31 July 2010

నక్షత్రాల కింద

నక్షత్రాల కింద కూర్చున్నాను

ఎవరికీ తెలియని కాంతిలో
నిశ్శబ్ధంగా
మునిగిపోతున్నాను

పగటిపూట చీకట్లో
రాత్రిపూట
కనులు విప్పలేని నీ
వెలుతురులో
ఒక్కడినే
ఎవరికీ తెలియని వర్షంలో
తడిచి
కరిగి పోతున్నాను

పిల్లల్ని
వొదిలివేసిన అలలతో
అలలని
వొదిలివేసిన పిట్టలతో
ఒక్కడినే
కాలం గడుపుతున్నాను.
కంటి చివర
వెచ్చటి రక్తం చినుకై, కన్నుని
వీడెందుకు
సిద్ధమౌతున్న
ఒక స్నేహితుడిని చూస్తూ

ఒక్కడినే

నక్షత్రాల కింద కూర్చున్నాను

29 July 2010

శిధిలాలు

మొహసింతో
కిటికీ వెలుపలకి చూడు :
శతాభ్ధాలుగా మనం పేర్చిన
ఊచలకు అవతలగా
రాళ్ళకు అవతలగా
నువ్వు దానిని కనుగొంటావు:
ప్రశాంతంగా
జీవంతో కంపిస్తూ
మంచుదీపంలో వెలిగే
ఒక తడి ఆరని జ్వాలని.

నువ్వు.
ప్రతిసారీ నువ్వు.
నేనైన నువ్వు
నీదైన అతడు.
ఆమెగా మారిన
ఎవరికీ చెందని
నువ్వు.
ప్రతిసారీ నువ్వు.

పదం.ఆ పదం. అది మనం ప్రతిసారీ ఆమెవద్దకు మోసుకువెళ్ళే
వారసత్వంగా వచ్చిన ఒక మరణ శాసనం.
అవతలివైపు, అవతలికి అవతలివైపు, పదపు మాతృముఖం వైపు
మనం ఏకత్వంతో వదిలివేయబడతాం.
పదం.ఆ పదం. అది మనం ప్రతిసారీ అతడి వద్దకూ, ఆమె వద్దకూ
నా వద్దకూ మన వద్దకూ తీసుకువెళ్ళే వారసత్వంగా రాని ఒక జాడ:
అది మనం.

శిధిలాలా? ఆరంభమే అంతం.
హింసా? అంతం ఆరంభం కాదు.ఇక తేలుతాం మనం, కనిపించని
ఆధారం నుంచి వెలువడే పొగలా, జ్వాలలా
తేలుతాం మనం. నువ్వూ తేలుతావు నేనూ తేలుతాను
ఎక్కడాకాని స్థలం నుంచి ఎక్కడా కాని స్థలంలోకి,
శబ్ధంలోకి, నిశ్శబ్ధం అంచులలోకి పయనిస్తాం మనం:మనం. శిధిలాలు,
హింసా ఒక కన్నీటి చుక్క కూడా మనం: నువ్వూ, నేనూ మనం.
అది మనం. అందుకే

దానిని పదిలంగా పొదివి పుచ్చుకున్నాం:మనం. పెదాల మధ్య దానిని
భద్రంగా దాచుకున్నాం: మనం.
మన అస్తిత్వాలతో దానిని శిలువవేసాం:మనం. ఎలా అంటే, మనం
చేయగలిగినదల్లా నిన్ను గడ్డకట్టించగలిగినట్టు. నిన్ను
గుర్తుంచుకుంటూ కూడా విరామచిహ్నాల మధ్యకు నెట్టి వేయగలిగినట్టు.

నువ్వు.
ప్రతిసారి నువ్వు.
నేనైన
మనంగా మారిన నువ్వు .

(అస్తిత్వపు అంచున ఖచ్చితంగా అస్తిత్వపు అంచునే ఒక చిహ్నం
బయల్పడటంతోనే దాగి ఉంటుంది
: మనం. నువ్వు.)

మొహసింతో
కిటికీ వెలుపలకి చూడు :
శతాబ్దాలుగా మనం పేర్చిన
ఊచలకు అవతలగా
రాళ్ళకు అవతలగా, నువ్వు దానిని
కనుగొంటావు:
ప్రశాంతంగా,
జీవంతో కంపిస్తూ
మంచుదీపంలో వెలిగే
ఒక తడి ఆరని జ్వాలని.

ఇప్పుడు మనం మాట్లాడవచ్చు.
ఒకసారి. మరలా. ఒక్కసారి .

