28 February 2013

ఫిబ్రవరి 28, 2013 సాయంత్రం

ఫిబ్రవరి 28న సాయంత్రం నాడు, ఇక ఈ దినాన్నీ ఈ మాసాన్నీ
     ఎలా ముగించాలా అని మల్ల గుల్లాలు పడుతూ ఉంటే, ఫిరోజ్ వచ్చి
తన అరచేతుల్లో అల్లుకున్న గూటిలో

అపురూపంగా ముడుచుకుని పడుకుని ఉన్న, లేత రంగుల
     శాంతి తళుకుల ఆ అందమైన గబ్బిల్లాన్ని చూపిస్తో అంటాడు:
తెలుసా నీకు? ఎలాంటి వాసనో దీనిది?

పచ్చి ఆపిల్ పళ్ళ వనాల వాసన, కమ్మనైన రుచి
     వణికే పెదాలు, మరి లేత ఎరుపు కనులూ తనవి. ఒక్కసారి
ముద్దిడి చూడు. మరిక వదలవు దానిని

దా, దా. మన ముగ్గురమూ కలిసి నిదుర లేచి అలా
     రాత్రి లోకాలలోకి వెళ్లి, నక్షత్రాలని వెదజల్లి వచ్చే సమయమయ్యింది.
 తెలుసు కదా నీకు, ఈ Smirnoff, మరి నా ఫరీదా

దొంగ నాటకాలతో, దొంగ నీతులతో పిరికి ప్రియుళ్ళకై వేచి చూసే
     ఓపిక లేని వాళ్ళనీ. రా మరి. ఆలస్యం చెయకు. స్నేహితుల తోడు లేక
ఈ అమృతాన్ని విషాన్ని చేయకు. రా, రా. ఆలస్యం చేయకు

నీ హృదయాన్నీ, నోటినీ శుభ్రంగా కడుక్కుని రా " అని అంటే

ఈ పిబ్రవరి 28, 2013 సాయంత్రం ఈ రాత్రీ ఈ దినం ఎలా ముగియబోతుందో
     నాకు అయితే అర్థం అయ్యింది . మరి మీకూ? 

వై డోన్ట్ యు

కాఫీ తాగుతావా?

వై డోన్ట్ యు బై మీ ఎ బియర్?

పోనీ, టీ?

ఫోర్గేటిట్. నేను అడిగిన దానికి జవాబు చెప్పు ముందు-

పోనీ కలిసి డిన్నర్ చేద్దాం-

చేద్దాంలే, ఇద్దరం కలసి 
ఏదో ఒకటి, ఎలాగోలాగా 
కానీ వై డోన్ట్ యు బై మీ ఎ బియర్?
జస్ట్ ఎ బియర్?

ఇక అందుకని, చెరో క్రేట్ 
బియర్స్ తెచ్చుకుని 
కూర్చుంటే, అ గదిలో 

చీకటి కాగానే మొలిచింది ఒక చందమామ 

ఎర్రటి కళ్ళతో, నవ్వుతో
తన తెలతెల్లటి కాళ్ళతో 
నెమ్మదిగా విచ్చుకునే ఒక నెత్తురు మొగ్గై 

నను గాట్టిగా కౌగలించుకుంటో. అది సరే కానీ   

ఈ రక్త పిపాశుల కథ మీకు ఎందుకు కానీ  

వై డోన్ట్ యు 
గెట్ లాస్ట్ ఫ్రం              
దిస్ white white page filled
with beers 
and later
her tears?

26 February 2013

అనిశ్చితి


తనకి తెలుసు, ఈ నగరమొక రహస్య మృత్యు కుహరమని
    మానవ రుచి మరిగిన, పొంచి ఉన్న ఒక వ్యాఘ్రమని- అందుకనే

ప్రతీ ఉదయం, రెల్లు దుబ్బల్లా సూర్యకిరణాలు రెపరెపా వీచే వేళల్లో
     తన కళ్ళల్లో కొద్దిగా అలజడి: వంట చేస్తున్నంత సేపూ
     ఆపై, నీకై తను బాక్సు సిద్ధం చేస్తున్నంతసేపూ కొంత
     దిగులు సవ్వడి. అన్యమనస్కంగా కదులుతూ తనలో
     తానే ఏదో మాట్లాడుకుంటుంది తను

తనకు తానే ధైర్యం చెప్పుకుంటున్నట్టూ, తనను తానే ఒదార్చుకుంటున్నట్టూ-

అంతా చేసి ఇక నిబ్బరం పట్టుకుని, నువ్వు వెళ్ళే సమయానికి
     పమిటెతో ముఖం తుడుచుకుంటూ నీ చేతికి బాక్సు అందించి
     ఒక బలవంతపు చిరునవ్వుతో "వెళ్లిరా. జాగ్రత్త" అని అంటుంది
     కానీ లోపలే ఎక్కడో మొక్కలు, పూలూ పిట్టలూ గాభరాగా విసవిసా మంటూ
     పిచ్చి గాలితో, ఈకలు ఎగిరే రెక్కలతో కొట్టుకుంటున్న చప్పుడు-

"తొందరగా వచ్చేస్తాను" అని నువ్వు చెబుతావు కానీ, ఇక దారి పొడుగూతా

పల్చటి నీటిపొర అలుముకున్న తన కనులు వాసనే నీ చుట్టూతా
ఆ దినమంతా, నీ లోకమంతా నీ కాలమంతా
రెండు వొణికే చేతులై, బేలగా తాకే తన పెదాలై

నీ చిట్టి పిల్లలై, నీ ముసలి తల్లై తండ్రై, చివరికి
ఎవర్నీ ఏమీ అనలేని ఇళ్ళు లేని మహాకాలమై-  
_______________________________________________________________________
When I wrote this on 21st of January 2013, it was purely 'my' personal experience. And now, with a sad heart I see this feeling reflect in many of the households  of my friends and acquaintances with minor variations. Yes. Sometimes, someone whimpers deep within my heart.

వెళ్ళిపో.

వెళ్ళిపో.

ఆర్చుకుపోయిన కడుపుతో, అన్నం లేక సాగిన అరచేతితో
మలినమైన ఈ నగరపు సరస్సు ఒడ్డున
నింపాదిగా అంటుకుని, తగలబడుతున్న

కళ్ళతో, నాసికలతో పెదాలతో పాదాలతో వక్షోజాలతో చేతులతో
ఎముకలతో, రోదనలతో నువ్వే చివరికి.

వెళ్ళిపో.

పాలివ్వలేని, ఒక తల్లి చూచుకం కాలేని, ఖాళీ ప్రతిధ్వనిలతో
కళకళలాడే

కంకాళాల మహా నగరం ఇది అని తెలియదా నీకూ, నాకూ?
వెళ్ళిపో

ఎక్కడో
మరలా
బాంబులు పేలి, నీ నోటి వద్ద మిగిలిన ఒక అన్నం ముద్దలోకీ
నీ కళ్ళల్లోకీ

నెత్తురు చింది, మరొకసారి నువ్వు చచ్చిపోయే వేళయ్యింది. 

నలుపు

ఈ వేళ ఒక నలుపు షర్టుతో, ఒక నలుపు పాంటుతో
నల్లని సూర్యుని కింద, నల్లని పదాలతో నేను - ఆహ్.

ఏమిటంటావా ఇది?
ఏమీ లేదు. నిట్ట నిలువునా చీలిన ఛాతిలోకి ఒక బిందువు
రాలిపడి, ఇక అంతా

వలయాల ప్రకంపన.

ఏమిటా అని శరీరంలోకి తొంగి చూడకు, చివరికి
ఈ నెత్తురు చుక్కలూ
ఓపలేని నల్లటి సెగలై

దహించుకుపోయి, ఎగసిపోయే బూడిద రేణువులైనాయి:

(-ఇంతకూ
నువ్వు అనుకుంటున్న వాళ్ళు, ఎవరూ లేరిక్కడ
శతాభ్ధాల కరుణ ముద్రికతో-)

ఇక ఆపై ఏమౌతుందో ఎవరికీ తెలుసు?   

25 February 2013

ఎరుపు

చెట్లని పట్టుకుని, మసక చీకట్లో ఊగుతాయి ఈ వాన చినుకులు ఆకుల్ని వదలకుండా
     అప్పుడొకటీ అప్పుడొకటీ ఆకస్మికంగా నీ మెడపై రాలి
     నీ శరీరాన్ని ఒక గగుర్పాటుకి గురి చేస్తో: ఇక నువ్వు

చక్కగా నీ చేతులు చుట్టూ చుట్టుకుని, కొంచెం వెచ్చగా మరి కొంత ఇష్టంగా మారతావు
     ఉదయం నుంచీ గుండెను తవ్వుతున్న ఒక ఎర్రటి జ్ఞాపకం
     నుంచి తప్పించుకుని: ఇక అప్పుడు మరి ఎందుకో నీకు

గుర్తుకు వస్తాయి పూవులూ. గుర్తుకు వస్తారు పిల్లలూనూ. గుర్తుకు వస్తారు
     వెన్నెల శాలువాలని కప్పుకుని, చుక్కల జూకాలతో కొంత దిగులుతో
     చీకటిలో, రాజప్రసాదాల్లో తిరిగే అన్యమనస్కులైన ఆ స్త్రీలూ

ఒకప్పుడు నీ గదిలో వాళ్ళు వెలిగించిన అగరొత్తుల పరిమళంతో: ఇకప్పుడు
     ఆ సన్నటి ధూప దారాలు సర్పాల వలే పాకి, నీ మెడకి ఉరితాళ్ళయ్యి
     బిగుసుకున్న కాలమూ గుర్తొచ్చి ఉలిక్కిపడతావు. సరిగ్గా ఆప్పుడే

ఆ చెట్ల కింద, సన్నటి నీళ్ళల్లో ఎవరివో కనులు కనపడుతున్నప్పుడే
   
నీ మెడపై ఎవరివో మెత్తటి వేళ్ళ స్పర్స: వెనుక నుంచి, నీ చెంపపై ఎవరిదో
     వెచ్చటి శ్వాస: కనిపించని పాదాలు నీ వెన్నంటే సాగే సవ్వడి-
     బురదలోకి కాలి వేళ్ళు సన్నగా దిగుతూ చేసే కాలి గజ్జెల అలజడి. ఇక

ఒక జలదరింపుతో, విభ్రాంతితో వెనుకకి తిరిగి చూస్తావా నువ్వు, చల్లగా రాలుతూ
     ఆకులూ, వాటి వెంట వలయాలు తిరుగుతూ ఒక గాలి: పైన ఎక్కడో ఆకాశం
     ఒక నల్లటి వస్త్రాన్ని విదుల్చుతుంది, మ్లానమైన నీ హృదయంపై కప్పేందుకు. ఇక
   
ఆ తరువాత ఈ భూమి, నిన్ను దాచుకునే ఒక సమాధీ. ఈ రాత్రి

నీ శిరస్సు వద్ద ఉంచేందుకు, నిన్ను ఇష్టపడ్డ వాళ్ళెవరో, తమ
నెత్తురులోంచి పదిలంగా వెలికి తీసిన ఒక శ్వేతపుష్పమూనూ-
   
సరే. సరే. తల తిప్పి చూడు, నీ చుట్టుపక్కలా నీకు ఇరువైపులా

ఆ తుమ్మముళ్ళ చెట్ల కింది నీడలు, నిలువ నీడ లేకుండా
                                                               నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోతున్నాయో!

