31 May 2013

Bacardi bum

వొళ్ళంతా తీగలు, నీటి తీగలు అల్లుకుని, లోనికి సర్రున దిగుతూ ఉంటే, శరీరం సుర్రున జలదిరిస్తోంది. 

అరచేత్తో ముఖంపై నీటిని తుడుచుకుని, చీకట్లో కనీ కనిపించని రహదారిపై 'ఉంటానో, ఊడతానో ' అని అనుకుంటో, నేనసలే మా గుడ్డి మాలోకాన్ని కదా, ఈ చిన్ని చూపుల కళ్ళజోడుతో, ఈ తెల్లని అపాచీ అశ్వాన్ని వానలో అధిరోహించలేక, లేకుండా ఉండాలేకా 

ఎలాగోలాగా ఆ అపరాత్రి ఇంటికి 'చచ్చి బ్రతికితిరా' అనుకుంటో ఈదులాడుకుంటూ వచ్చీ వచ్చీ, వచ్చీ వచ్చీ, మరిక 

తల తుడుచుకుంటో, ఆగలేక, వంటింట్లోకి వెళ్లి, దాచుకున్నగూట్లో చూస్తే ఒక ఖాళీతనం- అతి భద్రంగా దాచుకున్న బకార్డీ బాటిల్ కనిపించక దాని కోసం వెదుకుతూ ఉంటే, ఎప్పుడూ లేని ప్రశాంతత కదులాడుతున్న గదులలో ఎన్నడూ లేనిది, పదకొండు గంటలకే పడుకున్న పిల్లల అర/దొంగ నిద్రల లోంచి

నడిచొచ్చి నెమ్మదిగా తను 'ఇందాక
అనుకోకుండా పడేసారు పిల్లలు' అని
తాపిగా చెబితే, అప్పుడు నమ్ముతావు నువ్వు ఖచ్చితంగా, విరక్తిగా- హతవిధీ ఇక 

దేవుడినీ, నరకాన్నీ, పాపాలనీ శాపాలనీ, ఖర్మనీ- ఆహ్ ఇదంతా నా తలరాత అనుకుంటో, గతిలేక, ఇటువంటి రాతలు రాసుకుంటో- అది సరే కానీ 

By the way, could you lend మీ,
(A) couple of shots
Of whisky or/
Vodka/

To this romantic/bombastic
Bacardi bum
Of the night? 

27 May 2013

ఇప్పుడు

పాత్రలో ఇన్ని నీళ్ళు కాగబెట్టి, ఇన్ని నూకలు పోసి, ఉడికాక, ఇంత ఉప్పు వేసి, మరికొంత రాగి పిండి పోసి, కలిపీ కలిపీ, కలిపీ, చివరిగా ఇంత నెయ్యి పోసి కలిపి ఇక 

ఒక ముద్ద సత్తు ప్లేటులో వేసుకుని, పాత చింతకాయ పచ్చడితో, ఈ చీకట్లో - చిన్నటి వెలుతురు మిణుకు మిణుకు  మనే నేలపై కూర్చుని తింటావు నువ్వు 

ఇక చేయదగిన గొప్ప కార్యమేదీ లేదు కనుక: ఇక ఈ పూటకి, మొక్కలకి నీళ్ళు పెట్టినట్టు, వడలిన పూలపై ఎవరో    గాలిని  చిలకరించినట్టూ, ఈ నీ శరీరానికి గుక్కెడు నీళ్ళూ, రాత్రి తేమా ఇచ్చి, నిదుర తోటలోకి అలసటగా పంపించడం తప్పితే

నిజానికి చేయడానికి ఏం ఉంది? రోజూ రాయాలనేం ఉంది? ఇలా కూడా ఉండవచ్చు నువ్వు. గాజుపాత్రలోని చేపపిల్లలా, ముడుచుకున్నకుక్క పిల్లలా, పిల్లి పిల్ల వలే గుర్ మంటో నిన్ను రుద్దుకుంటూ తిరిగే ఒక మెత్తటి అలసటతో, నెమ్మది అవుతున్న శ్వాసతో

రెండు చేతుల మధ్య ఒక దిండుని పుచ్చుకుని, కనులు మూసుకుని నువ్వు పడుకుంటే - అందులో తప్పేం ఉంది?  

26 May 2013

ఇక్కడ

ఈ చీకటిని
ఒక సీతాకోకచిలుక అనుకుందాం కాసేపు-

నీ కళ్ళల్లో
ఎగురుతూ, అది నీ లోపల ఎక్కడో వాలితే
ఆ రెక్కలకి
నీ రెక్కలు వదులు అయ్యి
నీ హృదయం చల్లబడుతుంది.

ఇక నీ నుదిటిపై
తెరలుగా గాలి. మట్టిని తాకే నీటి వాసనా-

గోడలపై పెరిగే
నీడలలోంచి, కాంతి పువ్వులు నవ్వుతాయి
చిన్నగా, నీకే
వినపడేటట్టు-

ఆ నీడల పందిరి
కిందే ఉందో అమ్మాయి, శరీరపు లాంతరుతో
నీకు దారి చూపిస్తో-

ఇంకా కొద్దిగా ఇలా
ఊహిస్తూ ఉండు-
వస్తాను నేను మళ్ళా, రొయ్యలని వండుకుని. 

25 May 2013

ఆకు

కూర్చున్నాం నేనూ, ఈ అశోకా వృక్షపు ఆకూ ఎదురెదురుగా-

కొద్దిగా ముదిరి, పీల్చివేయబడని పచ్చదనమేదో కొంత మిగిలి
కొంత సూర్యరశ్మిని తనపైకి వంచుకుని
చిరుగాలికి అలా కదిలే ఈ అశోకా ఆకు

నా పరధ్యాన ముఖాన్ని, తన చేతివేళ్ళతో మరి చిన్నగా తాకితే
అతని అమ్మ గుర్తుకు వచ్చింది -
కొంత పగిలి, మరికొంత చీలికలై

నేలకు నీడనీ, వాననీ, గాలినీ ఇచ్చి, నేలపైకి, నేలలోకి చేరేందుకు
ఆఖరుగా, తపనతో, ఆసుపత్రిలో
కొమ్మను పట్టుకుని రెపరెపలాడే
ముకుళితమైన ఆకుగా మారిన
ఆ అమ్మా, మరి ఈ అశోకా ఆకూ-

మరి  చీకటయ్యే వేళకి, పోటెత్తిన హోరుగాలికి, ఎగిసిన దుమ్మూ
దుమారానికి తాళలేక, నువ్వు
లేక మరి ఆకు తెగి, రాలి, ఎటు
వెళ్ళిపోయిందో, ఎన్నెన్ని తుంపులయ్యిందో

ఇక చెట్టుకీ తెలియదు,ఈ కళ్ళల్లో
నుంచి జారిన, అశోకా ఆకువంటి
అశ్రువుకీ, అశోకా చెట్టంత పొడుగైన అతని ఒంటరితనానికీ తెలియదు- 

24 May 2013

epistemology

ఉన్నతుడివి నువ్వు, ఈ అనేక ఉష్ణ కాలంలో
నీదొక శీతల నేత్రం

సూర్యసింహాసనం నీది, దానిలోంచి ఒక పాదం
ఇక్కడికి జారి జారి
ఒక పదమయ్యింది

న్యాయనిర్ణేతవి నీవు
అపర భగవానుడివీ
అమాయకుడివీ నీవు

నీ నోట్లో వేలుపెడితే, ఇదేమిటి అని అడిగే
మహాఋషివి నీవు.

స్మశానాలలో  
సమాధులపై
ఒక కాలెత్తిన శునకానంద ఆ అవసరాన్ని
చూసావా నువ్వు?

-అదే ఈ వాక్యం-

గోవిందా, గోవిందా

నీళ్ళే లేవు, ఖర్జూరపు పళ్ళు నీ దాహాన్ని ఎటూ తీర్చలేవు

గుడారమా? అదెలాగూ
నిండిపోయింది, మరే
నువ్వెక్కి వచ్చిన ఒంటెతోనూ, దాని ఒంటేలుతోనూ - ఇక

బయటకి పాక్కుంటూ
వచ్చి, ఈ తుఫానులో
చచ్చీ , చెడీ హతవిధీ అని అనుకుంటో నువ్వేం చేస్తావు మరి?

లాగులిప్పుకుని, ఇక ఈ
ఇసుకలో ఈడ్చుకుంటూ
హోహోం హోహోం అంటూ, నిన్ను నువ్వే పాడె కట్టుకుని పోతా

ఉంటే , మరే, ఈ పదాలు
పెట్టిన పిండం కోసం మరి
ఆకాశమంతా కాకులు, తెరలు తెరలుగా 'కావ్, కావ్, కావ్...'

మని, మనీ, ఎనీ కీర్తి ఇక
ఎనీ టైం ఎనీ ప్లేస్ అంటే-
ఒరేయ్! ఇప్పుడు చెప్పు

రాస్త్తావా నువ్వు, కవిత్వం మళ్ళా ఎన్నడైనా ఎక్కడైనా ఎందుకైనా?  

23 May 2013

confession

పెద్ద మార్పేమీ ఉండదు కానీ, బరుక్కుంటాను తలను అలాగే, కోతిలాగే-

మరీ ముఖ్యంగా, సర్వం విసుగు పుట్టి, ఇంకా విసుగు పుట్టని బార్లల్లో దూరి బుద్ధిగా మూడు పెగ్గులతో, బయటకి రాలేననీ తెలిసి, ఎనిమిది పెగ్గులు తాగి, తిరిగి ఇంటికి ఇంకో మూడు బీర్లు తెచ్చుకుని, బాల్కనీలో కూర్చుని భూమిని సృష్టించిన విధాత, ఇక తొలి రాత్రిన కూర్చుని నక్షత్రాలని చూస్తో 

తొలిసారిగా శాంతిగా, నిండుగా ఉన్నట్టు, మరలా ఒక అనంతం దాకా కూర్చుని, తెల్లటి కిరణాలుమెత్తటి రేకులై విచ్చుకుని, మట్టి తడచిన వాసనతో గాట్టిగా కౌగలించుకునే దాకా అలా ఉంటే సౌఖ్యంగానే ఉంటుంది కానీ మరి తిరిగి నిద్ర లేచిన తరువాత, తలలో ముళ్ళు పొడుచుకు వచ్చి

లోకమంతా, కాలమంతా గిరగిరా గిరగిరా,  గి రసరా సరసరా అంటో తిరుగతా తూలతా ఉంటే, మంచాపై ఇలా, ఇల్లల్లా చల్లటి నీళ్ళతో కూర్చుని, గొంతు తడుపుకుంటూ, నల్లని కపి వలె తలను బరకుకుంటూ ఇదిగో ఇలా మీకిది చెబుతున్నాను, నా ఈ ఆరడుగుల తోకని తిరగని ఫానుకేసి చుట్టుకుని

తిప్పుకుంటూ తల కిందులుగా, వేలాడుతో - 'Don't you know That I am a monkey విత్ ది తోకా of a dog?' 

