుచ్చుకుని, ఇక ఇప్పుడు
     మొలుచుకు వచ్చిన నీ వేర్ల వాసనకై
తడుముకులాడే

వాన ముఖం లేని ఈ అరచేతులు-

వాన అనలేను దీనిని. నువ్వు కమ్మిన ముసురూ
     అని  అనలేను దీనిని. బ్రతికుండగానే చర్మాన్ని ఇలా
     నింపాదిగా ఒలుచుకుంటూ వెళ్ళిపోయే
స్మృతినీ, నువ్వు లేని ఈ సన్నిధినీ-

ఎలా గడవటం ఇక ఈ దినం? 

18 July 2013

పూవులు,భవంతులు

ప్రేమంటే ఏమిటి అని నువ్వు అడుగుతావు కానీ, పెద్దగా
ఏమీ ఉండదు-
వాన వెలిసాక

ఈ దారి పక్కగా కొట్టుకు పోయే, ఈ లేత ఎరుపు పూవు
రాలింది ఎక్కడో
నాకు తెలియదు

అది ఎవరిని తాకిందో, ఏ గాలిలో తనువుని మరచి ఎగిరిందో
ఎవరి చేతుల మధ్య
పసి నిదురయ్యి
ఒదిగి పోయిందో
నాకు తెలియదు-

నీకూ తెలియదు.

ఇంకా సాధ్యం కాలేదు మనకు: ఈ భవంతుల మధ్య పచ్చగా
మొలకెత్తడం ఎలాగో.
చినుకులని రాల్చే
చెట్ల కిందకు వెళ్లి

మళ్ళీ నవ్వడమెలాగో. గాలి మాలలతో ఇరువురమూ
కౌగలించుకుని
ఇకిలింతలతో
బ్రతికి/పోవడం
ఎలాగో. ఇక

చల్లని చీకట్లోకి
పూల శవాలతో
సైకిళ్ళపై నీ/నా

హృదయ వీధుల్లో నుంచి 'పూలు పూలోయమ్మా
మల్లె పూలం'టో
ఒంటరిగా, వెళ్లి/
 పోయిందెవరని

నన్నసలే అడగకు!   

వాలు కుర్చీ

నీకో వాలు కుర్చీ ఇష్టం ఉండి ఉండవచ్చు.ఎన్నో ఏళ్ళుగా కలగని ఎలాగోలాగ ఒకదానిని చివరకు నువ్వు కొనుక్కుని ఉండి ఉండవచ్చు. మరి ఒకనాడు

నువ్వు పని నుంచి తిరిగి వచ్చి, అలసటగా అలా ఆ వాలు కుర్చీలో వాలిన నాడు, ఆకాశం కొంత ముసురు పట్టి ఉంటుంది. జల్లించిన చీకటి ఏదో గాలితో కలసి చల్లగా నీ ముఖాన్ని తాకుతుంది.  ఇక, అప్పుడెవరో తడచిన వస్త్రాన్ని విదిల్చినట్టు నీ చుట్టూ శబ్ధాలు- నీ సమక్షంలో తెల్లటి పూలు విచ్చుకున్నట్టూ, కళ్ళెత్తి నిన్ను చూస్తున్నట్టూ తమ అరచేతులలోకి, నీ ముఖాన్ని అందుకుని ముద్దాడుతున్నట్టూ, నీలోకి ఒదిగిపోతున్నట్టూ, శబ్ధాలు అంత లేతగా ఉంటాయని, పసివేళ్ళ వలే తాకుతాయనీ తెలియలేదు నీకు ఇంతకాలమూ-

ఇక నువ్వు తల తిప్పి చూస్తే నీ ఇంట్లోనే మిలమిలా మెరిసే నక్షత్రాలు. పిల్లల అరచేతుల్లోంచి ఎగిరి వచ్చి నిన్ను వెన్నెలతో దయగా తాకే సీతాకోకచిలుకలు. ఆ రెక్కల ఝుంకారంలో దాగిన తేలికైన రాత్రుళ్ళు. ఎలా అంటే, కలలో తెలిసిన పరిమళమేదో మెలకువలోకి వచ్చి నిన్ను ఒక మహా విభ్రమానికి గురిచేసినట్టూ, గత జన్మ స్మృతులేవో జ్ఞప్తికి వచ్చినట్టూ, మృత్యు రహస్యమేదో బోధపడి ఇక నువ్వు విరామంగా సాగినట్టూ, నిజంగా నీకో వాలుకుర్చీ ఇష్టం ఉండి ఉండవచ్చు. వాలుకుర్చీనో 

