30 April 2013

Meeeee, and My Jeera Rice

ఇల్లంతా చీకటి. మరి దానిలోకే ఎక్కడిదో చిన్న కాంతి, సీతాకోక చిలుకల వలె
పిట్టల వలే రెక్కల్లార్చుకుంటూ వస్తే
నా నుదిటిన ఒక పూవు పూస్తుంది-

సరే, నువ్వెటూ  లేవు, మరి లేరు ఈ పూట స్నేహితులూ, శత్రువులూ మధువుతో
జీవనపు మత్తుతో ఎరుకతో-
నాకు నేను తోడు ఉండగా 
ఇక, వారితో పనేముందని 

సర్లేమ్మని, పోపోనీ లెమ్మని 
తలంచి, తల వంచి ఒక వాలు కుర్చీలో కూర్చునీ కూర్చునీ కూర్చు/నీ కొన్ని లోకాలలోకీ 
కొన్ని కాలాలలోకీ ఊగీ ఊగీ ఊగీ
ఇప్పుడే ఇల్లా లేచాను, పిల్లి వలే  

నెమ్మదిగా, ఏవో నావైన గాయాలను నాక్కునీ నాక్కునీ నాక్కునీ, ఇక ఈ నీ పూటకి 
ఇంత జీరా రైస్ చేసుకుందామని 
తిని రేపటిదాకా మిగులుదామని-

(What are you looking at?
Why don't you go out
And get a beer, and cook some food---)

మరి నీకో, తనకో ఎవరికో, ఎవరెవరికో, మరెవరికో---

By the way
Who told you that
This is a poem? 

29 April 2013

ఎలా?

పచ్చిక గడ్డిపై గుంపుగా వాలతాయి సీతాకోకచిలుకలు

చేతిలో ఒక మధుపాత్రతో, హృదయంలో
ఒక జలదరింపుతో చూస్తాను వాటిని-
ఎండలో తుళ్ళే నీటి తుంపరలో మెరిసే

సీతాకోకచిలుకలనీ, పిల్లలనీ, తూనీగలనీ స్త్రీలనీ మట్టినీ
ఈ నీడల పందిరిలో కూర్చుని
ఒక సంరంభంలోకి మేలుకొని.

ఎలా అడగటం వాటినీ, ఈ మధువునీ
నే రాసే వాటిని అలా
మార్చడం ఎలాగనీ?   

చిన్న విషయం

తల వంచుకుని నువ్వు గదిలోకి వస్తే
చీకటిలో ఒక దీపం వెలిగి, ముఖంపై ఒక తుంపరా, చినుకులు వాలి
రెక్కలు వచ్చి ఎగిరిన
ఆకుల వాసనా, గాలి

నీటి చెలమల్లో దూరి
వలయాలయ్యిన ఒక
చిన్నఅద్భుతమూనూ-

ఆహ్, పెద్దగా ప్రత్యేకమైన విషయం అంటూ ఏమీ లేదు

బ్రతకొచ్చు నువ్వూ నేనూ మరికొద్ది కాలం ఇలా హాయిగా
స్ఖలించినంత సుఖంగా, మరి

ఇలా ఈ లోకంతో నవ్వుకుంటో
ఆడుకుంటో, వెక్కిరించుకుంటో. 

27 April 2013

అది

1
భూమి మీద మిగిలిన ఆఖరి మానవుడు, తపనగా నలుదిక్కులా చూసుకుంటున్నట్టు
దారీ తెన్నూ లేక, తాకగలిగే ఒక అరచేయి లేక
తన నీడనే తాను ఓరిమిగా తాకుతూ కన్నీళ్ళ
పర్యంతం అయినట్టూ తల ఎత్తి చూస్తే కళ్ళలోకి

నిలువెత్తు గునపాల వలే దిగే సూర్యకిరణాలూ, కనుపాపాలని కోసే గాలీ. మరి ఇంతకూ
మనుషులు, తాకగలిగే మనుషులు ఎక్కడ
ఉన్నట్టు?