22 May 2013

నిన్ను ఎన్నడూ చూడలేదు, ఒక్కసారైనా - అయినా
నీ  కళ్ళు ఎలా ఉంటాయో ఖచ్చితంగా తెలుసు నాకు-

విరబూసిన పత్తికాయలలోంచి
దాగక బయటపడే తెల్లటి దూదిని చూసావా నువ్వు?
అటువంటి కాయలనీ, నిండైన
దూదినీ నువ్వు చూసే ఉంటావని అనుకుంటాను నేను -

మరి అవే నీ కళ్ళు. తెల్లటి మబ్బులు-







  

20 May 2013

ఒక మామూలు కవిత

రాసుకుందామని కూర్చుంటాను, ఇక్కడ, ఒక్కడినే మరి, నీలాగే ఈ రాత్రి కాంతిలో-

నీవు ఉండే గదుల వంటివే. అద్దెకు తీసుకుని, మన శరీరాలనీ, మాటలనీ అద్ది
నాలుగు పూల కుండీలతో, పొద్దుతిరుగుడు పూవులా
మనం మలచుకునే, ఈ రెండు అద్దె గదుల ఇల్లే మరి-

నీవు వినే శబ్ధాల వంటివే ఇక్కడ కూడా. నువ్వు రాసుకుందామని కూర్చున్నప్పుడు
నీకు వంటింట్లోనుంచి వినిపించే వంట పాత్రల సవ్వడే-
ప్రతీ రాత్రీ, మనలని మనం బ్రతికి ఉంచుకునేందుకు

తానో, లేక కొన్నిసార్లు నువ్వో చేసే ధైనందిన చర్య-
నువ్వు వాటిని జాగ్రత్తగా వినగలిగితే, ఆ శబ్ధాలలో
సన్నటి గాజుల అలికిడి వంటి, గాలికి కదిలే పూల పరిమళం వంటి, బియ్యం చెరిగే, మరి
వాన చినుకులు రాలే ఘడియలూ వినిపిస్తాయి-

ఇక, నీ పిల్లల వంటి వాళ్ళే నాకూనూ- ఇల్లంతా
ఎగిరి ఎగిరి, ఈ పట్టాణాలల్లోంచి తప్పించుకుని
పచ్చని పొలాల్లో, తూనిగలో మరి మిడతలో రివ్వున ఎగిరే మైదానాలలో, వాళ్ళు హర్షంతో
కేకలతో పరిగెత్తిపోతున్నట్టూ- మరిక వాళ్ళు
ఉండటం వల్లేనే , ఈ నాలుగు గోడలూ ఇంత

పచ్చని పొలలై , ఉద్యానవనాలు వేలాడే నగరాలై
కొంత కనుల కింద శాంతియై.ఇక మరి రాత్రంటావా
నువ్వు నీ సహచరితో మాట్లాడుకునే,పోట్లాడుకునే
నిన్ను నువ్వు విడమర్చుకుని తెరపి పడే చీకటి వలే వ్యాపించే ఒక సజీవ గర్భం, చెమ్మానూ-
పెద్దగా ఏముంటాయి చెప్పు - కట్టవలసిన బిల్లులూ
రాని జీతాలూ, ఇవ్వవలసిన ఇంటి అద్దెలూ, జరిగిన

అవమానాలూ, రాబోయే రోజులూ, పిల్లలు ఉదయం చేసిన అల్లరి పనులూ, తలుపు సందులో
పడి చిట్లిన వేలూ, గుక్క పట్టి ఏడ్చిన ఆ ముఖమూ
ఇంకా కొంత శరీర శాంతి. రోజూ రమించాలనేం ఉంది?

అప్పుడప్పుడూ తన అరచేయి నీ నుదిటి మీద
ఆగినప్పుడు, అక్కడొక నెమలి వచ్చి, రెక్కలు
విప్పార్చి నృత్యం చేస్తుంది. అపుడు నీ లోపల ఎక్కడో సన్నగా చెట్లు వీచి, ఆకులు రాలి, నీ
లోపలి ఆకాశం నెమ్మదిగా మేఘావృతమౌతుంది-

మూసుకున్న కళ్ళ కింద కొంత చిన్న వెలుగు
ఎవరో దీపం వెలిగించి, నీ లోపల ఉంచి, అరచేతులతో కాపాడుకుంటునట్టు కూడానూ-
సరే, మరి ఇవే, మరి ఇలాంటివే,రాసుకుందామని
నేను కూర్చున్నప్పుడు: ప్రత్యేకమైన ఇంద్రజాలం
ఏదీ లేదు నా వద్ద. నీలాగే, అత్యంత సరళంగానే

చూడు, రాసుకుందామని కూర్చుని, నీ గురించీ
నా గురించీ చెప్పుకుంటుండగానే, ఎలా మరి ఈ
నాలుగు పదాలు, నిన్ను విడిచి, నన్నూ విడిచి
రొట్టెలు ఉంచిన ప్లేటు వద్దా, కదులుతున్న మల్లెతీగ చుట్టూ, తడి గుడ్డ చుట్టిన మట్టికుండ వద్దా
పసిడి కాలం వంటి నుదిటిపై, నిప్పుల వేడిమికి

కమ్ముకున్న చెమటని, తన ముంజేతితో తుడుచుకునే నీ స్త్రీ వద్దకూ, ఎలా
వెళ్లి చుట్టూ తిరుగాడుతున్నాయో! మరేం లేదు
ఇంతకూ ఇప్పుడైనా తెలిసిందా నీకు, మరి ఒక
కవితను ఎలా చేయవచ్చునో, నువ్వు ఒక కవితగా ఎలా మారవచ్చునో, ఇక చక్కగా ? 

ఎన్నడైనా?

ఇక్కడ నువ్వుంటే బావుండేది- (నిజంగానే, ఆ రిక్త అరచేతుల్లోనే)

వేళ్ళతో తాకితే కదిలే చీకటి. ఇదొక సరస్సు కూడానూ-
శరీరాన్ని నావను చేసి వొదిలితే, మరి 
సన్నగా వీచిన గాలికీ, ఆ కాంతికీ ఇక 
ఒక్కసారిగా ప్రాణం వచ్చిసాగిపోతుంది 

రాత్రి అలలపై ఈ కాగితపు నావ, తీరం లేని లోతుల్లోకీ, ఒక విస్మృతి 
కాలంలోకీ, నువ్వు లేని లోకాలలోకీ- 

అయినా సరే, మరి ఇక్కడ నువ్వుంటే బావుండేది (నిజంగానే)

ఈ చీకటి నీళ్ళలోకి తొంగి చూసి, వాటిని మంచినీళ్ళ వలే మార్చే  

నీ ప్రతిబింబాన్నిఈ అరచేతులతో అందుకుని
కొంత నా దప్పిక తీర్చుకునేందుకూ, 
ఈ శోక వదనాన్ని కడుక్కుని కొంత 

తెరపి పడేందుకూ, ఆపై నిదురించేందుకూ-

అది సరే కానీ, రాత్రిపూట గోడలపై రెపరెపలాడే నీడలను చూస్తూ 
కూర్చున్నావా ఒక్కడివే ఎన్నడైనా?

19 May 2013

చీకటి

ఏమీ లేని వాణ్ని. తాకితే నీకూనూ అంటుకుంటుంది కొంత చీకటి-
చల్లగానూ, గరకుగానూ, కొంత చెమ్మతో 
చేతులంత, కన్నీళ్ళంత లోతుతో గాత్రంతో-

చెప్పానుగా, ఏమీ లేని వాణ్ని. ఏమీ లేదు ఇక్కడ, నా వద్ద. త్రాగడం
-భస్మం అయ్యేటట్టు- ఎందుకయ్యా అంటే 
అరచేతుల్లోని ముఖం భారమయ్యి, మరి
ఒక్కడినే ఒక్కడిని అయ్యి, ఎవర్నీ కానని 

తెలిసి- అది సరే, ఇది అంతా ఏమిటీ అంటే, ఏమీ లేదు 

ఆకులపై వాలిన వెన్నలని చూస్తావు నువ్వు

మరి అవే ఆకుల కింద, ఆకులని భీతితో, అంతిమ శ్వాసతో హత్తుకున్న
చీకటిని చూస్తాను నేను. ఇంతకూ 
నీతో ఏదైనా తప్పు చెప్పానా నేను-?

17 May 2013

బడ్వైసర్ బడ్డీ

ఒక రాతి బల్ల మీద అరచేతులు ఆన్చి, కళ్ళను చుట్టూ తిరిగే పావురాళ్ళ రెక్కలలో వొదిలివేసి, ఇక
ఈ మధ్యాహ్నం ఒక బీరుతో, ఈ
బార్ల హారంలో ఒదిగి ఒదిగి మరి

నేనూ నా బడ్వైసర్. ఇంకా ఒక మహత్తరమైన వేణు వనాల, గానాల- లోకం. నీ నెత్తురికి
సుగంధం అంటుకుని
వ్యాపించే ఒక కాలం-

రా ఇక్కడికి. తాగిక మరి నాతో. 
చెబ్తాను నీకిక నేను ఆ రహస్యం 

నీ రెండు చేతుల్నీ రెక్కలుగా మార్చి రాత్రికి నింగిలోకి పావురమై అలా ఎగిరిపోవడం ఎలాగో
చుక్కల గూటిలో- చీకటిలో చిన్నగా- ఒత్తిగిల్లి, ఒద్దికగా ఇక
జాబిలిని ముద్దాడుతూ నిదురోవడం మరి ఎందుకో. సరే సరే 

మరి వస్తావా నువ్వు, రంగుల వెన్నెల చిట్లే ఈ చల్లని ఛాతి గృహంలోకీ , నవ్వులలలోకీ 

మరి నిన్ను నువ్వు వొదులుకుని, 'మనం', అనే
ఒక ప్రేమని మాత్రమే అలా 
మిగుల్చుకునీ, ఉంచుకునీ? 

