30 May 2011

లోహలిపి

కనుమరుగౌతున్నది

కనరానిది, పూలు చిమ్మిన
దారిలో ఎదురౌతున్నది

శిలల నీడలు చేతులు చాచే
రాత్రిలో, ఎన్నటికీ రానిది

తవ్వుకుపోతున్నది, మదినీ
తననీ: తనువునీ.

మూడు దినాలు
మూడు శాపాలు

చాలిక ఈ జననానికి
చాలిక ఈ అంతానికి.

పడగ విప్పిన లోహలిపికి
స్వరాన్ని ఇచ్చిన

రుధిర వెన్నెల దేహధారిని
ఏమని పిలుద్దాం?

అ/జ్ఞానం 30.

అనుకోలేదు ఎన్నడూ

కొలనులోని జాబిలిని
వేటాడతానని

చెట్టు తొర్రలో దాగిన
పక్షి గుండె చప్పుడు
వింటానని

గాలి తోసే పచ్చిగడ్డినీ
రాత్రి వీచే రాతిగాలినీ
తాకుతానని

అనుకోలేదు ఎన్నడూ=

వెనుదిరిగి చూడకు.
వెంట తిరగకు. విను:

ముఖాన్ని కప్పిన అర
చేతుల శూన్యంలో

నువ్వు ఉన్నా పెద్దగా
ఏమీ తోచదు=

27 May 2011

అ/జ్ఞానం 29.

తను లేకపోతే తోచదు

పక్షులకీ, పిల్లలకీ
పూలకీ

దేశద్రిమ్మరికీ
దేహదాహార్తికీ

తన తనువు లేకపోతే
తోచదు.

చూడూ, నువ్వు లేక
అరచేతులనిండా

ఎంత శూన్యం గూడు
కట్టుకుంటుందో!

18 May 2011

అ/జ్ఞానం 28.

హృదయంలోకి ఒక బాకుని
దింపుతున్నాను

నిన్నొక పూబంతిని చేసి
రెమ్మరెమ్మనూ

తెంపుతున్నాను

నింపాదిగా,నిర్వికారంగా=

కనులలో రక్తపు చినుకుల్నీ
మనస్సులో ఒక కంపననీ

నీ శరీరంలో ఒక ఆగ్రహ
జ్వాలనీ రగిలిస్తున్నాను

బహు జాగ్రత్తగా
బహు నెమ్మదిగా

కరుణతో శాంతితో
ప్రేమతో=

తప్పక చంపుతావు
నువ్వు నన్ను
ఇందుకు
తప్పక ద్వేషిస్తావు
నువ్వు నన్ను
ఇందుకు
తప్పక వెడలిపోతావు
నువ్వు నన్ను
ఇందుకు

నన్ను నమ్మినందుకు:

అయితే ఒక దినానంతాన
నీ పిల్లలు నిన్ను వొదిలి

వేగిరంగా వెళ్ళిపోతున్న
సంధ్యా తరుణాన

నువ్వు ఒంటరిగా పూలు
అల్లుకునే చీకటి సమయాన
దీపం ఏకాకిగా మిగిలిపోయే
కరకు క్షణాన

గుర్తు తెచ్చుకుంటావు నన్ను

కనుల అంచున మంచుతో
పెదాల అంచున వొణుకుతో:

కృతజ్ఞతలు తెలుపుకుంటావ్

కొంత వేదనతో
కొంత నిట్టూర్పుతో

నేను ఇచ్చిన గాయపు
బహుమతికి అంతిమంగా

కృతజ్ఞతలు తెలిపే ఉంటావ్

ఒక బాకుకీ
ఒక నరహంతకుడికీ
తోటను దగ్ధం చేసిన
తోటమాలికీ=

అ/జ్ఞానం 27.