24 February 2013

ఏమీ లేదు

ఎలా ఉన్నావు నువ్వు? తను అడిగింది, నుదిటిపై చేయి ఉంచి- 

ఏమీ లేదు. ఇంటి ముంగిట్లో పూవు ఒకటి రాలిపోయిన సవ్వడి. 

లోపల ఎక్కడో నీటిపై వాలిన తూనీగ పాదాలు గీసిన 
వలయాల అలజడీ.  

వీచే గాలులలో తేలిపోయే పసుపచ్చ ఆకుల అంతిమ అలికిడీ: ఇక 

ఇద్దరు ప్రేమికులు ఏళ్ళ తరువాత ఎదురుపడి
స్థాణువయ్యి, అలా నిలబడి నిశ్శబ్ధమయినట్టు
ఒక తొలి కలయిక వలే ఒక చివరి చూపు వలే

చాలా యధాలాపంగా, కూర్చుని గోడలపై నీడలను తదేకంగా చూసే ఓ  
మూడింటి రాత్రివి నువ్వు కాగలిగితే, నిన్ను నువ్వు 
పక్కన పెట్టుకుని ఎప్పుడైనా నన్ను చూడగలిగితే---

ఏమీ లేదు.  నాతో నేను మాట్లాడుకుంటున్నాను, పగులుతున్న

ఈ రాత్రి లాంతరు కటిక చీకట్ల కాంతి కింద- 

19 February 2013

ఒక ఉనికి

ఇలా ఎప్పుడైనా ఉన్నావో లేదో నాకు తెలియదు-

నూనె తరిగి, వొత్తి వొరిగి
రాలిపోతుందీ
దీపపు కాంతి.

ఇక ఒక మహా చీకటి, నీడల్లోంచి నీ వైపు చేతులు చాస్తే

గాలిలోని చెమ్మని పుచ్చుకుని
కంట నీరు పెట్టుకుంటుందీ
నీ ఇంటిలోని ఒంటరి కిటికీ-

ఇక అప్పుడు ఆ చీకట్లో నువ్వు ముడుచుకుపోయి, నీ
తలను, నీ రెండు
అరచేతుల మధ్య

మౌనంగా పూడ్చుకుని, తిరిగి ఉదయాన నీ తల ఎత్తితే

నుసి నుసిగా రాలే ఎండలో, నీ ఆద్దంలో ఒక కపాలం నీ
శరీరంలో ఒక
అస్థిపంజరం-

ఇంతకూ ఎవరది?
ఇంతకూ, ఏమని
పిలుస్తావు నువ్వు దానిని? ఏమని చెబుతావు వాళ్లకి?  

18 February 2013

రెండవ అధ్యాయం *నాహిద్ కథ*

చాలా కాలం క్రితం: ఎంత దూరమైన కాలం అంటే, ఇంకా ఇక్కడే ఈ క్షణానే ఉండినంత దగ్గరగా ఉన్న దూరమైన కాలంలో తన ఇంటి ముందు ఉన్న బాదం చెట్టు కింద కట్టి ఉన్న రాతి వలయంపై అతను కూర్చుని ఉన్నప్పుడు ఆమెను తొలిసారిగా గమనించాడు. అది ఆమె ఉండే ఇల్లు. ఆమె కూడా అతనిని గమనించింది కానీ, పరిశీలించలేదు. ఆమె గేటు తీసుకుని బయటకు వెళ్ళిన క్లుప్త సమయంలో సుదీర్ఘంగా, సాధ్యమైనంతగా ఆమె రూపాన్ని కళ్ళతో అనువదించుకున్నాడు. ముఖ్యంగా తన వదనం

తెల్లటి తాకిడి కలిగిన కాగితం, కాగితపు మెత్తదనం కలిగిన జాబిలీ. మాట్లాడే వెన్నెల. ఆ తరువాత కనులు. వరి పొలాలు హోరున వీచే కళ్ళు. అప్పుడతను గ్రహించలేదు: తన ముందే ఆ రెండు కళ్ళూ రెండు కమిలిన నెత్తురు బావుల్లా మారి నెమ్మదిగా, మరణపు సరిహద్దుల దాకా గడ్డ కట్టుకుపోతాయని.

---కళ్ళు తెరువు. ఒక్కసారి. నువ్వెందుకు కళ్ళు మూసుకుంటున్నావు? ఒక్కసారి, కనురెప్పలను గట్టిగా తెరువు... మరణించకు,  వొదిలి... వెళ్ళిపోకు...ఒక్కసారి, ఒకే ఒక్కసారి కదులు, కనీసం చేతి వేళ్ళనైనా కదుపు...ఒక్కసారి. ఒకే ఒక్కసారి---

పాలిపోయిన ముఖంతో ఆసుపత్రి గది. మందుల వాసన. అదోరకమైన అనిశ్చితమైన వాసన. ముఖానికి ఊపిరిని అందించేందుకు ప్రయత్నిస్తున్న ఆక్సీజన్ మాస్క్.నరాలలోకి దిగబడిన సూదులు. అతను పాలిపోయిన ముఖంతో తన మంచం పక్కగా నిలబడి ఉన్నాడు. అదే సూర్యరశ్మి. పల్చటి తెరలానూ, తేలికయిన బంగారపు రంగుతో, కిటికీలోంచి సాలెగూడు వలే లోపలి అల్లుకునే సూర్యరశ్మి. అదే గాలి. మృదువైన గాలి. సిక్నెస్. పరచితాపరచిత వాతావరణం. ఈ దృశ్యాన్ని ఇంతకు మునుపే ఊహించాడా? ఇంతకు మునుపే జీవించినట్టు: ఈ జీవితమంతా ఈ సమయమంతా ఈ క్షణాలన్నీ ఇంతకు మునుపే గడిపి మరొక్కసారి, లేదా అనేక సార్లు తిరిగి జీవిస్తున్నట్టు, ఒక ఘాడమైన సిక్నెస్ లాంటి అనుభూతి.

---నువ్వు కళ్ళు తెరవాలి. నువ్వు ఎలా కళ్ళు మూసుకోగలవు? నువ్వొకసారి కళ్ళు ఎందుకు తెరవవు? ఒక్కసారి, ఒకే ఒక్కసారి, నీ కనురెప్పలను ఎందుకు విప్పవు? ఒక్కసారి, ఒకే ఒక్కసారి, బలంగా గాడంగా నీ కళ్ళను ఎందుకు తెరవవు? కనులు తెరువు ఒక్కసారి, లేదా నేను వాటిని నా నెత్తురుతో తడుపుతాను నీ కనుపాపలు కనిపించేదా కా: నేనొక ఉన్మాదిని, కళ్ళు తెరువు నువ్వు, ఒకే ఒక్కసారి---

ఈ ఆసుపత్రి. ఆ గోడలు. సమాధులలోంచి నిల్చోబెట్టినట్టు. ఈ గోడలనూ, ఈ మందులనూ ఈ మంచాన్నీ ఈ ముఖాలనీ ఇంతకు మునుపు చూసాడు. చాలా చాలా దగ్గరిగా. ఎక్కడ? అతను సంఘర్చించుకున్నాడు, బలంగానూ అసహనంగానూ అశాంతిగానూ, ఈత రాక నీట మునుగుతూ ఊపిరికి తన్నుకులాడే మనిషిలాగా.

నాకు అబార్షన్ అయ్యింది: ఒకసారి. నాన్నకు తెలియదు. ఏం జరిగిందో, నాకూ తెలియదు. అన్నయ్య స్నేహితుడు . రాత్రి. అమ్మా నాన్నా లేరు. నిశ్శబ్దం. బాధ కూడానూ. అతను...నాకు ఏం జరుగుతుందో కూడా తెలీలేదు. నొప్పి ఒక్కటే. ఇప్పుడు కూడా నొప్పే తలచుకుంటే...ఆ చీకటి భయం. ఇప్పుడు కూడా, రాత్రి పూట అప్పటిలాంటి చీకటి చుట్టుకుంటే భయం వేస్తుంది. బాధ వేస్తుంది. నొప్పి కూడానూ. ముఖ్యంగా ఆ ఆసుపత్రి గదులు, ఆ మందుల వాసనా, మరీ ముఖ్యంగా ఎదగని పిండం: ఇంకా చేతులూ కళ్ళూ కాళ్ళూ సరిగ్గా ఏర్పడని పిండం. అప్పుడిక నేనే ఒక పిండం అయ్యీ...
         
ఒక లేత స్పర్శ. ఒక చెమ్మగిల్లిన నయనం. బరువుగా జారిన కన్నీటి చుక్కలు కూడానూ. మరి అతను ఏం చేసాడు? అతని ఎదురుగా కూర్చుని, తన గాయాల్ని ఆమె అతని ముందు విదిల్చినప్పుడు అతను ఏం చేసాడు? ఆమె మౌనంగా తల వంచుకుని, ఆ చెట్ల కింద, ఆ నీడలలో ఎక్కడో కలుక్కుమంటున్న నొప్పితో మౌనమైనప్పుడు, తనే నీడ లేని ఒక చెట్టుగా మారిపోయింది. అతను ఆ గాయాల వృక్షం కింద కూర్చుని తల ఎత్తి ఆమె వైపు చూసాడు: అవే కళ్ళు. కళ్ళల్లో అవే నదులు. ఆ నదులలో తేలిపోతున్న తన శరీరం. సంతోషాన్నీ దుక్కాన్నీ విషాదాన్నీ బాధనీ అంతం లేని నొప్పినీ, శరీరంపై జరిగే అత్యాచారాల్నీ, శాంతినీ అశాంతినీ, అసంఖ్యాక కోతల్నీ చంపుకోలేని ప్రేమల్నీ వొదులుకోలేని మనుషుల్నీ, గాయపరచ లేని ప్రియుళ్ళనీ ఇంకా అనేకానేక విషయాలని దాచుకున్న శరీరం. విషయాలయ్యిన శరీరం. ఆ శరీరం ఒక యుద్ధ ప్రదేశం. అల్లకల్లోలమైన ఒక సముద్రం. మరొక రోజు మరొక సమయంలో ఉద్వేగంగా శాంతిగా కాంతిగా కదులాడే ఉషోదయపు సూర్యరశ్మి: తన శరీరం.