ఒంటి కన్ను రాక్షసుడు అను Red Eye

ప్రపంచమంతా అంత ఎర్రగా ఏమీ కనిపించదు కానీ, చిన్ని చిన్ని ముళ్ళేసి
నులుముతున్నట్టు కొంత నొప్పి, కొంత చికాకూ- మరి 
అప్పుడు నువ్వేం చేస్తావంటే, కాలంపై కన్నెర్ర జేయలేక 

ఒక్కడివే నీ వాలు కుర్చీలో కూర్చుని, ఒక చల్లని తడి గుడ్డని చేతిలో ఉంచుకుని 
పాల చుక్కలు వేసుకున్నా పసికన్ను కాని, మరి నీ ఆ 
ఒంటరి కన్నుని అదుముకుంటో కూర్చుంటావు నువ్వు 

ఒక్కడివే, నీపై నువ్వే కన్నెర్ర జేసుకుని, ముఖం ఇంతలా 
మాడ్చుకుని, 'ఎందుకంత తాగితి రాత్రి, మరి ఎందుకంత 
పీల్చితి ధూమమూ, కరడు గట్టిన జీవితపు చితాభస్మమేదో కన్నులలో రాలేటట్టూ 
పదం పంచుకునే వారు లేక శరీరం మొత్తం శోకించేటట్టూ'

అని నువ్వు ఒక్కడివే అనుకుంటూ, అప్పుడప్పుడూ అద్దంలో ముఖం చూసుకుని
ఎరుపెక్కిన ఎడం కన్నుని ఒక మారు తుడుచుకుని, ఇక 
ఇలా అనుకుంటావు నువ్వు, పదునెక్కిన వ్యంగ్యంతో ఒక 
లోలోపలి వికటాట్టహాసంతో: 'హేహే రాజన్! ఉండెను ఇక్కడ 

ఇంకా, ఒక ఒంటి కన్ను రాక్షసుడు, ఒంటి గంట రాత్రిలో  
కనులలో మొలుచుకు వస్తున్న కొమ్ములతో, కోరలతో-
అయిననూ నేను బ్రతికే ఉంటిని చూడుడి, నన్నున్ జూసి 
కనులలో నిప్పులు పోసుకును వారు ఇక నిశ్చింతగా మరి తెల్లని కనులతో నిదురించుడి-'

అది సరే కానీ మరేమో కానీ ఎవరి సంగతో మనకెందుకు కానీ 

By the way 
Have you ever got a red eye?
By the way 
Have you ever got an eye?
I mean 'I'?

16 May 2013

పొట్టు

పూర్తి ధ్యాసతో, పెదాలు బిగపట్టి, సమస్థ విశ్వం అదే అయినట్టు
పూర్తిగా నిమగ్నమయిపోయి
చెక్కుతారు కదా పిల్లలు అలా

వంకర టింకరగా, ఆ పెన్సిల్ని

ఆనక గజిబిజిగా గోడలపైనో
కాగితాలపైనో, మరిక నీపైనో
బొమ్మలు వేయడానికీ, రాసుకోడానికీ, ముల్లు విరిగితే, తిరిగి
మళ్ళా చెక్కుకోడానికీ, మరి

నువ్వూ అంతే - అంతే శ్రద్ధతో
వేళ్ళ మధ్య పొందికగా పుచ్చుకుని, ఒక చిరునవ్వుతో, సహనంతో
నింపాదిగా చెక్కుతావు నన్ను-

(ఎలా అంటే, నేను, నువ్వు ఆడుకునే ఒక బొమ్మని అయినట్టూ
ఇక నిన్ను విడిచి నేను
ఎక్కడికీ వెళ్ళిపోలేనట్టు)

ఆఖరికి ఇక్కడ, ఇప్పుడు

చెక్కీ చెక్కీ చెక్కీ అలసిపోయి నువ్వూ, అరిగీ అరిగీ అరిగీ, ఇక
ఏమీ మిగలక, గాలికి కొట్టుకు
వెళ్ళే చెక్కపొట్టునై నేను -ఇక

ఈ కాగితంపై మిగిలేది ఎవరు? 

15 May 2013

ఎందుకు కాకూడదు?

కనులలో ఏవో నెగడులు రగిలి, నుదిటిలో ఏవో లోకాలు చిట్లి, అరచేతుల్లో
ముఖాన్ని పాతుకుని, ఆ చీకట్లలో కూర్చుని
బావురుమంటున్న ఒంటరి నీడల్నినేనొక్కడినే

వింటున్నప్పుడు, మరి నువ్వొస్తావు: నీవే అవి- రెండే రెండు అరచేతులు

రెండే రెండు పాదాలు, రెండే రెండు కనులూ, రెండే రెండు మాటలూ, శబ్దాలూ
అస్వస్థత నిండిన శరీరాన్ని లోపలి పొదుపుకునే
నీ బాహువులూ, రెండే రెండు అశ్రువులు, మరిక

రెండే రెండు పెదవులు, చీకటిని చీకటి పెనవేసుకున్నట్టూ
ముదురాకులపై ఉదయపు చెమ్మ ఏదో పరచుకున్న్నట్టూ

ఘనీభవించిన సరస్సులపై పొగమంచు ఏదో ఒక సుగంధమై వ్యాపించినట్టూ
భీతిల్లి కంపించే అరచేతిలోకి మరో అరచేయి ఏదో ధైర్యమై
చుట్టుకున్నట్టూ, కనులు తెరవని కుక్కపిల్ల ఏదో, తన
తల్లి పొదుగులోకి ముడుచుకున్నట్టూ, పాలు తాగినట్టూ

ఇక నువ్వు యిలా వెలిగించిన ఈ ఒకే ఒక్క రాత్రిలోకి ఇలాగే జారిపోతాను నేను
నీతో, మరి ఒక అంతిమ క్షణంలోకి, కరుణ నిండిన ఒక
ఆఖరి కాంతిలోకీ, తిరిగి మొదలయ్యే ఒక శ్వాసలోకీనూ-

మరేం పర్వాలేదు: వికసించిన పూవులన్నీ ముకుళితమవ్వాలి. అవన్నీ ఎక్కడో
ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు రాలిపోవాలి.మరి అది
కనిపించని నిప్పులని దాచుకుని, కని /పెంచే చల్లని
తల్లి వక్షోజాలై, నన్నూ నా ముఖాన్ని అదుముకుని

నాకు పునర్జన్మని ఇచ్చే, నీ అరచేతుల్లోనే, ఆ వనాలలోనే ఎందుకు కాకూడదు? 

14 May 2013

ఎలా?

ఇన్ని ఏళ్ళ తరువాత తనని తిరిగి మళ్ళా చూడటం-

కంపించే చేతివేళ్ళతో, తన ముఖాన్ని తాకితే 
     నా చేతివేళ్ళ చివర్లన్నీ, తన కన్నీళ్ళ
     నెత్తురు అంటుకుని 
     చిట్లిపోయాయి

భగవంతుడా! చుట్టుకుంటున్న చీకటీ
     కన్నీళ్ళ పర్యంతం అయ్యే
     ఈ వేళల్లో

సన్నటి గాలి కూడా గొంతు చుట్టూ బిగుసుకుని
     ఊపిరాడనివ్వకుండా నులుమే
     ఇటువంటి కాలాలలో 

ఒక ముఖం మరొక ముఖంపై
     వడలిపోయి అలా
     నిస్సహాయంగా
     రాలి

పోయే వేళల్లో 

భగవంతుడా -

ఇక ఈ రాత్రి ఎలా తెల్లవారడం?
     ఎలా బ్రతికి
     ఉండటం?

యిలా.

ఆకాశం నుంచి ఈ నేల దాకా
ఒక లేత వాన పరదా జారితే యిక ఎందుకో నాకు ఎప్పుడో
నా తల్లి కట్టుకున్న చుక్కల చీరా నేను తల దాచుకున్న తన మల్లెపూల
నీటి యెదా గుర్తుకు వచ్చింది.

పమిట చాటున దాగి తాగిన పాలు
తన బొజ్జని హత్తుకుని పడుకున్నఆ ఇంద్రజాలపు దినాలు
రాత్రి కాంతితో మెరిసే
దవన వాసన వేసే ఆచెమ్మగిల్లిన సూర్య నయనాల కాంతి కాలాలూ

గుర్తుకువచ్చాయి ఎందుకో, ఇప్పటికీ చీకట్లో
అమ్మా అంటూ తడుముకునే, ఎప్పటికీ
ఎదగలేని ఈ నా నలబై ఏళ్ల గరకు చేతులకు-

ఉండే ఉంటుంది తను ఇప్పటికీ - ఎక్కడో -
నన్ను తలుచుకుంటో ఏ
చింతచెట్ల నీడల కిందో ఓ
ఒంటరి గుమ్మం ముందో

కాన్సరొచ్చి కోసేసిన వక్షోజపు నుసి గాటుపై
ఓ చేయించుకుని నిమురుకుంటూ
తనలోనే తాను ఏదో గొణుక్కుంటూ

ఇన్ని మెతుకులు కాలేని ఆకాశాన్నీ
కాస్త దగ్గరగా రాలేని దూరాన్నీ ఎలా
అ/గర్భంలోకి అదిమి పట్టుకోవాలనిఒక్కతే కన్నీళ్ళతో అనేకమై యోచిస్తో
వాన కానీ భూమీ కానీ మొక్క కానీ పూవు కానీ గూడు కానీ దీపం కానీ

అన్నీ అయ్యి ఏమీ కాక, ఒట్టి ప్రతీకలలోనే
మిగిలిపోయి రాలిపోయే లేగ దూడ లాంటి
మన అమ్మ

యిలా ఉందని
ఎలా చెప్పడం?