2
శిధిలాల మధ్య, హృదయాల వంటి బండరాళ్ళ మధ్య, గోడలపై నిలకడగా పాకే లతలు-
నువ్వు వాటిని నీడలు అనవొచ్చు. నువ్వు
వాటిని కరిగిపోని శిలలూ అని అనవొచ్చు-

కొమ్మలలోంచి గూళ్ళు రాలిపోయి, నీకు
ఇరువైపులా గడ్డిపరకలు పీలికలలుగా
తేలిపోయే వేళల్లో, చెట్లపై నుంచి కిందకి
నింపాదిగా దిగివచ్చే సర్పాలు, మరి మెలికలు మెలికలుగా వలయాలు వలయాలుగా-

నువ్వు వాటిని, ఆ గూళ్ళని, నువ్వు ఇన్నాళ్ళూ నిర్మించుకున్న బంధాలని అనుకోవచ్చు
నువ్వు వాటిని, ఆ గడ్డిపరకలని, చేతికీ
చేతికీ మధ్యన ఏర్పడిన ఒక దూరమనే
పిలవొచ్చు. ఇరువురూ గడపలేని ఒక
విపత్కాలాన్నే, నువ్వు ఆ సర్పాలుగా

భావించ వచ్చు, ఆ కాంతిరహిత వలయాలని నువ్వు కాలంగానే భావించవచ్చు. మరి
ఇంతా చేసీ, ఇంతా అనుకున్నా, మారేదేమిటి?

3
తల వంచుకుని, అరచేతుల మధ్య ముఖాన్ని కుక్కుకునీ, సమాధి చేసుకునీ, మరిక
అరచేతులలో చిట్లిన చెమ్మలో, చెమ్మతో
ఈ నాలుగు చిన్న మాటలని, తన తోటి
తనకు లేని మనిషికై రాసుకునే మనిషి-

ఏమని పిలుస్తావు నువ్వు అతనిని? సరే
ఇలా ఒక కవిత అని కూడా అనుకుందాం
ఇప్పటికి:

నువ్వు వొదిలి వెళ్ళాక, తిరిగి నువ్వు వస్తావని, చీకటింట ఒక తల్లి పొయ్యి వెలిగించుకుని
కుండలో ఇన్ని నూకలూ నీళ్ళూ పోసి
ముడుచుకుని కూర్చుంటే, ఎగిసిన ఆ
మంటల్లోంచి గతజన్మలూ గత ప్రేమలూ

తన అనేక జననాలూ, అనేక మరణాలూ, ఇంకా మోయవలసిన అనేక జీవితాలూ చిమ్మాయి-
అనేక శిశు జననాలూ, అనేక గర్భస్రావాలూ
చివికి పిగులుతున్న ఈ శరీర  మందిరంలో
తనకి అనేక కాంతి నదులూ కనిపించాయి-

మరి, అంతా చూసీ ఒక నిర్లిప్తతతో ఎదురు
చూసీ చూసీ, తను అక్కడే నిదురోయింది-
అన్నం ఉడికింది కుండ కాలిపోయింది మరి
నిప్పూ నివ్వెరపోయి ఆరిపోయింది. ఇంతా చేసి, వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు. అరచేతుల్లో
దిగబడిన ముఖాన్ని ఎవరూ వెలికి తీయలేదు-

4
భూమి మీద మిగిలిన ఆఖరి మానవుడు, ఒక శరీరంకై, ఒక మాటకై, ఒక స్త్రీ స్పర్సకై, నీడలని
తవ్వీ తవ్వీ వెదుకున్నట్టు, తనకు

గర్భం లేదనే ఎరుక తొలిసారిగా కలిగి దుక్కించినట్టూ, తాను ఎప్పటికీ గర్భం కాలేనందుకూ
ఈ ధరిత్రిని చెరిచి చంపివేసినందుకూ
ఒక్కడుగా మిగిలి, ఒక్కడుగా రోదించీ

గుండెలను చరచుకుని చరచుకునీ చూస్తే
అంతా ఒక చీకటి శూన్యం, ఒక కృష్ణ బిలం-

5
మోకాళ్ళ మీద ఒరిగిపోతూ మరి నువ్వు
అనుకో అప్పుడప్పుడూ ఇలా, ప్రార్ధించు
అప్పుడప్పుడూ నువ్వు ఇలా:

'నాలుగు మాటలు మాట్లాడే మనిషిని ఆశించే కంటే, వెదికే కంటే, ఎదురుచూసే కంటే, మరి
గోడలకి మేకులు కొట్టుకోవడం చాలా సుఖం.'