---నువ్వు ఎలా తీసుకోగలవు ఇంత దుక్కాన్ని, నీలోకీ, నీ శరీరంలోకీ?---

ఒక నగ్న దేహం మధ్యాహ్నపు సూర్య కిరణాల వొత్తిడికి అతని పక్కగా కదిలింది. ఒక చిరునవ్వులా కూడానూ. తన చేయి చల్లగా అతడిని దగ్గరగా హత్తుకుంది. దగ్గరగా. మరింతగా దగ్గరగా, ఎంతగా అంటే తన రక్తంలో కలుపు కునేంతగా: తను ఇలా అంది అతనితో.

నన్ను వదలకు. నన్ను వొదిలి వెళ్ళకు. నాకు ప్రేమభరితమైన జీవితం లేదు. నాకు ప్రేమ కావాలి: రోజూ.  నన్ను నన్నుగా , నా శరీరాన్నీ నన్నూ, ఈ పెదాలనీ పాదాల్నీ పదాలనీ ప్రేమించు. నన్ను వొదిలి వెళ్ళకు. నేను ఎవరిని నమ్ముకుంటాను? నమ్మిన ప్రతీసారీ గాయపడ్డాను. తిరిగి కోలుకోలేనంతగా, తిరిగి ఈ లోకం లోకి రాలేనంతగా తిరిగి మనుషులపై ప్రేమనూ, నమ్మకాన్నీ పెంచుకోలేనంతగా గాయపడ్డాను. శ్రీ, నేను మనుషులని నమ్ముతాను. నేను మనుషులని ప్రేమిస్తాను. ఇన్ని గాయాలు నా శరీరాన్నీ హృదయాన్నీ కోసివేసినా నేను జీవితాన్నే నమ్ముతాను. నిన్ను ప్రేమిస్తాను. నన్ను వొదిలి వెళ్ళకు-ఎన్నటికీ.  

మరొక రోజు. మరొక సమయం. మళ్ళా తన శరీరం నిండా లెక్క లేనన్ని కోతలు. అతడు ఆ వేళ వాటిని లెక్క పెట్ట దలుచుకున్నాడు. తన గాయాలలోంచి పూల సుగంధాల సీతాకోకచిలుకలని నిర్మించి ఇవ్వదలిచాడు. కానీ అన్నిటి కంటే ముందు ఒక ప్రాధమిక ప్రశ్న: ప్రేమ అంటే ఏమిటి? అదొక కాలమా? అదొక భాషనా? అదొక నిశ్శబ్ధమా? రేపు - ఒకప్పుడు మనం బ్రతికి ఉన్నామని- గురుతు చేసుకునేందుకు, మనం ఇప్పుడు చేసుకునే ఒక గాయమా? అతని తోచలేదు. గాయాలలోంచి ఒక ఇళ్ళు  నిర్మించి ఇవ్వడం ఎలాగో, ఇంటికి రెక్కలు తొడిగి, మృదువుగా నిమిరి అలా గాలిలోకి వొదిలి వేయడమెలాగో అతనికి తోచలేదు. తను అడిగినది ఎలా ఇవ్వాలో, ఎలా సాధ్యమో తెలియక అతనికి దిక్కు తోచలేదు. అతను, తెలుసునేందుకు ఆమెని వొదిలి, ఆమెను మళ్ళా గాయపరచి పారిపోక మునుపు ఆ ముస్లిం గులాబి ఇలా కూడా అంది:

మనుష్యులని ప్రేమించకుండా నేను ఉండలేను శ్రీ. నాకు తెలియదు ఎందుకో కానీ, ప్రేమించకుండా, ప్రేమించి గాయపడకుండా నేనుండలేను. నేను మనుష్య్లని ఇష్టపడతాను: వాళ్ళ వైరుధ్యాల తోటీ, విశ్వాసఘాతాల తోటీ, వాళ్ళ నిర్ధయాల తోటీ, ద్రోహాల తోటీ నేను వాళ్ళని ఇష్టపడతాను. శ్రీ, నిన్ను ఇష్టపడతాను. నువ్వు నా పట్ల చూపించే ప్రేమా కన్సర్న్ రేపు ఉండక పోవచ్చు. రేపు నువ్వు నన్ను ఇంత ప్రేమగా రమించక పోవచ్చు. ఒట్టి శారీరక సంబంధం మాత్రమే మన మధ్య ఆఖరి వెలుతురై ఊగిసలాడుతుండవచ్చు. అది ఎప్పటికీ సాధ్యమే: ఎప్పటికీ శాశ్వతమైన సంబంధాన్ని నేను ఊహించ లేను. కానీ, ఆశించడం? ఎలా దీనిని ఆపడం?

---కనులు తెరువు. మరణించకు. ఒక్కసారి కనులు తెరువు. చూడలేను ఈ తెల్లని గోడలు. కాంచలేనీ కరుణ లేని పడకలు. వెళ్ళకు. ప్లీజ్ స్టే. ఒక్కసారి కళ్ళు తెరువు---                              

రక్తం కావాలి. ఈ శరీరం కోసం. మనుష్యులని ఇష్టపడి కోసుకున్న శరీరం కోసం. మరొక రోజు, మరొక సమయంలో ఆమె కడుపులోని బిడ్డ వాంతి చేసుకున్నప్పుడు, ఆ ద్రవం తన జీవితం లోని అయిస్టాభరిత వైవాహిక సంబంధంలా ఊపిరి తిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు, వొకే ప్రశ్న. ఒకే ఒక్క ప్రశ్న. తను బ్రతుకుతుందా లేదా? మూసుకున్న కళ్ళను అలాగే కప్పి ఉంచుతుందా?

నా భర్త. బహుశా, ప్రేమిస్తాడేమో నన్ను. కానీ ధైర్యంగా నాకై ఉండలేదు. భయస్తుడు. నేను అతడిని ప్రేమిస్తున్నానా? లేక అంగీకరించడానికి అలవాటు పడిపోయానా? దేహమొక్కటే అప్పగిస్తున్నానా? ఏమో? ఇష్టపడుతుండవచ్చు. అతనితో అనుభవాన్ని అప్పుడప్పుడూ ఇష్టపడతాను కనుక. అతని తల్లి, ఒక ఫ్రస్తేటడ్ వుమన్. ఆయక్త అయిష్ట భరిత, అశాంతి భరిత జీవితాన్ని నాపై చూపిస్తుంది. నేనూ మనిషిననీ స్త్రీ ననీ తనకి అప్పుడప్పుడూ గుర్తుకు వస్తుందనుకో, ఒక నిర్లిప్త నిస్సహాయ సమయ రహిత సమయంలో--- కానీ తను మాత్రం ఏం చేయగలుగుతుంది? పాతికేళ్ళ యంత్రపు జీవితం, పాతికేళ్ళ యంత్ర దినచర్యలతో?

అవన్నీ సరే కానీ ఇప్పుడు రక్తం కావాలి. ఆమె హృదయం మరి కొంత కాలం ఉండేందుకు రక్తం కావాలి. బి పాజిటివ్. ఆసుపత్రిలో రక్తం లేదు. కొనుక్కు రావాలి. ఎక్కడైనా త్వరగా. అందరూ ఉందీ ఎవరూ లేక మిగిలిపోయిన తనకి ఇప్పటికిప్పుడు రక్తం కావాలి.   బి పాజిటివ్. మూడు రాత్రుళ్ళు కొట్టుకులాడుతున్న గడులలోంచి బయట పడేందుకు తనకి రక్తం కావాలి. ఆనక చెబుతుంది తను జీవితం గురించి. ప్రేమ గురించి. ఈ జీవన సంక్లిష్టతల గురించి. ఉద్వేగం గురించీ, శాంతి అశాంతుల గురించీ. కానీ ముందు ఆమెకి రక్తం కావాలి. బీ పాజిటివ్. మంచాపై అలా పడిపోయి తను - చెట్లనూ, మొక్కలనూ వానలనూ మనుష్యులనూ జంతువులనూ ప్రేమలనూ ప్రేమ ఘాతుకాలనూ ఇష్టపడిన ఆమె శరీరం రక్తంకై, తిరిగి ఈ భూమిపైకి వచ్చేందుకు ఒక ప్రార్ధన చేస్తుంది: 

తను తిరిగి ఇక్కడికి రావాలి. తిరిగి ఈ మనుషులని ప్రేమించాలి. తిరిగి గాయపడాలి. మళ్ళా ఇష్టపడాలి. మళ్ళా చావు బ్రతుకుల్లో కొట్టుకులాడాలి. అందుకు ముందు రక్తం కావాలి. బి పాజిటివ్. ఎక్కడైనా కొనుక్కు రావాలి. త్వరగా. తిరిగి తను ఈ మట్టి పైకి రప్పించేందుకు, ఈ మట్టిపైనా ఈ జీవితాలపైనా తన పద పాద స్పర్శ  మోపేందుకూ, ఈ మనుషులని మరింతగా అనువదించుకునేందుకూ, తనకి రక్తం కావాలి. కొద్దిగా. బి పాజిటివ్. చూడు. ఒక శరీరంతో అధ్బుతాలు చేయ వచ్చు. సంభాషించ వచ్చు. ప్రేమించ వచ్చు. ముద్దాడ వచ్చు. రమించ వచ్చు. నిన్ను నీవు ఒక స్పర్శ లా మార్చుకుని తనని తాక వచ్చు. అనేకానేక విషయాలను సాధ్యం చేయ వచ్చు. తను: ఆ చేతులూ పెదాలూ పాదాలూ కనులూ తొడలూ చేతి వేళ్ళు  తిరిగి ఈ భూమిపై కదులాడాలంటే ముందు రక్తం కావాలి. అత్యవసరంగా రక్తం కావాలి.