రాయలేవ్ నువ్వు

రెండు పాదాలతో
ఏడు లోకాలు తిరగాలి

చేప కన్నులో
చిక్కిన జాబిలిని తాకాలి

అలల వలలో
దాగిన వేసవిని మీటాలి

రానీ వాళ్ళను
వేటగాళ్ళను

రానీ వాళ్ళను

స్త్రీలను, స్మితవదనాలను కధనాలను
తధాగతుని వాచకంతో,పురాజన్మల
ప్రతీకారంతో కారుణ్యంతో=

ఏం చేయలేవ్
నువ్వు

కన్నుని వీడుట కన్నీటి ధర్మం
కన్నీటిని, చూపునీ పరిహసించుట
మిత్రుని ధర్మం

దరిచేరుట, దారిచూపుట
దయగా బాకుని డెందమునందు
దించుట, నీవు మోహించిన
పుష్పపు ధర్మం=

రాయలేవ్ నువ్వు, ఏం
చేయలేవ్ నువ్వు

రెండు నయనాలతో
సప్తలోకాలను తిరగాలి

తిరిగి రా, తిరిగి
తిరిగి రా

స్వసమాధిలోకి
విదేహంలోకి
నిర్యానంలోకి=

17 May 2011

అ/జ్ఞానం 26.

సాగుతుంది సర్పం
వెన్నెల మాటేసిన
దారిలో

రాలుతున్నాయ్
రావి ఆకులు
నిశ్శబ్దంలో

అరుస్తున్నాయ్
ఏటి ఒడ్డున
కప్పలు

కీచురాళ్ళతో

కొమ్మల్లో కదిలే
పక్షుల శబ్దాలతో=

సాగిన దారంతా
కొంత కాంతీ
కొంత శాంతీ

తనదీ, తన
తనువుదీ, ఎదురు
చూపుదీనూ=

వెన్నెల కాటేసిన
దారిలో

ఏ సర్పబాహువుల్లో
సమాధులపై

అతడు పదాలను
లిఖిస్తున్నాడో

ఆమెకీ తెలియదు
అతడికీ తెలియదు

అ/జ్ఞానం 25.

కదులుతుంది నెలవంక
నీటి చెలమలో
తన నవ్వులో

ఎగురుతోంది, ఎగిరెగిరి
వాలుతోంది గడ్డి

వెన్నెల కాంతిలో, నీటిలో
తన నయనాలలో=

శిధిలాలలో, చివరి చిత్రాల
నీడలలో

అతడు రాలిపోయింది
ఎక్కడో

తనకి తెలియదు
లాంతరు కాంతిలో
దాగిన తన
తనువుకీ
తెలియదు=

అ/జ్ఞానం 24.

చెరువులో చంద్రుడు
చంద్రుడి మదిలో
పిల్లలు

చెట్టును వొదిలి
పాపల్ని వొదిలి

చింతతో, చిరు
గాలితో అతడు

రాలిపోయింది
ఎక్కడో

రాత్రికీ తెలీదు
ఆమెకీ తెలీదు

15 May 2011

అ/జ్ఞానం 23.

