30 November 2012

నన్ను వెళ్లిపోనివ్వు

నిన్నేమీ అడగను. దారి కాయకు. ఇన్ని చుక్కలు
పూల గుత్తుల్లా వెలిగి ఇచ్చిన ఆ
కొద్ది మసక కాంతినీ కాజేయ్యకు:

రాత్రి ఇంకా బాకీ ఉంది. తోవ చేసుకుని తెల్లవారికి
చేరాల్సిన దారి ఇంకా మిగిలే ఉంది.ఇక
పుచ్చుకున్న లాంతరులో ఆఖరి కాంతి
మిణుకు మిణుకు మంటుంది. రివ్వున

నువ్వై విచ్చుకున్న చెట్లలోంచి ఒక పక్షి
ఎగిరేపోతుంది. నా కల చెదిరేపోతుంది-
నిన్నేమీ అడగను. నా నిదుర కాయకు

వెళ్ళిపోతాను, మంచు చెమ్మై అలసిన భూమిలోకి-

నన్ను వెళ్లిపోనివ్వు.   

అగర్భం


అరవిచ్చిన బ్లేడు అంచున మెరిసి, అంచునంటి పెట్టుకుని
     కదులుతుంది ఒక వెన్నెల తీగ. నువ్వొక కవిత రాస్తూ 
     ఉన్నట్టయితే, దానిని నవ్వే నెలవంక అని ఉందువు-

వెదురు కుర్చీలో తనూ, ఎదురుగా తన పాదాల వద్ద నువ్వు.
     చీకట్లో అశోకా వృక్షాల వెనుకగా, ఆ వేసవి రాత్రిలో కమ్మగా
     పనస చెట్టు వాసన. తను కవయిత్రి కాదు: అందుకే 

జీరపోయిన గొంతుతో చెబుతుంది వాస్తవాన్ని: "Do you 
     smell that? That tree smells of Death. It smells of 
     our love. It smells of...". ఇక ఇరువురి పక్కగా ఆ 

అర్థరాత్రిలో దాదాపుగా శిధిలమయిన ఒక రమ్ బాటిల్.
     ఇంతకు మునుపే చెప్పాను మీకు, బకార్డీ రమ్ అని.
     అటు పక్కగా, నిన్నటి ఉదయం నుంచి తాగీ తాగీ, తాగీ 
     తిన్నవేవో కక్కిన ఆత్మ నెత్తురూ, ఈ జీవితపు మధువూ

ఆ నల్లటి పచ్చికలో. ఆ హాస్టల్ లాన్ లో. "మరి నాకు మెన్సెస్ 
     రాలేదు ఈ సారి. మరి ఏం చేద్దాం దానితో?" అని తను 
     యధాలాపంగా అడిగితే, నవ్వుతాను నేనిక అప్పటికే 
     ఛాతీపై కోసుకుని, ఎండుతున్న ఏడు కత్తి గాట్లని ఒత్తి

ఇంత నెత్తురు తడిని వేలితో నాలికపై రాసుకుంటో: రాత్రి 
     అంతే నింపాదిగా, ఆగి ఆగి చేమ్మగిల్లుతున్న గాటులా 
     తన గర్భంలోని పిండంలా నింపాదిగా నిలకడగా మరి 
     ఊపిరి పోసుకుంటుంది. దిగంతాలలో ఎక్కడో కానీ ఒక 

నిశ్శబ్ధ ఆక్రందన. గోడలపై నిర్విరామంగా పొడుగయ్యే నీడలు.
     తెరిచిన గది తలుపులోంచి, కిటికీ పైన కదిలే తోక తెగిన 
     బల్లి. కుత్తుక తెగినట్టు సుదూరంగా ఒక శునకమేదో---

తొలి వెలుతురు చినుకులు మట్టిని తాకేసరికి, ఇక మేం 
     ఒకరినొకరు గట్టిగా పట్టుకుని, ఎవరూ లేని వాళ్ళమై 
     వెక్కి వెక్కి ఏడ్చాం, గుండెలు చరుచుకుని నిండుగా 
     రోదించాం: ఒదలలేక, ఒదులుతూ తనే అంది: నానీ 
     నానీ, నువ్వంటే చాలా ఇష్టం కానీ..."అని. ఆ తరువాత

మరిక నాకే ఎప్పటికీ తెలియదు, ఆనాడు ఎందుకలా మేం 
     వెక్కి ఏడ్చామో, మరి ఇప్పటికీ అటువంటి రాత్రుళ్ళలో
     గర్భ స్రావమై చితికిన ఆ పిండాలు, ఇప్పటికీ ఈ తెల్లటి 

గోడలపై పసి శిశువుల నీడలై, మృత్యు పుష్పాలై నీ 
శరీరపు వాసనతో ఇంకా ఇక్కడ ఎందుకు 
లేత వేళ్ళతో నా కుత్తుకని నులుమి వేస్తూ 

ఎందుకు ఒక ఆదిమ బలిదానాన్ని గుర్తుకు తెస్తాయో.

( చదువుతున్నావా నువ్వు దీనిని? 
ఈ ఆగర్భ పురుషుడనైన నాతో? నీ)                 

29 November 2012

అగర్భం

అరవిచ్చిన బ్లేడు అంచున మెరిసి, అంచునంటి పెట్టుకుని
     కదులుతుంది ఒక వెన్నెల తీగ. నువ్వొక కవిత రాస్తూ 
     ఉన్నట్టయితే, దానిని నవ్వే నెలవంక అని ఉందువు-

వెదురు కుర్చీలో తనూ, ఎదురుగా తన పాదాల వద్ద నువ్వు.
     చీకట్లో అశోకా వృక్షాల వెనుకగా, ఆ వేసవి రాత్రిలో కమ్మగా
     పనస చెట్టు వాసన. తను కవయిత్రి కాదు: అందుకే 

జీరపోయిన గొంతుతో చెబుతుంది వాస్తవాన్ని: "Do you 
     smell that? That tree smells of Death. It smells of 
     our love. It smells of...". ఇక ఇరువురి పక్కగా ఆ 

అర్థరాత్రిలో దాదాపుగా శిధిలమయిన ఒక రమ్ బాటిల్.
     ఇంతకు మునుపే చెప్పాను మీకు, బకార్డీ రమ్ అని.
     అటు పక్కగా, నిన్నటి ఉదయం నుంచి తాగీ తాగీ, తాగీ 
     తిన్నవేవో కక్కిన ఆత్మ నెత్తురూ, ఈ జీవితపు మధువూ

ఆ నల్లటి పచ్చికలో. ఆ హాస్టల్ లాన్ లో. "మరి నాకు మెన్సెస్ 
     రాలేదు ఈ సారి. మరి ఏం చేద్దాం దానితో?" అని తను 
     యధాలాపంగా అడిగితే, నవ్వుతాను నేనిక అప్పటికే 
     ఛాతీపై కోసుకుని, ఎండుతున్న ఏడు కత్తి గాట్లని ఒత్తి

ఇంత నెత్తురు తడిని వేలితో నాలికపై రాసుకుంటో: రాత్రి 
     అంతే నింపాదిగా, ఆగి ఆగి చేమ్మగిల్లుతున్న గాటులా 
     తన గర్భంలోని పిండంలా నింపాదిగా నిలకడగా మరి 
     ఊపిరి పోసుకుంటుంది. దిగంతాలలో ఎక్కడో కానీ ఒక 

నిశ్శబ్ధ ఆక్రందన. గోడలపై నిర్విరామంగా పొడుగయ్యే నీడలు.
     తెరిచిన గది తలుపులోంచి, కిటికీ పైన కదిలే తోక తెగిన 
     బల్లి. కుత్తుక తెగినట్టు సుదూరంగా ఒక శునకమేదో---

తొలి వెలుతురు చినుకులు మట్టిని తాకేసరికి, ఇక మేం 
     ఒకరినొకరు గట్టిగా పట్టుకుని, ఎవరూ లేని వాళ్ళమై 
     వెక్కి వెక్కి ఏడ్చాం, గుండెలు చరుచుకుని నిండుగా 
     రోదించాం: ఒదలలేక, ఒదులుతూ తనే అంది: నానీ 
     నానీ, నువ్వంటే చాలా ఇష్టం కానీ..."అని. ఆ తరువాత

మరిక నాకే ఎప్పటికీ తెలియదు, ఆనాడు ఎందుకలా మేం 
     వెక్కి ఏడ్చామో, మరి ఇప్పటికీ అటువంటి రాత్రుళ్ళలో
     గర్భ స్రావమై చితికిన ఆ పిండాలు, ఇప్పటికీ ఈ తెల్లటి 

గోడలపై పసి శిశువుల నీడలై, మృత్యు పుష్పాలై నీ 
శరీరపు వాసనతో ఇంకా ఇక్కడ ఎందుకు 
లేత వేళ్ళతో నా కుత్తుకని నులుమి వేస్తూ 

ఎందుకు ఒక ఆదిమ బలిదానాన్ని గుర్తుకు తెస్తాయో.

