09 December 2016

అంతిమ ప్రశ్న

నేల అంతా కాంతి. ఆకులు
కదులాడే నీడలు. రాత్రి
కురిసిన మంచు. పూవులూ -
చివరిగా అంది తను:

"పూరేకులు రాలే నిశ్శబ్ధాన్ని
ఏనాడైనా నాలో
వినగలిగావా నువ్వు ?"

జవాబు

వేలి చివర నుంచి, ఒక నీటి చుక్కను
అతని నుదిటిపై రాల్చి "నేనొక
వనకన్యనూ, వానచినుకునూ. తెలుసా
నీకు ?" అని అడిగింది తను -
కానీ అప్పటికే, తనని గట్టిగా పట్టుకుని
నిద్రపోయి ఉన్నాడు అతను!

08 December 2016

దృష్టి

అతి జాగ్రత్తగా ముక్కలని ఏరి, ఇంటిని
సర్ది పెట్టింది తను. ఈలోగా
సాయంత్రం అయ్యింది. చీకటీ పడింది -
కొంచెం గాలీ వీచింది. అయితే

ఇంటికి తిరిగి వచ్చి, దుస్తుల్ని విప్పుతూ
అతను, పగిలిన పాత్రని కానీ
తనలో లేని పూలని కానీ, వేర్లు తెగిన ఒక  
మొక్కని కానీ తనని కానీ, మరి

ఎందుకనో, అస్సలు గమనించనే లేదు!

ఇద్దరు

చీకటి ఒడ్దున ఇద్దరు: వాళ్ళ లోపల
చుక్కలతో మెరిసే నీళ్ల శబ్ధం -
వెన్నెల ఇసిక. గవ్వలూ, పీతలూనూ:
ఎక్కడో  మిణుకుమంటో దీపం -
***
తెప్పకింద చేరి రాత్రి, ఇక వాళ్ళతో 
అక్కడే ఆగిపోయింది!


కారణం

కర్టెన్లు వేసి ఉన్నాయి. చీకట్లో వెలుతురు
వలయం ఒకటి పావురమై
అతని భుజంపై వాలితే, తన ముఖాన్ని
ఛాతిపైకి జరుపుకుంటూ

తనలో తాను గొణుక్కుంటాడు అతను -
"నువ్వు కాదా? మరొక రోజు
మరొక సారీ, బ్రతికి ఉండేందుకు నాకు
మిగిలిన, ఒకే ఒక్క కారణం!"

తెరపి...

రెండు శీతాకాలపు రాత్రుళ్ళ మధ్య పెద్దగా
ఏమీ జరగలేదు -

అన్నం వండి, ఆరేసిన దుస్తులను తెచ్చి
నెమ్మదిగా మడత పెట్టుకుంటూ
కూర్చుంది తను. ఎదురుగా అతను: ఒక
పుస్తకంతో, పేజీల చీకట్లలో, ఏవో

చుక్కలతో, గాలితో, గూళ్ళలోని పక్షులతో -
***
రెండు శీతాకాలపు రాత్రుళ్ల మధ్య, పెద్దగా
ఏమీ జరగలేదు కానీ
ఇద్దరి మధ్యా, ఆరిన దుస్తులలోంచి ఎగిరే
లేత ఎండ వాసన! 

07 December 2016

ఆ పిల్ల...

నిమ్మకాయ రంగు ఎండ పిల్ల, అక్కడే
ముఖమంతా కోపంతో -

"అలా ఉండకు: వేసవి తెలుసు నాకు"
అని కూడా చెప్పాను నేను -
కానీ, వేసవి రంగు పిల్ల ముఖం తిప్పదు
నాపై ఇంత నీడ ప్రసరించదు!

"పోనీ, నేనేమైనా చేసానా చెప్పు?" అని
కూడా ప్రార్ధిస్తానా మరి నేను
నీడలు దోబూచులాడే నీలి కళ్ళ పిల్లతో
"హె పో: నాతో మాట్లాడకు -"

అని అరుస్తోంది, అంతలోనే నాపై పడి
రక్కుతోంది, గండుపిల్లిలా
ముఖం పెట్టుకొని, మిడి గుడ్లేసుకుని
చూస్తోంది, గుర్మంటోంది

ఛాతిపై కుంకుమై చెదిరి, రాత్రి అంతా
ఆగక ఒకటే కురుస్తోంది

ఎండలో చిట్లిపోయిన, నా వానాకాలపు
బేల కళ్ళ  పిల్ల! 

పోలేక...

పొరలుగా చీకటి: రాత్రి -
త్రవ్వుతున్న శబ్ధం
ఎవరో వెళ్లిపోయినట్టు -
లోతుగా దిగబడి
క్షణకాలమాగిన పలుగు
ప్రేమా దయా నీవు -
***
ఇక, రాత్రంతా బయట
వెన్నెల్లో రాలిన
పూలు, గాలికి మోకరిల్లే
ఆశ్రు దృశ్యం!

స్పృహ

రాత్రి ఎప్పుడో, మ్రాగన్ను నిద్రలో నువ్వు
నా గుండెల మీద తల ఆన్చితే
ముసురు చీకట్లలో అవిసె చెట్లు వొణికిన
జ్ఞాపకం: హోరున వీచిన గాలికి

ఆకులు రాలి, వెన్నెల చెదిరి, అలలపై
మరోవైపుకు తేలిపోతే, నీ చిక్కటి
కురుల కింది కళ్ళల్లో, పండిన గోరింట
వాసన. ఛాతిపై ఒక గాటు: చెమ్మ -

రాత్రుల కలవరింత. బ్రతికి ఉన్నాననే
స్పృహ. కానా తరువాతే ఎందుకో
నీ తల అనిన చోట, వలయాలు ఏర్పడి
హృదయం పునర్యానమయ్యే వేళ

రాత్రే ఎక్కడో, దారి తప్పిపోయింది!