చదువరీ, ఇవ్వగలవా నువ్వు కొంత రక్తం, తనని చూచేందుకూ, మరింత జాగ్రత్తగా తనని గమనించేందుకూ తనని ప్రేమించేందుకూ, తనని బ్రతికించుకునేందుకూ?    
------------------------------------------------------
26.09.1997        

15 February 2013

చీమిడి ముక్కుల వెన్నెల

ఈ వేళ నువ్వు మాట్లాడితే, నీ గొంతంతా జీర, మరి బరకు బరకు వానానూ-      

నీ ముఖం ఉబ్బి, ముక్కు చివర్లు ఎర్రగా మారి లోకంపై రుసరుసలతో
మరి ముంజేతితోనో, చేతిలో రుమాలుతోనో
క్షణక్షణానికీ నీ ముక్కు తుడుచుకుంటో నీ

ముక్కు ఎగబీల్చుకుంటో - అయ్యో అయ్యయ్యో - పాపం నువ్వు అలా
నానా అవస్థలు పడుతుంటే
ఒకటే ఆనందం నాకు.ఒకటే

ఆగకుండా నవ్వు నాకు. మరి ఇక నువ్వు తుమ్మితే, నీ ముక్కులోంచి
తుళ్లిన మేఘాలు నీ
చెంపలపై నీ పెదాలపై

కురిసి, అది చూసి పకాల్మని వికటాట్టహాసం చేసే నన్ను చూసి మరి
నీకు నన్ను కరిచేయాన్నంత కోపం వస్తే                    
మరి ఏం చేయను నేను, నిన్నిలా చూస్తో

నా తెలుగు భావుకత్వపు కవులను తలచుకుంటో? అమ్మాయీ, మరేం
పర్వాలేదు, నేనిలా రాస్తే నీ
అందమేమీ చెడిపోదు. మరి

అయతే, గియితే ఇంకా కొద్దిగా ద్విగుణీకృతం అవుతుందే కానీ తగ్గేంపోదు.
అమ్మాయీ, నీదీ శరీరమే నీ
దీనూ శరీరపు అవస్థలే.మరి

అందులో తప్పేమీ లేదు. నేను పడీ పడీ నవ్వితే కోపగించుకోడానికేమీ లేదు-
మరి, నా చీమిడి ముక్కుల వెన్నెలా
ఇదిగో ఈ మహాస్ట్రాంగ్ అమృతాంజన్

ఇన్ని వేన్నీళ్ళలో వేసుకుని, కూర్చుని నువ్వు ఆవిరి పట్టుకునేందుకు. అందుకే
ఇక అదయ్యేదాకా మర్నామీదా
ఈ లోకం మీదా ఈ కాలం మీదా

ఆగకుండా, అరుచుకుంటూ విసుక్కుంటూ నిన్ను నువ్వు చీదుకుంటూ చికాకుతో
అలా చీమిడి తుంపరలతో
తుమ్ముతూ రాలిపడకు-!

12 February 2013

లిమరిక్ లాంటి ఒక రమ్/రిక్

Doc doc doc
I'll put you in a dock

ఇచ్చావు సరే, మరి

Norflox
Eldoper
Pantop
Oral re hydration solutionతో

రెండు రోజులు వాటిని మింగి బ్రతకమని
తాగి, తిని విషం
తుల్యమయినది

తగ్గుతుందనీ, మరేం కంగారు
పడవద్దనీ. కానీ మరి

Doc doc doc
I will not put you in a dock, కానీ

ఏం చెయ్యమంటావీ -శోక
నివారణోపాయం లేని
హృదయాన్నీ కాలాన్నీ

తోడెవరూ లేని లోకాన్నీ?  

నీవిచ్చిన నిదుర

నా కనుగుడ్లపై బరువుగా నెమ్మదిగా నీ పాదాల సవ్వడి. మరి ఇక

నీ పాదాల వెంట వచ్చే చల్లటి చీకటి 
     
నా కనురెప్పలపై నీ బొటన వేళ్ళ 
     మృదువైన రాపిడినీ, ఈ కనుల 
     అంచులలో నేను ఊహించలేని రాత్రినీ దిద్దుతుంది: మరి ఇక 

రాత్రి వసంతాల దిగులు మాగ్ధలీనా

సింధువుల వలే, నిదుర బిందువులను అద్దటం 
     నీకే తెలుసు. చూడు: ఎవరో ఒక వలలో 
     తమ బాహువుల ఊయలలో ఊపుతున్నారు 

దారీ తెన్నూ లేని ఒక ద్రిమ్మరిని. 

తన చుట్టూ ఒక విస్మృతి పరిమళం ధూపమై పొగమంచై   
కమ్ముకుందంటే, నిను తాకి 
నీ వక్షోజాల నీడలలో తనకి 

నిదుర దొరికి, తిరిగి ఇంటికి చేరుకున్నాడంటే 
మృత్యువు అంటే మరేమీ కాదు 
తన శిరస్సు  క్షణకాలం వొరిగిన 

నీ ఒడి మాత్రమే అని అన్నాడంటే 
ఇక అందులో ఆశ్చర్యం ఏముంది?  

11 February 2013

సెలవు దినాన నీ ఉదయం

ఉదయం అంటే ఎంత ఇష్టం నీకు!

బాల్కనీ తలుపు తెరిచి, వేకువ గాలిని లోపలి పిలిచి ఒక కప్పు తేనీరుతో
బాల్కనీలోని పిచ్చుకల్తో మాట్లాడటం ఎంత ఇష్టం నీకు
ఎండ నీ లోగిలిలో వాలిన వేళ, దాని రెక్కల్ని తాకుతూ

చల్లటి గాలికి చేతులు కట్టుకుని, నీలోకి నువ్వే ముడుచుకుని
ఆకాశాన్నీ, గాలిలో పరిమళమై వ్యాపించే కాంతినీ
రంగులు మారే చెట్లనీ, వాటిపై కరిగిపోయే తేమనీ

కుండీలో నిన్నటి కంటే కొద్దిగా పెరిగిన మొక్కలనీ, వాటి చిగురాకులపై
మృదువుగా నీ చేతివేలితో రాస్తూ, వాటిలోని కొంత ఆకుపచ్చదనాన్నీ
కొంత ప్రాణాన్నీ మాకై కొంత నీలోకి నింపుకుని నీ

కళ్ళలోకి తొంగి చూసే ఈ మబ్బులను కడుక్కుని
నెమ్మదిగా లోపలి వచ్చి పిల్లలని నిద్ర లేపడం
వాళ్ళు మగత నిద్రలో, నిన్ను తమ చేతులతో
దగ్గరగా లాక్కుని కౌగలించుకోవడం, వాళ్ళ చేతివేళ్ళల్లో ఇరుక్కున్న
నీ శిరోజాలని చిరునవ్వుతో విడదీసుకుని అలా

వాళ్ళని తృప్తిగా ముద్దాడటం, ఎంత ఇష్టం నీకు. ఎంత ఇష్టం నాకు!
చూడూ, ఉదయం నువ్వు బాల్కనీలో వేయడం
మరచిన బియ్యపు గింజలకై
లోపలి వచ్చిన ఆ పిచ్చుకలు

ఒకటే కిచ కిచ, వాటి చిట్టి చిట్టి పాదాల హడావిడి డైనింగ్ గది అంతా-
పద పద పద తొందరగా, మరి కొద్దిసేపట్లో
నిదుర లేచిన ఇంకో మూడు పిచ్చుకలు

ఇక నీ పాదాల చుట్టే తిరుగుతాయి, ఇన్ని గింజలకై, నీ పట్లా జీవితం పట్లా
మహా కృతజ్ఞతతో 'అమ్మా' అంటో వాళ్ళు
'అమ్మాయీ' అని అనుకుంటో మరి నేను

చిన్నగా సన్నగా ఒద్దికగా బుద్ధిగా నీ చుట్తో 
తెల్లటి నల్లటి పూల చెండుల పిల్లి పిల్లలమై-  

దాల్ దారూ

ఆకాశాన్ని వొదిలి కొంత నేలపైకి దిగుతావు జబ్బు పడ్డప్పుడు-

పొరల పొరల ఎండ సర్పాలై నీ చుట్టూ రాలే వేళ, ఎండల్లో రాలే
ఆకులని చూస్తుంటే ఒక తడబాటు-
లోపల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళూ

నువ్వు లోపలికి ఎప్పటికీ తీసుకోలేని వాళ్ళూ, నువ్వు కాలేని
వాళ్ళూ-అంతా, అందరూ- నీడలై నీ
చుట్టూ నడయాడతారు.మరి నీడల్తో

ఏం మాట్లాడగలవ్ నువ్వు? నీ నుదిటిపై చేయి వేయలేని నీడలతో
నిన్ను హత్తుకోలేని నీడలతో
నువ్వు ఆనుకుని కూర్చోలేని
నీడలతో నువ్వు పడుకోలేని, నీ చుట్టూ సంచరించే నీడల నీడలతో
ఏం చేయగలవ్ నువ్వు? మరి     

దూరాన కొమ్మల్లో, కాంతి తుంపరలో నిశితంగా చూస్తో ఒక పక్షి
తాకడానికి, ఎవరూ లేని నీకు
ఈ సమయానికి అది కొమ్మల్లో

వికసించిన ఒక నల్లటి పూవు, అలసి జ్వ్లలించే నీ కనులకి అది
ఒక చల్లని వానా, గాలీనూ. ఇక

కడుపు చేతబట్టుకుని, గొంతు అంటుకుని జ్వరంతో అవస్థలతో
తాత్వికంగా తయారయ్యి, నీ మానాన
నువ్వు ఉంటావు కదా సరిగ్గా అప్పుడే

ఫిరోజ్ ఫోన్ చేసి: "भाई, रात का उतारा नहीं- अकेले
अकेले घर पे क्या करते हो? चलो
तोडा धारु थोड़ा ढाल खाके आयेंगे-"

అని అంటే ఇక
విషానికి విషమే విరుగుడా? పోదునా? వొద్దా? అనే అయోమయంలో
ఇదిగో ఈ స్థితిని ఈ సమాచారాన్నీ
మీకు రిపోర్ట్ చేస్తున్నాను, రాత్రంతా

నల్ల కలువ వలే వికసించి భూమినీ
ఆకాశాన్నీ అతని ముఖాన్నీ చుట్టిన
ఫరీదాని జ్ఞాపకం చేసుకుంటో: ఇల్లా

కూడా అనుకుంటో: By the way do you still remember Faridha?
The Faridha, who is in
All of us? 