( చదువుతున్నావా నువ్వు దీనిని? 
ఈ ఆగర్భ పురుషుడనైన నాతో? నీ)                   

అ(నా)త్మ పదాలు (prelude)

తల వంచుకుని ఇంటికి నడుచుకుని వస్తావు నువ్వు. ఇక నీ కాళ్ళ కింద లేత సూర్య కాంతి  పసుపు నీళ్లై పోర్లిపోవడం చూస్తావు. తల పైన చెట్ల కొమ్మలు గాలికి జలదరిస్తే, నీ పాదాల వద్ద నుంచి గుప్పున లేచి గుంపుగా ఎగిరిపోతాయి ఆకుల నీడలు: ముఖ్యంగా, రావి ఆకులు, ఎవరివో కన్నీళ్ళని దాచుకున్నట్టు ఉండే , మౌనముద్ర లోంచి లేచి, పొర్లి పొర్లి పారే నీళ్ళ సవ్వడితో నిన్ను మరో దిగులు లోకాలకి తీసుకుపోయే రావి ఆకులు. అవే నువ్వు నడుస్తూ ఉండగా గుర్తుకు వచ్చే ముకుళితమయిన ముఖాలు. తలుపు చాటు నుంచి చేయి ఊపుతున్నట్టూ, అరచేతిలో ఆఖరిసారిగా క్షణ కాలం అరచేయి ఉంచి వెనకకి లాక్కుని, బలవంతపు నవ్వుతో చిట్లిన పెదాలతో వీడ్కోలు అయ్యినట్టూ 

నీ రక్తంలో రక్తం అయిన వాళ్ళూ, నీ గుండెలో ఊపిరి అయిన వాళ్ళూ ఎవరిని పిలవాలన్నా వాళ్ళను పిలిచే పలుకు అలవాటయ్యి నీ నోటి నుంచి వారి పేరు తప్ప మరో పేరు రాని వాళ్ళూ, వాళ్ళే గోధూళి వేళ రేగిన చీకట్లలో మిణుకు మిణుకు మంటూ కనిపిస్తూ, ఎంతకూ నువ్వు దరి చేరలేని వాళ్ళూ , నువ్వు వొదిలి వేసుకున్న వాళ్ళూ, నువ్వు చివరిదాకా ఉందామనుకున్న వాళ్ళూ నీకు చివర అయిన వాళ్ళూ నిను చిత్తుగా ప్రేమించిన వాళ్ళూ నిన్ను ప్రేమించి చిత్తయిన వాళ్ళూ  నీ శరీరాలంత సలుపుడు పుండులై నువ్వు నీ చితి దాకా మోసుకు తిరిగే వాళ్ళూ సర్వమూ అయ్యి ఏమీ కాని వాళ్ళు ఏమీ లేక నీ వద్దకు వచ్చి ఒక గూడుని కట్టుకుని పిల్లలని కానీ పెంచుకుందామనుకున్న వాళ్ళూ పిల్లలూ లేకా నువ్వూ లేకా రాకా రెక్కలు విరిగి శిగమెత్తి రోదించే వాళ్ళూ తెల్లని వాళ్ళూ నల్లని వాళ్ళూ ఛామన ఛాయ వాళ్ళూ ఒళ్ళున్న వాళ్ళూ ఒళ్ళు లేని వాళ్ళూ నిన్నొక స్మృతి చిహ్నంగా వెలిగించిన ప్రమిదెల కింద దాగిన నీడలలో తల దాచుకుని తలుచుకునే వాళ్ళూ, వాళ్ళే 

నువ్వు తల వంచుకుని ఇంటికి నడచి వస్తున్నప్పుడు, ఈ గాలిలో ఈ చెట్లల్లో నీ చుట్టూ ఎగిరే పురుగులలో వాలిపోయిన సీతాకోకచిలుకలలో ముసురుకునే చీకట్లలో స్థంబించిన నిప్పులో వీధి దీపాలలో చేయి చాచి ముందుకు వచ్చి కపాలం వంటి అరచేతిని వొణుకుతూ నీ ముందు ఉంచే భిక్షగత్తేలుగా మార్చబడిన తల్లులతో దారి పక్కగా ఆగి ఉన్న వేశ్యలతో అద్దిన నెత్తురు ఎండి పెళుసుగా పగులుతున్న పెదాలలో పిల్లలు లేని పాలిండ్లలో ఏడ్చే యోనులలో ఇక ఏడ్వలేక ఆగిపోయిన అనాధ పసిపిల్లలలో పగిలిన పాదాలలో పగలే లేని జీవన ఎడారులలో, మరి 

ఎక్కడ చూచినా నువ్వే అయితే, కన్నా, ఇక అతడొక్కడే ఒక్కడై దేహాత్మలు లేక దేవులాడుకుంటూ కబోధివలె తడుములాడుకుంటూ, ఈ స్మశాన మహాసామ్రాజ్యాలలో

పగిలీ 
విరిగీ 
చిరిగీ
 తన హృదయాన్ని
 తన అరచేతిలోకి
 తనే తీసుకుని
 తనే
 తినీ
 తినీ
 తినీ
 నమిలీ
 నమిలీ
 నమిలీ
 ఇక ఊస్తే 
నెత్తురుతో చెల్లా చెదురైన
 ఈ పదాలు
మరి నీకే.
                           

దారిలో


ప్రతి ఉదయాన్నే, ఇళ్ళలోంచి గోడలకు పైగా రోడ్డు పైకి వాలిన కొమ్మలకి పూసిన పూలను తెంపుకునేందుకు వస్తారు  ఒక ముసలావిడా, తన మనవరాలూ ప్రతి రోజూ ఒక పూలబుట్టతో. ఆ లేత పొగమంచంతా ఆ పిల్ల మాటల సవ్వడకి కాబోలు రెక్కలు విదుల్చుకుని తటాలున ఎగిరే పోతుంది. తను పట్టుకున్న ఆ ముసలి తల్లి అరచేతి వెచ్చదనానికి కావొచ్చు, మరి తూర్పున కొంత తొందరగానే సూర్యోదయం.  

ఏమిటంటే, తెంపుకునే ఆ పూవులు పూజకు కావచ్చు. ఏ  దైవ పాద సన్నిధికో కావొచ్చు . వాకిలికి కట్టు  కునేందుకు  కావొచ్చు. తలలో అలంకరించుకునేందుకు కావొచ్చు. దేనికీ, ఎవరికీ  కాకపోవొచ్చు. 

దేనికో, ఎందుకో నీకు తెలియదు కానీ, వాళ్ళను చూస్తూ ఇక మరి అక్కడే నిస్సహాయంగా నువ్వు నీలో మునిగీ దారీ తెన్నూ మరచి. మరి ఇక ఈ దినానికల్లా నీ ఆశ  ఏమిటంటే, ఆ  కొమ్మని వొంచినట్టు ఎవరో  నిన్ను తేలికగా వొంపి, మెత్తగా తుంపి నిన్ను పూజకు అర్హత కావిస్తారనీ, నీ పద సన్నిధికి నిన్నే ఎవరో అంతిమంగా సమర్పిస్తారనీ.

మరి ఇకా తరువాత ఏం జరుగుతుందని అడగకు నువ్వు, నిన్ను తను తన తనువు బుట్టలో దాచుకుని నుదుట బొట్టుతో వొంటరిగా కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళే దారిలో- 

28 November 2012

ఆ(నా)త్మ కధలు 1.


ఎలాగూ వంట చేయడం రాదు కదా మనకి, ఇక సరేనని చూసుకుందాం లెమ్మని, లేలెమ్మని హాస్టల్లో నా గదిలో  

ఒక గిన్నె అప్పు తెచ్చుకుని, ఇంత ఎద్దు మాంసం పుచ్చుకుని ఆ కుక్కర్లో వేసి ఇక దాని ముందు కూర్చున్నాం నువ్వూ నేనూ. అంతటితో ఆగక ఒకటే పడిగాపులు, అది ఎప్పుడు అవ్వుతుందా అని, అది ఎప్పుడు ఉడుకుతుందా అని మనం ఆ రాత్రి మన పక్కన చల్లగా జేరిన మధుపాత్రలతో రెక్కలు విప్పిన ఓ వెన్నెలతో, (మరి దబుష్ దాని పేరు, తెల్ల పూలగుత్తి వంటి ఆ పిల్లి పేరు) మన స్త్రీలను గురించీ, మనకు దక్కని స్త్రీల గురించీ, ఇంకా స్త్రీలు కాని అమ్మాయల గురించీ కొన్ని వింత మాటలతో ఆటలాడుకుంటూ మనం,  సరే మనకెలాగూ వంట చేయడం రాదు కదానీ, సరే మనకెలాగూ లాగుల లేవు కదానీ, సరే మనకెలాగూ ఇక ఈ లోకంతో పని ఏమీ సంబంధం ఏమీ కదా అనీ  : మరే

అయితే ఇక తొందర ఆగక, ఆగలేని తొందరతో ఆ స్టవ్ ముందు, ఆవిరి ఆవిరయ్యేదాకా ఇక కూర్చోలేకా , ఆవిరి అవిరయ్యేదాకా ఆగాలని తెలీకా, ఇక నిను చూస్తో వీరగర్వంతో నవ్వుతో నీకు మహా నల భీమ పాకపు మెళుకువలు బోధిస్తో, గుక్క గుక్కగా రమ్ ని నువ్వు హే రామ్ అంటో తాగుతుండగా, ఓం తత్సత్ అంటో నువ్విచ్చిన నెత్తురు విల్ల్స్ ని నేనొక సాధువులా పీలుస్తుండగా ఏం చేసాను నేను?        

మరే, మరి నువ్వు నీ ప్రియురాలి దగ్గరనుంచి బ్రతిమాలుకుని, తన గదిలోంచి తెచ్చుకున్న ఆ కుక్కర్ ను ఇక ఆలాస్యం చేయక, నీ సూచనలని అవలంభించక, దానిని తెరిచేందుకు ప్రయత్నించీ తెరవలేక, మత్తెక్కిన ఒక కచ్చతో, అల్లం వెల్లుల్లీ కలగలసిన మాంసం వాసన కల్పించిన మైమరుపుతో, ఇక లాగుతాను కదా ఆ మూతను నా సర్వ శక్తులనూ ఒడ్డీ, ఇక చూడు అప్పుడో విస్ఫోటనం: ఎవరి శాపాల వడ్డీతోనో పేలుతుంది డ్డామ్మని నీ మళయాళపు లలన ప్రాణం, స్టవ్ పై నుంచి ఎగిరిపోతుంది ఆ కేరళా పాత్రా మన ఆత్రుతా మన గాత్రం గోత్రం దీవెనా ప్రార్ధనా పాపం. మరిక చూడు అప్పుడు నీ ముఖం నా ముఖం 