ఇప్పుడు,ఒక ఇప్పుడు మాత్రమే

ఒక అలని అరచేతిలో పట్టుకుని
అలవోకగా అలా ఊపినట్టు
నువ్వు
ఆ గాజుగ్లాసుతో
గాలిలో
కొన్ని పదాలను రాస్తావు :
ఇక
జీవితపు అమృతం అంతా
నీ కలల
బంగారు కాంతి అంతా
ఆ బంగారు
బంగారు పాత్రలో ప్రతిబింబించి
అలలనెలవంకై
ఊగిసలాడతాయి.
ఇక అప్పుడు
ఇక అప్పుడు
నువ్వు బ్రతికి వస్తావు.

ఒక గీతంతో,
ఒక పురాతన శబ్దంతో
భూమిని
పాదాలతో తన్ని
గాలిలోకి
ఎగరబోతున్న
ఒక పక్షి బంగారు
బంగారు చర్యతో,
నువ్వు
జీవం పోసుకుని,
నీలి నీలి కళ్ళతో,
రహస్యకాంతితో
మృత్యుదేవత చేసే
నీలినృత్యంతో
నువ్వు
నిర్బయంగా
నృత్యం చేస్తావు.

ఒక చిరుగాలి
ఒక చిరు
చిరు గాలి
రాత్రిని అందిపుచ్చుకుని
పొలాలకుపైగా,
నల్లటి అశ్వంలా
ఈ సంధ్యాసమయంలోకి
ఒక చిరుకాంతిని
ఒక చిరు చిరుకాంతిని
ఈ రాత్రిని
తన వెంట తీసుకువస్తుంది.
ఇక అప్పుడు
నువ్వు బ్రతికి వస్తావు
ఇక అప్పుడు మాత్రమే
నువ్వు బ్రతికి వస్తావు


ఇక అప్పుడు
నువ్వు జీవితంలోకి ప్రవేశించి,
కలలని రమించి,
అన్నింటినీమించి
సర్వాన్నీ
మొదటిసారిగా ప్రేమించి
నువ్వు
ఇంద్రజాలపు పదాలను
నువ్వు
ఇంద్రధనస్సు పదాలను
విశ్వపు
అంచునుంచి
తేలి వచ్చే
స్వరాలవలె
పాడతావు :
కవిత్వాన్ని
లిఖిస్తావు

మౌనమైన పెదాలతో,
ఈ గాలిలో
కురిసే మంచులో
మానవాళికి ఆవలివైపు
ఆలపించాల్సిన
గీతాలున్నాయి. ఇక
ఈ రాత్రికి నేను
ఒక శిశువు కలలో
మరణించేందుకు సిద్ధపదతాను

ఇక అప్పుడు
నువ్వు
భయాల గురించి మాట్లాడతావు.
ఇక అప్పుడు
నువ్వు
హృదయరహిత
మృగాలుగా మారిన
దినాల గురుంచి మాట్లాడతావు
నువ్వు కన్నీళ్ళ భయాల్ని
భయాల కన్నీళ్ళనీ ఆలపిస్తావు
మొహసింతో,
నువ్వు నీకై
నీ గురుంచి
నన్నుఅలాపిస్తావు.

ఒక సముద్రం నెమ్మదిగా
ఒక జోలపాటతో
నిదురలోకి జారుకుంటుంది .
తన అస్తిత్వపు
చితాభస్మం నిండిన గ్లాసుని
పోదివిపుచుకున్న
బంగారు
బంగారు మనిషికి
శాపమూ
వరమూ
అయిన రాత్రిలో
అతడు
నిశ్శబ్దానికీ
గీతానికీ మధ్య
సముద్రానికీ
సముద్రపోడ్డుకీ
మధ్య తేలుతూ
తనలో తాను
ఊయలలూగుతాడు.
నలుపు
నలుపు జీవితపు
జ్ఞాపకం మార్చిన
నీలి నీలి
నీలాల
నయనాల మధ్య
వలయమై
పోతాడు

ఇక అప్పుడు
ఒక గీతంతో,
ఒక ఆదిమ శబ్దంతో
గాలిలోకి
ఎగిసిపోతున్న
ఒక పక్షి బంగారు
బంగారు సంజ్ఞతో
రంగులమయమైపోయి
తెల్లగా మిగిలిపోతూ
నువ్వు నన్ను
జీవితం వద్దకు
తీసుకువెళ్లేందుకు
నీలి నీలికళ్ళ
ప్రేమదేవత చేసే
నీలి నీలినృత్యంతో
పాదాలు
కలిపేందుకు
నువ్వు నన్ను
తీసుకువెళ్లేందుకు
వస్తావు.
జీవితమైనా లేదా
మృత్యువైనా
మొహసింతో
ఇక ఏమాత్రం బాధించవు,

ఇప్పుడు,ఒక
ఇప్పుడు మాత్రమే మనం
మరో రొజుకై జీవించగలం.