కాంతి

ఇక్కడే, ఒక్కడినే నక్షత్రాలని చూస్తూ కూర్చుంటాను-

చుట్టూ నల్లటి మల్లెపూవులు రాలే చెమ్మగిల్లిన చీకటి-
వీచే సన్నటి గాలీ: ఎవరో మరి
వాకిట్లో నీళ్ళు చిలుకరించాక

చక్కగా ఎగిరివస్తున్న, వొళ్ళు విరుచుకున్న మట్టి వాసనానూ-
ఎవరిదో ఒక చేయి నీడయై
గోడపై దీర్ఘంగా సాగి, నిన్ను
తాకే వేళలలో, నీ శరీరంలో

ఒక సన్నటి జలదరింపు. వెనుక నుంచి ఎవరో నీ మెడపై
రహస్యంగా ఊపిరై తాకినట్టు
ఇక్కడే మరి ఒక్కడినే నిన్నూ
ఈ నక్షత్రాల కాంతిని చూస్తూ-

మరి ఇక ఎవరికి  తెలుసు
నేను ఇప్పుడు చూస్తున్న
నువ్వైన ఈ నక్షత్రపు కాంతి ఏ పురాతన కాలానిదో? నువ్వు

ఇంతకూ అక్కడ ఉన్నావో లేదో?

13 May 2013

ఈ స్థితి

నాలుగు వాక్యాలు రాసుకుందామనే, అంతకు మించి పెద్దగా కోరికలూ
    ఏమీ లేవు - అరచేతుల్లోకి ముఖాన్ని ముంచుకుని
    శుభ్రంగా కడుక్కుని, ఆపై
    వీచే గాలితో తుడుచుకుని

కనులు మూసుకుని, ఒకసారి నిన్ను తలచుకుని
     ఒక ప్రార్థన మొదలుపెడతాను -
     ఎలా అంటే, గుండెను చీల్చుకుని
     నెత్తురుతో కొట్టుకుంటున్న గుండెకాయని అరచేతుల్లో ఉంచి
     ఆ లబ్ డబ్ సవ్వడిని నీకు
     కన్నీళ్ళతో వినిపించినట్టూ

రాలిపోయిన ఒక జీవాన్ని, గుండెలకి హత్తుకుని ఏడ్చినట్టూ
     చివరికి, ఏమీ చేయలేక ఒక
     నిశ్శబ్ధపు ఆక్రందనతో నేలకి ఒరిగిపోయినట్టూ
     స్పృహ తప్పినట్టూ:  అదే అదే

ఒక మూగవాడి ఆఖరి సంజ్ఞా గీతం వలే, అతని చేతివేళ్ళ కంపన వలే-మరి
     ఇలాంటి పచ్చిముల్లు ఎప్పుడైనా
     అరిపాదంలో దిగి విరిగిపోయిందా
     నీకు, తీయరానీయకుండా, అలాగే ఉంటూ సలుపుతూ?

ఇదే, నువ్వు రాయాల్సిన సరియైన రహస్య సమయం
     నెత్తురు అంటిన ముల్లుతో, నీతో-
     దా మరి, రాద్దాం ఒక ఇల్లాంటి నిన్నూ నన్నూ, ఒక పసిముల్లునూ-  

12 May 2013

ఈ పూట

వెదురు వనాల బుట్ట బొమ్మలా నువ్వు, తిరిగి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు
మరి మన ఇల్లంతా కరివేపాకు వాసన
కొంత పుదీనా పచ్చదనం, చల్లటి తడీ-

మరి నీ కళ్ళలోంచి తొంగి చూస్తూ ఉంటాయి, కొత్తిమీరా
ఎర్రని టమాటాలు, మరికొన్ని చిలకడ దుంపలూ, ఇన్ని
ములక్కయలూ, మరికొన్ని పచ్చని ఆకుకూరలూనూ

ఇంత మట్టీ, వానా కలగలసిన సాయంత్రపు వాసనతో, నీ గాజుల చప్పుళ్ళలో ఇరుక్కుని-

ఇక నువ్వు అలసటగా కుర్చీలో కూర్చుని, చున్నీతో
నుదిటిన పట్టిన చమటని తుడుచుకుని
నావైపు చూస్తే, ఒక మంచినీళ్ళ బాటిల్ని

నీకు అందించి, ఇలా అంటాను నేను -
"ఈ పూటకి నేను వంట చేస్తాను. ఏం
తింటావూ? టొమాటో రైస్ చేయనా?"

ఇక, తెరిచిన తలుపులోంచి కొంత గాలీ,  మరికొంత చీకటీ. ఎక్కడో సుదూరంగా
మిణుకు మిణుకుమంటూ, ఒంటరి
నక్షత్ర మొకటి మనలో. లోపలెక్కడో

ఆకులపై చినుకులు రాలి చేసే
ఒక మెత్తని సవ్వడీ - రుచీనూ-

ఆహ్- ఏమీ లేదు. ఒక రోజు ఇలా కూడా ఉండవచ్చుననీ, గడుస్తుండవచ్చుననీ
చెబుతున్నాను మీకు నేను,  ఈ
ఎర్రెర్రని టొమాటోలు కడుక్కుంటో-

అది సరే కానీ, నా సంగతేమో కానీ
By the way, what are you eating
For tonight?

ముందు


ఒక కవిత ఎలా రాయాలోతరువాత చెబుతాను కానీ, ముందు ఇది ఊహించు:

కిటికీలోంచి చేతిని చాచి, తలను దానిపై వాల్చి కూర్చుంటే, మరి
ఎక్కడిదో ఒక తేనె పిట్ట వచ్చి నీ అరచేయిపై వాలుతుంది
అరచేతిని కదపకుండా, అబ్బురంతో కళ్ళింత చేసుకుని
నువ్వు దానిని చూస్తున్నప్పుడు

పైన ఆకాశం కొంత రంగు మారుతుంది. కొంత గాలి వీస్తుంది
పని చెసుకుంటూ, చెదిరిన శిరోజాలను వెనకకి తోసుకుని, నీ
వైపు ఒక పరి చిరునవ్వుతో చూసే నీ స్త్రీ గుర్తుకు వస్తుంది-
నిన్ను ఊరకనే తాకి కిలకిలా నవ్వే పిల్లలూ, వాళ్ళ కళ్ళల్లో

మెరిసే తోటలూ, నేల తడచిన సుగంధంతో నిన్ను తాకుతాయి
వెన్నెల ఏదో నీ ప్రాంగణంలో రాలి, కొన్ని పూవులేవో వికసించి
ఇక నీ చుట్టూతా సన్నటి పురాస్మృతుల జల్లు, నీ అరచేయిని
అందుకుని అరచేతిలో ఎవరో వేలితో సున్నాలు చుడుతున్నట్టు-

క్షణకాలం నీపై అలా వాలి, నిన్ను తాకి తేనె పిట్టైతే ఎగిరిపోతుంది కానీ
నీ శరీరమంతా దాని చిట్టి పాదాల ఒత్తిడి
దాని రెక్కలు అడుగున దాగిన వెచ్చటి
దాని పసి శరీరపు అలికిడి, లేత తాకిడి

మరేమో ఇక నీ మనస్సులో
సరస్సు వంటి ఒక నిశ్శబ్ధం- నావ ఏదో ఆగిపోయినట్టూ, నడి సంద్రమే
తీరం అయినట్టూ, ఇక ఈ
ప్రయాణపు మర్మమేదో పూర్తిగా తెలిసిపోయినట్టూ

మృత్యువు రహస్యమేదో తొలిసారిగా అవగతమయినట్టూ
పూల మధ్య దారం అయ్యి, ఆత్మ నుంచి ఆత్మకి
అల్లుకుంటుంనట్టూ, నెత్తురు దివ్వెయై వెలిగినట్టూ-

సరే, సరే, అది సరే కానీ,ఒక కవిత ఎలా రాయవచ్చునో, ఇప్పుడైనా తెలిసిందా నీకు?

10 May 2013

బాల్కాయ్*

'అక్కడ చేయి పెట్టుకోకూడదు, ఎప్పుడూ అక్కడ చేయి పెట్టుకుని
నులుముకుంటావేమిటి? యాక్, చేయి తీయి'
అని వీలైతే ఒక దెబ్బ కూడా వేస్తాం కానీ, వాడే

ఆనక అటు తిరిగి, ఇటు తిరిగీ, నెమ్మదిగా నా వద్దకు వచ్చి ఇలా
అంటాడు ఆ నాలుగేళ్ల నల్లని వాడు: "నాన్నా
దురద పుడుతుంది నాన్నా, దురద పుట్టినా
బాల్కాయ్ నులుముకోకూడదా?"అనడిగితే

ఎక్కడో ముఖం దాచుకుని, శతాభ్ధాల లైంగిక అణచివేతలు గుర్తుకు
వచ్చి, శరీరం ఒక పాపం, మరి లైంగిక
అవయవాలు ఒక నేరం, అని పిల్లలకి

చెప్పీ చెప్పీ చెప్పీ, శైశవం నుంచి బోధించీ బోధించీ బోధించీ, నీ శరీరాన్ని
నువ్వు ఆస్వాదించచనిదే,  ఇతరుల శరీరాన్ని
నువ్వు ఆరోగ్యవంతంగా ఆస్వాదించలేవు అని

ఈ పుణ్యభూమిలోని తల్లులకీ తండ్రులకీ ఇక

మరి చెప్పలేక ఎలా చెప్పాలో తెలియక, ఇదిగో
చేతివేళ్ళల్లో నీళ్ళు కుక్కుకుని, ఈ పదాలను
రాసుకుంటూ ఉన్నాను, శరీరాన్ని మరియు లైంగిక అవయవాలనీ, రతినీ
అంటరాని పదాలని చేసి, పిల్లల నోట్లో గుడ్డలు