హే కృష్ణా, జీసస్ అల్లహా, పాత్ర మూత ఎక్కడికో కొట్టుకుపోయి, చిమ్ముతాయి మరి నా ముఖం నిండా, నా గది నిండా ఫాను పైనా టేబుల్ పైనా లైటు పైనా షెల్ఫ్ పైనా నీ షర్టుపైనా, జుత్తుపైనా కాలుతూ, నాసికల పై నుంచి మెల్లిగా జారుతో, గుప్పిళ్ళతో ఆకాశం నుంచి ఎవరో ఇకిలిస్తూ నక్షత్రాలని వెదజల్లినట్టు, ఒక వెన్నెల చినుకులని తుంపరగా    జల్లినట్టు,  చక్కగా ఉడికిన ఆ ఎద్దు మాంసం ముక్కలు కమ్మని పుదీనా వాసనతో: ఇక అందుకే 

విధి వంచితులమై, ఏమీ చేయలేక, ఏమీ చేయ రాక ఆ గదిలో ఉండలేకా వెళ్ళాలేక, "వొద్దంటే విన్నావా మామా, మూత ఇంకా ఉంచాలి అంటే విన్నావు కాదు" అని నువ్వు అంటే ఇక నేను ఆ ముక్కల్ని ఏరుకు రాగా, మందు తాగి హాయిగా వెళ్లాం మనం మళ్ళా నిస్సిగ్గుగా మన స్త్రీల గదులకి హిహ్హిహ్హీ అనుకుంటో, అన్నానికి  ఇన్ని డబ్బులు అడుక్కునేందుకు, ఒక ప్రియమైన సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలతో, మన వీరోచిత వంట మహాకధనాన్ని అందరికీ   ఘనత వహించిన మహారాజశ్రీ వదనంతో చెబుతో అభినయిస్తో ఆనందిస్తో- 

మరి రమా, మరి ఇవాళ  ఇదంతా ఎందుకంటే, మనం లేని ఆ గదుల ముందు నేను ఇప్పుడు నడుస్తుంటే, ఇప్పటికీ ఆ గుమ్మాల ముందు తిరుగుతున్నాయి నీ నా ఆత్మలు పురాకృతమై, ఒకప్పుడు బ్రతికిన ఆ కాలాలై ఆ లోకాలై  అ అక్కడ నుంచి వెళ్ళలేకా అక్కడకి తిరిగి పోలేకా, కళ్ళల్లో చితులతో, బాహువుల్లో సమాధులతో, ఎప్పుడో దారి తప్పి వెళ్ళిపోయిన మన దబుష్ తో, ఆ తెల్లని కుక్కతో, ఇక ఎప్పటికీ తిరిగి పచ్చిక పైకి మన వద్దకి తిరిగి రాని దాని చిన్ని చిన్ని పిల్లలతో-  

27 November 2012

నేనూ, నా అ/జ్ఞానం

వేళ్ళ చివర్లని నీటి రంగులలో ముంచి
     ముద్రికలై తెల్లటి గోడల మీదా, కాగితాల మీదా వాలతారు పిల్లలు
     మరే, నువ్వు కవిత్వమని గీసుకున్న పిచ్చిగీతల మీద కూడానూ: 

వాళ్ళ బొటన వేళ్ళపై ఉంటాయి అప్పుడు ఆకాశాలు నారింజ రంగులతో 
వాళ్ళ కళ్ళల్లో వీస్తాయి అప్పుడు ఉవ్వెత్తున అరణ్యాల శీతల పవనాలు 
గూడు కట్టుకుంటాయి వాళ్ళ శరీరాల్లో
కాంతి ప్రపంచాల తెల్లని తేనె పిట్టలు - 

బుగ్గలపై,  ముంజేతులపై, నుదిటిపై 
అప్పుడే స్నానం చేయించి వాళ్ళమ్మ
తొడిగిన పూల దుస్తులపై నిండా శాంతిగా హాయిగా ఇష్టంగా ఒలికిన 
రంగులు. అవి వాళ్ళ నవ్వులూనూ-

తప్పుకుని, తప్పుకుని  నువ్వేమో 
కడు జాగ్రత్తగా పిల్లి పిల్ల వలే బహు
నేర్పరితనంతో పోగుచేసుకున్న జ్ఞానంతో లౌక్యంతో లోకానికి లోకాన్ని 
ఎలా ఉద్ధరించాలో చెబుదామని అలా 

కదులుతావు కదా ముఖ పుస్తక తెరల ఆ  
కరకు దంతాల మాయా పేటికకు ముందూ
అప్పుడు తటాలున ఒకరినొకరు వెంటాడుకుని వచ్చి నువ్వు రాసుకున్న
కాగితాలపై నీ ఇనుప సంభాషణలపై ఏడూ 
రంగుల వానలై ఏడూ రంగుల జలపాతాలై

డ్డామ్మని కురిసి, రాలి నిన్ను పూర్తిగా తడిపి 
వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళే, నీటి రంగులతో 
కలల అలజడులతో కదిలే పాపం పుణ్యం ఆత్మా దేహం ఎరుగని నీ పిల్లలు.
ఇక గదిలో తటాలున వెలిగిన వెన్నెల్లో కొన్ని 
సీతాకోక చిలుకలు ఎగిరి,  నీ కళ్ళ అంచున నలిగిన కన్నీళ్ళ అంచులపై 
వాలి, ముని వేళ్ళతో నిన్ను దయగా ప్రేమగా 

నిమురుతుండగా, రంగులతో కలగాపులగమైన 
నీ అక్షరాలని చూస్తూ అనుకుంటావు నువ్వు:

"మరే. మరి ఇన్నాళ్ళకు ఈ పదాలయితే విముక్తి 
చెందాయి కానీ, మరే మరి నేనూ, నా అ/జ్ఞానం?"        

అతను

మూడ్రోజులుగా తిండి లేక, ఉదయం నుంచి మందూ లేక
     వొణుకుతూ నీ గుమ్మం ముందుకు వస్తే, ఉమ్మూస్తూ
     అంటావ్ కదా "హే, పోరా లంజాకొడకా, నీయమ్మని...

ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నావంటే గుద్ద పగలకొడతా..."
     అని అంటావు కదా అప్పుడు నువ్వు నీ పొరుగువారి
     పట్ల ప్రేమతో, మరి డోక్కుపోయిన డొక్కతో నేనే ఇక

చివికిపోయిన షర్టుతో, ముక్కు తుడుచుకుంటూ
     ముక్కు ఎగబీల్చుకుంటూ వెళ్ళిపోతాను, నీ
     దేహ దేవాలయాల ముందుగా మరి నీ ఆత్మ
     ప్రార్ధనల సాక్షిగా, ఇదిగో మరి ఇక్కడి నుంచే

నను గన్న మాయమ్మ అమ్ముకున్న పాలిండ్ల వద్దకే
మరి తన పవిత్ర పాత్ర వద్దకే, దేశాన్నంతా అడుక్కుని
తెచ్చుకున్న గుప్పెడంత చద్దన్నం ముద్దతో, చావుతో

ఇనుప దారులలో విరిగిన చీకటి పందిట్లలో మెరిసే
ఆ వెన్నెల నెత్తురు కిందకీ, తన
బాహువుల బొమికలలోకీ ఇలా   

ఆత్మ లేక ఆశ లేక అమ్ముకోలేక అమ్మకం కాలేక నీ
చంకల కింద చిలుకనై నిన్నే వల్లె వేస్తూ మిగలలేక-  

26 November 2012

కృతజ్ఞత/కృతఘ్నత

ఈ హృదయాన్ని
నాగళ్ళతో దున్ని, విత్తనాలు చల్లి ఆపై నీళ్ళని నాపై చిలుకరించీ
నన్ను గాలికీ ఆకాశానికీ భూమికీ
కాంతికీ వెన్నెలకీ, చల్లటి  చీకట్లకీ

ఒక తల్లి
స్థనానికీ, రెండు దోసిళ్ళతో నను కడు జాగ్రత్తగా అందించింది నువ్వే:

పమిటెను దోపి, రాత్రిని దూరం చేసే గోరంత
వెచ్చదనాన్ని ఇంటిలోకి తెచ్చేందుకు ఎవరో ఒక స్త్రీ
ఓపికగా, శాంతిగా ఒక దీపం వెలిగించినట్టు-   
   
మరో దారి లేదు. రా. తలుపులు మూసి, ప్రమిదెను ఆర్పి
నీ శరీరాన్ని తెరువు. ఎండిన నా రెండు అరచేతులతో నా
అరచేతులలో నిన్ను పూర్తిగా నింపుకుని

ఆత్మ లేని ఈ జీవితపు గుక్కెడు దాహాన్ని తీర్చుకుంటాను

నీ పట్ల సర్వత్రా ఉన్న ఒక
కృతజ్ఞతతో, కృతఘ్నతతో- 

24 November 2012

"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో..."

"అనేకసార్లు పడుకుని ఉంటాను, అతనితో
     ఎందుకని అడగకు. కొన్నిసార్లు ఇలా
     ఉండదు జీవితం - పూలూ ఆకాశం వానా వెన్నెలా అనంతమైన ప్రేమా

అంతా ఒక అబద్ధం.వాడుకోబడి
రాత్రిలో నడిరోడ్డుపై వొంటరిగా, నువ్వు వదిలివేయబడి
ఆకలయ్యి దాహం అయ్యి ఒక

ఒంటరివై, అంధ బిక్షువై, ఒక
అనాధ ఆశ్రమంకై శరనార్ధియై వెదుక్కోవడమే నిజం. శరీరం నుంచి శరీరానికి
దారీ తెన్నూ లేక తరిమి తరిమి
వేయబడటమే అంతిమ సత్యం:

Do not talk all that, ages of
romantic bull shit with me-
And do not frame me either, fucker": అని ఇక తను నగ్నమయినప్పుడు తన

పాలిండ్లపై, తన నాభిపై తొడలపై
మృగాలు, తమ ఖడ్గ దంతాలతో
తమ నల్లటి పొడుగాటి గోళ్ళతో తనని నింపాదిగా చీరిన నెత్తురు మరకలు
ఎన్నడో ఆవిరయ్యిన కన్నీళ్లు-

ఇక నేను, తనకి ఏమీ చెప్పలేక
ఇక నేను, తనకి ఏమీ అవ్వలేకా
తనని గాట్టిగా కావలించుకుని తొలిసారిగా వెక్కి వెక్కి ఏడ్చాను

"I like this night and
I like this Bacardi rum
Do you?" అని తను నవ్వుతో, కొంచెం మత్తుగా కొంచెం దిగులుగా కొంచెం బాధగా
అడిగిన రాత్రి, నా తల్ల్లులూ
చెల్లెళ్ళూ అక్కలూ అనాది
ఆదిమ స్త్రీలూ ఒక్కసారిగా

ఎందుకో గత జన్మలయ్యీ, పునర్ జన్మలయ్యీ అనంతంగా గుర్తుకువచ్చి- ఎందుకో.       