నేను ఏం సూచిస్తున్నానో, అర్థం అవుతుందా
నీకు? చేతులలో మేకులతో ఇనుప దిమ్మెతో
అక్కడ వేచి చూస్తున్న నీకు?

6
తిరిగి రా ఇంటికి. అద్దాలు లేని పూలనీ మరి
పక్షులనీ, గాలినీ, వాననీ, వెన్నెలనీ, చీకటినీ

చీకటి వాసన వేసే ఉదయాలనీ, ఉదయాల వాసన వేసే ఉమ్మ నీళ్ళనీ, కన్నీళ్ళనీ నీతో కలిపి
కడుపుతో ఉన్నాను ఇక్కడ. విన్నావా నువ్వు?
విను, ఇక ఒక ఆఖరి పంక్తిని-
7
Amen. 

25 April 2013

అంతే

రాత్రంతా నువ్వు లేని నీ ముఖం
జ్వలిస్తుంది, ఎవరో దాచుకుని దాచుకుని వేసుకున్న చితుకుల మంట వలె.

గుసగుసలాడినట్టు ఇక నెమ్మదిగా ఆకులు కదులుతాయి ఈ ఆవరణలో -
నేను వాటిని గాలిలో రెక్కలల్లార్చే
నీ కనురెప్పలనే పిలుస్తాను.ఇక

ఆ తరువాత సుగంధ ధ్రవ్యమేదో ఒలికి, ఇల్లంతా తెరలు తెరలుగా వాసన వేసినట్టు
గోడలపై నుంచి వెలుపలకి వచ్చి
చుట్టూ అల్లుకునే పిల్లల గీతలు-
నేలపై నుంచి పైకి లేచి, కాంతిలో

అంటుకునే, చాచిన అరచేతుల తడి, కొన్ని మాటలూ మరికొన్ని విప్పిచెప్పలేనివేవో ఈ
సమయపు సరస్సుపై నెమ్మదిగా
తూనిగల వలే వాలి, చలనమేదీ
కలిగించక క్షణకాలం అలా ఉండి

ఎగిరిపోయినట్టు, చీకటిలో క్షణకాలం మిణుగురు పురుగులేవో అతవరకూ చూడని
లోకాన్ని కాంతివంతం చేసినట్టు
నువ్వో నేనో మాట్లాడుకున్న ఆ
అర్థం లేని మాటలే శబ్ధాలే మరి

ఇక్కడ కొంతసేపు, ప్రతిబింబాల వలె, అద్దంపై ఒక మంచు పోర ఏదో కమ్మినట్టగానూ-
ఇక దీని తరువాత ఏం జరుగుతుందా
అని నువ్వు అంటే, ఆహ్ మరేం లేదు

కిటికీలు తెరిచి, తలుపులూ తెరిచి
అద్దాన్ని శుభ్రంగా తుడుచుకుని ఆ
ఆద్ధంలో, తాకలేని లోకాలలోకి చేయి చాచి ఒక మనిషి నిద్రకు ఉపక్రమిస్తాడు. అంతే-! 

24 April 2013

just like that

ఇంట్లో వొంటరిగా గది సర్దుకుంటుంటే, విసుగ్గా పక్కలు తీసి
దుప్పట్లు మడత పెట్టుకుంటుంటే, మరి 
ఎక్కడో నువ్వు కదులాడిన చప్పుడు
మరి కొంత నీ పాదాల వాసనా, ఎవరో

నవ్వినట్టూ, చెట్ల నీడలేవో ఇంటిలోకి వచ్చినట్టూ, ఆకులు
గలగలలాడి అంతలోనే నిశ్శబ్ధమయినట్టూ