27 July 2010

వాగ్ధానం

నీ పదం నా సత్యం కాలేదు, నేను కాంచే ఉత్సవం
నీకు వాగ్ధానం కాలేదు

మొహసింతో, మనమందరమూ హృదయాలలో ఒక సమాధినీ
భుజాలపై వారసత్వంగా వచ్చిన
ఒక శిలువనీ మోసుకు తిరుగుతున్న వాళ్ళమే. శిలువవేయబడి
ఈ భూమినీ మన అస్తిత్వాలనీ
ఒక స్వరరహిత తరంగంలో ముంచివేసే ఆ తపన ఇక్కడిది కాదు.
దిగులు,మొహసింతో, ఎదురుచూసే మన కళ్ళని కమ్ముకునే
ఆ దిగులుపూరితమైన దిగులూ
ప్రతిధ్వనీ ఏదీ లేక మన హృదయాలలోంచి దూసుకువచ్చే
ఆ నిశ్శబ్ద ఆక్రందనా
అవి మనకు చెందవు మొహసింతో, మన పిల్లలలా అవి
మన ద్వారా వస్తాయి కాని మనకు చెందవు .

నేను దిగులుగా ఉన్నానా? నాకు తెలీదు .
నేను మతిస్థిమితం లేని వాడినా? అది నాకు తెలుసు .
ఇక మనకు మిగిలిన శరణాలయం అంటావా?
మొహసింతో, ఈ జీవించడంలో మరణించు .

25 July 2010

వలయం

ఒక వలయాకారపు చిహ్నం, ఒక ఆకస్మిక సంజ్ఞతో ఇక నువ్వు ఎన్నటికీ నీ వద్దకి తిరిగి వెళ్ళలేవని చెప్పినప్పుడు ఏం నువ్వు చేస్తావు? ఏం చేయగలవు నువ్వు?

నువ్వు జీవించిన జీవితాలన్నీ, నువ్వు కాంచిన మరణాలన్నీ నువ్వు సమాధి చేసిన ప్రేమలన్నీ నువ్వు చేయగలిగీ చేయలేని పనులన్నీ మంచు కమ్మిన అద్దంపై అస్పష్టంగా కదిలి వెళ్ళిపోయే ఒక ముఖంలా మారినప్పుడు నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఏమి చేయగలవు?

ఒక ఖడ్గ ఖండితానికీ, శిలువ వేయబడటానికీ మధ్య ఉన్న ఎంపిక చేసుకునే అవకాశమా ఇది? మృతులకూ, జీవించేవాళ్ళకూ మధ్య చలించే నిశ్శబ్దమా ఇది? ఒకవేళ ఇదంతా,తరచూ మరచిపోయే కలలోంచి గుసగుసలాడే, మరచి వచ్చిన మరో జీవితపు శకలమా ఇది?

జీవించేది ఎవరు? మరణించేది ఎవరు? వెడలిపోయేది ఎవరు? వెడలిపోతూ కూడా ఉంటూ సర్వాన్నిత్యజించేది ఎవరు? త్యాగం చేసేది ఎవరు? ఈ పదాల చీకట్ల చివర పొటమార్చిన రక్తం చినుకై మిగిలేది ఎవరు ?

dejavu. dejavu. dejavu.

24 July 2010

ప్రశ్న

అరచేతుల నిండా గులక రాళ్ళతో
ముఖం నిండా గాయాలతో, దప్పిక గొని
సముద్రాన్ని ఆశిస్తూ
ఒక చల్లటి వర్షాన్ని వెదుకుతూ
వచ్చాను నీ వద్దకి

వంచిని నీ తలను ఎత్తగా
మెరిసాయి అక్కడ
అంధత్వాన్ని కలిగించే తెల్లటి వెలుతురుతో
మెరిసే ఎడారులు
వ్యాపించాయి అక్కడ
ఘనీభవించీ, సమయంతో సాగే, పురాతన
రాళ్ళకు కట్టివేయబడిన
దిగులు రాత్రుళ్ళు

వచ్చాను నేను నీ వద్దకి
అరచేతుల నిండా
గులక రాళ్ళతో, వెన్నెల నిండిన
సముద్రాన్ని ఆశిస్తూ
వచ్చాను నేను నీ వద్దకి

ఇంతకూ,
ఏమి ఆశించావు నువ్వు
ఏమి పొందావు నువ్వు

అరచేతుల నిండా
గులకరాళ్ళూ, కనుల నిండా
పురాతన ధూళీ అలుముకుని
సూర్యుడినీ, సముద్రాన్నీ
గాలినీ నేలనీ నీళ్ళనీ
నిను వీడని వర్షాన్నీ
వెదుకుతున్న మనిషి నుండి?

