31 August 2011

బుద్ధి రాదు

బుద్ధి రాదు. నిద్ర మెలుకువలోకి మారదు. యంత్రాలు

ముఖాలలో పదాలలో యంత్రనిర్మిత కధనాలు.

ఏముందని వచ్చావ్ ఇక్కడికి?

నమ్మని స్నేహాలూ, నమ్మకం లేని స్త్రీల పురాణాలూ
అంతులేని విషాద కధనాలూ:

ఏముందని ఏం తెచ్చావ్ ఇక్కడికి?

రాత్రి కంటిలోంచి రాలే
వెన్నెల కిరణాలు, అప్పుడప్పుడూ నిన్ను తాకే
వాన కెరటాలూ, పసి పెదాలూ

అరచేతులలో దాగిన తన ముఖం
ముఖంలో వలయమైన జీవిత విలయం
ఎవరి హృదయంలో లేని నివాసం

ఎవరి శాపం ఇది? ఎవరి లలాట లిఖితం ఇది?

బుద్ధి రాదు నీకు. మెలుకువ చీకటిలోకి తరలిపోదు.
వినిర్మాణ విధేయుడా నిరంతర విషాద శాపగ్రస్తుడా

నువ్వెందుకు బతుకుతున్నావో చనిపోకుండా ఎందుకు
ఈ పాపపూరిత పదాలను రాస్తున్నావో
నీకేమైనా తెలుసా?



27 August 2011

పాదం మోపలేని చోటు

పాదం మోపలేను అక్కడ
నీ నయనాలు ఆగిన చోట

తిరిగేవీ తిరిగి రానివీ అవే
నువ్విచ్చిన పెదాలే

ఎక్కడా అని అడగకు.
హృదయంపై ముద్రితమైన
ఉమ్మి జాడను వెదకకు.

ఛాతిని హత్తుకున్న చేతులు
చూపులని చీకట్లలో
ముంచివేసిన కురులు

అవే పాదాలూ అవే పెదాలూ
విరిగిన గదులలో
కాలిన వెన్నెల దేహాలూ

ఎందుకూ అని అడగకు

ఎక్కడా, ఎప్పుడూ అని
చూడకు చూపించకు

వెళ్లిపోయిందీ నీవే. వెను
తిరిగిరానిదీ నీవే:

పాదం మోపలేను అక్కడ
నీ నయన శిలాజాలు
మిగిలిన చోట

= నీ చూపు కాంతి ప్రసరించిన
నీరెండ నీడలలో
వాన చినుకులలో
తుళ్ళుతున్నాయి
రెండు పిచ్చుకలు.

తెలుసా నీకు అవి ఎలా
తిరిగి రాని దూరాలలోకి
రాలిపోబోతున్నాయో?


25 August 2011

abstract noun*

మళ్ళా రాలేను ఇక్కడికి

వొదిలివేసిన చేతిని పొదివి పుచ్చుకున్న
ఆమె అద్దం అదే పదాన్ని విసిరికొట్టింది

తప్పు. తప్పు. తప్పు. అంతా తప్పు.
తప్పుకో. తప్పు ఒప్పుకో.

నవ్వే నోరు మాట్లాడలేదు. మాట్లాడే
నోరు వీడ్కోలు పలుకలేదు.

అర్ధం అనర్ధం అంతా నీవే. ఇక స్త్రీలతో
నీకేం పని? కొరుకు. తిను.
ఈ లోకాన్ని నమిలి నమిలి
కాలంకావలగా ఊసి విసిరికొట్టు.
ఇక ఈ మనుషులతో నీకేం పని?

రొట్టెను అందించి ఆ అరచేతులే
నీ పెదాలకు రాళ్ళను అందించాయి
జన్మనిచ్చిన దేహమే/దేశమే
నిన్ను మృత్యుభిక్షువుని చేసాయి

మధువుని తాగి అమృతమయిన
వారి హృదాయాలే తిరిగి నిన్ను
పద బహిష్క్రుతుడని చేసాయి
బహిష్క్రుతి అయిన/బాహిర్ కృతి వంటి
తననే, తన తనువునే నీకు
నీడలు లేని జాడలుగా మార్చాయి

తప్పు. తప్పు. అంతా అచ్చు తప్పు.
తప్పుకో. ఒప్పుకో.