మధుశాలలో ఒకరికొకరు తోడు
స్నేహితులు లేక
చెరశాలలో నేను

రాత్రికి పగలు. సూర్యుడికి
చంద్రుడు

గాలికి పూలు. పూలకి స్త్రీలు
స్త్రీలకు పిల్లలు

లోకమంతా ఒకరికొకరు తోడు
గ్రహణంలో చిక్కుకుని
ఎవరూ లేని నేను

చెట్టుకి గూడు. గూటికి గుడ్లు
చెలమకి కప్పలు. కప్పలకి
కాకులు

కాలమంతా ఒకరికొకరు తోడు
ఎవరూ లేక కదిలే
తోక తెగిన బల్లిని

నేను

శిశువుకి స్థన్యం. బిక్షువుకి
మరణం

నీళ్ళకి రాళ్ళు. రాళ్ళకి ఆకులు
ఆకులకి నీడలు.
నీడలకి పిల్లులు

మెరిసే విశ్వాలకి విశ్వాలు

మరణం నుంచి జననం దాకా

ఒకరికి ఒకరు మరొకరు తోడు

ఏ నక్ష్త్రమూ లేని కృష్ణ బిలం
నేను

మధుశాలల్లో మనుషుల
కర్మాగారంలో ఆదిమ శిలను

నేను

తెలిసింది. సమాధులపై రాతి
పూలను ఉంచే వేళయ్యింది
దీపం ఆర్పివేసే సమయం
వచ్చింది

వెడలిపో త్వరగా
ఎవరూ గానం చేయని
చరణంగా

నిశీధి నిశ్శబ్దంలోకి, నిశ్శబ్దాల
నీడలలోకి

చీకటివై, ప్రతిబింబమై
పలు రంగుల నీడవై=

14 May 2011

పచ్చని చెట్టువి నువ్వు

పచ్చని చెట్టువి నువ్వు

మంచు కురిసే
వెన్నెల రాత్రివి నువ్వు

పెదవిపై మిగిలిన
రక్తపు చినుకువి నువ్వు

పాత్రలో వడలిన
శ్వేత గులాబీవి నువ్వు

కన్నుని తాకిన
తెమ్మర తారకవి నువ్వు

కంటిని చీల్చిన
కన్నీటి కాంతివి నువ్వు

వొదిలి వేయబడ్డ
ఖాళీ గూటివి నువ్వు

పిల్లలు ఉండీ పిల్లలు రాని

ఎదురుచూసే
ఎదురుచూపువి నువ్వు
బెదురు చూపువి నువ్వు

ఎవరూ తాకని తల్లివి నీవు
ఎవరూ పాదం మోపని
తెల్లని కలవి నువ్వు

పూలని తాకని వర్షం నువ్వు
వర్షాన్ని తాకని
బాలికవి నువ్వు

స్థన్యం లేని స్థలం లేని
శిశువువి నీవు
నీడ లేని నీడలలో కదిలే
నీడవి నీవు

నదివి నీవు నగరానివి నీవు
సారంగి లేని
అగమ్య ప్రయాణం నీవు

నిరంతర కలవి నీవు
నిర్మల కలవరం నీవు

కలల అలలు విసిరివేసిన
గర్భానివి నీవు.
విశ్వ శూన్యానివి నీవు

యవ్వనం నీవు
వృద్ధాప్యం నీవు

మృత్యుపాదాల రహస్య
పయనం నీవు

బరువుగా కదిలే బాల్యం నీవు
కదలలేని రోగిగా మారిన
ఆవువి నీవు

ఎవరో వెలిగించి వొదిలివేసిన
దీపం నీవు
కొనశ్వాసతో కొనసాగుతున్న
వొణికే సన్నటి జ్వాలవి నీవు

ఆదిమ అంతాలలో బిందువువి
నీవు. బిందువులో కరిగే
మృత్యుసింధువువి నీవు

తొలి వెలుగు నీవు
చివరి చీకటి నీవు

ధరిత్రిపై మిగిలిన చివరి
చెట్టువి నీవు. మంచు కురిసే
చివరి రాత్రివి నీవు

పెదవిపై విరిసిన చివరి
చిరునవ్వువి నీవు

పిల్లలు ఉండీ పిల్లలు రాని

ఎవరూ తాకని
ఎవరూ సోకని

ముదుసలి తల్లివి నీవు
నింపాది మరణం నీవు=

స్థితి

ఒక దినం గడిచింది. ఒక
కాళ రాత్రి ముగిసింది

మురిసిపోకు. ఇంటికి వెళ్లి
ఆమె ముఖాన్ని
వెలిగించాల్సిన

సమయమిదే:

ఒక యుద్ధానికీ
ఒక మౌనానికీ

సిద్ధంగా ఉండు=

అ/జ్ఞానం 22.

వీచే గాలిలోకి వెళ్ళలేవు
మొక్కలకి నీళ్ళు
వొంపలేవు

పిల్లలతో ఆడలేవు
నవ్వుతూ మాట్లాడలేవు
తనతో ప్రేమగా
ఉండలేవు

కనులలోని చినుకులని
చినుకుల్లోని చిత్రాలని
చిత్రాలలోని చింతనీ
చూడలేవు

దరి చేరలేవు. దాటలేవు
ఎవరినీ దారి
దాటించలేవు

అరచేతులలో దీపంతో
దిగులుతో, తపనతో
పగళ్ళూ రాత్రుళ్ళూ

కబోధివలె తిరిగేవాడిని
ఎవరైనా ఏం చేస్తారు?
ఇంతకూ ఇంతకు
మునుపెపుడైనా

ఇంత హృదయస్థిమితం
లేనివాడిని

ఎక్కడైనా చూసారా
మీరు?