ఎప్పుడూ నేలపై పడుకునే నీ తల్లికి, నేల నుంచి ఎగిసే చలికి వొణికే నీ తల్లికి, నువ్వు ఇంతకాలమూ కొనిద్దామని కొనివ్వని ఒక పరుపో, ఒక స్వెట్టరో కూడా అయ్యి ఉండి ఉండవచ్చు. చికిలించిన కళ్ళతో నీకై ఎదురుచూసే నీ తండ్రి కావొచ్చు. నలిగి నలిగి, నీకై కనులను తలుపులపై పరచిన నీ భార్య కావొచ్చు. పిల్లలు కావొచ్చు. నీలో నువ్వై కూరుకుపోయి ఏడ్చే వాళ్ళు కావొచ్చు. ఎవరైనా కావొచ్చు. మరి

నీకు ఇష్టమైన వాటి సంగతి సరే కానీ -నువ్వు ఇంతకాలమూ గమనించని- నిన్ను ఇష్టపడే వాళ్లకి నువ్వు, ఇక ఈ ఒక్క పూటకి ఒక వాలుకుర్చీయో, చేతి కర్రో, పాదు తీసి తమని తాము నాటుకోగలిగే ఇంత నల్లని మట్టో, ఈ చీకటిలో వెలిగించుకోగలిగే ఒక దీపమో అయితే ఎంత బావుండు-  

13 July 2013

ఒకసారి

ఆ  చెట్ల కింద నుల్చుంటే,  చుట్టూతా వాన-

తల్లి కొంగు కింద దాగి, నువ్వు
తల ఎత్తి చూస్తే, తన
నవ్వు కనిపించినట్టు

ఆకుల మధ్య నుంచి పల్వరసలాంటి
వెలుతురు. ఓ శ్వాస-
శ్వాస లాంటి గాలీనూ

ఊగే కొమ్మలూ, రెపరెపలాడే ఆకులూ
కనుచూపు మేరా
నీటి పుప్పొడి ఏదో
రాలుతున్నట్టు,ఈ

వానా, ఈ సువాసనా
ఈ నేనూ, ఈ నువ్వూ.

ఇక అప్పుడు మనం

మనల్ని హత్తుకున్న చేతులపై
చుబుకాలని ఆనించి
అక్కడలా, ఆగిపోయి
దిగంతాల కేసి చూస్తూ

చూస్తూ, అలా నిలబడిపోతే
వాన వెలిసాక
వెళ్ళ వలసిన
గూడు మిగిలి
లేదు ఇప్పుడు
మనకు-

ఇంతకూ
ఎక్కడున్నాం అర్పితా
అప్పుడు మనం? 

12 July 2013

దయ

కొంచెం దయగా ఉంటే పోయిందేముంది అని అనుకుంటాను నేను-

వాళ్ళూ మనుషులే కదా, ఎక్కడో ఎందుకో కరకుగా మారాల్సి వచ్చి
కరడు కట్టుకు పోయి ఉండవచ్చునని, తోటి వారిని
మనుషులుగా గుర్తించడం మరచిపొయి ఉంటారనీ
అది, వాళ్ళ సహజ నైజం కాదని, అది వాళ్ళు కారనీ-

బయటేమో, మొన్న జల్లులా, కాంతి పూల రేకుల్లా రాలిన వాన, ఇవాళ
కుండపోత - పోలిక కావాలంటే, నల్లని నింగిలోంచి
తెల్లని కాక్టస్లు గుత్తులుగా రాలుతున్నట్టు - మరిక

నువ్వు నిశ్చింతగా ఇంట్లో కూర్చుని టీవీలలో వార్తలు చూసే తీరిక వేళల్లో
ముంపుకి గురయ్యి అనేకమంది నిరాశ్రుయులుగా
మారుతుండ వచ్చు.ఆకలికి అలమటించి పోతుండ
వచ్చు. ఎక్కడో కోల్పోయి, జారిపోయి, మరి ఎక్కడో