ఈ ప్రార్ధన పాపాలలో ఒదిగిన పుణ్యంలేని
శాపానివి నీవు. పరిణితి లేని
ప్రధమ పంక్తి నీవు. నిలువు చీకట్లలో
మిగిలిన శ్వేతరేఖవి నీవు

చూడు ఇక్కడే, ఇక్కడే ఈ దినానంతానే
ప్రభువు పరమపదించింది

అతడి కన్నీళ్లు రాళ్ళయి నిర్మాణమై
ఆకాశాన్ని పూవుగా మార్చింది ఇక్కడే
పూవులో తేనెగా నిశ్శబ్ధం ఊరి

తన స్వరంగా మారింది ఇక్కడే. ప్రేమ అంటే
ఏం చెబుతావ్? రా ఇక్కడికి

ఒక దీపం వెలుగుతోంది
రెండు అరచేతుల మధ్య

ముగిసి ప్రతిధ్వనిస్తున్న
అంతిమ పదమై. ఇక నువ్వు

చనిపోయినా పరవాలేదు=
________________________________
* in memory of Jaques Derrida (excerpt)

22 August 2011

బొంద*

బొందలలోని అందములు వేరే యెందులనూ కనపడక

తిరిగితిని విరిగితిని
మీ పాదపద్మములయందు రాలి తరించితిని
అటుపిమ్మట కడుపారా రోదించితిని
చితులయెందు మొహితుడనై
భస్మమును కూడి శపించితిని
అటుపిమ్మట మిమ్ములను శాసించితిని
నవ్వుకొంటిని నాజూకు పదములందు విసిగి
కరాళ నృత్యములను వాక్యములను

ఆదరించితిని స్వదహనంలో విశిష్టతను
సాధించితిని బొందలయందూ
శవపేటికలయందూ దాగొంటిని కలగంటిని
కంకాళ స్వప్నములను పూలయందు స్త్రీలయందూ
వెదజల్లితిని, విష వేదములను వ్రాసితిని

అంతిమముగా ఆనందించితిని
నా చితిని అంటిచితిని

బొందలయందు బహు అందముగా
నిదురించితిని=

________________________________________
* written as a reaction to a comment on my post sometime back. of course later removed it. people who did not see this text and who were keen on reading it kept asking me to post it. so here it is: as it is.

నువ్వూ

వెళ్లిపోయావ్ మిణుగురు
రెక్కల మీదుగా
రెక్కలతో

ఇక్కడ తిరిగే
ఊదారంగు పిచ్చుకలు
నీవేనా?

లేత కాంతిలో
చినుకులలో
చినుకులతో
చిందులేసే పిల్లల్లో, కళ్ళల్లో

మెరుస్తున్నాయ్ పదాలు
నువ్వింతకాలం బ్రతికిన
నువ్వు కాని, మళ్ళా రాని
నువ్వే అయిన చిత్రాలు

చూడు
మరో లోకం నుంచి
నువ్వు చూడని
మరో చూపుతో

ఒక పసి చేయి లిఖిస్తోంది
నీ కళ్ళతో
నవ్వుతో

నువ్ రాయాలనుకున్న
ఆ మహావాక్యాన్నే

స్వర్గలోకపు ఆకాశంలో
అప్రతిహతంగా=

పిల్లలు /పెద్దలు

తన వదన వలయంలో అరచేతులని ముంచావు

చేతికి అంటిన రంగులు, వేళ్ళను తాకిన
చూపులు, తన కళ్ళల్లో విరిసిన పూవులు
తనవా నీవా? ఎప్పటికీ అడగకు

ముఖ్యంగా పిల్లలని, ఆడుకుంటున్న పిల్లలని
నీడలు ఏవని నీడలలోకి రమ్మని:

నవ్వుతుంది సూర్యరశ్మి. ఊగుతోంది లోలకమై
ఎగిరెగిరి వాలుతోంది పిల్లల ముఖాలపై
వెన్నెల వానల సీతాకోకచిలుకై: రమ్మని అనకు

ఎప్పుడూ వాననీ గాలినీ వనాన్నీ
నీ ముద్రిత హృదిత చెరసాలలోకి.