23 November 2012

"I like this night and I like this Bacardi Rum. Do you?"

నువ్వా రాత్రి నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడు
     నీ నోరంతా చిక్కగా కాగిన బెల్లం వాసనా, మరి కొంత అగ్నీనూ.
     ఊపిరాడక గించుకుని, నీ చేతుల్లోంచి  తప్పించుకుని వెనకకి 
     వాలి శ్వాస తీసుకుంటుంటే పడీ పడీ నవ్వుతావు కదా నువ్వు

అప్పుడు ఆ నా చిన్ని గదిలో, మబ్బులూ పిచ్చిగా ఊగే చెట్లూ 
     దుమ్మూ దుమారమూ, మరి సన్నగా మొదలయ్యే తుంపరానూ.
     "భయపడ్డావా" అంటూ తెగిన పెదాల పైనుంచి నెత్తురిని మెత్తగా నీ 
      తెల్లటి దుప్పట్టాతో తుడిచినా, నా లోపలి వొణుకు ఆగదు. 

'మండుతుంది' అని అంటాను, నొప్పిగా ముఖం పెట్టి. మరి మళ్ళా 
     నవ్వుతో అంటావు కదా నువ్వు: "మరి, వొద్దూ వొద్దు అంటుంటే 
     నాకు మందు తాగించింది ఎవరు? ఇలా దగ్గరికి రా. కొరకనులే
     ఈ సారి. భయపడకు" అంటూ మళ్ళా తనే, నన్ను జాగ్రత్తగా 

తన తల్లితనపు పాలిండ్లలో పొదుపుకుని:  ఇక అలా వెచ్చగా ఒదిగి 
     తన చుట్టూ చేతులు వేసి, తనని గాట్టిగా పట్టుకుని 
     ఆ చీకట్లలో నా ముఖం దాచుకుని, అలా పడుకుని 
     బయట కురిసే వాననీ, తన  శరీరంలోని ప్రవాహాన్నీ
     వింటుంటే అడుగుతుంది తను, స్ఖలించినంత హాయిగా:

"I like this night and 
I like this Bacardi Rum. 
Do you?" 

మన అమ్మలు

వాకిట్లో గోడకి జారగిలబడి, ఉదయపు ఎండలో
      జుత్తు చిక్కు తీసుకుంటూ ఒడిలోని తువ్వాలుపై దువ్వెనలో పేలను వెదుక్కునే
      ముసలి అమ్మలను చూసి ఉండవు నువ్వు ఎప్పుడూ- 

అప్పుడు, వాళ్ళ ముఖాలపై నీడలు ముడతలుపడి దీర్ఘంగా సాగుతాయి. నొసలు చిట్లి
      సాలోచనగా ఎక్కడో కోల్పోతారు వాళ్ళు. శీతాకాలపు గాలికి వొణుకుతాయి అలా
      మొక్కలు. వీధిలో నిర్విరామంగా ఆరుస్తూ, గెంతుతుంటారు పిల్లలు. ఒక పక్కగా
      వంట గదిలోని గిన్నెలని పోగేసుకుని, మట్టి కాళ్ళతో చేతులతో మాటలు లేకుండా
      బొమ్మలకి దుస్తులు వేస్తూ, జుత్తుని సరిదిద్దుతూ, వాళ్ళే

ఐదారేళ్ళ పాపలు, మెరిసే కళ్ళతో. అవతలి ఇంటిలో ఎక్కడో వెనుక బట్టలు ఉతుకుతూ
       మధ్యలో పిల్లలని కేకవేస్తూ, తిరిగి అన్యమనస్కంగా దుస్తుల్ని పిండుతూ తల్లులు.
       గాలికి జల జలా రాలుతాయి అప్పుడు, పాలిపోయిన వేపాకులు: సగం తిన్న
       ఆకుపై నుంచి, విచ్చుకున్న పూవుపై నెమ్మదిగా కదులుతుంది ఒక గొంగళి
       పురుగు. కొమ్మల్లో ఎక్కడో నువ్వు చూడలేని ఒక పక్షి కూత - తనని తాను
       కోల్పోయిన, ఇక  ఎగరలేని రెక్కల తపన. చెట్టు బెరడు పైనుంచి ఒక ఉడుత
       తటాలున చెమ్మగిల్లిన నల్లటి మట్టిపైకి దుమికి, తన వైపు క్షణ కాలం చూసి   
       తన కనులలో కనులు కలిపి కదులుతుంది కదా, సరిగ్గా అప్పుడే

వీధిలోని పిల్లలు తాము ఆడుకునే బంతి తన వాకిట్లో పడగా, వచ్చి అడుగుతారు
       'ఓమ్మా, బాల్ పడింది. ఇవ్వవా' అంటూ. తనలోంచి తాను బయటకి వచ్చి
       తను ఒక నిట్టూర్పుతో, మోకాళ్లపై చేయి ఉంచి అతి కష్టంపై పైకి లేచి, నిన్నే
      ఈ అక్షరాలని చదువుతున్న నిన్నే అందుకుని వాళ్ళ చేతులకు అందించి

ఇక
వొణుకుతూ కరుగుతూ పగులుతూ, ఒంటరి చీకట్లతో తెల్లటి నీడలతో పగిలిన అద్దమై
ఇంటిలోకి నెమ్మదిగా కదిలి, కనుమరుగవ్వుతూ, మొదటిగా చివరిగా ఎప్పటికీ తనే -  

21 November 2012

చూడు

గడప లేని ఒక రాత్రిని ఇలా గడపవచ్చు నువ్వు:

అనేక హస్తాలూ, అనేక నయనాలూ నీలో జనినించి

వీచే గాలీ, రాలే పూలూ ఎగిరే
సీతాకోకచిలుకలూ కలవరంగా
కదిలే చెట్లూ, చెమ్మలాగా

పొరలాగా నీ పైనుంచి  అలుముకునే చీకటి కాంతీ
ఇవేమీ బయట లేవనీ, అన్నీ నీలోంచి వెలుపలికి
ప్రసరిస్తున్నాయనీ

వాకిళ్ళు లేని ఇంటిలో కూర్చుని తెలిసిననాడు
నీతో చల్లగా, తోడుగా అమృత
మయమై ఒక మధుపాత్రా ఓ
చిన్ని గిన్నెలో పాత పచ్చడీ

మరి చీకట్లో నువ్వు ఇష్టంగా వెలిగించుకుని అర
చేతులలో దాచుకున్న, వొత్తి చివరన ఎగిసే
తన శరీరమంత తెల్లని పసుపు మంటానూ-

 మరి ఇక నీ స్నానాల గదిలో తను అద్ది మరచిన
ఒక ఎర్రని టిక్లీ నెత్తురు మరకలా అద్దంపై కాలంతో
కరిగి రంగు వెలసి, చివరికి
ఒక శ్వేత మృతస్పటికంలా

నిన్నొక సూక్ష్మ కేంద్రాన్ని చేసి నలుదిశలా ఎలా
వెదజల్లుతుందో - చూడు.  

20 November 2012

జణ గణ మన అంబానీ అను రిలయన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

శ్వేత సౌధం మీద కూర్చుని తప్పక అమ్ముకుంటావు
చివరికి నా ప్రాణవాయువునీ.

విపణిలో లబ్ధికై తప్పక ప్రచారం చేస్తావు
శీతలమైన అరలలో, గాలి అసలే ఆడని
పోట్లాలలోని, తాజా తల్లి పాల గుణాలనీ .

మరి
రైతులనీ, పంటలనీ సర్ధే పెడతావు
వరసగా అంగట్లో, తెల్లని వరసలలో

పల్చని పొరలని మా ముఖాలపై మృత్యువస్త్రం వలే కప్పి.

ఇక క్షురశాలలే పెడతావు దేశమంతటా
వీధి చివరి క్షురకుల నోళ్లల్లో మన్నే కొట్టి.
ఇక తాజాగా తాపీగా కట్టే, కుంటావు ఒక
పాలరాతి ఆకాశ హర్మ్యాన్ని పౌరులను పునాదులుగా పెట్టి.

ఇక
ఈ దేశపు చెవులలో, కనులలో అలాగే
పెడతావు ఒక పెద్ద తంత్రీ తంత్ర ప్రసార
మహా మాయా విషపుష్పాన్ని నీ
నిత్య వ్యాపార దండకాన్ని పటించి

హస్తాల కమలాల ముద్రికల తోడుగా, సాక్షిగా
నీ కంపనీ దుస్తులనే తొడుగుతావు మాకు
ముందుగా మమ్మల్ని పూర్తిగా నగ్నం చేసి
ఆపై మున్ముందు ఘనీభవించిన బాటిళ్ళలో
మా రక్తాన్నే మాకే అమ్ముతావు నిర్భీతిగా
మా ఈ శరీరపు బావులను మా ముందే తోడి:

 ఇక మిగిలి ఉంటే ఏమన్నా చివరికి
స్థనాలను కోల్పోయి తిరిగే స్త్రీలతో నీ
స్త్రీ ఆడుకునేందుకు హర్ష నృత్యాలే చేయిస్తావు
జూదపు క్రీడల ఐపిల్ మైదానాలలో జత కూడి-

అన్నా, అంబానీ - ఈ దేశపు సర్వాంతర్యామీ

నువ్వు కంకాళమయం చేసిన ఈ దేశానికి
చితి అంటించి, ఆ చితాభస్మాన్నీ పాకెట్లలో
పవిత్ర పుణ్య ప్రసాదంగా అమ్ముకోక మునుపు    

మిగిలి ఉందా ఇంకేమైనా, నా ఈ శరీరంపైనా
నా ఈ శరీరం లోపలా నువ్వు వ్యాపారం చేసి
తవ్వుకోనిదీ, తోడుకోనిదీ, వాడుకోనిదీ, వదులుకోనిదీ?  