శవాలుగా తేలుతుండనూ వచ్చు. 'ఇవన్నీ నీకెందుకు' అని నువ్వు అంటే

ఇక నేనేమి చెప్పను? నువ్వు నన్ను చీదరించుకున్నా
నువ్వు నీ దినవారీ చర్యలలో భాగంగా, నన్ను నిత్యం
గిరాటు వేస్తున్నా, ఓ ఖడ్గాన్ని నా హృదయంలో దింపి
మెలి తిప్పి నన్నొక చోద్యాన్ని చేసి చూసి ఆనందిస్తున్నా

నీకూ, విషపు బెరడు పేరుకున్న నీ రంగురంగుల నాలికకూ, ఇదిగో ఇలాగే

ఇదే చెబుతాను: జీవితం పట్ల కొంచం దయగా ఉంటే
తప్పేమీ లేదనీ, మనుషులని కాస్త కావలించుకుంటే
మరక అంటేది ఏమీ లేదనీ. ఇందా:  అందుకో మరిక

నా తల్లి తన నెత్తురు బుట్టలోంచి వెలికి తీసి నీకు ఇస్తున్న ఈ పద పుష్పాన్ని- 

10 July 2013

ఎలా?

నీకేమైనా రాద్దామని ఉంటుంది. కనీసం, ఇలా ఈ బల్లపై వడలిపోయిన
లేత పసుపూ, లేతెరుపూ కలసిన
గులాబీ మొగ్గల వంటి పదాలనైనా-

కిటికీలోంచి అప్పుడప్పుడూ తొంగి చూస్తాయి పిచ్చుకలు. అంతలోనే
ఎగిరిపోయే వాటి రెక్కల సవ్వడి-
గాలి తాకితే ఊగే నీడలూ, పైనేమో
బరువుగా సాగిపోయే మబ్బులూ-

నిజమే, ఇవ్వాలని అనుకుంటాను
కనీసం చినుకులనైనా, చీకటినైనా
మరి అదే సాయంత్రం, అదే రాత్రిలో
నీకైనా, నాకైనా: కానీ, నానీ, మరి
తెలుసా నీకు ఏమైనా
ఇలా, వడలి/పోయిన

తెలుపూ, లేతెరుపూ కలగలసిన, సాయంత్రాలలో ధూళికి రాలిపోయిన
తెల్ల గులాబీ మొగ్గల వంటి, నీ కళ్ళనూ
నా కళ్ళని తిరిగి బ్రతికించుకోవడమెలాగో?     

ఎన్నడైనా?

నువ్వు అప్పుడు లేచి ఉండవు. నీ గది బయట

ఒక తుంపర . వెన్నెలాంటి కాంతి. చెట్ల కిందుగా
రాలే ఆకులూ, వాటిని ఇముడ్చుకుని
ఎగిరిపోయే గాలి. నీ ఆత్మ వొణికిపోయే

చల్లటి గాలి. మరి, అప్పుడు ఎక్కడైనా
నీ చుట్టూ నువ్వు చేతులు చుట్టుకుని
నీ తలను వంచుకుని గుండెల నిండుగా

ఎవర్నన్నా పీల్చుకుని నీలోకి నువ్వు
నడిచి పోవడం బావుంటుంది - కొంత
బ్రతికినట్టు, మెలుకువలోకి వచ్చినట్టు

పూలు నిండిన గృహంలోకి ఎవరో నీ
హృదయాన్ని జాగ్రత్తగా దించినట్టూ
పరిశుభ్రం చేసి నిన్ను వెలిగించినట్టూ-

మరి నడిచావా నువ్వు అలా, ఎన్నడైనా ఎప్పుడైనా
మరొకరి కలలోకి మెలుకువవై, తిరిగి ఆ
మెలుకువలోకి ఒక సుగంధపు కలవై
ఊగే లేత ఆకువై,ఒక పసిడి పసి నవ్వై-?