విప్పిన అరచేతులలో వృద్ధాప్యం నవ్వుతోంది
నీ నడుము చుట్టూ చేతులువేసి
ఒక పసివదనం ఏడుస్తోంది

మృత్యువు ఒక పదమై
మరొక పదాన్ని లిఖిస్తుంది. నిన్ను
పరిహసిస్తూంది

మిత్రశోకం. శోకస్నేహం
దూర ద్రోహమై తీరని దాహమై వేధిస్తోంది.
కరుణ లేక కంపిస్తోంది


తన వదన విలాప వలయంలో చేతులు ముంచావు

ఒక ఉరుమునీ, ఒక మెరుపునీ
సంధ్యాకాశంలోకి ఎగిరి
అంతలోనే నీలోకి రాలిన పక్షులనీ
తోడుకొని వచ్చావు:

ఇక రాత్రయ్యిందా? ముడుచుకున్న పసిచేతులలో
ఇక నిదుర నిదురించిందా?

హితుడా మోహితుడా సమ్మతంలేని స్నేహితుడా

నిరంతరం కురిసే వర్షాలలో
నువ్వు బతికి ఉన్నావో లేదో అని
ఎప్పుడూ ఎవరినీ అడగకు:


19 August 2011

ఎవరు* 2

అతడి చేయి సాగలేదు
అతడి నాలిక వెళ్ళగలిగినంత దూరం

ముఖం లేని మాటలతో ముద్రితమై
పునర్ ముద్రణ అవుతుంది
అతడి పదం

అతడికి ఎప్పుడూ ఇలా కావాలని లేదు

పచ్చికలో నగ్నంగా మూర్చిల్లి
వానలో గెంతే కప్పలనే
గుర్తులలో నానే కళ్ళనే

ఎదురెదురుగా చూపుల్ని విసిరి
వెక్కిరించే తొండలనే

కదిలే తన నునుపైన వీపుపై
రుతువులు మారే ఎండలనే

వాటినే, వాటినే అతడు
స్వప్నించింది
వాటినే, వాటినే అతడు
నివసించింది

చలికాలపు వెల్తురులకీ
వానాకాలపు చీకట్లకీ
ఎండాకాలపు నీడలకీ

రంగులు వేస్తూ అతడు
మరణించినది వీటినే:

చేయి, భూమి నుంచి భూమిలోంచి
పెదాల వరకు సాగే అతడి చేయి

గాలిని పోగుచేసి వీచే అతడి చేయి
నీటిని సాగు చేసి సాగారాల్ని చేసే
అతడి చేయి

ప్రభూ, అది నువ్వు ఇచ్చినదేనా?
ప్రభూ, అది నువ్వు పంచినదేనా?

నువ్వు నిర్మించి ఇచ్చిన నోటి గూటిలో
దాగిన నిలువ నీడ లేని నాలిక
విసుగూ విరామం లేని నాలిక

విసిరికొట్టింది ఒక పదాన్ని
వాగ్ధానం వలె ప్రపంచపు వాచకంలోకి=

దూరంలో, సుదూరంలో
సన్నగిల్లుతున్న దీపంలో

దాగిన నీడలు
పరిధులు దాటుతున్నాయి
దగ్గరవుతున్నాయి

ఈ నిర్మిత ఆక్రందనను
అధిగమించడమెలాగో

నీ నిశ్శబ్ధపు నిర్యాణంనుంచి
ఒక లేఖను పంపు

అక్షరాలు లేని పదాలతో:
____________________________________

* in memory of Jaques Derrida (excerpt)

17 August 2011

ఎవరు*

ఎవరు రాసారు ఇక్కడ
ఒక వాక్యాన్ని?