ఆ పక్షులు

చుట్టుకుంటోంది చేయి
వలయమై

అలుముకుంటోంది ఊపిరి
నునువెచ్చని మంటై

ఎగిసిపడుతోంది ఛాతి
అలలై

పర/వశమైపోతోంది. ఆదిమ
నీడల ప్రాగణంలోకి

శరీరం చేజారిపోతోంది.
మృత్యుమోహితమై
దిగంతాలలోకి

నయనం ఇంకిపోతోంది:

=ఇక పక్షులు, నిన్ను
వొదిలివెళ్ళిన ఆ పక్షులు
గూటిని చేరే సమయం

ఆసన్నమయ్యింది:

లేచి దీపం వెలిగించు=

12 May 2011

ఏం చేసావ్ నువ్వు

ఏం చేసావ్ నువ్వు

పాషాణ నయనాలతో

రోదించేవాడిని
చూసి సంతసించావ్
ఉదయాన్నే లేచి

ఇల్లంతా బిరబిరా తిరిగే
పూబంతి రెమ్మలని

పెరికివేసావ్. నిశ్శబ్దాన్ని
నలువైపులా

నింపివేసావ్. మరొకసారి
చనిపోయావ్=

=ఈ లోకం, ఎందరి
నయానాలో పొదిగిన
ఈ లోకం, ఎందరి
కన్నీళ్ళో కడిగిన
ఈ లోకం

నీది మాత్రం కాదిక

ఏనాటికీ=

అసలే కదపకు

అలల నవ్వులో మునిగిన
కలల మువ్వలు

కదలకు, పిల్లల శాంతిని
అసలే కదపకు

=చూడు చుట్టూతా ఎంత
కాంతి పరుచుకుని ఉందో
కాంతిలో ఎంత వెన్నెల
దాగి ఉందో=

వాగుల్లో తేలే నెలవంకల్ని

తేనె తాగే తుమ్మెదల్ని
గాలిలో తేలే తూనీగల్నీ

పిల్లల్ని, వేసవి వానలలో
బురదలో చిందులేసే

పిల్లల్ని అసలే కదపకు

కలల నవ్వులో మునిగిన
అలల సవ్వడిని
అసలే తాకకు=

10 May 2011

అ/జ్ఞానం 21.

చెట్లు, కరడు కట్టిన చెట్లు
అవే నీ స్నేహితులు

నీడలు, నిను వీడని
నిను తాకని నీడలు
అవే నీ అతిధులు

చినుకు చట్రాలలోకి
ప్రవేశించినప్పుడు
నింగికెగిసిన మబ్బులూ
నల్లటి నదులూ
అర్థమవుతాయ్

శిధిలాలలోకీ, శిశిరాలలోకీ
కూలబడినప్పుడు
వొదిలివేసిన బాహువుల
నిర్మలమైన
చీకటి కారాగారాలు
విశిధమౌతాయ్

అనుకుంటావ్ కదా
అప్పుడు

చితాభస్మమేరా

జీవితమంతా, కరాళస్వప్న
లిఖితమేరా

కవిత్వమంతా=

రాలిపోయే రావిఆకులను
చుట్టుకునే సమాధుల శాంతి

ఒకప్పుడు తిరిగిన
స్మశానాల కాంతీ కావాలిరా
నీకు ఇప్పుడు

ఒక కాటికాపరి
సాహచర్యంతో =

అందుకని వెళ్ళు

చెట్లు. రోదించేవాళ్లపైకి
దయగా వొంగి
గుసగుసలాడే
కరుడుగట్టిన ఆ
మెత్తటి చెట్లు

అవే నీ భాంధవ్యాలు

వెళ్ళు. అవి వీచి వ్యాపించే
శాపకాలాల

సమ్మోహిత నేత్రాలలోకి
త్రికాలాలలోకీ

సప్తలోకాలలోకీ=

అ/జ్ఞానం 20

నాలుకపై విషవృక్షాలు
పెదవులపై ఎడారులు

ఏమిటిది?