19 November 2012

ఆదిమ బలిదానం

చల్లటి నీడలలో, వానకి పిచ్చిగా తడిచిన

గుల్ మొహర్ పూల చెట్లు
ఒక్కసారిగా వీచిన గాలికి
తనువులు జలదరించి ఇక   

ఎర్రెర్రని  పూలని పకాల్మని
ఒక నవ్వుతో పడకపైనంతా
విరజిమ్ముతాయి-     

అవే, నెత్తురు ఎగతన్నుకు వచ్చి
మెత్తగా విచ్చుకుని నిన్నుగట్టిగా
తమలోకి లాక్కుని వాటేసుకునే
ఆ పిచ్చి గుల్ మొహర్ పుష్పాలు

నిన్ను ఎప్పుడూ ఏమీ అడగని
పుష్పాలు, నిన్ను వదలలేని
నీకు అర్ధం కాని ఎర్రని వెన్నెల
పుష్పాలు. నీ మెలుకువలో నీ
నిదురలో జ్వలించే పుష్పాలు-  

ఇక అందుకే ఆ రాత్రంతా, అతనిలో  

ఒక అడవీ, ఒక సముద్రమూ 
ఒక ఇప్పపూల వానా మరి 
ఒక ఆదిమ బలిదానమూనూ-   

ఆదిమ బలిదానం

చల్లటి నీడలలో, వానకి పిచ్చిగా తడిచిన

గుల్ మొహర్ పూల చెట్లు
ఒక్కసారిగా వీచిన గాలికి
తనువులు జలదరించి ఇక   

ఎర్రెర్రని  పూలని పకాల్మని
ఒక నవ్వుతో పడకపైనంతా
విరజిమ్ముతాయి-     

అవే, నెత్తురు ఎగతన్నుకు వచ్చి
మెత్తగా విచ్చుకుని నిన్నుగట్టిగా
తమలోకి లాక్కుని వాటేసుకునే
ఆ పిచ్చి గుల్ మొహర్ పుష్పాలు    

నిన్ను ఎప్పుడూ ఏమీ అడగని
పుష్పాలు, నిన్ను వదలలేని
నీకు అర్ధం కాని ఎర్రని వెన్నెల
పుష్పాలు. నీ మెలుకువలో నీ
నిద్రలో జ్వలిచే పుష్పాలు-  

ఇక అందుకే ఆ రాత్రంతా, అతనిలో  

ఒక అడవీ, ఒక సముద్రమూ 
ఒక ఇప్పపూల వానా మరి 
ఒక ఆదిమ బలిదానమూనూ-   

ఆమె

ఆమె నవ్వడాన్ని, తరచూ చూడవు నువ్వు.

వంటలో నిమగ్నమై, హటాత్తుగా తల ఎత్తి
మసి అంటిన అరచేతితో తన
ముఖాన్ని తుడుచుకుంటూ

నీ  వైపు చూసి ఆప్రయత్నంగా నవ్వుతుంది తను.

మరి ఇకా
తరువాతా, ఆ రాత్రి అంతా
మండుతూనే ఉండింది ఆ
కట్టెల పొయ్యి అప్రతిహతంగా, ఉజ్వలంగా-

చివరికి నువ్వొక్కడివే ఆ నిప్పుల ముందు
అక్కడ: చీకట్లో- నింగిలోకి ఎగిసే
ఒక తెల్లని పొగవై- మిగిలిపోయి. 

18 November 2012

శిక్ష :-)

చలికి గజ గజా వణుకుతూ, రాత్రిలోంచి
    అధాటున దూకి ఇంటిలోకి వచ్చి, ఒక 
    టామీలా ముడుచుకుని, ఇంకా పళ్ళు 
    పట పటా కొట్టుకుంటూ వాలుకుర్చీలో
    కూర్చుని నా మానాన నేను ములుగుతా ఉంటే

వెనుక నుంచి వచ్చి, ధడాలున 
    రెండు మగ్గుల ఐసు నీళ్ళు పోసారీ పిల్లలు   
    నా పవిత్ర పిల్ల రాక్షసులూ, నా చిట్టి పిశాచ 
    గణమూ -"నాన్నా వచ్చావా నీకో సర్ప్రైజ్"
    అంటూ, ఇక వెనుకనుంచి తను మహదానందంతో ఇకిలిస్తుండగా-

మరే, మరి దీనంతటి తరువాతా 
     నాకు చెప్పకండి,  మన పుణ్య 
     పాపాలనూ గమనించి మనకు

     శిక్ష వేసే సర్వాంతర్యామీ ఎవరూ లేరని!                     

17 November 2012

ప్రకటన

చాలు. మాట్లాడకు.

మోకాళ్ళపై ఒరిగి వినమ్రతతో
                భూమిని తాకిన నుదిటినీ
                                        శ్వాసకి నింగికి ఎగిరిన

ధూళినీ కదపకు.

సాయంత్రం అయ్యింది. రాత్రీ అయ్యింది.

చీకటిని హత్తుకుని
            ఒక పూవు నేలనూ
                             చీకటి గాలినీ కప్పుకుంది.
   
లేని వెన్నలని తలవకు.
                       ఇతరుల నెలవంకలపై ఆగకు.

తప్పుకో:చల్లటి నిశ్శబ్ధమై
                పడుకుంటావు నిర్మలంగా

నీతో నువ్వు
                   నీలో నువ్వు: చూడు
                                        రెక్కలు విప్పార్చి

 రాత్రి మంచు పచ్చికపై ఆగి ఉంది
                           తారకల మచ్చలతో
                                 ఒక ఒంటరి సీతాకోకచిలుక.                                                        

అసాధ్యులు

తింటుంటే పొలమారి, దగ్గి దగ్గి, కళ్ళలోకి నీళ్ళు వస్తుంటే
     తల మీద అరచేత్తో తడుతూ అంటుంది తను: ఎవరో
     తలుచుకుంటున్నారు నిన్ను - మరి ఎవరో వాళ్ళు?

ఇక తనొక గ్లాసుతో నోటికి నీరు అందించి
కుతూహలంగా నీవైపు చూస్తుంటే, మరి
నువ్వు ఓర కంటితో తన వైపు చూసీ చూడక, నీ గత
     ప్రియురాళ్ళందరినీ తలుచుకుంటావు

అన్నం ముద్దలను తమ అరచేతులతో నీకు అందించి
చివరికి ఏమీ మిగలక, మరకలంటిన
పాత్రలై మిగిలిపోయిన
ఆ కన్నీళ్ళ కలువలనే

తలుచుకుంటావు, పొక్కిలైన హృదయంతో: మరిక
ఒక జవాబుకి నీ వైపు అలాగే తదేకంగా చూస్తున్న
నీ స్త్రీకి ఏమీ చెప్పలేకా ఇక ఒక
అన్నం ముద్ద మింగుడు పడక

తెరిచిన తలుపులలోంచి చల్లటి గాలి రివ్వున నిన్ను
చరుస్తుండగా, లేచి చేయి కడుక్కుని, తను
అందించిన  తువ్వాలుతో తుడుచుకుంటూ 
అనుకుంటావు ఇలా: "Gaaaaaaaaaaaaad
these wives are impossible. అసాధ్యులూ
అనితర సాధ్యులూ వీళ్ళు-", అని బింకంగా
బేలగా పరమ దిగులుగా అంతిమ చరణంగా- 

16 November 2012

క్షుద్ర పదాలు

గుళ్ళో దండం పెట్టుకుని, ప్రార్ధన చేసి
చల్లగా ఇంటికి వచ్చి
పుణ్యం చేసామను
           కున్న వాళ్ళందరితో ఇల్లా
           అన్నాడు మోమితేష్: అన్నాల్లారా, అమ్మల్లారా

గీతకు ఇవతలా, గీతకు అవతలా సరే కానీ
గీత గీసీందెవరు, గీతను
కాపాడుతున్నది ఎవరు?

గీతాలు లేని లోకానికి గంతలు కట్టి
చూపునిచ్చామని
చెబుతున్న వాళ్ళు
                ఎవరు? అమ్మల్లారా, అన్నాల్లారా, అక్కల్లారా

సావిత్రి సరే, సీత సరే మేరీ మాతా సరే మరి
ద్రౌపదిని
ఊర్మిళని

పవిత్ర పాత్ర మాగ్ధలీనాని
నిలువెల్లా ఆత్మతో తాకేది
              ఎవరు? కబోధి

ని నేను కానీ వాచక విముక్తం లేక వినిర్మాణం కాలేక
    శరీరమంత తోలు మందం
    వాక్యాల పునురుక్తమై - లోపలే ఉన్న రాజ్యాన్నీ
ఉద్యానవనాలనీ పాప పంకిలం చేస్తున్నది ఎవరు?

నేనొక బహిష్కృతడనే కానీ
గర్భ ద్వేష పుణ్య పురుషల
        దేశంలో లోకంలో కాలంలో, అన్నల్లారా తమ్ముళ్ళారా
        అక్కల్లారా చెల్లెల్లారా, మర్మావయం అయిన
        పురుషుల్లారా

తల్లి గర్భాన్ని ఆలింగనం చేసుకుంటున్నాను ఇలా హాయిగా
నిండుగా నిర్భీతిగా
మరి నా ఆత్మతో నా
శ్వాసతో నా అంతిమ
మృత్యువుతో- అది

సరే కానీ మరి నువ్వేమిటి? నీ సంగతేమిటి? అని అన్నాడు అతను
స్వదేహ సమాధిలో
సంలీన మవుతూ-

నేను నవ్వి, నేను ఏడ్చి నేను పగిలి పిగిలి 'నేను' లేకుండా
పోయి, ఇదిగో వచ్చి ఇల్లా రాస్తున్నాను

ఈ అమృత క్షుద్ర పదాలు, ఒక
మార్మిక ఆదిమ తపనతో, ఒక
తొలి మలి రహస్య దాహంతో-
మీకు కాక మరి నాకే దారి దిక్కూ తోడూ నీడా లేకుండా. ఇల్లా.                     