రాకుండా రాయకుండా లేకుండా
మిగులుతోంది

మొదటి తుది అక్షరం
ఆనవాలు లేకుండా=

(విరామ చిహ్నం తాకుతోంది
రాగ చిహ్నాన్ని
స్వపరాగ సంపర్కమై
మరువలేని ఆలింగనమై)

=తన పెదాల నుంచి జారిన
శ్వేతసర్పం
అతడి నాభిలో కుబుసం
విడుస్తోంది

కరుస్తోంది కురుస్తోంది
నల్లటి సాలెగూళ్ళలోకి
అతడి పదాలని
పీల్చుకుంటోంది =

ఎవరు ముద్రించారు ఇక్కడ
ఒక పదాన్ని?
ముద్రణలో ముద్రితమైన
ముద్రణని?


నిండైన ద్వేషం
నిండైన కామం
నిండని ప్రేమ
నిలువ నీడలేని
కరుణ


నాలికలు శోక శాపాలై
పోలికలు లేని పాపాలై
పసి వదనం లేని అద్దాలై
స్థిరపడినాయి ఇక్కడ


మృత్యుమోహ స్థలాలలో
స్థల శిధిలాలలో శిధిల
జననాలలో
రాలుతోంది
నిశ్శబ్ధం

కాగితాన్ని అంటిన
కన్నీటి వేలుని

పలువరిస్తో నిలువరిస్తోంది
గగన సాగర శబ్ధం

వెళ్ళిపోయినా వెళ్ళిపోకు
ఆగిపోయినా తిరిగిరాకు

ఎవరు రాసారు ఇక్కడ
ఒక రాతని?

రాకుండా రాయకుండా లేకుండా
మిగులుతోంది

ఖాళీ నయనం
చూపు చిత్రాన్ని ఎదజల్లి
తనలోకి వెదజల్లి=

నువ్వు మొదటివీ కావు
నువ్వు ఆఖరివీ కావు. రోదించకు
చూచుక కళ్ళతో
పాల కన్నీటితో

ఒక ఆఖరి అమృత విషం
పొందలేని ఎవరి ప్రేమోయై
ఎదురు చూస్తోంది నీకోసం

ఈ వాక్యంతాన
జాడ నుంచి జారిన
జాడని వీడని
జాడయై
నీడయై

(
నన్నిక ఒకింత కరుణతో
మూయనివ్వు)

________________________________________________

* in memory of Jaques Derrida (excerpt)




16 August 2011

నీ ఇష్టం

పోరలుతోంది పొడ గాలి పొమ్మనకుండా
ఎగురుతోంది ఎండ

ఎదురౌతోంది ఎవరినో కదుపుతోంది

ఎగిరెగిరి పడుతోంది
ఎక్కడ రాలాలని అడుగుతోంది
నీ వెంటే వస్తోంది వాన తోట

మెడలు వొంచి, తనువు పంచి
మెరుపు కళ్ళతో కదులుతాయి
నువ్వు మరవలేని మబ్బులు

నువ్వు మరచినప్పుడు నిను వీడని
వాన వాసన వేసే స్త్రీలు

సాగుతాయి రహస్యంగా అరచేతులు
అల్లుకుంటాయి నిన్ను ఆమాంతంగా

నువ్వు వొదిలివేసిన గుజ్జెన గూళ్ళు
వాటిలో తల దాచుకున్న
అమ్మాయిల కలలు

ఆడతారు పిల్లలు రేగే మట్టి కెరటాలతో
నవ్వుతారు, గెంతుతారు

నీపై ఇకిలింతలను విసిరేసి, జారుకుంటారు
నీపై బురదను చిమ్మి:

ముడుచుకున్న కుక్కపిల్ల బొజ్జలో
ఎదురుచూసే సదాసంచారి చూపులో

ఎవరున్నారు? ఎలా ఉన్నారు?