ఎక్కడి నుంచో వాన కురుస్తున్న సవ్వడీ
మరి కొంత వర్షపు గాలీ ఇక్కడ. ఇక్కడే

నువ్వు లేని చోట, కొంత భ్రాంతీ కొంత అవిశ్రాంతి మరి కొంత
అసహనమూనూ - మరి ఏం చేయను?
ఏం చేయాలో తోచక, ఇదిగో ఇల్లా ఒక

పదాలతో పంజరాన్ని అల్లుకుంటూ కూర్చున్నాను, వచ్చి
వెళ్ళిపోయిన వానతో, గాలితో తడితో-

క్షమ

నిన్ను ఏమైనా అని ఉంటే, క్షమించు నన్ను

చిన్ని పదాలే ఇవి కానీ, నేల రాలిపోయిన 
గూడు ఇది, వానకి తడచి కిటికీ అంచున 
వాలి

రెక్కలు విదుల్చుకుంటూ, రాలిపోయిన 
గూడు వంక చూస్తూ 
కిచకిచలాడే పిచ్చుక 

పిల్లలే ఇవి. మరేం లేదు, నీడ లేక తిరిగే 
ఒక శరీరం నేలకొరిగిపోయింది. 
ఒక పూవు నేల  రాలింది. ఒక 
కన్ను 

నిన్ను చూసీ చూసే కన్నీరయ్యింది. చిన్నా 
నిన్ను ఏమైనా అని ఉంటె, 
క్షమించకు నన్ను ఇలాగే- 

20 April 2013

తెలుసు కదా నీకు?

గాలిలో గది. మరి గదిలో చీకటి. వాన విసిరిన
ఆకులు రాలి, ఊగే చెట్లు
ఝుమ్మని నీలో నాలో-

నానిన మట్టిలోంచి, చూరు అంచుల పైనుంచీ
నువ్వూ నేనూ తాగే ఈ
జీవితపు కాంతి జలం-

మరి దా, ఈ రావి చెట్ల కిందకు, వడి వడి అడుగులతో

శరీరాన్ని ఒక గొడుగును చేసి
చిందర వందరయ్యిన జుత్తుతో
నుల్చుని ఉన్నాను నీ కోసం.

మరి తెలుసు కదా నీకు తప్పక
నేనూ, ఈ వానా కురిసేదెన్నడో? 

లిఖితం/కవిత్వం

దానికి నువ్వు  అవసరం లేదు కానీ, అది అవసరం నీకు-మరి నువ్వు దానిని

వెలిగించకపోయినా, ప్రతి రాత్రీ
ఆ ప్రమిదెని తీసి, నీ సర్వంతో
దానిని ఒరిమిగా ఇష్టంగా ధ్యానంతో కొంత శాంతితో, నీలో నువ్వు నిమగ్నమయ్యి

ఏ చెట్ల కిందో మరే కాలాల కిందో
దానిని తుడుచుకుని, మరి నీ
ఊపిరితో ఊదుతూ శుభ్రపరచుకుని, ధూళి అంటని వెలుతురులా ఉంచుకోవడం

చాలా చాలా అవసరం. మరి
శ్వాస సోకని మురళి తిరిగి
ఒక చెక్క ముక్కగా మారి, అతడిని ఖననం చేసిన కథా సంగతీ తెలియదా నీకు?  

అర్హత

సరే, ఇటు చూడు:

నువ్వు రాసిన, మరి నేను దాచుకున్న
     గత జన్మల అతి నవీన లేఖలన్నిటినీ దరి చేర్చి 
          ఓపికగా, నీ మోముని అరచేతుల్లో పుచ్చుకుని, ఇక

ఒకసారి ఆఖరిసారిగా చూసుకుని వొదిలి వేసినట్టు

ఈ రహస్య భాషల, నీ శరీరం వొదిగిన కాగితాలని
     నెమ్మదిగా ముక్కలు ముక్కలుగా చించి, పోగేసి
          మంట పెట్టి చూస్తూ కూర్చున్నాను: గాలికి ఎగిసి, మరి

ఆ గాలికే నింగికి తేలే నల్లటి నుసి వలే, నిప్పురవ్వల వలె-

కొబ్బరి చెట్ల మధ్యగా వికసించే జాబిలిని కానరాని, చెట్లు లేని
ఈ ఆధునిక వీధులలో

దారి పక్కగా రాత్రంతా ఊళ పెడుతూ ఇక అతనూ
     ఇళ్ళు లేని వీధి కుక్కలూనూ- ఇక ప్రేమ గురించి
          మాట్లాడేందుకు

నేను ఎవరు, నువ్వు ఎవరు?  