కాటుక పూల కన్నీరు

ఒంటరిగా గదిలో పగలు ఒక్కటే ఒక అమ్మ

వొణికే చేతులు
వొణికే కనులు
వొణికి వొణికి అరచేతులలో రాలిపడే కన్నీళ్లు.

ఇలా కాదు అనుకున్నది
ఇలా కాదు జరగాల్సినది
ఇలా కాదు మరి విరమణ

ఇద్దరు పిల్లలతో రహదారిపై
ఎటు వెళ్ళాలో తెలియక
పమిటెతో కళ్ళు తుడిచి
విసవిసా నడుచుకుంటూ

ఒంటరిగా మండుటెండలో
ఒంటరిగా ఒక్కటే ఒక చెల్లి

నాలికపై  ఒక చేదు
గుండెలో ఒక గాటు
వొణికి వొణికి పాదాలలోంచి తొణికే ఒక శోకం

ఇలా కాదు అనుకున్నది
ఇలా కాదు జరగాల్సినది
ఇలా కాదు మరి విరమణ

ఒంటరిగా అనాధై
రాత్రిలో పాకలో మిగిలిన ఒక అమ్మ అమ్మ

ఇక వొణక లేని చేతులు
ఇక వొణక లేని కనులు
వొణికీ వొణికీ వొణికీ ఇక

వొణక లేక భూమికి వొంగి
నింగికి వీపును చూయిస్తూ
చద్ది అన్నంతో చద్ది దేహమై
ఇలా ఎముకలల శిధిలమై
మిగిలిపోయిన అమ్మమ్మ 

ఇలా కాదు అనుకున్నది
ఇలా కాదు జరగాల్సినది
ఇలా కాదు మరి విరమణ
అందుకే

ఇక ఇక్కడే ఎక్కడో మరి చీకట్లలో
తడుముకుంటూ
బావురుమంటూ

ఏడుస్తోంది ఒక పిల్లి పిల్ల ఒంటరిగా
కాటుక పూల
పందిరి  కింద

ముడుచుకుని
ముడుచుకుని
ముడుచుకుని

తన కుత్తుక పైకి నింపాదిగా
దయ లేక దిగుతున్న
మృగ దంత ఖడ్గాలతో-

మరి
కాటుక పూల కన్నీళ్ళతో
తనని అలా ఒంటరిగా
వొదిలివేసినది ఎవరు?         

15 November 2012

ఒక తండ్రి*

కన్నా నేను నిన్ను కోప్పడ్డాను

నాన్నా అని బ్రతిమలుతున్నప్పుడూ విరుచుకు పడ్డాను. నాదైన యంత్ర లోకంలో
బ్రతుకు జాతరలో కొట్టుకులాడుకుంటుంటాను కానీ
నేను ఎప్పుడైనా నీ బాల్యం అలలపై వెన్నెలనై, వెన్నెల పడవనై ప్రయాణించానా?
నిన్ను ఎప్పుడైనా ప్రేమగా దగ్గరికి తీసుకున్నానా?
పాచి పట్టిన లియో బొమ్మలు కొనిపెట్టాను కానీ నా బాహువులుయ్యాలలో
ఎపుడైనా జోకోట్టానా? పిచ్చుకలా నువ్ ఎగురుకుంటో వచ్చి
నా వక్షవృక్షంలో వాలి కువకువలు వినిపించాలనుకుంటావు కానీ నేనా నా కొమ్మల్ని
నరుక్కుంటూ వచ్చానే కానీ ఎప్పుడైనా గూటినయ్యానా?

కన్నా నువ్వు తిన్నా తినకపోయినా ఇంతన్నం పడేస్తే చాలనుకున్నా కానీ
నీ పిడికెడు లబ్ డబ్ శబ్దాల్ని అనువదించుకోలేకపోయాను
నా చిట్టి కన్నా నేనప్పుడు నిన్ను కోప్పడినప్పుడు రూళ్ళ కర్ర మెరుపుతో నీపై
విరుచుకుపడినప్పుడు నాలోని రాహిత్యాన్ని
ఎంత జుగుప్సాకరంగా వాంతి చేసుకున్నాను. మరి నేనిపుడు ప్యూపాలోంచి
ఎగురుకుంటో వచ్చి రంగు రంగుల రెక్కలతో నిన్ను
పలుకరిద్దామనుకుంటే కన్నా నా నాన్నా నువ్వు శవమైపోయావు.
---------------------------------------------------------------------------------------------------------
*written somewhere around 1996-98, at a time when neither was I, a 'married' man nor was I  a parent/father, from the viewpoint of a father who had lost his child due to his lack of time for his little one. 

పాపం

1
రాయాలని కూర్చుంటే
నల్లటి నీడలో తడితో వెలిగిన నీ కళ్ళే గుర్తుకు వస్తున్నాయి

2
పూవువి కదా నువ్వు. రెక్కల్లొచ్చి
ఎండలో వానలో చీకట్లో వెలుతురులో నవ్వులతో ఎగరడం
మాత్రమే తెలుసు కదా నీకు. మరి

3
నేను అతి జాగ్రత్తగానో
చైతన్య రాహిత్యంగానో
ఒక వలను తయారు చేస్తాను నీ చుట్టూ. నువ్వు నిటారుగా
తల ఎత్తి ఆకాశాన్ని చూపినప్పుడల్లా
నేను నీకు భవిష్యత్తుని సూచించి భయపెడతాను- 

'అరవకు' అనో, 'గొడవ చేయకు' అనో '
చెప్పిన మాట వినకపోతే నీకు బొమ్మలు కొనివ్వ' ననో
ఎలాగో ఓలాగా నిన్ను నేలకు దిగేస్తాను.
'నాన్నా, ఆడుకుంటాను' అంటే, కటువుగా 'ముందు
హోం వర్క్, ఆ తరువాతే ఏదైనా' అంటాను. మరి

4.
'నాన్నా నేను పూవుని కదా
నేను వెళ్ళకపోతే, తోటలోని సీతాకోకచిలుకలు
నాకోసం ఏడుస్తాయి'* అని నువ్వు బేలగా అన్నా సరే

5
మృగాలు సంచరించే చదరపు గదుల హృదయం ఇది
ముఖ పుస్తకాలు, నక్షత్ర ప్రసారాలూ మాత్రమే తెలిసిన
ఇరుకు చూపులు ఇవి - మరి నువ్వు

చూపించే చేతివేళ్లును అనుసరించి, నక్షత్ర సముదాయాలనూ
గ్రహాలనూ ఖగోళ విచిత్రాలనూ ఆనందాలనూ చూసే
సమయం లేని, కాంతి లేని కృష్ణ బిలం ఇది. మరి

6
అందుకే, నా మీద నా అసహనంతో కోపంతో కొడతాను కదా నిన్ను
చిన్న చిన్న విషయాలకే, ఎందుకో అర్ధం కాక తెల్లటి కళ్ళతో నీళ్ళతో
చూస్తావు కదా నువ్వు, అప్పుడు

నా శరీరమంతా ఒక తారు దారి. నాలిక అంతా
లోహ ఖచిత యంత్ర రహదారి. గూడు అని నువ్వు అనుకున్న
ఈ ఇల్లంతా నల్లని కాలుష్య సమాధి. అంతటా ఒక మృత్యు ఊపిరి-

7
కాసేపట్లోనే అంతా మరచి ఆ నాలుగేళ్ల చిన్ని అరచేతులతో
హత్తుకుని నా ముఖాన్ని నిమురుతావు కదా నువ్వు
అది గుర్తుకు వచ్చి

రాయాలని కూర్చుంటే, తెల్లటి తడితో
కళ్ళలోంచి రాలుతున్నాయి నల్లటి పదాలై ఈ పై అక్షరాలు
కొంత ధూళై  కొంత దూరమై
కొంత నెత్తురై కొంత శాపమై
నేను ఎప్పటికీ తిరిగి తాకలేని ఒక మహా కాంతి లోకమై-
________________________________________________________
*ఈ వాక్యం HRK మనవరాలు అతనితో అన్న పదాలు. అతను నాతో చెప్పగా -
నేరమైనా సరే- ఇలా నిస్సిగ్గుగా వాడుకున్నాను. ఈ వాచకపు అనుభవం మాత్రం
నా పరిధి లోనిదే.                                    

14 November 2012

మాట్లాడకు

అస్సలు మాట్లాడకు
పూవు ఒకటి తూగుతోంది కొలనులో
క్షణాలసలే లెక్కించకు
పసినవ్వు ఒకటి వెలుగుతోంది గదిలో

తలవకు అసలే మరి
సీతాకోకచిలుకలు తిరిగే ఈ తోటలో
తాకకు అసలే మరి
ఆ చేతివేళ్లు చిన్నగా
ముడుచుకునే వేళల్లో

కలల రంగులు కమ్మగా పూచే లోకాల్లో 
కనులు మరో  లోకంలోకి జారే కాలాల్లో   
సవ్వడే చేయకు

ష్......అంతా నిశ్శబ్దం
శ్వాస కూడా తీయకు
పాప నిద్దుర పోతోంది.    

వాక్యంత బిందువు

తెల్లటి కాగితంపై ఒక వాక్యం రాసి, చివర ఒక బిందువుని ఉంచాడు అతను. అప్పుడు 
     తను అంది అతనితో: అది అంత తేలిక కాదు. నీకు తెలుసా, వాక్యంత బిందువుని
     ఒక వాక్యం ఎలా చూస్తుందో?

అతను తన బల్లని వదిలి, తలుపు వద్దకు ఒక విరామ చిహ్నమై కదిలేటప్పటికి
     బల్లపై -రాసుకున్న కాగితాలపై- ఉంచిన పూలపాత్ర
     తన నయనం వద్ద వాక్యంత బిందువుగా మారింది-  

ఎవరు

నా చేతిలో ఒక భిక్షాపాత్ర.: అది నేనే.
    అది ఖాళీ: మరి దాని నిండా
    ధ్వని లేని ప్రతిధ్వని  నువ్వు

తల  వంచి చూస్తే
ఉంటాయి దానిలో
లోతు లేని నీళ్ళు: బహుశా
అడుగున, నువ్వు చూడని
                గులక రాళ్ళు.