09 February 2013

a bad bad ad day, and a bad pome

డ డ్డ, డ డ్డ, డ డ్డ, డడడ డడ డడా
డడా డడా డడా, డడడ డడ డడా
డడ్ డడ్ డడ్ డడా
డడడ డడ డడా డా

డా డా డా డడా, డడా డడా డడా
డడ్ డడ్ డడ్ డడా
డడడ డడడ డ డా

(Right now
You have been eaten
By a TV)

ఇంట్లో నిలువెత్తునా మొలిచిన
హోర్డింగ్ల లో
నియాన్ లైట్ల
మెరుపులలో

చెంపకు చారడేసి కన్నులున్న
మంచు వన్నెల వెలుగు కింద

అతను తాను ఒక స్మశానమనీ, ఎవరూ లేని సమాధి అనీ
తానూ, తన అనుకున్న
వాళ్లకూ మరి ఇక తను

నెలనెలా వచ్చే జీతమనీ
ఇంటికి తెచ్చే సరుకులనీ
పిల్లలకు పెట్టగలిగే ఖర్చులనీ, తనకి క్రమం తప్పక
కొనివ్వగలిగే బంగారమూ తన సౌందర్యసాధనాలనీ

తాను ఒక అపార్ట్మెంట్గా
నెలవారీ కట్టే చిట్టీలుగా
ప్రాణాన్ని తనఖా పెట్టి కొన్న చదరపు భూమి ముక్కలుగా
మారీ మారీ మారీ చచ్చి

పోలేక శవమై తనకు తానే భరించలేని ఎడుపుగా మారి ఇలా
పగలు పన్నెండింటికి
ఒక బార్లో, ఒక బార్తో -

డ డ్డ, డ డ్డ, డ డ్డ, డడడ డడ డడా
డడా డడా డడా, డడడ డడ డడా
డడ్ డడ్ డడ్ డడా
డడడ డడ డడా డా
డ్డ డ్డాఆ అనుకుంటో...

(The show will
Resume after
A short break

Don't go away
We will be
Right back)

08 February 2013

ఎలా?

రాత్రి అంటే ఎందుకంత ఇష్టం నీకు అని నువ్వు అడుగుతావు కానీ

ఈ చల్లటి చీకటి నాకు ఒక పొదుగు అనీ
నేనొక దూడననీ
నీకు ఎలా చెప్పేది?

కాలిన ముఖంపై ఈ రాత్రొక చల్లటి గాలి అనీ
దప్పిక గొన్న గొంతులో ఈ చీకటి
దయగా రాలే వెన్నెల చినుకులనీ

ఇది: ఈ రాత్రీ, ఈ చీకటి నాకొక తల్లి ఒడి అనీ నేను నీకు ఎలా చెప్పేది?
'నేనంటే నీకెందుకంత ఇష్టం?' అని కూడా
నువ్వు అడుగుతావు కానీ, అప్పటికే

పగలంతా తల్లడిల్లి వీధులలో తిరిగిన
ఒక నల్లటి బుజ్జి కుక్కపిల్ల, అప్పటికే
అరమోడ్పు కనులతో
తల్లి పొదుగున చేరింది

ఆకలి కొద్దిగా ఆరిన తన శరీరంపై లేత సరస్సులను పరిచే ఆ తల్లి
నాలిక కింద ఆదమరచి నిద్రించింది.

ఇక నీకు జవాబు చెప్పడం ఎలా? 

A Day with Juveria Tabussum

ఒక కవి ఇలా రాసాడు:

నిన్ను ప్రేమించడమంటే చెట్టు లేని ఆకుల గలగలలని వినడం
చినుకుల్లేని వానలో తడవడం, వెన్నెల్లో కూర్చుని కాలడం -
అంతం లేని ఈ శీతకాలపు రాత్రుళ్ళలో
తుంపర్లయ్యి తిరిగి ఆవిరయ్యిపోవడం-

కవి ఇలా కూడా అన్నాడు:

నిన్ను ప్రేమించడమంటే, నిప్పులని ముద్దాడటం
తెగిన కళ్ళతో నవ్వడం భాషని మరచిపోవడం,ఈ
లోకం చేత పరిహసించబడి, అవమానింపబడి ఒక్కడిగా మిగిలిపోవడం

కవి ఇలా కూడా గానం చేసాడు:

నిన్ను ప్రేమించడమంటే, నన్ను నేను మరచిపోవడం
నీ సౌందర్యంలో అంధుడుని కావడం, నిను మోహించి
నీ పాదఖడ్గపు కాంతి అంచులపై నా మెడను వాల్చి
నా  బ్రతుకుని నాకు ఇమ్మని నిన్ను శరణుజొచ్చటం

అయితే కవి ఇలా అడగలేదు:

నిన్ను ప్రేమించడమంటే నీ శరీరాన్నీ ఇష్టపడటం
నీ శరీరాన్ని ఇష్టపడటం అంటే నిన్ను అమితంగా మోహించడం
నిన్ను అమితంగా మొహించడమంటే నీతో రమించడం
నీతో రమించడమంటే, నన్ను నేను నీలో కోల్పోవడం

నీలోంచి కొంత కాంతినేదో కొంత శాంతినేదో తెచ్చుకోవడం, నీతో
ఉండటమంటే మృత్యువుని ఎదుర్కోవడం
జీవించడం ఎలాగో తిరిగి నేర్చుకోవడం
మరి కొంత కలగనడం మరి కొంత నేనై

మిగలడం. ఉండు నాతో చివరి వరకూ-

ఇలా అడగలేని కవికీ, అలా అన్న కవికీ తను ఇలా చెప్పింది:

Come to me when
You lose your skin
Come to me when
You peel off your tongue, your eyes, your ears and your truth.       
Till then, hey babe

Fuck off, and don't
You ever come here
On to this page
Again. 

07 February 2013

నువ్వు అడిగే విషయాలు

ఈ రాత్రి ఏమయ్యిందని నువ్వు అడుగుతావు

నేను ఏమీ చెప్పను.
పిల్లలు మరో మారు మరణించారనీ, పత్రికలు వార్తలు ముద్రించాయనీ
ప్రధాన మంత్రి ఎవరైతే, ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచుతారనే సర్వేలలో

హస్తాలు లేని మనుషులనీ, కమలాలు లేని గృహాలనీ
ఎవ్వరూ పట్టించుకోలేదనీ, యధాప్రకారం ధారావాహిక
కార్యక్రమాలలో నువ్వూ నేనూ కూరుకుపోయామనీ, మన ముఖాలని

మరచిపోయామనీ ఎవరూ చెప్పరు. విచిత్రం ఏమిటంటే

ఈ రాత్రి ఏమయ్యిందని నువ్వు అడుగుతావు కానీ
ఇదొక్కటే నిజం విను. ఇంకా లెక్క తేలలేదు

ఈ నేలపై, నేలను అడిగినందుకు పిల్లలు హత్యలు చేయబడ్డారే తప్ప
పిల్లలెవరూ మరో మారు చనిపోలేదు-

ఆచార్యా, కొద్దిగా భాష నీ మార్చుకో. ఇంతకూ ఇన్ని పత్రికలని నీ నాలికపై
ఇంత నిస్సిగ్గుగా ముద్రించినది ఎవరు?  

06 February 2013

ఉపోద్ఘాతం

1.
"ఎలా ఉన్నావు?"

అతడు తల ఎత్తి, ఒక మారు ఆమె  చూసి తల దించుకున్నాడు. సాయంకాలపు ఎండ ఆమె ముఖాన్ని కప్పి ఉంది. ఆ పసుపు పచ్చటి కాంతిలో ఆమె పసుపు పచ్చ ముఖం మరింతగా మెరుస్తోంది. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ప్రపంచంలో ఉన్న భాషలన్నిటిలోనూ, సంభాషణలన్నిటిలోనూ ఉన్న అసందర్భ ప్రశ్నలలో ఇది ఒకటి కావొచ్చు. బహుశా, సమాధానంకై కాకుండా ఉట్టినే అడుగుతారు కాబోలు. కానీ, జవాబు? అతనికి అసహనంగా ఉంది. అసౌకర్యంగానూ ఉంది. ఉదయంపూట కాలేజ్లో కుర్రవాడి ముఖం గుర్తుకు వచ్చింది. ముప్పై కిలోమీటర్ల నుంచి వస్తాడు - చదువుకోడానికి. ఏం ఉంటుంది? ఏమీ ఉండదు. నల్లటి ముఖం. భుజాన ఒక బ్యాగూ, దానిలో టిఫిన్ బాక్సూ ఇంకా కొన్ని పుస్తకాలూ. సరిగ్గా తొమ్మిది గంటల కల్లా కాలేజ్లో ఉంటాడు. సరిగ్గా తొమ్మిది గంటల కల్లా కాలేజ్లో ఉండటానికి, సరిగా ఏడింటికి ఇంటి వద్ద బయలుదేరుతాడట. ఇంతా చేసి వస్తే, మొదటి క్లాసు జరగదు. జరిగినా చెప్పేది అర్థం కాదు. అది ఆ కుర్రవాడి తప్పు కాదు. ఆ లెక్కల మాస్టారు ఏం చెప్పినా అర్థం కాదని, పట్టణాల్లో చదువుకున్న 'చదువొచ్చిన' కుర్రవాళ్ళూ చెప్పారు. తడచిన బొగ్గులాంటి ముఖంతో ఆ కుర్రవాడు చెబుతాడు: 

-లెక్కలు కష్టంగా ఉన్నాయి సార్. అర్థం కావడం లేదు. టూషన్ చెప్పడానికి ఇంటి వద్ద ఎవరూ లేరు సార్. ఇక్కడ ఈ సిటీలో టూషన్ చదవాలంటే మేము అంత ఉన్న వాళ్ళమి కాదు సార్-

-మీ నాన్నేం చేస్తాడు-

-చిన్న షాపు ఉంది సార్- అని కొద్దిగా ఆగి - చెప్పులు షాపు సార్. చెప్పులు కుట్టి అమ్ముతూ ఉంటాడు...-

-కాలేజ్ అయ్యి ఇంటికి వెళ్లేసరికి నాలుగు ధాటి పోతుంది కదా, మరి భోజనం?-

-అమ్మ టిఫిన్ కట్టి ఇస్తుంది సార్-

అతను ఆ కుర్రవాడి తల్లిని ఊహించుకోగలిగాడు. తన తల్లికి చాలా దగ్గరగా ఉంది ఉండవచ్చు. నలభై ఐదేళ్ళు పైబడి, ముఖంలో గీతాలు దీర్ఘమయ్యీ, బహుశా తను ఏమిటో తెలియని వ్యధతో, ప్రతి ఉదయం విషాదాన్నంతా దాచి పెట్టుకుని తల వంచుకుని టిఫిన్ బాక్సులో పెరుగన్నం పెడుతూ ఉండే రూపం. అమ్మలందరూ ఇలాగే ఉంటారా? అది కూడా అసందర్భ ప్రశ్నలలో ఒకటిలాగా అనిపించి తల విదిల్చాడు.