19 April 2013

హృదయ జాలం

ఒక హిమపాతమేదో దహించుకుపోయిన గొంతులోకి జారుతూ ఉంటే
ఒక్కసారిగా లోకం వికసితమయ్యి

కళ్ళకు ఏదో కొత్త కాంతి వస్తుంది
అప్పుడు నీకు: నీ శరీరమే తిరిగి

నీకు ఒక కొత్త ఉత్సాహంతో ఒకానొక
జలదరింపుతో ఎదురుపడుతుంది-

ఇక ఎత్తిన బీరు బాటిల్ని దించి, ముంజేతితో మూతి తుడుచుకుని ఇలా
అంటావు కదా నువ్వు అప్పుడు నాతో:

"దీని తస్సాదియ్యా. ఇక ఇప్పుడు
బ్రతకడమూ చనిపోవడమూ
పెద్ద విషయం కానే కాదు- చూడ్చూడు ఎలా మెరుస్తుందో కాంతికి ఈ
హృదయ జలం. పూలను నమ్మి

ముళ్ళని హత్తుకున్న గొంతిది భాయ్. తాగు తాగు చల్లగా ఉన్నప్పుడే-
రేపటి గుట్టూ ఆ తేనె తుట్టె గుబులూ
ఎవరికి తెలుసు?" అని నువ్వంటే ఇక

నేనేం చేస్తాను?

 (వెన్నెల్లో కూర్చుని రాత్రంతా
కథలతో గీతాలతో నీతో, నిప్పు
రవ్వల కన్నీళ్ళతో, కొంత స్నేహమై కొంత కాందిశీకులమై కొంత అపరిచితులమై అలా
ఎలా అంటే

You know
that is how
one completes a crate of beers, with a pack of smokes--)అది సరే కానీ, మరి

Have you ever
done that, with
or without your clothes? 

A Note/ఆ రాత్రి

"ఎలా చచ్చిపోదామని అని అనుకుంటున్నావు నువ్వు?" అని అడిగింది తను-

hmm....ఆ భగవంతుని 
భావప్రాప్తిలో-" అనే 
అదే చెప్పాను నేను. 

ఇక ఆ రాత్రంతా, రాత్రి చిక్కగా చెమటలు చిందించింది: అచ్చు మా శరీరాల వలే- 

18 April 2013

మరేం లేదు

ఎవరైనా నీలోకి కాళ్ళు జాపి, శిరోజాలు వెనక్కు తోసుకుని
రెండు చేతులూ భూమిపై అలా ఆన్చి
తలను నిర్లక్ష్యంగా వెనుకకు విసిరి

ఆకాశాన్నీ, ఇళ్ళకు వెళ్ళే పక్షులనీ, అలజడిగా కదిలే ఆకులనీ 

అలా నింపాదిగా చూస్తో, చుట్టూ ఉన్న
పిచ్చి మొక్కల పచ్చి వాసనని తమ
గుండెల నిండుగా ఘాడంగా పీలుస్తో

తేలికగా కాళ్ళని నీళ్ళలో ఆడించుకుంటూ కూర్చున్నారా నీలో
ఎన్నడైనా ఎప్పుడైనా? మరేం లేదు

ఒక చిన్న బ్రతికి ఉన్న కాలంలే అది. 

విజ్ఞప్తి

చక్కటి పూవువి నీవు-

ఎండలో, వేపచెట్టు కింద చల్లగా కదిలే నీడల్లానూ, తేలే గాలిలానూ సెలయేరులానూ
ఉంటుంది మరి నీ ముఖం.