మరి నువ్వు తొంగి చూసినప్పుడు
     ఆ వలయపు లోతుల్లో
     వలయాలవుతూ నీకు

కనిపించిన ముఖం, ఎవరిది?  

కొన్నిసార్లు

కొన్నిసార్లు
కావాలి నీకు -ఒక మాట- మరో మనిషి
     నుంచి: ఇక నవ్వుతూ హాయిగా
     ఇంటికి వెడతావు నువ్వు - ఆ

మాటని
వెలిగించుకుని, ఆ వెలుగులో
నిన్ను నువ్వు
నింపుకోడానికి.

చూడు: నువ్వు లేకపోయినా
నీ మాటతో
శరీరమెంత

-చూచుకాన్ని తాకిన
శిశువు పెదాల వలె-

ఇష్టంగా
ఒక ఆదిమ
ఆనందంతో
ఇలా జలదరించిపోయిందో.            

ఆకస్మికం

పొగమంచు కిటికీలలోంచి లోపలికి సాగిన వేళ
     ఎందుకో జలదరించి ఒక్కసారిగా కదులుతారు పిల్లలు. 
     దుప్పటిని వాళ్ళపైకి మరలా ఒకసారి జాగ్రత్తగా సర్ది
     ఇదిగో అలా చేతులు ముడుచుకుని కూర్చుంటాడు అతను: 

ఇక ఈ వేకువఝాము చిన్నగా కదిలగా ఎక్కడో తన కళ్ళ కింద 
     ఒక తెల్ల గులాబీ మొగ్గ విచ్చుకుంటుంది.  మంచుకు తడిచి
     గాలికి సన్నగా కదిలే ఆ గులాబీని 
     తనకి తెలియకుండా తన కలలోకి 
     జొరబడి తాకాలనే కోరిక అతనికి- 
     కానీ నిదుర వస్త్రాన్ని లాగకుండా 
     పిల్లలని లేపకుండా తన ఊపిరిలో
     ఊగే పూలపై అతను తన  పెదిమలని ఆన్చడం ఎలా?   

సరిగ్గా అప్పుడే      
అలా, అయోమయంతో అతను గింజుకుంటుండగానే, నిదురలోనే 
     అతని గుండె కొట్టుకునే చోట, తన అరచేయి 
     నెమ్మదిగా వాలి గూడు కట్టుకుంటుంది.ఇక 
     తటాలున గదిలో ఒక చితుకుల మంట రేగి 
ఆకస్మికంగా అతనికి అప్పుడు ఒక మహా రహస్యం తెలిసివచ్చి

ఇక ఎన్నడూ తిరిగి రాలేదు అతను, ఇక్కడికి- తను ఉండే చోటికి-

13 November 2012

ఏమంటావు నువ్వు?

అతనొక్కడే ఉన్నాడు అక్కడ, చీకటి వలయాలవుతున్న ఇంటిలో.
తను లేదు కానీ, తన నీడ మాత్రం అతని వెన్నెంటే
సన్నగా వెలుగుతూ, ఒక పల్చటి వాసనై, తెమ్మరై
                                                                      వెంటాడుతూ ఉంది. 

ఇక ఇక్కడికి రాలేని
తనకై ఎదురు చూసీ
                            చూసీ

అలసిన కళ్ళని అరచేతులతో రుద్దుకుని వొదిలితే
చీకటి గదంతా మెరుస్తో తెల్లటి సీతాకోకచిలుకలు.
అవును. ఇక ఇదే 
                        సరైన సమయం-

లేచి ఒక సిగరెట్ వెలిగించుకునేందుకూ
బియ్యం కడిగి, ఇన్ని మంచినీళ్ళు పోసి
అన్నం వండుకునేందుకూ. మరి ఏమంటావు నువ్వు?  

ఏమైనా

చీకట్లో నీ ముఖం తెలియదు
     నా వేళ్ళ చివర్లకి తడి మాత్రం తగులుతుంది
     నా ఛాతికి నీ హృదయ వేదన తెలియదు. నీ
     ఊపిరిని తాకిన నా శ్వాసే కమిలి పోతుంది

ముడుచుకున్న నీ రెండు అరచేతులు -అలానే-
     గూడు లేని గుప్పెడు ఆశా లేని నా ఈ రెండు అరచేతులలో:
     ఇక ఈ దినమంతా, మన ముఖాలపైకి
     ఎవరో నిర్లిప్తంగా లాగిన ఒక శ్వేత వస్త్రం.

అక్కడే, మన ముందుగానే
     ఆరుబయట నీడలలోనే
     ఒక ఒంటరి గడ్డి పూవు రాలిపోయింది యిప్పుడే. చూడు
     నిన్ను చూసీ చూసీ చెమ్మగిల్లి
     ఎలా ఈ అద్దం పగిలిపోయిందో-  

ధన్యవాదాలు

ఎదురెదురుగా కూర్చున్నారు ఇద్దరు, నీలి వస్త్రం వలే
     కమ్ముకునే రాత్రిలో: తమ ఆఖరి శ్వాసతో ఒక నీలి దీపాన్ని వెలిగించి
     ఈ ఒక్క చీకటి కాలానికీ, లోకానికీ

తాము బ్రతికున్నామని అత్యంత సున్నితమైన
ధృడమైన సంకల్పంతో చెప్పేందుకా అన్నట్టు-

ఇక ఆ తరువాత, అనంతకాలాల మౌనం తరువాత
అతడు అన్నాడు: "అమ్ములూ, ఇంత అన్నం పెట్టు
ఆకలి వేస్తోంది."     

ప్రాధమికం

ఎవరో
నిన్నొక ప్రమిదని చేసి, అరచేతిలో అమర్చుకుని
అలా గాలికీ ఆకాశానికీ ఎత్తి చూపారు. మరి నీకు

తెలియనిదల్లా, అది తన
శరీరాలయానికా, లేక నీ
నిర్జన హృదయ సమాధికా అని-   

10 November 2012

చరిత్ర


ఆవాహన చేస్తున్నాను. పెదాల చివరి దాకా వచ్చిన మాటని
     అక్కడే నొక్కిపట్టి, తుంపర కురిసే కాలాలలోకి కనులను వదిలివేసే
               మహాకళను నిన్ను స్మరించుకుని అభ్యాసం చేస్తున్నాను. చేతులు

తవ్విన భూమిలోకి దిగిన శరీరం నీవు. నా శరీరంలోంచి వేయి కొమ్మల వృక్షమై
       గన్నేరు పూలతో వికసించే మహా ఆకాశం నీవు. ఈ అబద్ధం నిజమే. ఒక
                 చినుకంత విత్తుని నాటి చిగురాకుని ఆశించిన ముఖాన్ని తాకిన

నిలువెత్తునా రివ్వున రేగిన నల్లని నాగు పడగవి నీవు.
      ఇంద్రజాలంతో కమ్మేసే సర్పహాస నయనివి నీవు. చూడు. పదాలు లేని
                   మొండి చేతులతో శ్వాసించే శిలయై ఉన్నాడు ఫిరోజ్, ఊర్మిళై ఒక

మహావిష -విస్మృతి లేని- నిదురై, నువ్వు లేని పాతాళ లోకాలలో
         కన్నీటి తల్పంపై మరలా మరలా జన్మిస్తూ. జన్నత్ ఎక్కడా అంటే
                అంటాడు కదా ఫిరోజ్ ఇక మధుపాత్రని నీలి ఆకాశపు అంచుకి తాకిస్తూ

"సోదరుడా: అడగకు రాముడిని రామ బాణపు గురి గురించీ పదును గురించీ
          చూడు నెత్తురు పొటమర్చిన ఈ గుండెనీ, సీత హృదయాన్నీ. అడగకు ఫరీదానీ,
                     శిలా విగ్రహ భక్తులనీ హత్యల గురించీ అద్రుశ్య

హంతకుల గురించీ, చూడు గూళ్ళు లేక తెగిపడిన తలలనీ
               మధుశాలలలో ఖండితమైన ఫిరోజ్ లనీ." ఇక చూడు,
                      నీ ఇంటి ముందు నుంచి నడచే పోయారు ఆ ఇద్దరు రాత్రుళ్ళతో

స్మిత వదనాలతో , హృదయాలలో నిండుగా దిగిన చరిత్రలతో బాకులతో.
ఆ ఇద్దరిలో ఎవరు ఎవరుగా మిగిలారో ఇక ఎవ్వరూ ఎవ్వరినీ అడగలేదు.

09 November 2012

తేనీరు

అరచేతుల మధ్య ఒక కప్పును పుచ్చుకుని
     పొద్దున్నే తేనీరుగా మారుతావు కదా నువ్వు
     అప్పుడు అల్లం వాసన వేస్తాయి నీ చేతులు.
     మరి నీ పెదాల మధ్య నుంచి కొంత ఏలకుల సుగంధం కూడా.