-ఏంటీ ఆలోచిస్తున్నావు?- మరొక ప్రశ్న.

-ఏం లేదు-

-ఏం ఆలోచిస్తున్నావో చెప్పొచ్చు కదా?-

అతడు అసౌకర్యంగా కదిలాడు. ఒక ఏక ఆలోచన లేనపుడు ఎలా చెప్పడం? అతను తల ఎత్తి ఆమె వైపు చూసాడు ఆమె అతని వైపే తదేకంగా చూస్తోంది. అతడికి, ఆకస్మికంగా నిస్సత్తువుగానూ దిగులుగానూ అనిపించింది. అసలు తను ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎందుకు కూర్చున్నాడు? ఆమె ఎవరు?

-నేను వెడతాను- అతను అన్నాడు.

ఆమె ఏమీ మాట్లాడలేదు. అతడికి ఆమె తరచూ అనే వాక్యం గుర్తుకు వచ్చింది. అతడు ఆ వాక్యం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె నిట్టూర్పు విడుస్తో అనాలి: సరే. మళ్ళీ ఎప్పుడు?

-తెలియదు-. అతనికి అక్కడ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత బావుండు అని అనిపించింది. వొంటరిగా ఉండాలి. వొం - ట - రి - గా -. ఎవరితోనూ సంభాషణ లేకుండా, అసంబద్ధ ప్రశ్నలు లేకుండా, అసౌకర్యంగా కాకుండా-ఎక్కడికన్నా వెళ్ళాలి. ఎక్కడికి? అతనికి తెలియదు. కానీ వెళ్ళాలి. కానీ ఏమిటిది? బాధా? కాదు. భయమూ కాదు. దిగులా? 

అతను ఆ పదంపై కాసేపు ఆగాడు. తను అనుభవిస్తున్నది దిగులా? ఈ ఎమ్టీనెస్...గుండెనీ, శరీరాన్నీ చుట్ట చుట్టినట్టు...కాదు. ఇది దిగులు కాదు. మరేమిటి? విషాదం...? ఊహు...ఎమ్టీనెస్...శూన్యత. కానీ దేనికి?  తను ఎందుకు కారణం కోసం వెదుకుతున్నాడు? ప్రతీదానికి ఒక కారణం ఉంటుందా? ఇక, అసహనంతో అతను చివాలున లేచి, నెమ్మదిగా క్యాంటీన్ మెట్లు దిగి కిందకి వచ్చాడు.

సాయంత్రం. ఆకాశం. అతను ఆకాశాన్ని, పాలరాయి శిల్పంపై కప్పిన ఒక జలతారు పరదా ని లాగివేసిన రెండు చేతులు లాగా ఊహించాడు. చుట్తోతా చెట్లు. చెట్ల మధ్య నుంచి రాలే పసుపు ఆకులో, మసక కాంతి బిందువులూ. అవి ఏమైనా తనకి కమ్యునికేట్ చేస్తున్నాయా? ఒక వేళ అయితే, ఏమిటది? అతనికి ఒకప్పుడు తను రాసుకున్న వాక్యాలు జ్ఞాపకం వచ్చాయి 

...the sky is nothing, sometimes
only a space, a space into which
you fly your life like a kite, with 
the thread in somebody else's hand

and that is memory, memory 
of being lead by 
another memory...

ఒక అపరిచిత ఎమ్టీనెస్. పేరు లేని దశలోకి దేహం జారిపోతున్న అనుభూతి. అతనికి పరచితమైన అనుభూతి. సంవత్సరాలుగా దేహంలో నెత్తురులా జ్వలిస్తోన్న అనుభూతి. బహుశా, ఇటువంటి విషాదపు దశలో తప్ప తను మరో దానిలో బ్రతకలేడు. తను ఇటువంటి అనుభూతిలో తప్ప మరొక దానిలో జీవించ లేడు. ఏమిటిది? సంతోషం కాదు. దుక్కం కాదు. బాధ కాదు. దిగులూ కాదు. ఇవన్నీ అయిన, అదే సమయంలో ఇవన్నీ కాని ఫీలింగ్ ఘాడమైన జీవన చలన సూత్రం. అతనికి మాత్రమే, అతను మాత్రమే స్పర్శించ గలిగే జీవితం. దేహంతో పాటు తల కూడా ఒక మత్తులోకీ, ఒక అంతులేని వలయాల లోకీ కూరుకుపోయినట్టుగా-

అతను తల వంచుకుని తన గదిలోకి వచ్చాడు. గదికి తాళం వేసి లేదు. తాళం వేసే అలవాటూ లేదు. తలుపులు తెరిచి లోపలి--- చీకటిగా ఉంది. తలుపుని పూర్తిగా తెరిచి, లైటు వేసి ఫాన్ స్విచ్ వేసాడు. గదిలో ఒక పక్కగా మంచం, మరో పక్కగా రాసుకునే బల్లా. రెండింటికి మధ్యా కొద్దిగా ఎత్తులో ఉన్న కిటికీ కిందుగా పుస్తకాల రాక్ - వాటిలో కొన్ని పుస్తకాలూ మరి కొన్ని జిరాక్స్ తీయించుకుని బైండు చేయించుకున్నవీ. టేబుల్ పై చెదురు మదురుగా కాగితాలు. 

నెమ్మదిగా చీకటి చుట్టుకుంటుంది. తెరచి ఉంచిన కిటికీలోంచి విసురుగా గాలి వీస్తోంది.అతను గాలి వంక చూసేందుకు ప్రయత్నించాడు. తన ముఖాన్నీ, తన దేహాన్నీ మెలికలుగా చుట్టుకుంటున్న హస్తాల కోసం. అరచేతులు కావొచ్చు. చెంపలపైనుంచి చెవులకు పైగా చల్లగా - బహుశా, ఆ కుర్రవాడి కళ్ళూ అలా ఉండి ఉండ వచ్చు. పగళ్ళూ రాత్రుళ్ళూ ఉన్న కళ్ళు. తడచిన ఉదయాల మధ్యగా మెరిసే నల్లటి రాత్రుళ్ళ కళ్ళు. ఎన్ని ఏళ్ళు ఉంటాయి అతడికి? పదహారూ? పదిహేడూ? ఆ కుర్రవాడు అద్దంలో తన ముఖం చూసుకున్నప్పుడల్లా తన ముఖం కాకుండా తన తల్లి ముఖం గుర్తుకు వస్తుండవచ్చు. ముప్పై ఏళ్లకు పైగా కష్టంతో, సంతోష రాహిత్యంతో, మసక బారి ముడతలు పడి, అయినప్పటికీ దయగా ప్రేమగా కదులాడే ముఖం. లేదా తన తండ్రి ముఖమూ చూసుకుంటుండ వచ్చు. వృద్ధాప్యం ఆకస్మికంగా జొరబడి, ముఖాన్నీ దేహాన్నీ చిందర వందర చేసినట్టు, చెమటలు పట్టిన ముఖంతో ఉప్పటి దేహంతో నల్లటి చెట్టు బెరడు లాంటి పెదాల మధ్య చిటపట లాడుతూ తగలబడే బీడీతో, ఒక సుపరచితమైన వాసనతో కదులాడే తండ్రి ముఖం. 

-స్కాలర్షిప్పులు సమయానికి రావు సార్ ... మా అమ్మా నాన్నా నన్ను ఇంత దూరం పంపించి చదివించడమే చాలా కష్టం సార్-

పెరుగన్నం. కాలేజ్ లోని ఆవరణలోని ఒక చెట్టు కింద కూర్చుని, టిఫిన్ బాక్స్ తెరుస్తాడు. చలికాలమైతే పరవాలేదు. కానీ ఎండాకాలం అన్నం త్వరగా పాడవుతుంది. ఒకాకొక పిగిలే ఎండాకాలపు తొలి దినాల్లో, చెట్టు కిందుగా నడుస్తూ ఆ కుర్రవాడిని గమనించి అడిగాడు:

-నేను కూడా వచ్చేదా? నాక్కూడా ఒక ముద్దన్నం పెడతావా?- అని.

అప్పుడు ఆ కుర్రవాడి నారింజ పెదాలపైన ఆకస్మికంగా రాత్రి ప్రత్యక్షమయ్యింది. అమావాస్య. కళ్ళల్లో పొడుస్తున నక్షత్రాలు.

-మీరు తినలేరు సార్...-

-మరేం పర్వాలేదు...-

ఆ కుర్రవాడి ముఖం ఇంకిపోయి, గడ్గాధమైన స్వరంతో అన్నాడు:

-ఎండాకాలం కదా సార్ ... అన్నం త్వరగా పాడవుతుంది... వాసన...మీరు తినలేరు...-అని 

ఆ కుర్రవాడు తల దించుకున్నాడు. అతను స్థాణువయ్యాడు. జేబులో రెండున్నర రూపాయలు ఉన్నాయి. దానితో పది కిలోమీటర్లు వెళ్ళాలి. బస్సు టికెట్టుకూ సరిపోవు. తమాయించుకుని అన్నాడు అతను:

-టీ తాగుదాం రా -

ఆ కుర్రవాడు టిఫిన్ బాక్సు మూసి భారంగా లేచాడు. బాదు. ఎందుకు? అయినప్పటికీ నొప్పి. దేహంలో. మనస్సులో. ఇద్దరికీ. కెఫే లో టీ  తాగుతుండగా ఆ కుర్రవాడు అడిగాడు:- మీరు అన్నం తిన్నారా సార్-?