07 July 2013

ఒక సరళమైన ప్రశ్న

ఏముంది ఇక్కడ? నీకు చెప్పటానికైతే, ఏమీ లేవు-

నిదురించిన పాప కురులని ఆప్తంగా సవరించినట్టు
ఈ గాలిని నిమిరితే, నీ అరచేతులకి
అంటుకునే ఒక చీకటి: చల్లని చీకటి-

పిల్లల పెదాలపై, ఒక పాల తడి మిగిలిపోతుందే, అలా
రాత్రిలో మెరిసే నక్షత్రాల కాంతి. నిన్ను
రెండు చేతులు లాక్కుని, గుండెలోకి
పొదుపుకున్నట్టు,మనిషి వాసన వేసే

గాలి. నీ శరీరానికీ తనదైన ఒక ఆవరణ ఉంటుంది కదా:
దానిలో, చిన్నగా మరి ఎవరివో పాదాల
సవ్వడి. ఒక గడ్డి పరక నీటిలో తేలినట్టు
ఎవరివో మరి మాటలు- రాలే ఆకులను
తప్పించుకుని వచ్చి, ఇక అతి చిన్నగా
నీ గదిలో రెపరెపలాడే పల్చటి కాంతీనూ-

నిజమే. నిజానికి ఏముంది ఇక్కడ,నువ్వు
తాకటానికీ, తిరిగి రావడానికీ, తిరిగి వచ్చి
చూడటానికీ? తిరిగి విశ్లేసించుకోవడానికి?

నిదురించే పిల్లలు. నిదురించని నీడలు.పిల్లల వంటి నీడలలో
నీడల పిల్లలమై కూర్చున్న నువ్వూ నేనూ-
మరి చిన్నా, దీని అంతటి తరువాతా, ఇది
'ప్రేమ' అని మనకి మనం చెప్పుకోవాల్సిన

అవసరమూ, ఆగత్యమూ ఏమిటి మనకు? 

06 July 2013

వానపాములు

ఈ నిదానపు మధ్యాహ్నం, ఒక మబ్బు పట్టిన గాలి. కూర్చుంటే నువ్వు
నీ గదిలో, మరి ఎక్కడి నుంచో ఒక కోయిల గానం-

నిన్న రాత్రి కురిసిన వానకి, ఆ నీటి కాంతికీ, ఇంకా మెరుస్తాయి
అశోకా ఆకులు. వాటి కింద నువ్వు నడుస్తూ ఉంటే
పచ్చటి పొదల వాసన. తల ఎత్తి చూస్తే, పొదల్లోంచి

తటాలున దూకి పారిపోయిన కుందేలు ఒకటి ఆకాశంలో. ఈ

సమయంలో ఇక్కడ ఒక తెల్లటి మేఘం కనిపించడం ఆశ్చర్యమే కానీ
ఏం చేస్తావు నువ్వు, కొద్దిపాటి చల్లదనంలో
మరి కొంత  మెత్తటి వెలుతురులో, మసక

మసకగా, నీ లోపల గూడు కట్టుకుంటున్న ఒక తెల్లటి ఒంటరితనానికి
తన ముఖం గుర్తుకు వచ్చినప్పుడు? నీ ముందు
క్షణకాలం మెరిసి తిరిగి అంతలోనే నీ పాదాల కింద
వేగంగా వ్యాపించే నీడలలోకి ఆ తెల్లటి మేఘమూ
ఆ తెల్లటి కుందేలూ కనుమరుగు అయినప్పుడూ?

ఇక, రాలే ఆకులనీ, రాలిపోయిన పూవులనీ ఏరుకునేందుకు, నీ
గది బయటకు అడుగు పెడతావు నువ్వు. నీ కళ్ళల్లో
వలయాలుగా గాలి. అరచేతుల్లో ముడుచుకు పోయే
తడి. కాలి బొటన వేలికి అంటుకుని, నిన్ను ఒకసారి
జలదరింపుకు గురి చేసే, తడచిన మట్టీ, వానానూ-

ఆఖరికి, చేతులు కట్టుకుని నడుస్తూ, నువ్వు నీ తల పక్కకి తిప్పి చూస్తే
ఒక వానపాము, మెలికలు తిరుగుతో, తనని తాను
తవ్వుకుంటున్నట్టూ, భూమిలోకి ఇంకిపోయేందుకు
ఒక తపనతో, ఆదుర్ధాతో, హడావిడిగా, కంగారుగా-

ఇక ప్రత్యేకంగా చెప్పాలా నేను మీకు, ఆ తరువాత నేనేం చేసానో? 