చల్లటి వెలుతురు ముసురు కమ్మిన ఆకాశం
     అప్పుడు నీ కళ్ళల్లో. అల్లుకున్న తీగపైనా
     లేత ఆకులపైనా కొంత మంచు తడి. దానిపై ఒకసారి
     నీ చేతివేలు వాలి ఇంద్రధనుస్సులను కదుపుతుంది
   
ఇక ఆ ఏడు రంగుల తాకిడిలో, ఆ ఆకుపచ్చని గూటిలో
     కీచుమంటాయి మొన్న పుట్టిన చిన్ని పిట్టలు. ఇక
     రెక్కలొస్తాయి అప్పుడు నీకూ నీ హృదయానికీనూ.
     ఆ మెత్తటి నిశ్శబ్ధంలో, దుప్పటిలో ముడుచుకుని
      అస్సలే కదలరు మన పిల్లలు. ఇల్లంతా

ఒక శాంతీ, కాంతీ, గోరువెచ్చని నీడలూ, అలంకారిక
పింగాణీ వస్తువులపై ఆగే లోకమూ
అతి సూక్ష్మంగా  వాటిపై పేరుకునే
కాలపు ధూళీనూ.సరిగ్గా అప్పుడే         

నీ వెనుకగా చేరి నా చేతుల మధ్యకు తీసుకుంటాను
     నిన్ను. చూడు, ఇక ఈ ఉదయాన
మరో కప్పు తేనీరు త్రాగవచ్చు మనం

నింపాదిగా, శాంతిగా, తొలిసారిగా-  

ఇలా

కూజాలో పొందికగా ఒదిగిన మధువీ రాత్రి
     కూర్చుంటానిక ఒక పాత్రతో నీ శరీరంతో
     నీ అరచేతులైన రెండు
     లేత తమలపాకులతో
     ఇలా నీతో - ఒక్కడినే-.

     ఇంత తేలికగా, ఇంత నేరుగా,
     ఎవరో నిన్ను పిలిచేందుకు
     చప్పట్లు చరచినట్టు, ఇంత
     దగ్గరగా జీవితమెన్నడూ లేదు.

     నుదిట నుంచి పాదాలదాకా
     నిన్ను ఇంత నిండుగా తాగి
     నేను ఎన్నడూ లేను.

     బొట్టు బొట్టుగా జారుతూ ఇక
     ఒక చల్లటి చీకటే రాత్రంతా
     నాపై వెన్నెలంత దయగా.

    చూడు
    ముడుచుకుని ముడుచుకుని
    తనలో తాను పోదుపుకుని
    నీ పొదుగులో తనని తాను
    మరచి, ఎలా

    పరమ పవిత్రంగా నిదురపోయాడో
    అతను.         

06 November 2012

తప్పు

తప్పు చేసేదాకా తప్పని తెలియదు
     తప్పని తెలిసీ చేసేదాకా మనస్సు ఊరుకోదు
     తప్పక, తప్పు తప్పని, తప్పు ఒప్పని
     తెలిసినా హృదయం ఆగదు.   ఒళ్లంతా

కనీళ్ళు, గుమ్మానికి వేలాడదీసిన కళ్ళు
     పమిట కొంగుతో ముఖం తుడుచుకుంటూ
     అలసటగా వంట గదిలోకి వెళ్ళే తన తనువులో

తప్పక తప్పని తప్పై, మళ్ళా ఒప్పై
చీకటిలో, ఆ గుడ్డి వెలుతురులో ఆ
సమాధిలో

ఆమె ఒక అద్దమై, తనలోంచి తనే ప్రతిబింబించి
పగిలిపోతుంది. ఏరుకోడానికి
ఎక్కడా నీ ముఖం లేదు. ఓహ్

ఏమీ లేదు, వానకి  పచ్చిగా మారిన గూటిలో
అప్పుడే పుట్టిన ఆ పక్షి పిల్లలని చూడడానికి
తనకి తోడు ఎవరూ లేరు. ఇక

ఎలా వెళ్ళిపోయిందో చూడీ రాత్రి, వొణికే
ఆ చేతులలోంచీ, బిగపట్టుకునీ కంపించే
ఆ అరుణిమ పెదాలలోంచీ

చివరికి నీలోంచీ.           

05 November 2012

ఆశ

రాత్రంతా తెరిచే ఉన్న ఒక కిటికీ:
     రాత్రంతా ముడుచుకుని,  చీకటిని చూసే ఒక మనిషి
     రాత్రంతా రాత్రై, కనురెప్పలకి వేలాడే ఖడ్గాలై, నువ్వొక
     దాహంతో ఆర్చుకుపోయిన శరీరమై

     రాత్రంతా తెరిచే ఉన్న ఒక కిటియై, కీచురాయై
     గది మూలన అల్లుకున్న బూజై, భుజం లేని
     ఒక శిరస్సై, అంతిమంగా
   
     నీకు నువ్వే మిగిలి, నీలోంచి నువ్వే పెగిలి పగిలి
     ముఖం దాచుకునే రెండు ఖాళీ అరచేతులై ఇలా-

     ఇక ఇప్పుడు ఆమాంతంగా ఎవరో నిన్ను
     తమ గుప్పిళ్ళతో దూసి, చీకటిని చీల్చి
     ఒక వెలుతురు పూవుగా మార్చి నిన్ను

     నలుదిశలా వెదజల్లితే, ఎంత బావుండును- 

ఇద్దరం

పల్చటి కాంతిలో ఇద్దరం, పక్క పక్కగా :
     నిమ్మకాయవంటి వెలుతురు, నీ శరీరంలోంచి నిమ్మతొనల వాసనా
     ఎదురుగా పచ్చికలో పిచ్చి పిచ్చిగా గెంతుతూ మహదానందంతోనే
     ఎగిరే మన పిల్లలు. అశోకా చెట్లలోంచి గాలి ఊగీ ఊగీ

     రివ్వున కిందకి దిగి వస్తుంది,  నీ శిరోజాలని చేరిపేందుకు.
     ఇక అంటావు కదా, అరచేత్తో ముఖంపై నుంచి శిరోజాలని
     వెనక్కి తోసుకుంటూ, నావైపు నవ్వుతో శాంతిగా చూస్తూ:
     'ఎంత చల్లగా ఉందో కదా ఈ గాలి. వెడదాం ఇంటికి తొందరగా.'

     నవ్వుతూ ఇక నీ చేతిని పుచ్చుకుంటాను నేను.
     సరిగ్గా అప్పుడే

     గుప్పెడెంత ఆకాశంలో నీ హృదయమంత జాబిలి వికసించింది-

ఏమిటది?

1
నిన్నేమీ అడగవద్దు అనుకున్నాను కానీ
     ఇది ఒక్కటే
2
ఎప్పుడైనా చూసావా నువ్వు
     చీకటి చినుకులని కళ్ళల్లో వేసుకుని
     కుర్చీలో అలా ఒదిగి నిర్లిప్తంగా రాత్రిని
     చూసే మనిషిని? ఇక అతని
3
నుదిటిపై సర్పాలు నడయాడతాయి
     పెదాలపై నీ విషపు రుచి అప్పుడు. తెరచిన
      అతని నోటిలోంచి నీ నాలిక
      కొన్ని పదాలతో బుసలు కొడుతుంది. చూడు
4
చెట్ల కింద విరిగిన నీడలని.
     ఇసుక పోగేసుకుని కట్టుకున్న గూడు చెదిరి
     కళ్ళంతా నిలువెత్తు వానైన పిల్లలని.
     అప్పుడు ఉంటావు నువ్వు  అక్కడ
5
పగిలి నెత్తురంటిన గాజులను ఏరుకుని
     ముంజేతులతో బుగ్గలని తుడుచుకుంటూ:
     ఈ నిప్పు అంత త్వరగా ఆరిపోయేది కాదు.
     ప్రేమ ముద్రిక అది, అంత తేలికగా వొదలదు
     నిన్ను. రక్షణ కవచం
6
ఏదీ  లేక  ముడుచుకున్న పావురం ఎవరో
     నీకు తెలియదా? నీ రెక్కలని నిమిరలా
     నిన్ను హత్తుకునే శరీరమేదో తెలియదా?
     ఎదురు చూసీ చూసీ నుదిట బొట్టు నీరై
     జారిపోతే
7
అప్పుడప్పుడూ శపించడం తప్పేమీ కాదు.
     ఇంతకూ శాపగ్రస్థులు ఎవరో తెలిసిందా? చూడు
     ఒక చందమామ ఎర్రగా ఉదయించింది. ఒక
     వెన్నెల నీళ్లై నిన్నూ నన్నూ చుట్టుకుంది. అందుకే
8
అడుగుతాను ఒకటి నిన్ను, అడగవద్దు
     వద్దొద్దూ అని అనుకుంటూనే ఇలా. మరి
9
ఇదే, ఇలా నిన్ను అడగాలనుకున్నదే
     నేను తరచూ మరచిపోతాను.
     ఇంతకూ ఏమిటది?          

01 November 2012

మహామంత్రగత్తె

కొంచెం ముఖం బావుందనుకో, హృదయాలని చిత్తడి చిత్తడిగా
తవ్వి తవ్వి నిలబడి చోద్యం చూసే కళ తెలుస్తుంది
అరె ఇక కొంచెం దేహం బావుందనుకో, మగవాళ్ళని
నీడలుగా మార్చి నీ పాదాల వెంబడేసుకుని  తిరిగే
   
అతి క్రూర వినోదా చాతుర్యం అర్ధం అవుతుంది. ఆపై
కొంచెం తెలివీ కొంచెం పద చాతుర్యం ఉన్నవేవనుకో
చూడు చూడిక, ఈ ముఖ కుగ్రామాన్ని త్రవ్వీ  త్రవ్వీ
   
ఒక శ్వేత మార్జాలంగా మార్చి నీ చుట్టూ తిప్పుకునే
ఒక మహాతాంత్రిక వశీకరణ విద్యా అబ్బుతుంది
ఇక జగన్మోహినీ - నీకొక చక్కటి మొండితనమూ
పురుష వ్యాకరణం లేని జాణతనమూ ఉన్నదే అనుకో

నీ జ్వలిత జననాంగాల దేహ వాక్య విన్యాసాల చుట్టూ
ఈ పరమ పురుష సూక్తావళి
గిరికీలు  కొట్టీ  కొట్టీ  కొట్టీ
నీ మహా జ్వాలను  తాకి
గిరగిరా తిరిగీ తిరిగీ తిరిగీ

నిను స్తుతిస్తో, నీ ఆ జంతర్ మంతర్ మహావాచకంలో     
నీ అత్యాధునిక రామాయణంలో దగ్ధమవ్వడమూ
నీకు నువ్వే ఒక తిరుగులేని
మహాకధనంగా మారడమూ
అవగతమవుతుంది-

ఇంతకూ తెలుసా నీకు, నువ్వొక మాయామహిమాన్విత మహామంత్రగత్తెవని?