రాత్రుళ్ళు నిదురించలేవు
పగళ్ళు వదనాన్ని
లోకానికి చూపించలేవు

కూర్చోలేవు. కదలలేవు.
విశ్రమించలేవు

హృదయగ్రహణాన్ని, నయన
రోగాన్ని ఆపలేవు=

ఇక ఇప్పటికి
అద్దంలోకి చూసుకో

ఒక పుర్రె నవ్వుతోంది
నిన్ను చూసి.

09 May 2011

అ/జ్ఞానం 19.

శిలపై మోదిన నీ నుదిటిపై
ఆమెను పుష్పించనీ

అలసిన అరచేతులతో
నీ ఛాతిని చీల్చనీ

నువ్వు కాలేని దృశ్యాలు
నీ నయనాలను
పెకిలించివేయనీ.

తిరిగిరాని, తిరగరాని
వంకీలు తిరిగిన
వెన్నెలలేని ఆ దారి

నీ పాదాలని
నరికివేయనీ.

మరణించినవారు
కరుణించిన రాత్రిలో

నువ్వొక తెల్లటి అద్దాన్ని
ప్రతిష్టించనీ
నువ్వొక తెల్లటి రూపాన్ని
సృస్టించనీ

ప్రతిబింబపు, ప్రతి
బింబాన్ని దర్శించనీ
వ్యాకరుణించనీ:


అందుకని, వాళ్ళు
రానందుకని
ఇక తెలియదు నీకు
ఎప్పటికీ

దర్పణంలోకి దారేటో
దర్పణంలోకి వెళ్ళినవారెవరో
వెళ్ళేవారెవరో

దర్పణంలోంచి నీకు
ఒక మృతవదనాన్ని

కారుణ్యపు నవ్వుతో
బహుకరించేవారెవరో=

08 May 2011

అ/జ్ఞానం 18.

నీ శరీరమేమీ మారలేదు. కాకపోతే

వదనం మాత్రం ఖడ్గమయ్యింది
పదం పాషాణమయ్యి

నీ రూపు సూర్యరశ్మిలో
జ్వలిస్తోంది

నను దహించివేస్తోంది.

వొదిలివేయి
నన్ను నా మధుశాలకు

అక్కడ దాస్తాను దర్పణంలో
మూడు పుష్పాలను
నీకు బహుమతిగా

నడిచిరా వాటితో
నా సమాధి వద్దకు

ఆ ప్రతిబింబాలలో
ఆ ప్రతిబింబాలతో=

07 May 2011

అ/జ్ఞానం 17.

మళ్ళా అర్ధిస్తున్నాను

మోకాళ్ళపై రాలిపడి
వేడుకుంటున్నాను

వొదిలి వెళ్ళు నన్ను.

ఆ చెట్టు కిందే, సరిగ్గా
ఆ చెట్టు కిందే
పల్చటి నీడలు గాలికి
కదులాడే ఆ మాంత్రిక
కాంతిలోనే

నిను మైమరుపుతో
తాకాను. మృత్యువును
కనుగొన్నాను.

ఆ తరువాత నవ్వానా
నేను ఎపుడైనా ?

మళ్ళా అర్ధిస్తున్నాను

వొదిలి వెళ్ళకు నన్ను.

06 May 2011

అ/జ్ఞానం 16.