-లేదు. హాస్టల్లో రూం లో నాకు భోజనం ఉంటుంది. వెళ్ళాక తింటాను-

అబద్ద. పర్వాలేదు. జీవితంలో చాలాసార్లు తప్పదు. చాలాసార్లు అబద్ధం నిజంగానూ, నిజం అబద్ధంగానూ మారుతూ ఉంటుంది. బహుశా, రెండింటికీ మధ్యా ఉండే సరిహద్దు గీత సన్నది ఉండవచ్చు. చాలాసార్లు రెండింటికీ తేడా లేకపోతుండవచ్చు. చాలాసార్లు రెండూ ఓవర్ లాప్ అవుతుండవచ్చు.

ఆ కుర్రవాడి ముఖం-సన్నగా, కోలగా. అన్నింటికంటే ముఖ్యంగా కళ్ళు. పగలూ రాత్రీ రెండూ కలగలసిపోయి.

అతడు మంచంపై కూర్చుని పక్కనే ఉన్న అద్దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. రెండు కళ్ళు. అపరచితమైన నయనాలు. ఎక్కడో భూమి పొరలలోంచి కేక వేస్తున్నట్టుగా. కాళ్ళ కింద నల్లబడుతున్న చారలు. ఎలా అంటే ఒక స్వప్నం ఆకస్మికంగా తునకలయ్యినట్టుగా. ముఖం - అది కూడా అపరాచితంగా అతను తన ముఖాన్ని మరింత సునిశితంగా అద్దంలో గమనించుకున్నాడు, నిక్షిప్తమైనదాన్నేదో కనుగోవాలనుకున్నట్టుగా. అది తన ముఖం కాదు. ఎట్లీస్ట్ తనకు తెలిసిన ముఖం కాదు. మరెవరిది? తనకు తెలిసిన ముఖం డిస్ లోకేట్ అయినట్టుగా, తనే గుర్తు పట్టనంతగా మారిపోయినట్టుగా...ముఖాన్ని చిత్రిస్తుండగా కాన్వాస్ పై నీళ్ళూ పెయింట్ వొలికిపొయి, చిందర వందరగా సాగిపోయినట్టుగా. అతడు మరి కొద్దిసేపు అద్దంలో ముఖం చూసుకుంటూ ఉండిపోయాడు. ఎటువంటి భావాలూ లేకుండా. గమనించడం గమనించడం కోసమే అన్నట్టుగా-

కిటికీలోంచి చీకటి మరింతగా చిక్కబడింది. లతల్లా, లోపలి నెమ్మదిగా అల్లుకుంటోంది. రాత్రి. మొదలవుతున్న రాత్రి. మరొక, సుదీర్ఘమైన చీకటి సమయం. ఎటువంటి వెలుతురూ లేకుండా, దిగులూ విషాదభరితమైన ఎటువంటి నిశ్చల అర్ధమూ లేని తన ముఖం లాంటి తన ముఖాన్ని తను గమనిస్తున్నట్టు ఉండే రాత్రి.

అతను లైటు ఆర్పివేసి మూలగా ఉన్న కుర్చీని దగ్గరగా లాక్కుని దానిలో కూర్చుండిపోయాడు, ఎదురుగా కిటికీలో చిక్కనవుతున్న చీకటిని గమనిస్తో. కళ్ళు మూసుకో తగలబడుతున్న పూలపై మంటలను ఆర్పివేసేందుకు కప్పుతున్న అరచేతులు - కనురెప్పలు. కొద్దిగా గాలి. కొద్దిగా దేహం. కొద్దిగా గతం. కొద్దిగా వర్తమానం - అద్రుశ్య అజగరమేదో శరీరాన్ని చుట్టుకుంటున్నట్టుగా. లోపల ఏదో జ్వలిస్తోంది. దేహం లోపల.ఏదో అరణ్యం తగలబడు తున్నట్టుగా. కొన్ని జ్ఞాపకాలు. కొన్ని ఇమేజెస్. కలగాపులగంగా కలగలసి మెలికలు చుట్టుకుని, అంతలోనే వీడిపోయి తిరిగి చుట్టుకుంటో-

అతను తన చల్లటి అరచేతులతో ముఖాన్ని అసహనంగా రుద్దుకున్నాడు. కొన్నిసార్లు స్పష్టం కాదు ఏవి ప్రతీకలో ఏవి వాస్తవాలో, ఏది గతమో ఏది వర్తమానమో. గతం వర్తామానంలోకి, వర్తమానం గతంలోకీ జారుకుటునట్టూ: అసహనం. విసుగు. అనిశ్చితి. ఇవి సరే: మరి ఆమె? ఒక్కటే. ఆమె దేహం ఒక్కటే. ఆమె నవ్వూ ఒక్కటే. ఆమె స్పర్శా ఒక్కటే. మరొక రోజు మరొక సమయం మరొక సందర్భంలో, నవ్వూ చిరునవ్వూ ఉద్రేకమూ శాంతీ అశాంతీ కూడానూ- ఆమె అంది అప్పుడు:

-నీకు మనుషుల్ని ఎలా ప్రేమించాలో తెలియదు-

అతను మాట్లాడలేదు.

-నీకు మనుషుల్ని ఏం చేసుకోవాలో కూడా తెలియదు శ్రీ- ఆమె మళ్ళా మృదువుగా చెప్పింది. అతను తల ఎత్తి ఆమె  వైపు చూసాడు. మధ్యాహ్నపు సుపరిచితమైన ఎండా మళ్ళా తన ముఖంపై నీడలతో వాలి ఉంది. ఆ నీడలలో తన కళ్ళు పక్షుల్లా కదులుతున్నాయి. అతడు వాటి వంక చూసాడు. 'భాష కాదు, లిపి లేటి వాటిని చదువు-' ఆ పక్షులు చెప్పాయి. అతనికి వాటిని స్పర్శించాలనే బలీయమైన కోరిక కలిగింది. అతన చేతిని చాచగానే ఒక కదలిక: అతని ముందు రెండు ప్రశాంతమైన సరస్సులు ప్రత్యక్షమయినాయి: నిటారుగా నిలబడి వికసించిన నీటి పూవుల్లా. అతనికి ఆకస్మికంగా వాటిలో తన ప్రతిబింబం కనిపించింది. తన శరీరం సమస్థమూ ఆ జల ధారలలో ప్రత్యక్ష మయ్యింది.  అతని కళ్ళు: మరణించిన శరీరాల్లా, లేక ఆకస్మికంగా పోయిన ప్రాణంలా. అవి తన నయనాలు కావు. అంది తన శరీరమూ కాదు. తన మరో తనలా కనుమరుగవుతున్న చిత్రంలా. చూసుకుంటే, అరచేతులకు నల్లని కాటుక -          

 తన రెండు అరచేతులనూ కళ్ళకి ఎదురుగా తెచ్చుకుని పరీక్షగా గమనించాడు అతను. కాటుక. అది రక్తపు కాటుక. కమిలిన కాటుక. ఆకస్మికంగా, కాతుకలోంచి రెండు కళ్ళు మొక్కల్లా పొడుచుకు వచ్చాయి. కనురెప్పలకు బదులుగా పాలిపోయిన ఆకులు. రోగగ్రస్థమైన ఆకులు. అవి కళ్ళూ, కనురెప్పలోనూ. తన తల్లి కళ్ళు. తన స్త్రీ కళ్ళు. ఏదో మాట్లాడుతూ ఆ కళ్ళు. ఆ మొక్కలు. అర్థం కాక, మూగవోయి అతను. ఆ కనురెప్పల కింద నీటిలో లిఖించబడుతున్న పదాలు ఏవీ అతనికి అర్థం కావడం లేదు. బాధ. నొప్పి. నొప్పీ. బాధా. అతని కళ్ళు కుంచించుకు పోయి, ఒక చీకటిలోకి సాగిపోయి, రెండు వేళ్ళ మధ్య ఎవరో చిదిమినట్టు, అతని శరీరమంతా చమట, నొప్పీ బాధా. అతను ఉలిక్కిపడి అ వాలు కుర్చీలో ఆ చీకట్లో ఆ గదిలో సర్దుకున్నాడు. గుండె శరీరమంతై గదంతా సవ్వడితో కొట్టుకులాడుతున్నట్టు- ఇక ఆ రాత్రి అక్కడ, అతనిలో ఒక గతమైన ఒక వర్తమానంలో అతని ప్రియురాలి అద్రుశ్య స్వరం ప్రాణభయంతో వెలువరించిన, కనుమరుగవుతున్న కేకలా మార్మోగింది:


-నువ్వు నన్ను వొదిలి వెళ్ళకు. ఈ దేహాన్ని వొదిలి వెళ్ళకు. నువ్వెందుకు నన్ను ప్రేమించవు? నువ్వు ఈ దేహాన్ని ఇష్టపడ్డప్పుడు ఈ పెదాలనూ పదాలనూ పాదాలనూ ఇష్టపడినప్పుడు, గోరింటాకులా నిన్ను నాపై పరచుకున్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించవు? ఒకసారి, ఒక్కసారి, నీ చుట్టూ ఉన్న మనుషులనీ, వాళ్ళలోని ఆశలనీ ఎందుకు గమనించవు? ఒకసారి- ఒక్కసారి, ఒకే ఒక్కసారి, వాళ్ళని వినేందుకూ, వాళ్ళని హత్తుకునేందుకూ నువ్వు ఎందుకు ప్రయత్నించవు? మూర్ఖుడా: నేను నిను ప్రేమిస్తున్నాను. నిజంగా. ఈ దేహం తోటీ, ఈ మాటల తోటీ, నా భాష తోటీ, నాదైన పెదాల తోటీ, పాదాల తోటీ ఈ వక్షోజాల తోటీ నా ఈ చనుమొనల తోటీ ఈ తొడల తోటీ నా ఈ కౌగిళ్ళ తోటీ ఈ హస్తాల తోటీ ఈ వేళ్ళ తోటీ నా దేహంలోని మలం తోటీ మూత్రం తోటీ నెల నెలా నెత్తురు వెన్నెలయ్యే నా ఈ చెలమ తోటీ నిన్ను ప్రేమిస్తున్నాను. మూర్ఖుడా: అది నువ్వు ఎందుకు , నువ్వెందుకు గ్రహించవు?- 
-------------------------------------------------------------------------------------------------

07.07.1997

05 February 2013

నిన్న, ఒక పార్క్ లో















































ఇంతటి  నిశ్శబ్ధం తరువాత
తను అంది:
Don't touch me
Anymore.
I don't know
Who the fuck are you...