చీకట్లో దీపం వెలిగించినట్టు
ఆ వెలుతురులో నీ గదిలో

కూర్చుని నీ అరచేతులని పుచ్చుకుని వాటిలో కాలాన్ని చూసుకున్నట్టూ, మరి
ఆ అరచేతుల్లోనే చిన్నగా
ఒక పిట్టై వాలిపోయినట్టూ

ఉంటుంది లోకం అప్పుడు-
చూడు:మరి నీ ముఖంలోకి

అతి నెమ్మదిగా నా చేతులు ముంచుకుని, ఆ కాంతి జలాన్ని మృదువుగా అందుకుని
మలినమైన నా ముఖాన్నీ
చేతులనీ పదాలనీ చక్కగా

కడుక్కుని కూర్చున్నాను
ఈ గుమ్మం పక్కగా, గోడకి
అనుకుని గోడలపై నీడలతో-

ఇంత అన్నం పెడతావా ఇక?   

14 April 2013

అతి మామూలు దినం

కనులపై నుంచి నీటిపొర ఏదో నెమ్మదిగా తొలిగినట్టు, అతి నెమ్మదిగా
  కాంతివంతమౌతుంది లోకం:

చల్లటి వెలుతురు గాలి వలే వీచి, ఇక ఈ ఉదయాన పచ్చటి ఆకులు
  కొద్దిగా కదులుతూ మెరుస్తాయి. నేలపై రాలిన
  పసుపుపచ్చని ఆకులు నెమ్మదిగా ముందుకు

దొర్లుతాయి, ఒక పసివాడు ఎక్కిన సైకిల్ను
  వెనుకనుంచి తోటి పిల్లలు తోస్తున్నట్టుగా-
  కొమ్మల్లో వాళ్ళు నవ్వుతున్న శబ్దాలు, చిన్నగా సన్నటి ఎండిన
  కొమ్మలు చిట్లి, ధూళి ఏదో రాలుతున్నట్టు

నువ్వు నిండారా తెరిచి చూసుకుంటున్న నీ
  అరచేతుల్లో కొంత సాంద్రతతో తొణికిసలాడే
  నీళ్ళ వంటి నీడలు: ఒకసారి, నీ ముఖాన్ని ఆ నీడలతో కడుక్కుని
  ఆ ఆవరణలో ఆ కుర్చీలో ఒళ్ళు విరుచుకుని

మళ్ళా ఒద్దికగా ముడుచుకుని కూర్చుంటున్నప్పుడు, ఇక నీకు
  తొలిసారిగా బ్రతికి ఉన్నావాన్న స్పృహ. కొంత
  లోతైన ఆనందం. ఎక్కడున్న వాటిని అక్కడే ఉండనిచ్చి, వేటినీ
  మార్చాలని చూడక, సర్వాన్నీ అలా చూస్తూ

ఉండే ఒక చర్య. ఒక మామూలు దినచర్య. ఆహ్, ఇంతకూ ఇదంతా 'ఏమిటీ'
  అని నువ్వు అడిగితే ఇలా చెబుతాను:

ఏమీ లేదు. ఈ ఉదయాన ఇలా లేతగా
  లేతెరుపుగా వికసించిన పసికళ్ళ వంటి ఈ పూవులు సాయంత్రానికి
  రాలిపోతాయి- రాత్రిలోకి కనుమరుగవుతాయి
 
అందులో తప్పేం ఉంది?      

ఒక జీవితం

"నువ్వు ఏమైపోయావో తెలియదు, ఎప్పుడు వస్తావో తెలియదు
  ఇలా ఎలా? కనీసం పిల్లలకైనా మిగలవా?" అంది తను అలసటగానూ
  మరి కొంత విసుగుతోనూ. కూర్చున్నాడు అతను

మాట్లాడకుండా బాల్కనీలో, గోడలపై కదిలే నీడలనీ
  అల్లుకున్న తీగకి, ఆకస్మికంగా వీచిన ఒక చిన్న గాలికి కదులాడే ఆకులనీ
  చూస్తూ: ఆ తరువాత నెమ్మదిగా

అడుగుతాడు అతడు: "దీనిని మనీ ప్లేంట్ అని ఎందుకు అంటారో తెలుసా నీకు?"