కుక్కి, వాళ్ళని ర్యాంకులుగా, పెట్టుబడులుగా
సమాజంలో హోదాలుగా తప్పితే, నిలువెల్లా
వెన్నెలనీ పూలనీ కాంతినీ వాననీ వసంతాల్నీ
ఎడారులనీ దాహాలనీ మోహాలనీ దేహాలనీ మోసుకు తిరిగే ఆత్మలుగా మరి

వాళ్ళని చూడలేక, వాళ్ళని పెంచలేకా మరి వాళ్లకి చెప్పాలేకా, వాళ్లకి ఇక
శరీరాలు లేకుండా చేసి, నిలువెత్తు సమాధులుగా
మారుస్తున్న నిన్నూ నన్నూ ఎందుకో మరి దుక్కంతో తలచుకుంటూ-
--------------------------------------------------------
*బాల్కాయ్ = the word for penis that the little one uses-

09 May 2013

నీ పెదాలు

ఎండని పువ్వులా చేసి, సిగలో ముడుచుకుని నువ్వొస్తే
ఇక అంతా ఒక అయోమయం - ఇక అప్పుడు

నీ ముఖం, ఒక కాంతి ఖచిత, ద్రవ దర్పణం
నేను తిరిగి నా ముఖాన్ని కనుక్కోలేని
కడుక్కోలేని, సూర్యుని వలే మెరిసే ఒక

వెన్నెల నయనం, ఒక వెన్నెల వలయం, ఒక వెన్నెల దహనం-

చత్. అసలే ఈ పొగల పొగల ఎండలో,  మరి నా మానాన నేను
ఈ మధుశాల పడగ కింద ఒకింత
శాంతిగా ఉందామంటే, అనుకుంటే

ఎందుకో మరి నీ పెదాలు, నిలువెల్లా
కాలిపోతూ నన్ను దహించివేసాయి-

ఉర్రేయ్ - ఎవడ్రా అక్కడ! ఒక టన్ను టిన్ను బీర్లూ, వేయి బార్లూ
ఇలా వొంపిపొండి - ఇక ఈ రాత్రి కి
ఏమైనా కొంత బ్రతికి, కొంత మిగిలి

రేపటికి ఎలాగోలాగా ఉండగలుగుతానేమో చూస్తాను-

08 May 2013

చేసిన పాపం

"చెమ్మగిల్లిన రాత్రిని నువ్వు ఎన్నడూ చూడలేదు" అని నువ్వు అన్నావు ఆనాడు-

చీకట్లో ఈ వేళ, ఇంటికి తిరిగి వస్తూ ఉంటే, దారికి ఇరువైపులా
ఊగుతాయి విస్తృతంగా తుమ్మచెట్లు -
రాలే ఏ వెన్నెల చినుకులో కూడా మరి
ఆ ముళ్ళని తాకి రివ్వున చీరిపోతాయి

రెక్కలు తెగి, సీతాకోకచిలుకలో లేక సీతాకోకచిలుకల వంటి మనుషులో
మరి వాళ్ళూ ఇక్కడే, దిగంతాల
జీవన భారపు బరువుతో విరిగీ-

చెప్పడానికి ఏమీ ఉండదు. నువ్వు నీతో ఉంటే బావుంటుంది, అని నువ్వు
అనుకున్న వాళ్ళూ, ఎవరైతే ఉంటే
నువ్వు కళ్ళని తుడుచుకుని, రేపు

తిరిగి లేచి, కొంత బ్రతికేందుకు వెళ్ళగలిగిన వాళ్ళూ, వాళ్ళు నిన్ను వొదిలి
వెళ్ళిపోయాక, పెద్దగా రాయడానికీ
ఏమీ ఉండదు.మహా అంటే అయితే

ఒక మొద్దు తుమ్మ చెట్టుగా మారి, ఊగిపోతో తూలిపోతో, నిన్ను నువ్వే ఇక
చీరుకుంటూ కూర్చుంటావు. అది సరే
చెమ్మగిల్లిన రాత్రిని నేను చూసుండను

కానీ, చెమ్మగిల్లి, ఆ తడితో, ఆ మంచుతో
ఒక నిండు శరీరం రాత్రై , చిక్కటి చీకటియై
నింగిలోకి ఒక అరచేయై మరొక అరచేయికై చాచి, తపించీ తపించీ తపించీ
అతి నెమ్మదిగా గడ్డకట్టుకుపోతున్నఒక

మనిషిని చూసావా నువ్వు ఎన్నడైనా?
అని నేను అననూ, అడగనూ ఈనాడు-
మరేం లేదు, నీళ్ళంటిన కళ్ళతో, ఎండిపోయిన రాత్రిలోకి ఒక మాటను జారవిడిచి

నీ వంటి కన్నుని తోడుకుంటూ కూర్చుకున్నాను ఇక్కడ. ఇలాగ. చివరికి. చావుకి.
అంతే - ఇంతకంటే మరేం చెప్పను? 

Noem అను ఒక కథ

1
వాళ్లకు నేనేమీ తేను, బహుశా వాళ్ళేమీ ఆశించరు కూడా. మహా అయితే
ఆకుల మాటున దాగిన పూలల్లా తటాలున బయటపడి
పకాల్మని నవ్వుతారు, ఆపై చుట్టూ చేరి అల్లుకుంటారు

ఈలోగా ఇంటి ముందు చీకటి తెరలు వీస్తాయి, వాళ్ళ కళ్ళల్లో వెన్నెల్లు వెలుగుతాయి
వెన్నెల్లో, వాన జల్లులలో మరి సీతాకోకచిలుకలు ఎగురుతాయి
రెక్కలపై నక్షత్రాలతో పూల పుప్పొడితో ఒక  చల్లటి గాలి వీయగా

నిదుర అంటిన వాళ్ళ కళ్ళల్లో కథలు మొలుస్తాయి. మరి నేను
వాళ్లకు పెద్దగా కథలు ఏమీ చెప్పను, బహుశా వాళ్ళేమీ ఆశించరు కూడా. మహా అయితే
ఇదిగో ఇటువంటి ఒక గాధను వింటారు వాళ్ళు అల్లుకుపోయి-
2
నీళ్ళు నెమ్మదిగా మీలా రూపు దిద్దుకుంటున్న సమయంలో
వేడిమి తెరలు కదిలే వేళల్లో, ఒక మానవుడు నిస్సహాయుడై
ఈ లోకంలోకీ ఈ కాలంలోకీ విసిరివేయబడ్డాడు. మరప్పుడు

అతనికి వయస్సు లేదు, చూపు లేదు, లోక మర్మం, ద్రోహం బ్రతకనేర్చినతనమూ లేదు
మరి ఏమిటంటే ఆ కాలమంతా డబ్బులేని రాక్షసత్వం. తిండి
లేక, ఫాక్టరీలో వడ్లకింద కూరుకుపోయి చనిపోయినంత వింత

అతని లోకం, అతని శాపం. తల్లిని కనలేకా తండ్రికి చెప్పాలేకా
తనకు తాను విడమర్చుకోలేకా, మధుశాలలలోకో స్త్రీల లోకో
వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ, శరీరాన్ని కోసుకుంటూ సాగిన ఒక

గతం. స్నేహితుల వద్దా, శత్రువుల వద్దా ఇంత ఎంగిలి పడేందుకు, నానా మాటలు విన్న
అగత్యం. ఏమీ లేని తనం. ఇన్ని పదాలని పోగేసుకుని, రాత్రికి
ఇంత మంటను రాజేసుకుని, నిప్పులో నుదిటినీ అరచేతులనీ
వెచ్చబెట్టుకుంటూ రేపటి దాకా ఎలాగోలాగా బ్రతికిన వైనం.మరి

ఇంతా చేస్తే, ఇన్ని యుగాల ఘర్షణ తరువాత కూడా ఇంటికి వెళ్ళలేని ఒక దైన్యం. తండ్రి
చనిపోతే, తన ఇంటికి తల్లిని తెచ్చుకుంటే తన భార్య నానా ఆగీ చేసి
తల్లిని వెళ్లగొట్టే సందర్భం. కన్నకూతురూ, అతని ఆ స్నేహితులూ
అపరిచితులై ముష్టిఘాతాలై మీద పడి తరిమి తరిమి కొడితే ఇక

ఎక్కడి వెళ్ళాలో, బ్రతికి ఉండాలో వద్దో, మరి చచ్చిపోవడమేలాగో
తెలియని గడ్డు కాలం. 'అన్నా ఏమిటిది' అని అంటే, 'అన్నా నేనూ
నీ వలెనేనే' అని చెప్పి, అరచేతుల్లో కనుగుడ్లను చితక గోట్టుకుని
విలవిలలాడిన అప్పటి, ఇప్పటి కరకు కాలమూ, లోకమూ. మరి

ఇటువంటి కథను ఇంతకు ముందు చెప్పానా మీకు ఎన్నడైనా?
3
బయట చిక్కగా చీకటి, మెల్లగా గాలితో కలిసి రాత్రిని అల్లుతుంటే, మరి పిల్లలు - వాళ్ళే -
నేనేదైనా తెస్తానేమోనని ఆశించని పిల్లలు గుండెలపై నిదురోతారు
భుజం తల ఆన్చి, మరి నా భార్యేమో ఉగ్గపట్టుకుని కూర్చుటుంది

గదిలో, ఎక్కడో సాలెపురుగు గూడు అల్లుతున్న నిశ్శబ్ధం. మెత్తగా
మంచుపొర ఒకటి అద్దంపై పరచుకుంటున్న లేత సవ్వడీనూ.మరి
అద్దం సన్నగా చిట్లి పగలవచ్చు, ఏ ఈగో సాలెగూటిలో ఇరుక్కోనూ

వచ్చు. గిలేరీలతో, కొంతమంది, మరి నువ్వు ప్రేమించే పావురాళ్ళని రాళ్ళతో కొట్టి రాల్చి
చంపి తినేందుకు తీసుకువెళ్లనూ వచ్చు. ఏమీ చేయలేక నువ్వు
అలా చూస్తూ ఉండిపోనూ వచ్చు."నిజమేనా అది, నువ్వు చెప్పిన
ఆ కథ? అది, నిజంగా నిజమేనా?" అని నా స్త్రీ అడుగుతుంది. నేను