Leave me alone.

అందుకే, అంతటి తన నిశ్శబ్ధం అతని కడుపుని
చెక్కులు చెక్కులుగా చేసినా
నిలబడి ఉన్నాడు, అతను
అక్కడే కదలక, కదలలేకా

వంటరి బస్టాప్లో మిగిలిపోయిన ఒక వొంటరి స్త్రీని 

ఎంత విదిలించినా
చీదరించు కున్నా
వొదలక అడుక్కునే, ఒక భిక్షగాడిలా:

ఇక ఏమనగలం ఏమనుకోగలం మనం ఇలా తప్ప:
Sometimes life is like that
deaf, dumb and mute, లైక్ 

A నల్లని చల్లని మొరటు రాతి రాత్రిలా- తనలా. 

04 February 2013

ప్రేమికులు

"What if I slept with somebody else
In front of you?" అని తను అడిగింది.

కొంత గాలి అతని ముఖాన్నీ, తన శిరోజాలనీ
చెరుపుతుండగా, సన్నగా నవ్వుతో
తల వంచుకుని మధుపాత్రని ఖాళీ
చేస్తో అతను అంటాడు:

"It doesn't matter.
It really doesn't matter
నువ్వంటే నాకు ఇష్టం.
As long as you are here with me
It really doesn't matter anymore."

ఇక కొంత రాత్రి ఇద్దరి మధ్యా, లోపలా బయటా
ఊట వలే ఊరితే, చెమ్మగిల్లిన
తన కళ్ళలోంచి కొంత కాంతిని
తన అరచేతుల్లోకి తీసుకుని
ప్రమిదెలవల్లే  వెలిగించుకుని

తనని ఆనుకుని కూర్చున్నాడు, తెల్లటి గంజాయి పొగతో

ఆకలికి డోక్కుపోయిన తమ ఇద్దరి కడుపులకీ
మూడు గర్భస్రావాలైన కడుపుతో ఇక మళ్ళా
తనే పడుకోవాలి ఎవరితోనో ఒకరితో అని తెలిసి

పిడికిలంత అన్నం కాలేని
గుప్పెడంత హృదయాలతో

ఆ ఇద్దరూ అక్కడ, కొంత అనాసక్తితో కొంత నిస్సత్తువుతో:

ఇక అప్పుడు, ఇక ఆ క్షణాన
Does it really matter
What love is anymore?  

ఒక్క క్షణం

ఈ వాక్యాన్ని రాసాను:

If you have a moment
Please, do come.
We will drink
to eternity.

She came and left
With the bottle
broken, and
the windows
open.

ఇక ఈ వాక్యాన్ని
ఇలా ముగిస్తాను.

కంగారు పడకు
ఛాతిలో ఒక దీపం పగిలింది.

03 February 2013

ఒక దినం

కాలి మసి పట్టిన కుండలా కడుపు మారినప్పుడు
కనులు ఎరుపెక్కి ముఖం దుమ్ముతో నలుపయ్యి
పగలంతా తిరిగి  తిరిగి
పగలంతా విసిగి విసిగి
పగలంతా విరిగి విరిగి

నీ శరీరాన్ని సప్పలు సప్పలుగా నరుక్కుని విపణిలో
అమ్ముకుని, ఇక ఇంటికి
నువ్వు వచ్చి వాలిపోయి

ఆ చీకటి కాంతిలో, ఆ చల్లటి నీడలో ఆ చీకటి గాలిలో
ఒక బీర్ బాటిల్తో కూర్చోవడం
నీకు నువ్వుగా
మిగిలి ఉండటం

తప్పేమీ కాదు - నాహిద్. చూడు: నీళ్ళు తగిలి
నీ శరీరంలోంచి మొలకెత్తిన ఆ
మొక్కల మధ్యా లతల మధ్యా

నీళ్ళు నిండిన నీ ఎర్రని మొగ్గల కళ్ళ కిందా ఎలా
వొణికి వొణికి ఏడుస్తున్నాడో నీ జోర్భా!      

01 February 2013

లాస్ మెస్ ద్రియోస్

'లాస్ మెస్ ద్రియోస్' అంటే కోరిక అని అర్థం,'లాస్ మెస్ ద్రియోస్' అంటే ప్రేమ అని అర్థం
'లాస్ మెస్ ద్రియోస్' అంటే ప్రేమతో కూడిన కోరిక అని అర్థం - అని తను- చెప్పింది కానీ
అది అంటే ఏమిటో ఇప్పటికీ అర్ధం కాలేదు నాకు:

ఆకుపచ్చని నక్షత్రాలు మెరిసే తెల్లటి ఆకాశాల్లా ఉండేవి తన కళ్ళు. మరి
చూసావా వాటిలోకి, సరస్సుల్లోకి రాలి
దారీ తెన్నూ లేకుండా కొట్టుకుపోతావ్

వానా వెలిసాక, ఆకుల చివర్ల నుంచి రాలే నీటి చుక్కలు ఆకస్మికంగా నీ
ఒంటిపై పడి, ఒళ్ళు జలదరిస్తుంది చూసావా
ఆలా ఉంటుంది తను నిన్ను తాకినప్పుడు

దారి పక్కగా వాన వెలిసిన నీటిలో మొలిచే
బుడగలలోకి బుడంగున మునిగి ఆరంగుల
లోకాలలో తిరిగి తిరిగి నిన్ను నువ్వు కోల్పోయినట్టు ఉంటుంది, మరి తను
అలా అలా మాట్లాడుతుంటే వింటున్నప్పుడు

పచ్చని చేలల్లో పంట కాల్వల పక్కగా నిలబడి
రివ్వున దూసుకువెళ్ళే గాలి పిట్టల రెక్కల సవ్వడిని చూసినట్టూ, పున్నమి
శీతల రాత్రుళ్ళలో దివి నంచి భువికి అల్లుకున్న
మంచుపొరలను ఒక చలిమంటతో రగులుతూ కాచుకుంటున్నట్టూ ఉంటుంది
మరి తను నిన్ను గాట్టిగా చుట్టుకున్నప్పుడు

ఇక కల్లు తాగిన కోతి పరిస్థితే నీది, తను నిన్ను
ముద్దు పెట్టుకున్నప్పుడు. నిలకడగా నిలువాలేవు నింపాదిగా నడవాలేవు
భూమి తిరుగుతూ విశ్వం తిరుగుతూ
తల కూడా తిరుగుతూ ఇక నువ్వు నీ

హృదయాన్ని చేతిలో పట్టుకుని వీధులన్నీ తిరుగుతావు - 'చూడండి. ఎవరికీ
తెలుసీ కళ?' అంటో, కవితలని రాస్తో. ఇక
ఒక రాత్రి తనతో నువ్వు, నీతో తనూ అలా
పడుకున్నప్పుడు, నీ ఆ గదిలో అరణ్యాల అలజడి. రహస్య లోకాల నీడల సవ్వడి.

అనంత దీపాలు వెలిగి, అనంత కాంతి ఖగోళాలు
రగిలి, భూమి పిగిలి పర్వతాలు పగిలి, వేనే వేల
వెదురు వనాలు వానలో ఆకు పచ్చి సంగీతమై
తనలోనూ నీలోనూ వ్యాపించి, ఇక ఊగుతోంది

తొలి నిదుర, కమ్మటి పాల వాసనతో, ఛాతి వాసనతో తొడల వాసనతో తొలకరి
వాసనతో, కనుల పాదాల వెన్నుముకల వెన్నె
లాంటి మెరుపుల పరిమళంతో, ఒక నివేదనతో-

'లాస్ మెస్ ద్రియోస్' అని తను అప్పుడు నీ చెవిలో
సన్నగా నవ్వుతూ నెమ్మదిగా గొణుగుతుంది కానీ

వానకి తాళలేక, గూటిలో ఒదగాలేకా నేలపై రాలి, చనిపోయిన పిచ్చుక పిల్లల
నానిన నిశ్శబ్దం ఇక నీ చుట్టూతా తను వెళ్ళిపోయాక
ఇక చెట్లల్లో, కొమ్మల్లో హడావిడిగా పిచ్చి పిచ్చిగా అరుస్తాయి పక్షులు రాలిన
పిచ్చుకపిల్లలపై గిరికీలు కొడుతూ - చెట్టు వద్దే  దాని
బెరడును రాసుకుంటూ అసహనంగా తిరుగుతోంది ఒక పిల్లి అరుచుకుంటో

ఎక్కడో ఎవరో దబ్బున రాలిన శబ్దం.  మరణించిన
దేహాన్ని పాడెపైకి చేరుస్తున్న నిశ్శబ్ధం.శ్మశానంలో
సరిగ్గా ఎండని కర్రలని దహించే నిప్పుల కలకలం
అజగారం వలే నీ చుట్టూతా పాకే పొగ, కళ్ళను కాటేసే పొగ, నీ ఛాతిని చీల్చి నీ
గుండెకాయని పెగిల్చి నీ అరచేతుల్లోనే ఉంచే పొగ-

ఏడవా లేవు శపించనూ లేవు చెప్పుకోనూ లేవు తప్పించుకోనూ లేవు మరి
పారిపోనూ లేవు ఆ 'లాస్ మెస్ ద్రియోస్' గాజుల
ఉరితాళ్ళల చప్పుళ్ళ వలయాలలోంచి: ఇక, ఒక

దినానంతాన, శ్వేతమయమైన ఆకాశం కింద కూర్చుని, అదొక శరీరం అయినట్టూ
అదొక స్త్రీ అయినట్టూ, పదిమందికీ ఖాళీ కుండలా
మారిన నీ హృదయం లేని ఛాతిని చూపిస్తూ ఇలా
నీలో నువ్వు గొణుక్కుంటావు: 'లాస్ మెస్ ద్రియోస్' అంటే ఒక ఖననం 'లాస్ మెస్

ద్రియోస్' అంటే ఒక జననం. 'లాస్ మెస్ ద్రియోస్' అంటే ఆకుపచ్చని గోళీకాయల
కనులున్న సర్పకన్యలు చేసే విన్యాసం.  'లాస్ మెస్
ద్రియోస్' అంటే దేవతలు మానవులతో చేసే పరిహాసం
పరిహారం లేని వేట వినోద చాతుర్యం. విన్నారా మీరు

ఇంతకు మునుపు ఇలా 'లాస్ మెస్ ద్రియోస్' లాస్ మెస్ ద్రియోస్ లాస్ మెస్ ద్రియోస్'...