ఇక అప్పుడు
ఎవరో ఆ చీకట్లో, బావిలోకి బిందెను ముంచిన
  చప్పుడు. దూరంగా, అతను తరచూ కలగనే
  తనలోనే తనకు మాత్రమే తెలిసిన ఒక రహస్య ప్రదేశంలో అలలు అలలుగా
  వీచే రావి కొమ్మల అలజడీ. భూమిపై నుంచి

సాయంత్రంలో చిన్నగా మట్టి లేచి, అలా కాగితంలా గాలిలో తేలి, తిరిగి నెమ్మదిగా
  నేలపైకి సర్దుకునే ఒక చిన్న సందడి. కొంత
  నిర్లిప్తతా కొంత శాంతీ ఇంకొంత అలసటానూ-

ఇక నెమ్మదిగా చీకట్లోంచి లేచి, కనురెప్పలకి అంటుకున్న నిన్నటి రాత్రిని 
  ముంజేతులతో తుడుచుకుంటూ ఇలా అడుగుతాడు
  అతడు చిన్నటి గొంతుతో -

"పడుకున్నారా పిల్లలు? అడిగి ఉండను ఎన్నడూ కానీ, ఇంతకూ అన్నం
  తిన్నావా నువ్వు?" 

13 April 2013

ఒక

ఎక్కడో చీకట్లో ముడుచుకుని ఉంటావు నువ్వు దుప్పట్ల కింద
  నుదిటిలో దిగే గాజు ముక్కలతో: బాహువులంత భయం, ఎడారులంత దాహం
 
అప్పుడు నీకు-

చిన్న సవ్వడులే మృత్యు శబ్ధాలు అయ్యే వేళ అది.
 
గజిబిజిగా రూపాలు కళ్ళ ముందు మెరిసి, నిను తాకి వెళ్ళిపోయే కాలమది.
 
ఇక అప్పుడు

అ గదిలోకి, నీ చీకట్లోకి ఎవరో వచ్చి దీపం వెలిగిస్తే,  ప్రాణంజలి వంటి ఆ కాంతిలో

నీ నుదిటిపై తను చల్లగా అరచేయి ఉంచితే, తన శ్వాసలోంచి నీ ముఖంపైకి వీస్తుంది
 
వర్షపు ఆగమన గాలి ఒకటి చెట్లు ఊగే ఆకుల కలకలంతో- ఇక నువ్వు, తన చేతిని
 
గట్టిగా పుచ్చుకుని, నువ్వు బ్రతికి ఉన్నావని రూడీ చేసుకునేందుకు

తూట్లు తూట్లు పడి, రెండు రోజులుగా ముద్దన్నం మింగుడు పడని వొణికే గొంతుతో
 
కొద్దిగా సం/దేహంగా  అడుగుతావు: "నిజంగా, నువ్వేనా?" అని.
 
సరిగ్గా అప్పుడు, సరిగ్గా అప్పుడే

రాత్రంతా నువ్వు నెత్తురూ, మధువూ కక్కుకుని విలవిలలాడిన, మబ్బులు
 
కమ్ముకున్న ఆ గదిలో, చిన్నగా చినుకులూతడచిన పచ్చిగడ్డి వాసనా, మరి
 
రెక్కలు తెగి తూనీగలు రాలిపోయే మెత్తడి సవ్వడీనూ. చాచిన

నీ మునివేళ్ళకి అంటుకునేచితికిన తన కళ్ళ తడీ. నీ చుట్టూ నిస్సహాయంగా
 
అల్లుకునే తన చేతుల అలజడీ, కొంత కరుణా కొంత నొప్పీనూ-ఇక
 
ఆ తరువాత ఆ దినమంతా

నీ హృదయంలో వెలుగుతూనే ఉంటాయి - నిన్ను తమలోకి పొదుపుకున్న-
 
తల్లి దీపాలైన తన వక్షోజాలు, కొంత శాంతియై కొంత జీవన వాంఛయై
 
చినుకుల చివరన

వేలాడే కాంతి గింజలై, మట్టి పూలై. ఇక, నీ గది గోడలపై, ఆ వెలుతురూ నీడలలో
 
గోడలని కరచుకున్న అన్నం మెతుకులలోంచి తెల్లటి పురుగులు రెక్కలు విప్పి
 
ఎగిరే నీ కాలాంతపు వేళల్లో, ఒక గగుర్పాటుతో

ఒక్కసారిగా నీకు బ్రతకాలనిపించి, మరొక్కసారిగా ఈ లోకాన్ని చూడాలనిపించీ
 
మృత్యువు తాకిన నీ కళ్ళను కొద్దిగా తుడుచుకుంటూ చెబుతావు కదా
 
తనకి అప్పుడు:

"
మమ్మూ, వొదలకు నన్ను. వొదిలి వెళ్ళకు నన్ను. బ్రతకాలని   ఉంది నాకు. ప్లీజ్-"    

నాన్నా నువ్వొస్తావా?

ఇంటికి వస్తూ ఉంటె, ఎదుర్రాయి మోదుకుని
కాలి గోరు చీలిపోయింది - పాపం పిల్లవాడు
కళ్ళంతా నీళ్ళు, పెదాలపై వణుకు. చేతితో 

కాలి బొటన వేలు పట్టుకుని, తల ఎత్తి చూస్తే 
కనుచూపు మేరా ఎర్రటి ఎండా, నిర్దయగా నడచిపోయే మనుషులూ
నీళ్ళు లేక, గోరు లేని, మాంసపు ముద్ధలా మారిన కరకు కాలమూ-

ఎత్తుకోలేదు ఎవ్వరూ, అడగలేదు ఎవ్వరూ 
వెక్కిళ్ళతో, మట్టి కలిసిపోయిన రక్తపు వేళ్ళతో, ఏడ్చుకుంటూ కుంటుకుంటూ
ఆ బాలుడొక్కడే రహదారంతా, తల్లినీడ లేని

లోకాలలో, అప్పుడు అక్కడ స్పృహ తప్పే 
క్షణాలలో, బాహువులలో తురుముకుని 
తనకి అనంతమైన ధైర్యం ఇచ్చే మట్టివంటి నాన్న వెన్నెల చేతులకై చల్లటి చినుకులకై- 

ఇక ఇన్నేళ్ళ తరువాతా ఇంత 
ఎదిగీ ఇలా అడుగుతున్నాడు ఆ బాలుడు బేలస్వరంతో, తండ్రి లేని ఖాళీ అరచేతులలోకి 
తన ముఖాన్ని కుక్కుకుంటూ:

"నాన్నా, ఈ లోకమొక ఎదుర్రాయి
మోడుకునీ మోదుకునీ, ఈ హృదయం చిట్లి చితికి నల్లటి నెత్తురు పూవయ్యింది. రాలి 
పోయే వేళయ్యింది.మళ్ళా నువ్వు 

ఎప్పుడు వస్తావు నాన్నా నన్ను 
హత్తుకునేందుకూ, మందు రాసి 
కట్టు కట్టి, అన్నం పెట్టి నీళ్ళు తాపి జ్వర తీవ్రతతో మూలిగే నన్ను పడుకోపెట్టేందుకూ?" 
అని.

ఇక ఆ రాత్రంతా వర్షం పడగా ఆ 
గదిలో ఆ యాభై ఏళ్ళ పిల్లవాడు
దిండుని గాట్టిగా కౌగలించుకుని 

ఉరుములకీ మెరుపులకీ ఉలిక్కి పడుతూ, కలవరింతలతో ముడుచుకుపోయాడు, ఒక 
మృత్యు భీతితో, ఒక తండ్రి జ్ఞాపకంతో
ఎన్నటికీ తను కాలేని తండ్రితనంతో-

చూసుకున్నావా నువ్వు, మోదుకుని 
రాలి నెత్తురోడిన, నువ్వు మరచిన నీకు 
అన్నీ చేసీ చేసీ నిను కాపాడీ కాపాడీ తన 
నెత్తురంతా ఇంకి రాలిపోయిన, ఎక్కడా మిగలక ఎవరికీ ఏమీ కాక వెళ్ళిపోయిన నీ చిన్నారి నాన్ననీ?