నా చేతిని, నిదురలోకి జారి, కలవరిస్తున్న పిల్లలవైపు చూపిస్తాను- ఎలా అంటే, మరి
నదిని చూపించమని అడిగిన వాళ్లకి నావని చూపించినట్టు- ఇక
ఆ తరువాత నాకు తెలియదు, తనకూ తెలియదు, ఎవరి గుండెపై
ఎవరు తల ఆన్చి ఎలా నిదురపోయారో, మరి తొలిసారిగా ఆ రాత్రి

నిదురలోకి తలారులు రాకుండా, తోటలూ కాకుండా ఘాడమైన పొగమంచు ఒకటి
మమ్మల్ని ఎలా కమ్మేసిందో, తిరిగి మేము ఎప్పటికైనా
నిదుర లేచామో లేదో, ఇది నిదురలో జరిగిందో, లేక
మెలకువలోనో, మరిక ఎప్పటికీ ఎవరికీ తెలియలేదు-
4
తెలియదా మీకు, మరి కొన్నిసార్లు మరి చాలా చాలా సార్లు, పిల్లలే మనలని ఓదారుస్తారనీ
లోపల వెక్కి వెక్కి ఏడ్చి, మరి మనమే వాళ్ళ ఒడిలో
దైన్యంగా నిదురోతే, మన తలలపై చేయుంచి, వాళ్ళే
అనునయంగా నిమురుతూ ధైర్యం చెబుతారనీ, ఓ

చిరునవ్వుతో దీవిస్తారనీ? గాలి తాకి దిశ మారిన ఒక
వర్షం, అటుపై గదిలో నిండుగా కురిసింది. వెలసింది-
పచ్చి ఆకుల వాసనా, రాలిన పుల్లలు విరుగుతున్న
ఒక మెత్తడి సవ్వడీ అక్కడ. మట్టి పొరల్లోంచి, మరి

బయటకి వచ్చి తిరిగి లోపాలకి వెళ్ళిపోతున్న వానపాములు పిల్లల కనురెప్పలపైన- కొంత
మబ్బులు తెరపి ఇచ్చిన కాంతి సంగీతం అతని ముఖంపైన-
కురులు అలలు అలలుగా వాళ్ళ ముఖాలపై నుంచి అలల్లా
తేలిపోయి, పరదా ఏదో తొలిగి చంద్రబింబాలు బయటపడ్డట్టు

ఆ వదనాలని నెమ్మదిగా వేళ్ళ చివర్లతో తాకుతూ అతను అంటాడు: 'బ్రతకాలని ఉంది నాకు'
5
"నాలిక గీసుకున్నట్టు, అప్పుడప్పుడూ మనస్సునూ, మనుషులనూ గీక్కోవడం మంచిది
ఈ మనుష్యులు, స్వతహాగా వీళ్ళు వేటగాళ్ళు, హింసక్రీడా
వినోదులు. ఏమీ చేయకు, వాళ్ళలో కలవకు నెత్తురు రుచి
మరగకు. ఏమీ లేకపోయినా, నీకు ఏమీ దొరకకపోయినా

రా ఈ గోడల మధ్యకు. ఈ గోడలతో ఈ నీడలతో మన బొమికలతో మన నెత్తురుతో మన పిల్లలతో
ఒక ఇల్లుని నిర్మించుకుందాం. మరి కొద్దికాలం బ్రతుకుదాం
ప్రేమ కోసం కాదు కానీ, నాకోసం నువ్వూ, నీ కోసం నేనూ
మన కోసం మనం బ్రతికి ఉందాం. ఊరుకో, అన్నం తింటావా?"

సరిగ్గా అప్పుడు, బయట ఒరిగి ఉన్న ఆ రాళ్ళల్లో నీరు ఊరింది-
పాత్రలలాంటి రాళ్ళలోంచి నీళ్ళు త్రాగడమెలాగొ తెలిసింది,తాకీ
తాకక, ముళ్ళ మధ్య చిక్కు ముడులు కాకుండా పూవులా ఉండటమెలాగొ అతనికి తెలిసినట్టయ్యింది
ఇళ్ళు విడిచి వెళ్ళక, ఇతరులని వొదిలివేయక-అన్నిటి-అందరి
సమక్షంలోనే ఉంటూ నడిచే మరో మార్గమేదో అతనికి తోచింది

తొలిసారిగా, తన చేతిని అందుకుని, తనే తాను అని తెలిసి బ్రతుకులో
తెరిపి పడటమెలాగొ గోచరించింది. జీవితం, అరచేతిలో అరచేయి అనీ,
అశ్రువుని పెనవేసుకునే మరో అశ్రువు అనీ, ఇతరమే తను అనీ, తానే
ఇతరమనీ, ఒకటి లేక మరొకటి మన్నలేదనీ స్పష్టమయ్యింది. ఏదో ఒక శాంతి వంటిది కూడా తాకింది-

"ఇక నెమ్మదిగా లేచి, కూడపెట్టుకున్న నెత్తురుతో కొన్ని పదాలను
రాయి, ఏమీ ఆశించని పదాలని వ్రాయి, ఏమీ ఆశించకుండా వ్రాయి
ఆపై, నీలో ఒక దీపం వెలుగుతుంది, మసి అంటినా, దానితో మరో
దీపం ఎలా వెలిగించవచ్చో  నీకు అర్థం అవుతుంది" అని తను అంటే

అతను మీకు ఇలా ఈ కథ ఒకటి చెబుతున్నాడు, కళ్ళల్లో మిమ్మల్ని
ఒత్తులుగా చేసుకొని, మీలోనే ఎక్కడో ఒక చోట కూర్చుని. ఇక అంతా
విని, ఇదంతా చదివి 'అతను ఎవరు', 'ఇది, నిజమా?' అని మాత్రం అడగకండి - మరి ఎందుకంటే

మీ వెనుక, మీ వెనుక నుంచి వచ్చి మీ కళ్ళను కప్పి మిమ్ములని
అబ్బురానికి గురి చేసే పసి చేతులు, వేచి చూస్తున్నాయి,మీలోనే
మీ మరోవైపున, మీ కలల మరో అంచున. మరి ఎందుకు హాయిగా నవ్వకూడదు మీరు కాసేపు? 

07 May 2013

గుర్తు

నిన్ను ప్రేమిద్దామని, అది నీకు చెప్పుదామనీ అనుకుంటాను కానీ
మరి తెలియదు నాకు అది ఎలాగో-

నువ్వు లేక ఎలాగో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మరి ఇక
అందుకే ఉదయాన్నే లేచాను
ఇల్లంతా కడిగి తుడిచాను,ఒక
పాత్రలో నీళ్ళు ఉంచాను, మరి

గుప్పెడు బియ్యం గింజెలు పిచ్చుకలకూ, పావురాళ్ళకూ జల్లాను
కుండీలో మొక్కలకి నీళ్ళు వొంపి
దుస్తులనీ, దుప్పట్లనీ ఉతికాను-

మరేమీ కావవి, మన పిల్లలూ నువ్వూ నేనూ విడిచిన ఆ దుస్తులే
వాటిని అంటిపెట్టుకుని ఉన్న మీ
శరీర వాసనల కోసమే వాటిని ఓ
సారి తాకి చూసుకున్నాను,ఆపై

తీగెలపై ఆరవేసి, ఎండకి వొదిలివేసాను- కొద్దిగా దాహం వేయగా
మంచినీళ్ళు త్రాగి, వాలు కుర్చీలో
ఒదిగి కూర్చున్నాను, అలసటతో
కనులు మూతపడగా మరి ఆకలీ

వేయగా, కొంత ఓపిక తెచ్చుకుని బియ్యం వండుకున్నాను, ఏదో
ఇన్ని మిగిలిన కూరగాయలతో ఓ
కూర వంటిది చేసుకున్నాను. ఇక
సంకటయ్యిన అన్నాన్ని, ప్లేటులో

వడ్డించుకోగానే,  పొడుచుకు వచ్చాయి ఆ తెల్లటి మెతుకులలోంచి
నీ చేతివేళ్లు బయటకి, తాకాయి
నింపాదిగా మరి  నా ముఖాన్ని-
ఇక నీ కళ్ళేమో, త్రాగుదామని

ఉంచుకున్న గ్లాసు అంచున చెమ్మగిల్లి ఎప్పటిలా నొప్పితో మెరిసాయి
దిగులుతో నా వైపు చూసాయి
అరచేతిలో అన్నంముద్దలై అలా
స్థంబించిపోయాయి, ఏడిచాయి-

అయ్యో, ఎందుకు గ్రహించలేదు మరి ఇన్నాళ్ళూ నేను, నిన్ను ప్రేమిస్తున్నానని
నీకు తెలియజేయడం అంటే ఇలాగని
నువ్వు రోజూ చేసే ఈ పనులే, నువ్వు

ఉన్నప్పుడు నేనూ మన కోసం చేయడమనీ, నీతో కలసి కొంత తెరిపి పడటమనీ? 

06 May 2013

what IS this?