05 July 2013

నమ్మకు

నీ చేతిలో రాళ్ళు ఉంటాయి. నీకేమో మరి అవి పువ్వులు-

నీడలు ఊయలలు ఊగే వేళల్లో, ఆకులు రెపరెపలాడి
నీ ముఖాన్ని తాకి రాలే
క్షణాలలో, ఒక ఆనందం

నీకు: ఆ పూవులని నలుగురికీ చూయించాలని, అద్రుశ్య
ధూపం అల్లుకునే వాటి
సువాసనని అందరికీ
పంచాలనీ, నవ్వాలనీ-

అమ్మల గన్న అమ్మా
ఓ, పిచ్చి మాయమ్మా
చూసుకున్నావా మరి అద్దంలో, నువ్వు ఇచ్చిన పూలతో

వాళ్ళు నిన్ను మోదితే
నెత్తురోడే, నీ పెదాలనీ
నువ్వు రాసే పదాలనీ?

తల్లీ, అంత తొందరగా
మనుషుల్నినమ్మకు
ఈ కవులను, అసలే... 

ఇలా

ఏముందని అడుగుతావు ఇక్కడ, ఈ రాళ్ళూ మట్టి బెడ్డలూ తప్ప- అని

అరచేతుల్లోకి తీసుకుంటే అవి పసి వదనాలు-
శ్వాసిస్తే, రాత్రంతా వెన్నెల్లో తడిచి
ఉదయాన వికసించి సువాసనను
వెదజల్లే పూవులు. ముట్టుకుంటే

కదిలిపోయి, నెత్తురై రాలిపడే మనుషులు, దగా పడ్డ అనేకానేక కుటుంబాలు-
చూడగలిగితే, అవి అశ్రువులని
దాచుకుని, అన్నం పెట్టిన స్త్రీల
అరచేతులు. పలుకగలిగితే నీ
నాలికపై అవి బీజాక్షరాలు. దా

మరి ఇక్కడికి.ఈ రాతి నేలపైకి-

ఇంత మట్టిని నులుముకుని నీ
ఒంటికి రాసుకుని కనురెప్పలపై
అద్దుకో- శిరస్సుపై జల్లుకో- ఇక నీ ఒంటరి లోకాలలోంచి, నువ్వు

ఒక చినుకై రాలి బ్రతికిపోతావు- 

04 July 2013

ఉసుళ్ళు

నీ శరీరం చుట్టూ ఒక ఆవరణ- ఇంట్లో దీపం లేని చీకటి.

నీ హృదయ ఆవరణలో నీరు ఆవిరయ్యే వాసన. 
రిఫ్ఫున, కనురెప్పలు కొట్టుకులాడే సవ్వడి 
తలుపు చాటున ఎవరో తమ మునిపంటిన 
అశ్రువులని ఆపిన వత్తిడి-

ఏం చేయగలం నువ్వూ, నేనూ ఇక 
వాకిలి పోక్కిలయ్యే వేళల్లో? వీపుకి 
వీపు ఆనించి, ఇక రాత్రంతా కూర్చుని చూస్తే, ఆ ఉసుళ్ళు 

కాంతికి విరిగి, రెక్కలు తెగి,  నేలపై నీ పాదముద్రలు 
స్మృతి చిహ్నాలుగా మారే   
ఈ గాలికి ఊగిసలాడుతూ
దొర్లిపోతూ సన్నగా రోదిస్తూ-

చూడు
మరేం లేదు, ఖాళీ గూడు వంటి దోసిలిలో తన ముఖాన్ని
పాతుకుని, నీ అవసరం తీరి 
పోయాక, పాతబడి పోయిన

ఇలా మిగిలిపోయిన ఒక మనిషిని
ఎవరూ తాకని అతని అరచేతులని.  

ఇక ఎలా మాట్లాడుకోగలం-మనం-?

నాన్న

'కంట్లో ఒక వర్షం చినుకు  బావుండు - వర్షిస్తున్నప్పుడు-'

వర్షం కవిత్వం- రెండు కనులనూ మేఘాల్లా విస్తరింపజేసి 
నిర్మలమైన కనులపాపలతో వర్షం కోసం ఎదురుచూడటం కవిత్వం-
ఆ రెండు కళ్ళూ  నల్ల మట్టితో నిండి ఉన్న ఆకాశాలు- లేదా
జలధార కోసం అవిశ్రాంతంగా ఎదురుచూసే రైతులు- లేదా
ఆ రెండు కళ్ళూ గతించిన అతని తండ్రి బాహువులు-లేదా
నాన్న రెండు కళ్ళూ, నాన్న ఊహ తెలీనప్పుడు కోల్పోయిన
పాలతో తొణికిసలాడే తల్లి వక్షోజాలు- వేసవి కాలం నిర్విరామంగా పరుచుకుపోయి
కోసుకుపోయే ఒక అంతు లేని తెరలా విస్తరించుకున్నప్పుడు