వాన వచ్చింది. నిన్ను తడిపి తడిపి
విసిరి విసిరి పోయింది

ఇక ఇంటికి వెళ్ళు. ఒక శరీరం నీకై
వెచ్చటి బొగ్గు కుంపటై

ఒళ్ళు విరుచుకొని వేచే చూస్తోంది.
అమెలో నువ్వు మరణిస్తావో

లేక జనినిస్తావో ఇక నీ ఇష్టం.





పాపి

కుంకుమ కన్నీళ్లు నీ కళ్ళు

నీ అరచేతులలో విచ్చుకున్న
నిన్న చిట్లిన గాజు పొదని నేను


చెంప చుట్టూ వలయాన్ని
గీసిన వేళ్ళు అగలేవు ఇక

నీ కళ్ళతోనే ఆ వేళ్ళు రోదించాలి
నీ వేళ్ళతోనే ఈ లోకం
తిరిగి చిగురించాలి

నవ్వుతోంది రాత్రి ఆకాశం నల్లగా
హృదయం లేని వదనంతో

నీటి అంచున ఇల్లంతా మౌనం
మౌనం అంచున
నీ పాదాల భారం

నడకలేని దూరం కాలాన్ని విడుస్తోంది
నునుపైన పదపడగై

విషపు విశ్వాలని విరజిమ్ముతోంది. రాత్రీ
దాత్రీ పొద్దుతిరుగుడు పూలై మెరవగా

నిన్ను చేరలేని దగ్గరితనం, పసితనం
ఎవరో వొదిలిన చిహ్నాలై
వెంటాడుతున్నవి

రా రా కన్నా: శిల్ప హ్రుదయుడైన పాపికైనా
హృదయం ఉంటుంది

వచ్చి నీ లేత చేతులతో
రాలే రాతి కన్నీళ్ళని తుడిచిపో=


15 August 2011

నీకు చెప్పలేని ఒక దిగులు వాచకం

నువ్వే కదా ఇలా అడిగింది

శ్వేతశిల్ప పదాలని వినిపించమని?
ప్రశ్నార్ధకం, ప్రశ్న అర్ధం ఏమిటని
ఎలా అని?

పచ్చిక బయళ్ళలో వీచే
పొంగి పొరలిపోయే గాలి కావాలి నీకు
నీటి స్వప్నాలలో, స్వప్న సంకేతాలలో రాలే
శిధిలాలూ శిఖరాలూ కావాలి నీకు
అద్దంలో వికసించిన ఎరుపు నేత్రంలో
జారిపోయే ఆకాశం కావాలి నీకు
ముఖాన్ని తిరగరాసే అరచేతులూ
చెవి చివురుని తాకే
హిమవనపు అగ్నిపెదాలు కావాలి నీకు


ఎదురుచూడలేవు, ఎదురు చూడకుండా
ఉండలేవు. కదలలేవు
కరిగే కొవ్వొత్తిని నిలుపలేవు. చీకటినీ
రాత్రి రాతిలో దాగిన తడినీ తాగకుండా
ఉండలేవు: పారిపోనూ లేవు
నిన్ను నువ్వు రక్షించుకోనూ లేవు:
ఇలా చూడు

నీకోసం వేచి వేచి, ఏడ్చి ఏడ్చి
సొమ్మసిల్లిన పిల్లవాడు

వానలో ఇల్లు లేని దారులలో దారుణాలలో
రాలిపోయే దిగులు పూవైనాడు


నీ చేతులతో, కరుణ నిండిన నింగి కళ్ళతో
అతడికొక రొట్టేముక్కను అందించు

బ్రతకాలి కదా అందరూ
నిరంతరం మరణిస్తూనే
ఉన్నా, ఉంటున్నా, ఉండబోతున్నా=


తొమ్మిదిన్నర గంటల కన్నీళ్లు

వృత్తాలలో, వదన వలయాలలో
మునిగిన నీడలు

అతడు వస్తాడు తనని తాను పోగొట్టుకుని
నుదిటిపై ఆమెను శిలువ వేసుకుని

దారిలో అతడిని ఆదరించినది ఎవరు?
దారిలో అతడిని ఆదమరచి, మైమరచి
వెళ్లిపొమ్మన్నది ఎవరు?