నీ రెండు కళ్ళూ

ఎండిన నేలగానూ, నేల రాలిన పక్షులగానూ, పక్షులపై
నెమ్మదిగా పేరుకుంటున్న సాయంకాలపు ధూళిగానూ
ధూళిలో చేరుకుంటున్న రాత్రిగానూ

మరి రాత్రుళ్ళలో, ఆ చీకట్లలో ఎవరూ
లేక, రాక, తెగిన ఆ కాంతి అంచులపై

మోకాళ్ళపై ఒరిగి, ముకుళిత హస్తాలతో ప్రార్ధించే, నువ్వు
కలవరించే దేహ/దేశ ద్రిమ్మరులుగానూ

ఎప్పుడు మారతాయో ఎవరికీ తెలియదు: అది సరే కానీ
మళ్ళా మరొకసారి ఇలా మొదలు పెడదాం ఈ కవితని-

నీ రెండు కళ్ళూ
ఎండిన నేలగానూ, నాగేటి చాళ్ళగానూ మారితే, కూర్చుంటావు
నువ్వు ఆ బీడు పడ్డ నేలలలో
ఎదురుచూస్తూ, ఎంగిలిపడక

కడుపులోకి తలను కుక్కుకుని, రాత్రంతా తాగినది కక్కుకునీ
మరి ఒక్కసారిగా శరీరం వణకగా
పెదాలపై నెత్తురిని తుడుచుకుని
'అమ్మా' అనుకుంటో, ఒక్కసారి

తల ఎత్తి చూస్తే, ఆకాశపు అనంతాలలో
ఒక తెల్లని కన్ను మొలుస్తుంది: ఎంతో
కొంత దానిలో నుంచి వాన కురుస్తుంది
ఎంతో కొంత మంచూ రాలుతుంది, నీ శరీరం ఘనీభవించి ఒక
ప్రాచీన శిలగా మారుతుంది- తల్లి పాల

వాసన ఏదో ఇక నీ చుట్టూతా, నీ లోపల ఆ కరవు నిండిన నేలలలో-
మరి నీతో, నెలలు నిండి తిండి లేక
చావుకి చేరువైన, ఆ ఆవు ఒక్కటే
ఒంటరిగా, ఇక ఎవరినీ కనలేని ఈ

నేలపై, నీ తల్లి వలే, నిను ప్రేమించిన స్త్రీల వలే, ఏమీ మిగల్చుకోలేని
తండ్రుల వలే, దేశానికి బలి అయిన
అనామకుల వలే, అనాధుల వలే-

PS:
సరే, సరే, ఇదేమిటో నాకు తెలియదు
మీకూ తెలియదు, అర్థం కాదు కానీ
మళ్ళా, మరొకసారి మనం
మొదలు పెడదాం
ఇలా ఈ 'కవితని'-

నా రెండు కళ్ళూ---
నీ రెండు కళ్ళూ---
తన రెండు కళ్ళూ, ఎవ్వరినీ, దేనినీ కనలేని మన అందరి రెండు రెండు నాలుగు కళ్ళూ---

అస్వస్థత

నీకేం చేయాలో తెలీనప్పుడు, ఊరకే కూర్చుని కిటికీలోంచి బయటకి చూస్తావు-

మరి పెద్దగా ఏమీ ఉండవు అక్కడ. గాలి, రికామిగా తిరిగే ఆ గాలే
నీ ముఖాన్ని తాకుతుంది తన పసివేళ్ళతో-
ఆరేసిన బట్టలే కదులుతాయి అలజడిగా అటు తిరిగీ, ఇటు తిరిగీ
కుంచించుకుపోయే కాంతిలో: మరి ఎందుకో

ఆ కాంతినీ, ఆ కదలికల ఆందోళననీ నువ్వు
ఎదురుచూసే కనులగానూ, కనురెప్పలగానూ ఊహిస్తావు- ఎవరో నిన్ను తాకి
ఆనక వెళ్ళిపోతే, తనతో పాటు వెళ్ళలేక, ఇంకా
ఇక్కడే ఉండిపోయి ప్రతిధ్వనిస్తున్న నవ్వులానూ ఊహిస్తావు, 'ఊహించడం పెద్ద
నేరమేమీ కాదు కదా' అని కూడా అనుకుంటూ-

ఇక నీ నుదిటిపై, లోపలా ఎర్రటి కాంతి. వానలో
ఎవరో నిన్ను బొగ్గులపై కాలుస్తున్న స్థితి. మరి
ఎండిపోతున్న పెదాలపై నాలికతో రాస్తుంటే, ఒక చేదు సర్పమేదో పాకిన అనుభూతి
లోపలెక్కడో కొద్దిగా వొణుకు, కొద్దిగా దిగులు-
'నుదిటిపై వాలాల్సిన అరచేతులెక్కడా? పొదుపుకోవాల్సిన బాహువులు ఎక్కడా?

శరీరం శరీరం మొత్తం ఒక మాటై నిన్ను పలకరించాల్సిన మనుష్యులు ఎక్కడా?'
అని కూడా అనుకుంటావు కానీ, ఊహించడమే
పెద్ద నేరమైన చోట, మాటని ఆశించడం పాపమే
అని గ్రహించి, కూర్చుంటావు అక్కడ, అక్కడే ఆ

కిటికీ ముందు, కిటికీ ఎవరో నువ్వు ఎవరో, మరి
నిజానికి లోపలేదో వెలుపలేదో తెలియక, తెలుసుకోవాలనే పెద్ద కోరికా కలగక- మరే
మరి చూస్తూ ఉండు, దిగంతాల నుంచి రాలుతున్న
ధూళిలోకి మరి నీ కన్నులను వొదిలివేసి ముఖాన్ని

నీ అరచేతుల్లో కుక్కుకుని ఊరికే అలా. అయినా
ఇంతకూ, ఎవరికి మిగిలి ఉన్నాయి గూళ్ళు ఇక్కడ
నువ్వు తల దాచుకోడానికైనా, గుండెలు బాదుకుని రోదించడానికైనా, చివరికి

ఎవరూ లేక, రాకా కనీసం నీలో నువ్వు నీతో నువ్వు చనిపోడానికైనా?

04 May 2013

think of it

We shall start with a metaphor: Ok?

Babe, ఒక చీకటి కమలం వికసించి
రెమ్మలపై పొగ వీచింది: నువ్వు
దానిని ప్రేమ అంటావు. మరేమో

నేను దానిని, ఆత్మలోకి ఇంకిపోయే ఒక అనాది పరిమళం అంటాను. ఈ లోపల

బయట చెట్లు ఎందుకో వీచాయి. మరి
ఎందుకో నాకు, వెన్నెల్లో తడిచి, అలా
కొద్దిగా ఊగే గడ్డి రెమ్మలూ మరి దాగిన

కప్పలూ గుర్తుకు వచ్చాయి. By the way
Do you remember that room? Our
Room, that tilted towards the sun
in the raging moonlight? Ok, Ok--

సరే, ఒక చిన్న నీడా చీకటీ ఇలా వచ్చాయి, వెదుక్కుంటూ వెదుక్కుంటూ మరి

ఎక్కడైనా, చిన్న నీడ దొరుకుతుందేమో
అని, అరచేతుల్లో బహిస్టు నెత్తురినీ మరి
మతాన్నీ గర్భంలో దాచుకుని అందుకని

నీ కళ్ళు ఊరికే తార్లాటలాడతాయి, ఇల్లా
ఈ నేలపై, దొర్లుకు వెళ్ళే గాలిలానూ మరి
ఆకులలానూ, మరి ఇవేమీ కాని ఓ రాత్రి

నిన్ను వెలిగించిన దీపంగానూ:  సరే సరే
Enough of fucking metaphors and మరి
Enough of drink, with or without beers

కానీ, మరి ఇదిగో ఒక చిన్న సంభాషణ--

హావ్ యు డ్రంక్?

ఐ డోంట్ నో--

హౌ మచ్?

ఐ డోంట్  నో

వాట్ ఆర్ యు డ్రింకింగ్?

ఇట్ tastes లైక్ వోడ్కా---

ఇస్ దట్ ఇట్ ?

ఎస్, ఐ గెస్స్ సో

నథింగ్ ఎల్స్ ?

మే బి రమ్ అండ్ బీయర్స్

వై డోంట్  యు కం హియర్?

For this one
I wrote the following
little poem, or rather
Noem--

దేహం దప్పికగొని, మరి
పిడచగట్టుకుపోయి, ఇలా ఎదురు చూస్తున్నాను, ఎవరికోసమో
తెలియక, ఎందుకోసమో
తెలియక: నువ్వెప్పుడైనా

గుండెనూ, శరీరాన్ని తవ్వుకుంటూ కూర్చున్నావా, నీ గది మరి
ఒక గర్భస్రావమైనప్పుడు?

You are drunk: She says.

Yes baby I am drunk: I say.

Why don't you stop the fucking drinking? She asks-

Babe, have you got some
grass? I would love to come over to you: I say-

Pardon, She says, repeat again
Do you want to come?

No babe, it is just that

ఈ పూట ఎందుకో నీడలు మనుషులు అయ్యాయి
ఈ పూట ఎందుకో మనుషులు పూవులయ్యారు
ఈ పూట ఎందుకో

ఒక గూడుని కట్టుకుంటున్నాను  నేను, నువ్వు
విదిల్చివేసిన నాతో--

Fuck off, She said
I said, itz right, ok
This is the night where you and me were drunk

You into me
Me into you
So what shall we do? చిన్నగా ఆకులు కదులాడి

ఆకులు, వీయగా
కొంత గాలి తాకగా
పిల్లలు పెట్టిన పిల్లి ఎక్కడో బావురుమంది- రాత్రి అంతా
ఒక ప్రతిధ్వని, ఒక

నిశ్శబ్ధం. చిన్నగా
వెలుతురు చీకటి చినుకులుగా నీ ప్రాంగణంలో టపా టపా
రాలుతున్న సవ్వడి-

And then she said
I love you-
And then I said
I love you too

ఇద్దరికీ అదేమిటో తెలియనప్పటికీ- ఇక ఆ రాత్రంతా మరి
ఆ కాలమంతా, ఆ లోకాలలో
తను ఏడిస్తే నా గుండెను ఒక

సీసం పెంకుతో రుద్దుకుంటూ కూర్చున్నాను నేను ఎందుకో-

By the way
Is this a poem?
By the way
Is this a poem
That you are looking forward to

In the lonely lonely breeze
Of your night and my life?

ఒక చిన్న విరామం కోసమై
ఇక్కడ ఆపుతాను నేను, నేనే మరి నీకోసం, నువ్వు వ్రాసే ఇతరుల కోసం---
But what shall we do
After that? What shall----

Think of It

We shall start with a metaphor: Ok?