నాన్నకో చిన్న కోరిక: "ఈ కంట్లో ఒక వర్షం చినుకు రాలితే బావుండు- వర్షిస్తున్నప్పుడు"

ఇదొక జీవంతో తొణికిసలాడే కారణం అతను కవి కావడానికి-
వేచి చూడటం, అబ్బురం నిండిన చిన్న పిల్లాడి కనులతో ప్రపంచాన్ని చూడటం:
అదీ కవిత్వం- వర్షం కవిత్వం. వర్షం కోసం ఎదురు చూడటం కవిత్వం

వేసవి కాలం అంచున నిలబడి, రాబోయే వర్షాకాలం
బహుమతిగా పంపించిన ఒక మేఘమయపు వర్షపు దినాన
వానపాము వలే భూమిలోకి తొలుచుకుపోయి లేదా
శరీరమే భూమిగా మారిపోయి నాన్ననూ, నాన్న కోరికలనూ            
ఆ రెండు కళ్ళల్లో వర్షపు అలల్లా కొట్టుకులాడే కలలను గుర్తుకు తెచ్చుకోవడం కవిత్వం-
చినుకులొక్కటే కవిత్వం కాదు- అది అంతకు మించినది
నాన్నలా, తన స్పర్శలా లేదా నయనాలు విచ్చుకోనప్పుడు
తను కోల్పోయిన తన తల్లి స్పర్శలా-

మరి అతని తల్లి ఎలా ఉంటుంది-?

సుదూరంగా, అసంఖ్యాక వర్షపు తెరల సంవత్సరాల క్రితం కురిసిన ఒకానొక వర్షం-
ఊరిలో, వసారా ముందు, చూరు అంచులను తాకుతూ,  పేడతో అలికిన
మట్టి మీద రాలిన వర్షం చినుకు రాలిన బరువుకి
ఎండిన మట్టి, కొద్దిగా చలించి అదృస్యంగా చలించి
గాలిలోకి చేతులు చాచితే అతని తల్లిలాగా ఉంటుంది.
అందుకే నాన్నకో చిన్న కోరిక-

"కంటిలో ఒక వర్షం చినుకు రాలితే ఎంత బావుంటుంది- వర్షిస్తున్నప్పుడు-"

నీడలు కమ్మిన మధ్యాహ్నం, చెట్ల గుబురు కొమ్మలలోంచి
ఊయలలూగుతూ జారిపడిన పక్షి ఈక వలే
వర్షం వాలిన జ్ఞాపకం తప్ప, మరే జాడా లేక   
అమ్మనే పదం తప్ప మరే గుర్తులూ తోడు రాక
వర్షం వెలిసాక, లోకాన్ని చిన్ని మంటలా అదుముకునే ఎండలా
అతని వర్షం వెలిసిన కన్నుల్లో అమ్మ కొట్టుకులాడుతుంది-

వర్షంలోని ప్రతి చినుకూ అమ్మ లేక తడబడిన బాల్యంతోనూ
ప్రతి నిమిషం, మట్టిలోంచీ, తండ్రి గరకు హస్తాలలోంచీ
మొలకెత్తుతూ గడిపిన పసితనంలో మిళితమయ్యి
ఎదురుచూసే అతని కన్నులలో ప్రతిబింబిస్తుంది-

కాళ్ళ ముందు కురిసే ప్రతి చినుకులోనూ తల్లి రూపం
కళ్ళలో వాలకుండా మట్టిపై చిట్లిన ప్రతి చినుకులోనూ
తల్లి హస్తాలు. ఆ చినుకు లోకాలలో, తను తన తల్లితో గడిపిన ఐదారేళ్ళ పసితనం-
ఒకప్పుడు ఆమె తనకు చనుబాలు తాపిందన్న ఊహ
తనని రెండు కాళ్ళ మధ్య పరుండబెట్టుకుని స్నానం
చేయించిందన్న ఊహ.వర్షం ఊహ-చాలా కాలం క్రితం