చెట్లు చిగురించవు ఈ శీతల అద్దాలలో
పూలు పలుకరించవు
ఈ యంత్ర ముద్రిత చదరపు గదులలో
నగర చదరంగంలో=

ఇక కొనసాగుతుంది దినం తొమ్మిదిన్నర
గంటలపాటు కన్నీళ్ళతో

అవి నీవో, నీవి కాని నీ పదాలవో నువ్వు
ఎప్పటికీ కాలేని నిశ్శబ్దానివో

రాత్రిలో ఒంటరి బావిలో రాలిన వెన్నెలకి
తెలియదు, తన నునుపైన
భుజాలపై రాలిన చీకటి కురులకీ తెలియదు

తెలిసే లోపు, వదన వివాదం ముగిసేలోపు

మరొక దినం ముగిసింది
మరొక వనం చేజారింది=

ఇక ఎవరు మిగిలి ఉంటారు చివరికి?

08 August 2011

ఒక తండ్రి*

కన్నా నేను నిన్ను కోప్పడ్డాను

నాన్నా అని బ్రతిమలుతున్నప్పుడూ విరుచుకు పడ్డాను. నాదైన యంత్ర లోకంలో
బ్రతుకు జాతరలో కొట్టుకులాడుకుంటుంటాను కానీ
నేను ఎప్పుడైనా నీ బాల్యం అలలపై వెన్నెలనై, వెన్నెల పడవనై ప్రయాణించానా?
నిన్ను ఎప్పుడైనా ప్రేమగా దగ్గరికి తీసుకున్నానా?
పాచి పట్టిన లియో బొమ్మలు కొనిపెట్టాను కానీ నా బాహువులుయ్యాలలో
ఎపుడైనా జోకోట్టానా? పిచ్చుకలా నువ్ ఎగురుకుంటో వచ్చి
నా వక్షవృక్షంలో వాలి కువకువలు వినిపించాలనుకుంటావు కానీ నేనా నా కొమ్మల్ని
నరుక్కుంటూ వచ్చానే కానీ ఎప్పుడైనా గూటినయ్యానా?

కన్నా నువ్వు తిన్నా తినకపోయినా ఇంతన్నం పడేస్తే చాలనుకున్నా కానీ
నీ పిడికెడు లబ్ డబ్ శబ్దాల్ని అనువదించుకోలేకపోయాను
నా చిట్టి కన్నా నేనప్పుడు నిన్ను కోప్పడినప్పుడు రూళ్ళ కర్ర మెరుపుతో నీపై
విరుచుకుపడినప్పుడు నాలోని రాహిత్యాన్ని
ఎంత జుగుప్సాకరంగా వాంతి చేసుకున్నాను. మరి నేనిపుడు ప్యూపాలోంచి
ఎగురుకుంటో వచ్చి రంగు రంగుల రెక్కలతో నిన్ను
పలుకరిద్దామనుకుంటే కన్నా నా నాన్నా నువ్వు శవమైపోయావు.
__________________________________________
* పాత వాచకం

06 August 2011

అ/వ్యాకరణ/ఆత్మ

వెనక్కి వెళ్ళకు
మళ్ళా తిరిగి రాకు
మూడు మూళ్ళు
ఎప్పుడూ మూడే

వెళ్ళిపోయే ఆకుల్ని
లెక్కించు
తెమ్మరని అలవోకగా
అలా ఆలపించు

సత్యమేమిటంటే
ఎవరికైతే ఏమీ లేవో
వాళ్లకి అన్నీ ఉన్నాయి

సర్వాంతర్యామిని
తన స్వప్నంలో
స్వప్నించే
సర్వాంతర్యామి

ఏడు ఏళ్ళు
ఎవరు ఎప్పటికీ
ఏమీ కారు

చూడు. అఘ్రానించు
అనుభూతి చెందు

వెళ్లిపోయేందుకు
తిరిగి రాకు

((రాత్రంతా వర్షం పడగా
అతడు కప్పల గృహంలో
తల దాచుకున్నాడు))

ప్రశ్న*

గుండెకు దగ్గరగా చేరి, వెచ్చటి ఊపిరితో
ఊడిన గుండీని తిరిగి పెట్టినట్టు

ఆమె అప్పుడప్పుడూ, నేను లేనప్పుడు వచ్చి
గదికి వేసిన గొళ్ళెం మధ్యగా
ఒక చిన్న కాగితం ఉంచి వెళ్ళేది.