Babe, ఒక చీకటి కమలం వికసించి
రెమ్మలపై పొగ వీచింది: నువ్వు
దానిని ప్రేమ అంటావు. మరేమో

నేను దానిని, ఆత్మలోకి ఇంకిపోయే ఒక అనాది పరిమళం అంటాను. ఈ లోపల

బయట చెట్లు ఎందుకో వీచాయి. మరి
ఎందుకో నాకు, వెన్నెల్లో తడిచి, అలా
కొద్దిగా ఊగే గడ్డి రెమ్మలూ మరి దాగిన

కప్పలూ గుర్తుకు వచ్చాయి. By the way
Do you remember that room? Our
Room, that tilted towards the sun
in the raging moonlight? Ok, Ok--

సరే, ఒక చిన్న నీడా చీకటీ ఇలా వచ్చాయి, వెదుక్కుంటూ వెదుక్కుంటూ మరి

ఎక్కడైనా, చిన్న నీడ దొరుకుతుందేమో
అని, అరచేతుల్లో బహిస్టు నెత్తురినీ మరి
మతాన్నీ గర్భంలో దాచుకుని అందుకని

నీ కళ్ళు ఊరికే తార్లాటలాడతాయి, ఇల్లా
ఈ నేలపై, దొర్లుకు వెళ్ళే గాలిలానూ మరి
ఆకులలానూ, మరి ఇవేమీ కాని ఓ రాత్రి

నిన్ను వెలిగించిన దీపంగానూ:  సరే సరే
Enough of fucking metaphors and మరి
Enough of drink, with or without beers

కానీ, మరి ఇదిగో ఒక చిన్న సంభాషణ--

హావ్ యు డ్రంక్?

ఐ డోంట్ నో--

హౌ మచ్?

ఐ డోంట్  నో

వాట్ ఆర్ యు డ్రింకింగ్?

ఇట్ tastes లైక్ వోడ్కా---

ఇస్ దట్ ఇట్ ?

ఎస్, ఐ గెస్స్ సో

నథింగ్ ఎల్స్ ?

మే బి రమ్ అండ్ బీయర్స్

వై డోంట్  యు కం హియర్?

For this one
I wrote the following
little poem, or rather
Noem--

దేహం దప్పికగొని, మరి
పిడచగట్టుకుపోయి, ఇలా ఎదురు చూస్తున్నాను, ఎవరికోసమో
తెలియక, ఎందుకోసమో
తెలియక: నువ్వెప్పుడైనా

గుండెనూ, శరీరాన్ని తవ్వుకుంటూ కూర్చున్నావా, నీ గది మరి
ఒక గర్భస్రావమైనప్పుడు?

You are drunk: She says.

Yes baby I am drunk: I say.

Why don't you stop the fucking drinking? She asks-

Babe, have you got some
grass? I would love to come over to you: I say-

Pardon, She says, repeat again
Do you want to come?

No babe, it is just that

ఈ పూట ఎందుకో నీడలు మనుషులు అయ్యాయి
ఈ పూట ఎందుకో మనుషులు పూవులయ్యారు
ఈ పూట ఎందుకో

ఒక గూడుని కట్టుకుంటున్నాను  నేను, నువ్వు
విదిల్చివేసిన నాతో--

Fuck off, She said
I said, itz right okey
This is the night where you and me were drunk

You into me
Me into you
So what shall we do? చిన్నగా ఆకులు కదులాడి

ఆకులు, వీయగా
కొంత గాలి తాకగా
పిల్లలు పెట్టిన పిల్లి ఎక్కడో బావురుమంది- రాత్రి అంతా
ఒక ప్రతిధ్వని, ఒక

నిశ్శబ్ధం. చిన్నగా
వెలుతురు చీకటి చినుకులుగా నీ ప్రాంగణంలో టపా టపా
రాలుతున్న సవ్వడి-

And the she said
I love you-
And then I said
I love you too

ఇద్దరికీ అదేమిటో తెలియనప్పటికీ- ఇక ఆ రాత్రంతా మరి
ఆ కాలమంతా, ఆ లోకాలలో
తను ఏడిస్తే, గుండెను, ఒక

సీసం పెంకులతో రుద్దుకుంటూ కూర్చున్నాను నేను ఎందుకో-

By the way
Is this a poem?
By the way
Is this a poem
That you are looking forward to

In the lonely lonely breeze
Of your night and life?

ఒక చిన్న విరామం కోసమై
ఇక్కడ ఆపుతాను నేను, నేనే మరి నీకోసం, నువ్వు వ్రాసే ఇతరుల కోసం--
But what shall we do
After that? What shall----

03 May 2013

అసహనం

గాలి అంతా ఒక చోట కేంద్రీకృతమై గూడు కట్టుకుంటున్నట్టు, తిరిగి
పీలికలై మరోచోట వాలుతున్నట్టూ, అక్కడ 
ఎండలో అలా, పెనవేసుకుని కదులుతాయి 

రెండు నీడలు: నువ్వు వాటిని కాసేపు చెట్లు అని పిలవొచ్చు. నువ్వు 
వాటిని కాసేపు రెండు పిట్టలనీ పిలవొచ్చు. నువ్వు 
వాటిని కాసేపు సూర్యుడిని అలా ఎగరేసి ఆడుకునే
పిల్లలూ అని పిలవొచ్చు, మరి వాళ్ళ నవ్వులుగానూ 

ఊహించవచ్చు. మరి, చివరిగా కాకపోయినా, తొలిసారిగా కాకపోయినా 
నువ్వు వాటిని, ఆ నీడలనే, నీ కళ్ళుగా చూడవచ్చు 
నీ మునివేళ్ళతో తాకవచ్చు- మరి  చెమ్మగా కనుక 

తగిలితే, రెండు పాత ప్రమిదెలని ముందేసుకుని, ఒక 
పాత గుడ్డతో ఒరిమిగా తుడుచుకున్నట్టు, ఆ నీడల
కన్నీళ్ళని తుడవనూ వచ్చు. అరలలోంచి కాగితాల్ని 

లాగి, నీలో నువ్వు నిమగ్నమయ్యి ఏవైనా రాసుకోవచ్చు, అభ్యంతరం 
ఏమీ లేదు. ఛాతిని చించుకుని వాటిపై బొమ్మలనూ 
వేసుకోవచ్చు, నెత్తురుతో నీ స్త్రీ శరీరాన్నీ అద్ధవచ్చు 
మరి, ఏమీ లేదంటే ఏమీ రాదంటే ఏదీ కాదంటే ఇలా 

రహదారులపై, ఆగిన వాహనాల కింద పరుండిన వీధి కుక్కల్లా, అలా 
ఊరికే విశ్రమించనూ వచ్చు. ఆహ్ - ఏమీ లేదు. ఒక 
వేసవి మధ్యాహ్నం ఇలా కూడా ఉండవచ్చునని ఇలా
కూడా గడపవచ్చునని మీకు చెబుతున్నాను, గాలికి 

గోడలపై నీడనై, గాలికి రేగిన దుమ్ములూ తేలిపోయే 
కాగితపు ముక్కనై, రాలిపోయిన ఓ ఆకునై, చివరికి 
బొట్టు బొట్టుగా రాలుతూ ఆగిపోయిన నీటిపంపునై-

అది సరే కానీ, మరి ఇంతకూ నీకిక్కడ ఏం పని? Why 
Don't you go and get lost in some fucking cheap bar?
Instead, why are you inscribing in my fuckin' heart-? 

ఈ ఉదయం

మనుష్యుల శరీరాలలోపల మొక్కలు మొలకెత్తి, చెట్లుగా వ్యాపించి
అలలు అలలుగా వీస్తూ ఉంటే
నీకు కొంత స్వాంతన - కనీసం

మరి మబ్బుల లాగైనా ఉంటే, ఎప్పుడో ఒకప్పుడు చినుకులై, నీ
ముఖాన రాలతారని ఒక చిన్ని
నిరీక్షణ. మరలా కాకపోయినా

కనీసం ఒక్కసారి ఒకే ఒక్కసారి
మట్టిలా మారినా బావుండునని
ఒక ఊహ- తవ్వుకుని తవ్వుకుని, వాళ్ళల్లో భూస్థాపితమయితే
ఎలాగోలాగా తిరిగి జన్మించవచ్చు

అనే చిన్ని ఆశానూ, తిరిగి ఎవరిదో ఒకరిది వేలు పట్టుకుని అలా
నిశ్చింతగా వెళ్ళవచ్చు, అలా
నింపాదిగా ఆడుకోవచ్చు అలా
నిర్భీతిగా పడుకోవచ్చు అనే
ఓ అమాయకమైన కోరికానూ.

మరి ఏమిటంటే, ఏమీ లేదు - ఉదయపు అంచున ఒక అరచేతిని చాచి
మరో అరచేయికై ఎదురు చూస్తున్న
ఒంటరి వాసన వేసే ఒక మనిషి-
మరి ఎవరి ముఖంలోనైనా, ఎవరి

కనులలోనైనా నీ ముఖం కడుక్కున్నావా నువ్వు
ఎండ చిట్లే ఈ ఉదయపు ఎడారిలో? 

01 May 2013

ఒక దినం, ఇలా

ఇక్కడే కూర్చున్నాను, ఈ ఎండ తటాకంలో కనుగుడ్లను బుడుంగన ముంచి
వాటిని శుభ్రం చెసుకుంటో - మరి

ఆ చెట్లు. అవి కదలవు. ఆ ఆకులు
అవి అల్లాడవు. గాలి లేక, వీయకా
గొంతు ఎవరో నులుమినట్టు, ఒక

దాహం. ఒక తపన. శరీరం మొత్తం ఒక నిలువెత్తు మట్టి కుండై, నీటికో
వానకో ఒకే ఒక్క చినుకుకో, పోనీ

కనీసం ఇంత చెమ్మకో వ్యాకోచించీ, వ్యాకోచించీ, వ్యాకోచించీ నిస్సహాయంగా
ఎదురు చూస్తున్నట్టు, ఇదొక, ఒక
చిల్లు పడ్డ నగరం ఓ అజగరమై ఇక

నన్ను చుట్టుకుంటే, ఒరే నాయనా
మరి ఏం చేయాలో తెలియక ఇలా
దారి పక్కన కూర్చున్నాను, నిన్ను

తలచుకుంటూ, ఎక్కడైనా ఒక బీరు
త్రాగుదామా అని కూడా అనుకుంటో-
అది సరే కానీ

మరి తాటి ముంజలు తిన్నావా నువ్వు
ఈ వేసవి కాలపు అంచులలో కూర్చుని
బుద్ధిగా ఒద్దికగా నీ చేతివేళ్ళని  నాక్కుంటో, నీ దుస్తులపై మరకలను చేసుకుని ఇకిలిస్తో?