తాటాకులు కప్పిన ఇంటి ముందు, అతను జన్మించక
ముందు, అతని తల్లికీ ఒక చిన్న కోరిక -"కంటిలో ఒక
వర్షం చినుకు రాలితే బావుండు-వర్షిస్తున్నప్పుడు"అని-

ఆమె స్వప్నించి ఉండవచ్చు. ఘాడంగా, వర్షానికి ముందు
భూమిపై బలంగా వీచిన గాలి తెరలా, రాత్రి పూట చిక్కగా అలుముకున్న చీకటిని
లోపల గదిలోంచి సన్నగా తాకుతున్న దీపపు కాంతిలో
గుమ్మం పక్కగా కూర్చుని, మబ్బులతో నిండుతనం సంతరించుకుంటున్న నింగిలా
బరువైన తన గర్భాన్ని ఆమె ప్రేమగా కలల అరచేతులతో కప్పి స్వప్నించి ఉండవచ్చు

"నా బిడ్డ కంటిలో ఒక వర్షం చినుకు రాలితే బావుండు- వర్షిస్తున్నప్పుడు-"

వర్షం చినుకొకటి మట్టిని తాకేంత సామీప్యంలో, ఆమెను మరణం చుట్టుకుంటున్నప్పుడు
ఆమె శరీరంలోని ప్రతి నెత్తురు చినుకూ మహోద్రేకంతో చలించిపోయి
ఒకే ఒక్క కోరికతో తపించిపోయి ఉండవచ్చు-'నేను చనిపోక ముందు
ఒక వర్షం చినుకు నా బిడ్డ కంటిలో రాలితే బావుండు-వర్షిస్తున్నప్పుడు'-

చాలా రోజుల తరువాత, మరో తల్లైన, అతని తండ్రి మరణించే ముందు
అతని తండ్రి కనులలో అద్రుస్యంగా కదులాడిన కల. వర్షం కల. నాన్నా
నువ్వది గమనించావా?నీ తండ్రి కనులలో కనిపించిన వర్షం.స్వచ్చమైన
ఆనంద సౌందర్యం వల్ల కదులాడిన వర్షం? నాన్నా అతను నీ కనులలో
ఒక స్వప్నాన్ని చూసాడు. వర్షిస్తున్నప్పుడు కంటిలో ఒక చినుకు మృదువుగా జారి పడటాన్ని

నీ కనులలో చూసాడు. ఆ చినుకులో నీ తల్లిని వీక్షించాడు
ఆమె కాంక్షించిన ఒక ఆప్తమైన కల, తనలాంటి సౌందర్యవంతమైన కల, నీ కనులలో
నిజమవ్వడాన్ని ఆనందపు వీడుకోలుతో గమనించాడు-
ఇక చాలా రోజుల తరువాత, నువ్వు మళ్ళా ఆనాటి ఆరేళ్ళ కళ్ళతో స్వప్నిస్తావు కదా

'కంటిలో ఒక వర్షం చినుకు రాలితే బావుండు- వర్షిస్తున్నపుడు-' అని
మరి నువ్వది గమనించావా? అరచేతుల్లా నువ్వు చాచిన నీ
కనులలోకి ఒక చినుకు రాలింది. మృదువుగా తాకింది. నీ
నయనాల సజలతనంలోకి కరిగిపోయింది. అది కవిత్వం-
నీ చుట్టూ ఉన్న మట్టిపై, నీ చుట్టూ ఉన్న మనుషులపై
లేతగా కురుస్తూ ఉంది. నువ్వు, నీ తల్లి ఒడిలో వొదిగిన
చిరునవ్వు వలే తాకుతూనే ఉంది. నువ్వు తపించిన నీ

బాల్యమంతా, తల్లి ప్రేమంతా, ప్రియురాలి చేతివేళ్ళ స్పర్సలా
తెల్లటి మబ్బులు తేలుతున్న ఆకాశంలాంటి, విప్పారిన నీ
కనులలోకి మట్టి పరిమళంతో ఒక చినుకై రాలి పడింది
అది కవిత్వం:నీ శరీరంపై వాలి,లోపలి నెత్తురు కొమ్మల్లో
అసంఖ్యాకంగా, గూళ్ళు కట్టుకుంటూనే ఉంది. నీ శరీరం