మృత్యుకాంతి

మృత్యు శీతల కాంతి వెలుగుతోంది ఇక్కడ
బంగారు రంగు నీడలలో,
ఇక ఎప్పటికీ వెళ్ళలేని ఇళ్ళ వలయపు దారుల్లో
ఇక ఎన్నటికీ చేరుకోలేని
పురాతన శాంతి గాధల వంటి
ఆ స్త్రీ బాహవుల ఎదురుచూపుల్లోకి
ఎవరూ లేని, ఎవరూ రాని
మృత్యు శీతల కాంతి గీతం జ్వలిస్తోంది ఇక్కడ
జన్మ నివ్వని, చనుబాలు తాపని
చివరిదాకా ఎదురుచూసి కడగంటి చూపు మిగలని
అనేక తల్లులుగా చీలిపోయిన
ఒక తల్లి శూన్య విషాదం విల విలలాడుతోంది ఇక్కడ.
కన్ను చివర నిలిచి, కన్నుని వీడలేని
తల్లి పాల వంటి కన్నీటి చుక్క
నిస్సహాయత విల విలలాడుతోంది ఇక్కడ.

ఇక ఉన్నదల్లా ఒక్కటే
ఎడ తెగని ఈ నిర్వికార లోకంలో, నీకై
నీకు నువ్వు నిర్మించుకున్న
రహస్య బలిశాల వద్ద నువ్వు మాత్రమే
అనేకంగా వికసించి,
దారి తెన్ను లేక అన్ని చోట్లా నిస్పృహగా
రాలిపోయేచోట
మృత్యు శీతల కాంతిలో, స్నేహితులు లేని
చీకటి ద్వారాలలోంచి బయల్పడే
ఒక మార్మికమైన ప్రేమ శాంతిలో
ఇక ఉన్నదల్లా ఒక్కటే
ఇక మిగిలినదల్లా ఒక్కటే
ఎవరో వెలిగించి వోదిలివేసిన ప్రమిద కాంతి ఒక్కటే.

ఉన్నావా? నువ్వు ఉన్నావా ఇక్కడ?
పిల్లల కళ్ళ పూల పందిర్లలో
ఒక నిష్కపట ఎదురు చూపులో, మసక నీడల్లో
వృక్షాల కింద తళతళ లాడే
నీటి చెలమల వెలుతుర్లో
ఉన్నావా, నువ్వు ఉన్నావా ఇక్కడ?
ఉన్నావా, నువ్వు ఉన్నావా ఇక్కడ?
ఒక అపరిచితుడి ఆలింగనపు అంతిమ అస్తిత్వంలో
కరడు గట్టిన నిర్లక్ష్యాలలో
ప్రియమైన వాళ్ళ నిరాదరణలో
ఉన్నావా, నువ్వు ఉన్నావా ఇక్కడ?

ఉండనీ, ఉంటే ఉండనీ,
పూలహారంలో దారంలా
కన్నీటి చుక్కనీ కన్నీటి చుక్కనీ కలుపుతూ
అదృశ్యంగా నువ్వలా ఉండిపోతే ఉండనీ
ఉండనీ, నువ్వలా ఉండిపోనీ,
ఎవరో వెలిగించి వొదిలివేసిన దీపంలా,
నువ్వు ఉంటే ఉండనీ. సాగనీ,
రహదారి పక్కన మూర్చిల్లుతూ, అర్ధరాత్రిలో
లుంగలు చుట్టుకుపోయే
అతడి జీవితంలా, మరణాన్ని హత్తుకొని కదలిక లేక
అంతిమ శ్వాసకై
ప్రపంచపు కొన అంచుని పట్టుకుని
జీవన్మరణ తెరల మధ్య
ఊగిసలాడుతున్న ఆమెను వదలలేకా, ఉండాలేకా
చూడలేక, చూస్తూ బ్రతకలేకా, ఆమె చుట్టూ
నడియాడుతున్న వాళ్ళ హృదయ దిగులు ధ్వనుల్లా
బ్రతుకు సాగితే సాగనీ
మృత్యు శీతల కాంతిలో, ఈ సమయం
ఇలా పగిలిపోతే పగిలిపోనీ .

ఇక ఆ తరువాత
అంతకుమునుపు మిగిలే ఒక అంతిమ కాంతి
ఒక అంతిమ శాంతి
ఎప్పటికీ మిగిలి ఉండే మృత్యుశీతల కాంతి.