ఎగిరిపోయాయి సాయంత్రంలలోకీ
నీడలలోకీ పిట్టలు

ఏమీ ఆశించని, నీ చుట్టూ ఉట్టినే
అలా గిరికీలు కొట్టిన పిట్టలు

రావు అవి మళ్ళా చెట్ల కిందకి
వర్షాలలో, గాలులలో

తిరిగి తిరిగి నీకై ఎప్పటికీ:

మరచిపోయావు నువ్వు, నువ్వు
ఒక కరాళ రాత్రివని
ఒక సజీవ కంకాళానివని:

దీవించిన అరచేతులే
ఇపుడు నిను దహించివేస్తాయి
పొదుపుకున్న బాహువులే
ఇపుడు నిను వెలివేస్తాయి

కారణజన్మడువి. నిరంతర
శాపగ్రస్థుడువి
పదసమాధుల అలంకారివి
ఆహంకారివి

తన దర్పణంలో ఒక లిల్లీ పూవు
పూచింది. తెల్లటి కాగితం

నీకై ఎదురుచూస్తోంది. వెళ్ళు

మణికట్టు తెంపుకునేందుకు
ఇదే సరైన సమయం.

04 May 2011

అ/జ్ఞానం 15.

నల్లటి పావురమొకటి
కువకువలాడుతోంది

హృదయంలో గూడు కట్టి
గుడ్లని పొదుగుతోంది

ఆగి ఆగి కదులుతోంది
ఆగి ఆగి ఎగురుతోంది

గరుకైన దాని గోళ్ళ గీతలు
నీ అరచేతిపైన
పదునుగా కదులాడే దాని
ముక్కు నీ కళ్ళపైన

ఆదుర్దా అంటే ఏమిటో
తెలిసిందా ఇప్పటికైనా?

పోగొట్టుకోవటం అంటే ఏమిటో
అర్థమైందా ఇన్నాళ్లకైనా?

పొదిగింది నిన్ను తనలో
పొదుపుకుంది నిన్ను
తన తనువులో

ఈదురు గాలి వీచిన వేళల్లో
వర్షం కురిసిన రాత్రుళ్ళలో

రెక్కలని పరిచి,తన శరీరంతో
నెగడును రగిల్చి,అన్నీ మరచి
రక్షించుకుంది తను నిన్ను

ఒక శిశువు వలె
తన రొమ్ములకి
చుట్టుకుంది నిన్ను:

కలవరపడింది
కంగారుపడింది. అంతిమంగా
గాయపడింది.

అన్నీ వదిలి నీకై నేల రాలిన
ఆ పావురపు అంతిమ కేకను

ఈనాటికైనా
వినగాలిగావా నువ్వు?

02 May 2011

అ/జ్ఞానం 14.

నిదురపోయే ప్రయాణం కావాలి
ఇవ్వగలవా?

పిట్టలు అలసివిపోవు. ఆడీ ఆడీ
పిల్లలు సొలసిపోరు

ఇల్లంతా తిరుగాడుతూ, ఇంటిలో
కాంతిని నింపే ఆమె

కాంతిని వొదిలి, కారుణ్యం లేని
చీకటిని ఇష్టపడే అతడూ

మీకు తెలుసు. ఇంకా ఒకరికొకరు
అపరిచితులైన వాళ్ళకే తెలీదు

రాత్రైతే లిల్లీ పూవులు పూస్తాయి
వెన్నెలో లేక నవ్వే నక్షత్రాలో

నీపైకి దయగా రాలతాయి.

చూడు ప్రపంచం మొత్తం ఎంత
దయతో కదులాడుతుందో

పూలు అల్లుకుంటున్న
ఆమె కళ్ళలో ఎంత ఇష్టం
గుమికూడుకుంటుందో

సన్నగా రెపరెపలాడే పరదా వెనుక
ఎంత చల్లటి గాలి వీస్తుందో

నీకై ఎంత శాంతి అద్రుశ్య౦గా
రహస్యంగా దోబూచులాడుతుందో

మృత్యుదర్పణం వొదులు.
ఆ పేరులేని దిగులిని విడువు.

ఇస్తానంటోంది తను బహుమతిగా
మరుపులాంటి ప్రయాణం

వెళ్ళు. వెళ్లి కాసేపు నిదురపో.

01 May 2011

అ/జ్ఞానం 13.

మన్నించు
జతగా ఉన్నందుకు
అతడిని శపించు

కరుణించు
అతడి కలలలో
శయనించు

వేసవి కాలం
ఆకులు
రాలు కాలం
దేహంలేని
దయలేని కాలం

మన్నించు

మన్నించి
అతడి మెలుకువలో
జీవించు