అణువణువులోంచి ఒక కలల పక్షి తొంగి చూస్తుంది- మరి నీకు తెలుసా
నీ శరీరం ఏమిటో? ఎగిరే పక్షుల కిలకిలరావాల సందడి-
విస్తరించిన మట్టి వృక్షాల వాన కొమ్మల అలజడి. మరి
నీ కనులూ, పెదాలూ, పాదాలూ, పదాలూ? అవి ఒక
నెత్తురు జలపాతం,ఒక వెన్నెల సాగరం.చూడు ఇటు

ఘాడంగా, ఆ చిక్కటి అరణ్యాలపై వర్షం కురుస్తున్నప్పుడు
నా చినుకుల వజ్రాలలోంచి,నేనూ ఒక స్వప్న బిందువుని   
దొంగలించాను. రహస్యంగా, నీకు తెలియకుండా,నేను ఒక
నెత్తురు చుక్కనూ, దాని పరిమళాన్నీ దొంగాలించాను.ఇక
ఇప్పుడు, నా రక్తం అలల నిండా మత్తుగా, బరువుగా కదిలే
ఒక కోరిక -'నా కంటిలో ఒక వర్షం చినుకు పడితే బావుండు- వర్షిస్తున్నప్పుడు-'
-------------------------------------------------------------------------
1997. 

03 July 2013






































































































                                                                                     


















01 July 2013

మూర్ఖుడు

It is a tale
Told by an idiot, full of sound and fury
Signifying nothing.
 — Macbeth (Act 5, Scene 5)-
1
వేకువఝాములలో వచ్చి, దుప్పటి తొలగించి, నెమ్మదిగా తను నీ పక్కన చేరేది. అప్పుడు, నీ కలలో తన శరీర స్పర్శ: లేత ఎండలో, పిచ్చుకలు రెక్కలు విదిల్చి తిరిగి గూళ్ళల్లో ముడుచుకున్నట్టు, నీ బోజ్జలోకి తను ముడుచుకుపోతే, నీ నిదురలోకి ఒక తల్లి తన స్థన్యం అందించినట్టు, ఆకలికి తల్లడిల్లిన ఓ శిశువు- మూసుకున్న కళ్ళతో- వొణికే వేళ్ళతో చూచుకాన్ని అందుకున్నట్టు, నీకు నీ నిదురలో

కొంత శాంతి. జనన మరణాల మధ్య వ్యాపించిన కొంత కాంతి. చిన్నగా చెట్లు కదిలి, రావి ఆకులు గలగలలాడే సవ్వడి. నదీ తీరాన, సంధ్యకాంతిలో ఓ నావ ఆగి ఊగుతున్నట్టు, కనురెప్పల కిందకి తేలి వచ్చే అలల తడి: నీ చుట్టూతా పురాస్మృతుల అలికిడి. ఇక చేతులు వేసి తనని, నీ నిద్దురలోకి దగ్గరకి లాక్కుంటే
2
ఎక్కడిదో మరి ఒక తుంపర: తూనిగలు పచ్చిక మైదానాలలో ఎగురుతున్నట్టూ, పూల పొదలు నీలోకి లేత వేడిమితో అడుగిడి విరగబూసినట్టూ, మంచు తాకిడికి గడ్డి పరక కదిలినట్టూ, సీతాకోకచిలుకలు ఏవో చిన్నగా వాలినట్టూ, నీలో నీ నిద్రలో, ఒక కాల స్వప్నం. ఒక స్వప్న లోకం. అనేకానేక లోకాల సంచారం. పలు మార్లు జననం పలుమార్లు మరణం-
3
ఇక, తన అరచేతిని నీ చేతిలోకి తీసుకుని, నిద్రలోనే ఎక్కడో మెదిలిన ఒక నెత్తురు నీడకి, దిగ్గున లేచి కూర్చుని చూస్తావా- మరిక ఇక్కడ నీ పక్కగా ఒక మహాశూన్యం. నలిగిన పక్కలో వ్యాపించే ఒక మహా నిశ్శబ్ధ శబ్ధం: ఎవరో నీలో చేరి ఒక సమాధిని తవ్వుతున్నట్టూ, మరెవరో నిన్ను అక్కడికి మోసుకు వస్తున్నట్టూ, తమ గుండెలు బాదుకుని భోరున హోరున గొంతు తెగేలా ఏడుస్తున్నట్టూ-
4
మరికా తరువాత నువ్వు నిదురోయింది ఎన్నడు?