ఈదురుగాలికి రహదారిపై దారినీ ఖాళీనీ గాలినీ
తాకుతూ కొట్టుకువెళ్ళే
ఎవరో పిల్లలు చింపి పడవేసిన కాగితంలా నేను
గదికి చేరుకున్నప్పుడు
గొళ్ళెం మధ్యగా దాచిన ఆమె దేహపు సువాసన
తెరల్లో ఇరుక్కునేవాడిని

రాత్రి మరచిన జాబిలినుంచి, పగలు వచ్చిన కాంతి
కొన్ని నక్షత్రాలని తెంపుకు వచ్చినట్టు
కాగితంపై మెరిసే కొన్ని పదాలు. అవి ప్రతిబింబాలు:
"నేను నీకోసం వచ్చాను. గదికి
తాళం వేసి ఉంది. ఎక్కడికి వెళ్లావు చెప్పకుండా?"

ఇన్ని మరిన్ని సంవత్సరాల తరువాత నేనా గదికి
నా మదికి, అలసట అరుస్తున్న
మట్టి కమ్ముకున్న సంచార ఆదివాసి కనులతో
ఏ కాగితమూ లేని గొళ్ళెం వైపు చూస్తాను. బహుశా
రుతువు మారింది. మంచుతెరల

మోహపు దినం మృత్యు రాత్రిగా చీలినట్టు
కోల్పోయినతనం ఇప్పుడు తలుచుకునే అక్షరాలుగా
అనాధ పదాలుగానూ మారింది.

అయితే, ఈ గొళ్ళెం గూడులో ఒకప్పుడు పొదిగిన
అక్షరాలు ఇప్పుడు ఎక్కడ రెక్కలతో
ఏ ఆకాశంలో సంచరిస్తున్నాయ్?
_______________________________________________________
* ఒక (పాత) వాచకం

03 August 2011

వెళ్తున్నాను దూరంగా

నిన్ను నమ్ముకోలేను
అమ్ముకోలేను

నిన్ను ఉంచుకోలేను
వదిలివేయలేను

నిన్ను హత్తుకోలేను
మరచిపోలేను

నిన్ను పిలవలేను
అలా అని వినలేను

నిన్ను చూడలేను
ఏమీ చూపించలేను

మరువక, కను
మరుగవ్వక
గూడు లేక గువ్వ
కువకువ
బెంగగా గుండెలో=

నువ్వు విన్నావా
దిగులు చినుకులు
దిగే సవ్వడి

ఆకులపైనుంచి
ఆకాశంలోంచీ

చితాభస్మం
చింతలలోంచీ
చితులలోంచీ:

నేత్రమే పాపం
పాపమే పుణ్యం.
ఏమీలేదు

వెళ్తున్నాను
దూరంగా

ఒక వెన్నెలనుంచీ
నా నుంచీ=

01 August 2011

ఇంకొంతకాలం

ఇదొక అలజడి
ఇదొక సవ్వడి

ఇందుకేనా వచ్చాను
ఇక్కడికి నీ వద్దకి?

మరుపు లేదు
ఈ అశాంతికి
విరామం లేదు
ఈ నయనాలకి

వడలిపోతున్నాయ్
పాత్రలో, నాలో
నువ్వు ఉంచిన
నువ్వు పెంచిన
తెల్లటి పూలు

వచ్చి నీ చేతిని
అందించు

ఇంకొంతకాలం
ఎందుకో ఒకందుకు
బ్రతికి ఉంటాను